Sunday 30 May 2010

జగన్‌కి వరంగల్‌లో ఓదార్పు యాత్ర చేసే హక్కు ఉండాలా?

ఓదార్పు యాత్ర వెనుక జగన్ అసలు ఉద్దేషం, జగన్ యొక్క ఓదార్పు గుణం, ఓదార్పు యాత్ర ఆవశ్యకత లాంటి అంశాలజోళికి వెల్లకుండా నిజంగా వీరు చెప్పేట్లు జగన్ హక్కుని ప్రభుత్వం, తెలంగాణా వాదులు కాలరాశారన్న వాదనలో నిజం ఉందా?

ఒక వ్యక్తిగా జగన్‌కి గానీ, మరెవరికయినా దేశంలో ఎక్కడికయినా స్వేచ్చగా వెళ్ళే హక్కు ఉండాలి. దురదృష్టవశాత్తూ మనదేశంలో పౌరులు ఎన్నో చోట్లకు ఒంటరిగా వెళ్ళలేని స్థితి ఉంది. జగన్ ప్రాతినిధ్యం వహించే రాయలసీమలో చాలా చోట్ల ఒక వర్గం వారు ఇంకో ప్రాంతంలోకి వెళ్ళాలంటే శాంతిభద్రతల కారణాల దృష్ట్యా పోలీసులు అనుమతి ఇవ్వరు.

ఈ ఓదార్పు యాత్రలో జగన్ ఒక వ్యక్తిగా వెళ్ళడం లేదు, రెండువేలమని అనుచర బృందం, మందీ మార్బలం, వ్యక్తిగత రక్షణ సిబ్బందీ, వారి ఆయుధాలూ వగైరాలతో వెల్తున్నారు. వారిని రిసీవ్ చేసుకోవడానికి కాచుకు కూర్చున్న కొండా దంపతులు వరంగల్ జిల్లాలో సమాంతర ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. వీరికి మాత్రం తమ యాత్రలకు అనుమతి కావాలి, అందులో ఏవయిన గొడవలు జరిగితే భాద్యత ప్రభుత్వానిదీ, తెలంగాణా వాదులదీ కానీ విరిది కాదు.

మరి ఇంత మంది గుమి గూడి ఊరేగింపుగా వెల్లడానికి అనుకూలమయిన పరిస్థితులు వరంగల్ జిల్లాలో లేనే లేవు. తెలంగాణా ఉద్యమానికి ఆయువు పట్టయిన వరంగల్, నల్గొండా, కరీం నగర్, నిజామాబాద్ లాంటి జిల్లాలలో సీమాంధ్ర నాయకులు నిరశన జ్వాలలు ఎదుర్కోక తప్పదు.

కేసీఆర్ నిరాహార దీక్ష చేసుకునే హక్కును బలవంతంగా కాలరాసి ముందస్తు అరెస్టు చేసి ఖమ్మం సెంట్రల్ జైలుకి తరలించిన ఈ ప్రభుత్వం జగన్ అరెస్టుకు ఎందుకు ఘర్షణలు చెలెరేగే దాకా ఆగినట్లు? శాంతిభద్రతలను కాపాడవలసిన హోం మినిష్టరు వ్యక్తిగత హోదాలో రాయబారాలు ఎందుకు చేసినట్లు?

తమ హక్కును కాలరాశారని మొసలి ఏడుపులు ఏడ్చే ఈ జగన్, సురేఖలు తమ తమ నియోజక వర్గాలలో ఆటవిక పాలన కొనసాగిస్తూ, సమాంతర ప్రభుత్వాలను నడిపిస్తూ ఇతర పార్టీ నాయకుల ప్రచారాన్ని అడ్డుకోవడం వాస్తవం కాదా?

ఇక అక్కడ నిజంగా తెలంగాణా వాదులు రాళ్ళు విసిరి రెచ్చగొట్టారా, లేక జగన్ వర్గీయులే ముందు రాళ్ళు వేసి కవ్వించారా అనేది మనకు తెలియని విషయం. విచిత్రంగా అక్కడ గాయపడిన వారంతా విద్యార్థులే. ఒక్క జగన్ యువసైనికుడు కానీ, కాంగ్రేస్ కార్యకర్త గానీ గాయపడలేదు. కాల్పులు జరిపింది రక్షణ సిబ్బంది మాత్రమే కాదు కొండా మురళి , మరియూ అతని అనుచరులు కూడా అనేది బహిరంగ రహస్యం.

ఈ మొత్తం వ్యవహారం చూస్తే ఎలాగయినా విద్వేషాలు రెచ్చగొట్టి రోశయ్య ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడం జగన్ వ్యూహం కాగా, కాగల కార్యం గంధర్వులే తీరుస్తారనే పీవీ సూత్రం రోశయ్య చాణక్య నీతిలాగుంది. తమ స్వార్ధం కోసం టీఆరెస్ నాయకులతో సహా అంతా పంతాలకు పోతే పావులుగా మారి ప్రాణాలమీదికి తెచ్చుకుంది మాత్రం పేద విద్యార్థులే.

Friday 28 May 2010

మేధావులు పాలనకు అసమర్ధులా?

మన్మోహన్‌సింగ్ దేశ ప్రధానమంత్రి భాధ్యత స్వీకరించినపుడు కాంగ్రెస్‌ని ఎప్పుడూ సమర్ధించని నేను కూడా ఒక విద్యావేత్తా, మేధావి, అర్ధికవేత్త, మనం దేశపు ప్రగతిశీల ఆర్ధిక విధానాల సృష్టికర్త ప్రధానమంత్రి అయినందుకు సంతోషించాను. కానీ అదే మన్మోహన్‌సింగుని ప్రతిపక్ష నేత అయిన అద్వానీ పదే పదే "నికమ్మా" అని పిలిచాడు. రాజశెఖర్‌రెడ్డి మృతి తరువాత రోశయ్య ముఖ్యమంత్రి అయినపుడుకూడా నేను ఎన్నోసార్లు ఆర్ధికమంత్రిగా బుడ్జెట్‌ని ప్రతిపాదించినవ్యక్తీ, అనుభవశాలీ అయిన రోశయ్య ముఖ్యమంత్రి అయినందుకు సంతోషించాను. కానీ ప్రతిపక్షమయిన టీడీపీతో సహా అనేకమంది రోజూ టీవీలలో ముఖ్యమంత్రిని అసమర్ధుడు అని అంటున్నారు.

ఒక రకంగా వీరిమాటలో నిజంలేకపోలేదు. వీరిద్దరు కూడా అనేక విషయాలలో ఖఠినంగా ఉండలేకపోతునారు. ఇద్దరికీ కూడా సోనియా అనుఙ్న్య లేనిదే ఏ నిర్ణయమూ తీసుకోలేరు. సోనియమ్మ లేకపోతే వీరి మాటలు కేబినెట్ కూడా వినదు. మన రాష్ట్రంలో రోశయ్య ముఖ్యమంత్రి అయినతరువాత అన్నీ కష్టాలే పాపం.

మరి మనదేశంలో పరిపాలన చెయ్యాలంటే కుటిల రాజకీయాలు తెలిసినవారు, గూండాగిరీలో ఆరితేరినవారూ తప్ప మేధావులకి సాధ్యం కాదా? గొర్రెలమందని కర్రతో అదిలించినట్లు మన ప్రజలని కూడా ఎప్పుడూ అదిలించేవాడే పరిపాలన చెయ్యగలడా? ఎందుకిలా?

Wednesday 26 May 2010

అబద్దానికి పరాకాష్ఠ - ఓదార్పు యాత్ర జరగదేమోనని హఠాన్మరణం

ఒక అబద్దాన్ని ఎంత వరకు సాగదీయవచ్చు? అది అబద్దమని అందరికీ తెలిసిన తరువాత కూడా ఆ అబద్దానికి తోడుగా మళ్ళీ మళ్ళి అబద్ధాలు చెప్పడం ఎలా సాధ్యం? మరి మన రాజకీయ నాయకులు తలుచుకుంటే ఏదయినా సాధ్యమే కదా?

హెలికాప్టర్ కూలి వైఎస్సార్ చనిపోయిన తరువాత మొదటిగా వరంగల్ జిల్లాలో ఒక కుగ్రామంలో ఒక కుండలు చేసుకునే కుమ్మరి రోజులతరబడి అచేతనంగా ఉండి కూడా విచిత్రంగా వైఎస్సార్ మరణవార్త విని హఠాన్మరణం చెందాడు. విచిత్రంగా వాళ్ళింట్లో టీవీ కూడా లేకుండానే అతగాడు వైఎస్సర్ సంక్షేమ పధకాలగూర్చి తెలుసుకుని, అతను చనిపోతే ఆ పధకాలు ఉండవేమో అని చనిపోయాడట!!

వరంగల్లో ఒక వైఎస్సార్ అనుంగు భక్తురాలైన రాజకీయ నాయకురాలు, మాజీ మంత్రిణి మొదలు పెట్టిన ఈ కొత్త ఆట రాష్ట్రమంతటికీ పాకి వారం రోజుల్లో ఐదు వందల మరణాలు రికార్డు అయ్యాయి. మరి ఆ వారం రోజుల్లో రాష్ర్టంలో ఇతర సహజ మరణాలు ఏవీ జరగలేదు, అనీ వైఎస్సార్ చనిపోతే తట్టుకోలేక గుండె ఆగిన చావులే!!ఆ అబద్ధాన్ని మన యువరాజు ఇంకాస్త పొడిగించి ఒదార్పు యాత్ర పేరుతో ఒక రాజకీయ యాత్రను సాగదీస్తున్నాడు. ఏది పెద్ద అబద్ధం? గుండాగిన చావు వార్తలా, లేక ఆ చావులకు ఓదార్పులా అని నాకు సందేహం వచ్చింది.

ఇప్పుడు ఆ రెండు అబద్దాలకంటే మరో పెద్ద అబద్దాల ఆట మళ్ళీ అదే రాజకీయ నాయకురాలు మొదలు పెట్టింది. వరంగల్ జిల్లాలో ఒక వ్యక్తి వై ఎస్ జగన్ యాత్రకు అడ్డంకులు కలుగుతున్నాయనే ఆవేదనతో షాక్ మరణం చెందాదట!! ఆయన షాక్ తిని చనిపోవడం ఏమో గానీ ఆ వార్త నాకు షాక్ ఇచ్చింది. అమ్మో..నేను కూడ ఒక సారి నా గుండెని టెస్టు చేయించుకోవాలి..ఇలాంటి వార్తలు విని నా గుండె తట్టుకునేలా లేదు!!

Monday 24 May 2010

నాస్తికవాదం కూడా ఒక నమ్మకమేనా?

నాస్తికుల వాదనను తిప్పికొట్టడానికి ఆస్తికులు ఉప్యోగించే ఒక ఆయుధం ఈ వాదన:"నాస్తికత్వం కూడా ఒక నమ్మకమే! దేవుడు ఉన్నాడని మేమెలా నమ్ముతామో, లేదని మీరు అలాగే నమ్ముతారు" అని. మరి ఈ వాదనలో నిజం ఉందా?

నాస్తికులు దేవుడు లేడు అని నమ్మరు. కేవలం వారు దేవుడు అనే ఒక నమ్మకం కలిగిఉండరు. ఏ నమ్మకమూ లేకపోవడమూ కూడా ఒక నమ్మకమే అవుతుందా? ఇది చిన్నప్పుడు మనం చదువుకున్న మౌల్వీ నసీరుద్దిన్ జోకు లాంటి వాదన. ఏ కారూ లేని వాడి దగ్గరకి వెళ్ళి నువ్వు నోకార్ (no car)కలిగి ఉన్నావు, రోడ్డు టాక్సు చెల్లించాల్సిందే అన్నట్లు.

లేనిదానిని నిరూపించడం అసాధ్యం అవుతుంది. ఎప్పుడైనా నిరూపించాల్సిన భాద్యత ఉన్నదని క్లెయిము చేసే వారిదే. దీనికి బెర్‌ట్రాండ్ రస్సెల్ ఇలా చెప్పాడు: నేను ఆకాశంలో శుక్రుడికీ, గురుడికీ మధ్యన ఒక టీ కప్పు తిరుగుతుంది అని చెప్పితే ఎవరైనా ఆకాశం అంతా తిరిగి ఆ టీ కప్పు లేదు అని నిరూపించగలరా? కాబట్టి దేవుడు లేడు అని నిరూపించమని నాస్తికులను అడగడం సరి అయిన వాదన కాదు.

Saturday 22 May 2010

దోషం మతంలో ఉందా లేక మనిషిలో ఉందా?


ఈ మధ్య తెలుగు బ్లాగుల్లో ఈ చర్చ వాడి వేడిగా అందరికీ వినిపిస్తుంది. సందర్భానికి తగ్గట్లుగా ఉంటుందని ఈ టపాని వ్రాస్తున్నాను.

ఎవరైనా మతాన్ని విమర్శిస్తే వెంటనే కొందరు ఇది తమ మతం పైన దాడిగా భావించి తిప్పికొట్తడానికి ప్రయత్నిస్తారు. వీరు ఇచ్చే సమాధానం ఇది మతం తప్పిదం కాదు, మతాన్ని అర్ధం చేసుకోని మనిషిదేనని. అయితే ఇలా చెప్పే వారిలో ఎక్కువమంది ఇతర మతాన్ని విమర్శిస్తే చూసి ఆనందించే వారే. వీలయితే తాము కూడా ఒక చేయి వేస్తారు. తమ మతవిశ్వాసాలకి దెబ్బతగిలినప్పుడు మాత్రమే వీరికి అది తప్పుగా తోస్తుంది.

నిజంగా దోషం మతంలో లేదా? వీరన్నట్లు అన్ని అనర్ధాలకూ మూలం మతాన్ని అర్ధం చేసుకోని మనిషేనా? ఎక్కడొ ఒక దగ్గర లోపం ఉంది అనేది మాత్రం అంతా ఒప్పుకునే అంశం అనుకుంటా. అక్కడ కాంట్రావర్సీ ఏమీ కనపడ్డంలేదు. మరి లోపం ఎక్కడ ఉంది?

మతం పూర్తిగా ఆచరణీయమా?

మతానికి మూలం మత గ్రంధాలు. మరి వీరు చెప్పినదే నిజమయితే మతగ్రంధాలలో ఉన్నది అంతా ఆచరణీయంగా ఉండాలి. అప్పుడు మాత్రమే మనిషి మతాన్ని సరిగ్గా ఆచరించగలడు. కానీ ఏ మత గ్రంధమయినా పూర్తిగా ఆచరణీయంగా ఉందా? "ఏమతం చూసినా ఏమున్నది గర్వకారణం, మతగ్రంధ సారం సమస్థం ద్వేషం, వివక్ష తత్వం" అన్నట్లు ఉన్నది మన గ్రంధాల పరిస్థితి. బైబిలు పాత నిబంధనా, ఖురానులలో ఎక్కువగా విగ్రహారాధకులపైని దాడులు ఉండగా వేదాల్లో స్త్రీలపై, శూద్రులపై వివక్ష కనిపిస్తుంది.ఇస్లాంలో కళలు (చిత్రకలా, గానం, సంగీతం లాంటివి) అన్నీ నిషిద్దం. మరి మతంలో నిజంగా దోషంలేనట్లయితే వీటిని యధాతధంగా ఆచరించగలమా?

అసలు మన సమాజంలో ఈ మాత్రం శాంతి ఇప్పుడు ఉన్నదంటే కారణం మనిషి మతాన్ని పూర్తిగా ఆచరించకుండా మెల్లి మెల్లిగా వాటిలోని కొన్ని చెడు అంశాలని వదిలివేయడమే.దీని అర్ధం మనం ఆచరించే మతం, అసలు మతం కన్నా కాస్తా నయం. అలాంటప్పుడు తప్పు మతానిది కాక మనిషిది ఎలా అవుతుంది?

అన్నిమతాల సారం ఒకటేనా?

ఉదారవాదులు ఎక్కువగా వాడే వాదం అన్ని మతాల సారం ఒకటే, మనిషుల ఆచరణలోనే విభేదాలు అని. మాక్రోలెవల్లో చూస్తే ఇది నిజమే: అన్ని మతాలు దేవుడు సృష్టికి మూలం అనే సూత్రం నుండి వచ్చినవే. అన్నింట్లో దేవుడు ఒక్కడే, అతనికి రూపం లేదు అని ఉంటుంది.

కానీ తరిచి చూస్తే ఏ రెండు మతాలు ఒకేసారి ఒప్పు కాలేవు. అన్నీ మ్యూచుయల్లీ ఎక్స్లూసివ్. క్రస్తవ ఇస్లాం మతాలు విగ్రహారాధనను వ్యతిరేకిస్తాయి. ఇస్లాం ప్రకారం మహమ్మద్ని ప్రవక్తగా కొలవనివాడు ఎంతమంచివాడయినా నరకానికే వెల్తాడు. హిందూ మతంలో దేవుడికి విగ్రహం ఉంటుంది, అనేక దేవతలు ఉన్నారు. అంటే ఒక మతం సత్యమయితే వేరొక మతం అసత్యం కావలసిందే.

మతమూ, మొరాలిటీ:

మనిషికి మొరాలిటీ (నైతిక విలువలు) అందించింది మతమేనా? మతం లేకుంటే తల్లికీ చెల్లికీ, తండ్రికీ, భర్తకీ తేడా ఉండేది కాదా?కుటుంబ వ్యవస్థకి మూలం మతమేనా?

ఈ వాదనే నిజమయితే ఏ మతమూ లేని అబోరిజన్లూ, మావరిలూ, ఆఫ్రికన్ తెగలూ, నేటివ్ ఇండియన్లలో కుటుంబ వ్యవస్థ ఉండకూడదు. కానీ అలా లేదే?

మనిషి నైతిక విలువలు మనిషి విగ్న్యానంతో పాటు evolve అవుతున్నాయి. ఒక వెయ్యేల్లకిందటికంటే వందేళ్ళక్రితం నైతిక విలువలు బెటరు, వందేళ్ళక్రితం కంటే ఈ రోజు బెటరు. దీనికి మతంతో సంబంధం లేదు.

మతం ఏది మంచో ఏది చేడొ చెబుతుంది. అయితే ఇది స్టాటిక్ స్టాండర్డ్. కానీ మంచీ చెడూల నిర్వచణాలు రోజు రోజుకూ మారుతుంటాయి. ఇప్పుడు గే మ్యారేజీలు తప్పు కాదు. కానీ మతం వాటిని తప్పంటుంది. కాబట్టి మతం అందించే మోరల్ కోడ్ ఆచరణీయం కాదు.

మతం వలన మనిషి మంచి నేర్చుకుంటాడా?

అన్ని మతాలూ ఇది తప్పు, ఇది ఒప్పు, ఈ తప్పు చేస్టే మనిషి చచ్చి నరకానికి వెల్తాడు లాంటి నమ్మకాలను భోదిస్తాయి. అయిటే ఇవి తెలుసుకొని మనిషి మంచి వైపు మల్లుతునాడా? ఇలా జరిగితే ఎక్కువమంది ఆస్తికులు ఉన్న మన దేశంలో పాపాలు తక్కువగా ఉండాలీ. ఎక్కువమంది నాస్తికులు ఉన్న స్వీడన్, డెన్మార్క్, నార్వే వంటి దేశాలలో పాపాలు ఎక్కువగా ఉండాలి. కానీ వాస్తవాలు అలా లేవు.

మతాల వలన జరిగిన మంచి కనపడడం లేదు, కానీ చెడుని చూస్తే చరిత్రలో ఎన్నో యుద్ధాలకి మతాలే కారణం. ఇప్పటికీ మత ఘర్షణలూ, తీవ్రవాదం లాంటి వాటికి కారణం మతమే.మతంతో సమంధం లేకుండా సమాజంలో మంచీ చెడూ రెండూ ఉంటాయి. కానీ మతం మంచి వారిని కూడా చెడువైపుకు మరలించడానికి ఉపకరిస్తుంది.


దీని గురించి స్టీవెన్ వీన్‌బర్గ్ మహాశయుడు ఇలా అన్నాడు: "మతంతో సంబంధం లేకుండా మంచివాడు మంచి పనులూ, చెడ్డవాడు చెడ్డపనులూ చేస్తాడు. అయితే మంచి వాడు చెడ్డపనులు చెయ్యడానికి కారణం మతమే."

మూలం: Richard Dawkins' "The God Delusion"