Thursday 31 March 2011

రామోజీ షేరుధర ఐదులక్షలా?

రామోజీరావు తన ఈనాడు వందరూపాయల షేరునొ ఒక్కోటి రు.5,28,630/- కు అమ్ముకోగా సాక్షి 10రూపాయల షేరును 350/- కు అమ్ముకుంటే తప్పేంటి?" ఇది సాక్షిలో పెట్టుబడులను సమర్ధిస్తూ వైఎస్సార్ అసెంబ్లీలో చెప్పిన సమాధానం, జగన్ సమర్ధీకులు నిత్యం టీవీల్లో కోడై కూసే విషయం, సాక్షి అనేకసార్లు తన పేపర్లో పెట్టుబడులను సమర్ధించుకుంటూ రాసుకున్న విషయం, ఇవ్వాల్టితో సహా. ఇంతకూ ఒకషేరుధర 5 లక్షలు అయితే ఎక్కువ ధర పెట్టినట్టు, రు. 350అయితే తక్కువ ధర పెట్టినట్లా? ఈ లెక్కన టెక్‌మహింద్రా షేరు ధర 670, విప్రో షేరుధర 450 కాబట్టి టెక్‌మహింద్రా విప్రోకంటే పెద్ద కంపెనీ అవుతుందా?

ఒక కోటి రూపాయల విలువైన వ్యాపారాన్ని నాలుగు వాటాలు చేస్తే ఒక్కో షేరు ధర 25 లక్షలు, అదే నాలుగు లక్షల వాటాలు చేస్తే ఒక్కో షేరు ధర 25 రూపాయలు. ఈవ్యాపారంలో పావలా వంతు ఎవరికైనా అమాలంటే ఒక్క 25లక్షల షేరు అమ్మినా, లేక లక్ష 25/-ల షేర్లు అమ్మినా తేడా ఏమీ వుండదు. కాబట్టి షేరు ధర ఎంత అనే వాదన అనవసరం, ఎంత వాటాను ఎంత ధరకు అమ్మాడనేదే అక్కడ ముఖ్యం. మరలాంటప్పుడూ అదేపనిగా అసెంబ్లీలోనూ, టీవీల్లోనూ ఇలా రామోజీ 5లక్షలకు ఒక షేరును అమ్మగా సాక్షి ఒక షేరును 350కి అమ్మితే తప్పేమిటని వాదన ఎందుకు?

రామోజీ తన ఉషోదయా పబ్లికేషన్స్‌లో 26 శాతం వాటాను సుమారు వెయ్యిఖోట్లకు అమ్ముకున్నాడు. ఈలెక్కన ఉషోదయ పబ్లికేషన్స్ మొత్తం విలువ నాలుగు వేలకోట్లు. ఈనాడుకు ఉన్న సర్క్యులేషన్‌కు, లాభాలకు, డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్‌కూ కలిపి బహుసా అంత విలువ ఉండొచ్చు. సాక్షి ఏ ఇరవైఐదేల్లనుంచో ఉన్న పేపర్ కాదు, ఇప్పుడే మొదలయింది. అందులో వాటాదారులందరికీ వారివారి పెట్టుబడులను బట్టి సుమారు అదే రేషియోలో వాటా రావాలి. కాబట్టి సాక్షి తన పెట్టుబడులను సమర్ధించుకోవాలంటే అందులో తన పెట్టుబడి ఎంత, అందుకు తన వాతా ఎంత, మిగతా వారి పెట్టుబడీ ఎంత, వారి వాటా ఎంత అనే విషయం చెప్పాలి, అంతే కానీ ఇలా అవసరంలేని, ప్రాముఖ్యత లేని షేరు ధరలు మాట్లాడి సమర్ధించుకుంటే ఏం లాభం లేదు. అయితే ఈవిషయంలో మన ముఖ్యమంత్రులూ, మత్రులూ, మీడియా తమ మోసాల్ను కప్పిపుచ్చుకోవడానికి ఎంత చక్కగా, నిస్సిగ్గుగా అబద్దాలను చెప్పి నిజాలను మసిపూసి మారేడుగాయలు చేస్తాయో మాత్రం తెలుస్తుంది. ఇలాంటి చర్చలు జరిగే అసెంబ్లీలో చర్చలకు ఉన్న విలువెంత? అలాంటి అసెంబ్లీలో విషయాలు చర్చిస్తే ఉపయోగమెంత?

Monday 28 March 2011

డ్రైవర్ మల్లేష్, మంత్రి వివేకా

అసెంబ్లీ ఆవరణలో ఒక ఎమ్మెల్యేపై చిన్న దెబ్బ వేసినందుకు డ్రైవర్ మల్లేష్ పాపం అరెస్తయ్యాడు. ఏం కేసులు పెట్టారో, ఎప్పుడు వదులుతారో తెలియదు.

అసెంబ్లీ లోపల ఒక ఎమ్మెల్యేపై నేడొక మంత్రి చెయ్యిచేసుకున్నాడు. మరి ఇప్పుడు మంత్రిపై ఏం కేసులు పెడతారు? మంత్రిని అరెస్టు చేస్తారా? చట్టం సామాన్యుడిపై మాత్రమే అమలు, మంత్రులు చట్టాలకు అతీతులా?

Friday 25 March 2011

మేధావి వర్గం వివక్షాధోరణి

"చెడ్డవారి దుర్మార్గం కంటే మంచివారి మౌనం ప్రమాదకరం" ఇది మన మేధావివర్గ రాజకీయనాయకుడు జేపీగారు పదేపదే వినిపించే డైలాగు. జేపీగారూ, వినండి: మంచివారి మౌనం కంటే కూడా మేధావివర్గం వివక్షాధోరణి ప్రమాదకరం. ఈ మేధావి వర్గం వారిమాటలతో ప్రమాదం ఎంతంటే వీరుమాట్లాడే నీతులన్ని వింటుంటే ఎంతో బాగున్నట్టుగా ఉంటాయి, నిజమే సుమీ ఎంత అన్యాయం జరుగుతుందీ అనిపిస్తుంది. కానీ వీరి నీతులు చాలా సెలెక్టివ్‌గా ఉంటాయి. తామకు ఎవరు నచ్చకపోతే వారికి మాత్రమే నీతులు వినిపిస్తారు, తమకు నచ్చిన వాడు లేదా తనకంటే బలంగా ఉండి తను నీతులు చెబితే రెండు తగిలించే వాడికి మాత్రం వీరు నీతులు చెప్పరు. చెడ్డవారి దుర్మార్గం సామాన్యుడి బ్రతుకులను మాత్రమే అణచివేస్తాయి, మేధావుల వివక్ష సామాన్యుడి మనసులనే మానిపులేట్ చేస్తాయి.

మన మేధావినాయకుడు జేపీ విగ్రహాలకూల్చివేత సందర్భంగా అరగంటసేపు అసెంబ్లీలో చానా ఆవేశంతో, మధ్యమధ్యలో జాషువా పద్యాలతో, గురజాడ కవిత్వాన్ని ఉపయోగిస్తూ మాట్లాడాడు. కాస్త న్యూట్రల్‌గా ఉంటూ కాస్త విషయాలను గూర్చి పెద్దగా లోతుకు వెల్లని సామాన్య జనం విని ఆహా ఎంతబాగా మాట్లాడాడు జేపీ, ఇది విని కూడా ఫలానా వారికి బుద్ధిరాదేమో అనుకునేలా మాట్లాడాడు. మరి ఇదే పెద్దమనిషి దేశంలోని అతున్నత న్యాయస్థానంలో న్యాయమూర్తిగా పనిచేసిన వ్యక్తి అధ్యక్షతన తెలంగాణా విషయంపై నిజానిజాలు తేల్చమని ఒక కమిటీ వేస్తే ఆ కమిటీ ఉద్యమాన్ని ఎలా అణచివెయ్యాలి, నాయకులను ఎలా కొనాలి, మీడియాను ఎలా మానిపులేట్ చెయ్యాలి అన్న పాఠాలతో ఒక కుట్రపూరితమైన రిపోర్టును వండితే దానిపై మాత్రం అసలేం స్పందించడు. రాష్ట్ర హైకోర్టు కమిటీ అలాంటి రిపోర్టును ఇచ్చినందుకు నిందిస్తే ఇతనికి మాత్రం పట్టదు.

ఉస్మానియా విద్యార్థులను రాక్షసంగా హాస్టల్లలో బంధించి గంటలతరబడి కొడితే రాష్ట్ర హైకోర్టు ఇది మానవహక్కుల ఉల్లంఘన అని చెప్పినా ఇతను మాత్రం అసలేం స్పందించడు. పైగా ఒక టీవీ షోలో మాట్లాడుతూ తెలంగాణాలో విద్యార్థుల ఆత్మాహుతిని చాలా తక్కువగా చేస్తూ ఈ దేశంలో రోజుకు ఎంతమంది ఆత్మహత్యలు చేసుకోవడంలేదు అని వాఖ్యానిస్తాడు. అప్పులకు తట్టుకోక చేసుకొనే రైతు ఆత్మహత్యలకూ, ఉద్యమంలో ఆత్మాహుతి చేసుకునే వారికీ ఈయన దృష్టిలో తేడా ఏంలేదు. ఒక తెలంగాణా సగటుపౌరుడు ఈయన నెత్తిపై ఒకటి ఇచ్చినతరువాత కూడా ఈయన తనవివక్షను మానుకోలేదు.

ఇక మన సీపీఎం మేధావులు మరోతీరు. ఊరందరిదీ ఒకదారైతే ఉలిపికట్టెది మరో దారన్నట్లు వీరి మార్క్సిస్టు మేధస్సు ఎప్పుడూ అడ్డదిడ్డంగానే ఆలోచిస్తుంది. వీరిదృష్టిలో హిందువులకు కొమ్ముకాసేవారు మతతత్వ శక్తులు, ముస్లిములకు కొమ్ముకాసేవారు మాత్రం కాదు. రాష్ట్ర హైకోర్టు శ్రీక్రిష్ణ రిపోర్టు ఎనిమిదో అధ్యాయాన్ని కమీషను తమ విధులను విస్మరించి కొందరికి కొమ్ముగాస్తూ రాసిందని చెప్పి రిపోర్టును బహిర్గతం చెయ్యాలని తీర్పిస్తే ఈ సీపీఎం మేధావులు క్రిష్ణకమిటీని తప్పు పట్టరు, తీర్పిచ్చిన న్యాయమూర్తిని తప్పుపడతారు. పైగా మీడియానూ, పార్టీలనూ మేనేజ్ చెయ్యాలనే అనైతికమయిన పనులను చెప్పిన రిపోర్టును సమర్ధిస్తూ ఇవన్ని ఎవరికీ తెలియని విషయాలంటూ విషయాన్ని పలుచన చేస్తారు.

Saturday 19 March 2011

రాష్ట్రమంటే ప్రజలు కాదోయ్, రాష్ట్రమంటే విగ్రహాలోయ్!!

రాష్ట్రమంటే ప్రజలు కాదోయ్
రాష్ట్రమంటే భూములోయ్!!
రాష్ట్రమంటే సెజ్జులోయీ
రాష్ట్రమంటే విగ్రహాలోయ్!!


ఆరువందల యువకులెల్లరు
నేలకొరిగితె నీకేలనోయ్!
ఉద్యమాలను అణచివేసెయ్
బూటుకాళ్ళతొ తొక్కవోయ్!


భూములెల్లా కబ్జ జేస్తే
పెద్ద మేడలు కట్టవచ్చోయ్,
ఏడు తరములు కదలకుండా
కూరుచుని మేయొచ్చునోయ్!!


డబ్బు, మీడియ వద్దనుంటే
ఉద్యమం సృష్ఠించవచ్చోయ్!!
దొంగ కమిటీలేయవచ్చోయ్
లోకమును ఏమార్చవచ్చోయ్!!


ఓటులడిగే వేళవస్తే
మాయమాటలు జెప్పవోయ్,
ఏరుదాటిన వెంటనే
కాల్చేయవోయ్ నీ పడవనే!!


(గురజాడకు క్షమాపణలతో!!)

Thursday 17 March 2011

పేదవాడి సత్యాగ్రహమే ఆత్మబలిదానం




మద్రాసు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చెయాలనే ఆశయంతో ప్రాణాలర్పించిన పొట్టి శ్రీరాములు త్యాగధని, అమరజీవి అని మనం చదువుకున్న చరిత్ర, మనం నమ్మే వాస్తవం. కానీ అదే ఆఆశయంతో ఆత్మ బలిదానం చేసుకున్న ఆరువందలకు పైగా యువకులు మాత్రం మన మీడియా దృష్టిలో, ఇంకా అనేకమంది సీమాంధ్ర నాయకుల, ప్రజల దృష్టిలో పిరికివారు లేదా పిచ్చివారు.

ఇంతకూ ఒక ఆశయం కోసం బలిదానం చేసుకున్న యువకుడికీ, ఒక ఆశయం కోసం నిరాహారదీక్ష చేసి చనిపోయిన వ్యక్తికీ తేడా ఏమిటీ అంటే అది చనిపోయే విధానం నిరాహార దీక్షలో కాస్త సాగదీయబడడం, ఎప్పుడో ఒకప్పుడు ప్రభుత్వం దిగివస్తే తనప్రాణం నిలుస్తుందనే ఆశ, అంతకుమించి మరేమీ లేదు. పోనీ గాంధీగారి సత్యాగ్రహం గురించి మనం గొప్పలు పోతాం, మరి ఇప్పటి పరిస్థితుల్లో సత్యాగ్రహం సాధ్యమా అంటే, ఒక సామాన్య మానవుడు, లేదా కొంతమంది సామన్య మానవులు కలిసి నిరాహారదీక్ష చేపడితే ఫలితం ఏముంటుందో అందరికీ తెలిసిందే..పోలీసులతో దాడి చేసి బలవంతంగా దీక్షను భగ్నం చెయ్యడం, దీక్షా వేదికను, దీక్ష చేసే ఉద్యమకారులను బూటుకాళ్ళతో తొక్కడం.

ఆత్మబలిదానం అనేది ఇప్పుడు తెలంగాణాలో కొత్తగా చేసింది కాదు, ఇంతకుముందు మనదేశంలో మండల్ కమీషన్ వ్యతిరేకంగా చేసిన ఉద్యమంలోనూ, ఇంకా అనేకసార్లు ప్రజలు ఆత్మబలిదానాలు చేసుకున్నారు. ఢిల్లీలో మండల్ కమీషను వ్యతిరేకంగా ఆత్మహత్య చేసుకున్న రాజీవ్ గోస్వామిని ఎవ్వరూ పిరికి వాడనలేదు. ట్యునీషియాలో మొహమ్మద్ బొజోజి ఆత్మాహుతి చేసుకుంటే అతన్ని అమరవీరునిగా మిడిల్ ఈస్ట్‌లో కొనియాడారు. కానీ మనరాష్ట్రంలో ఆరు వందలమంది ఆత్మబలిదానాలు చేసుకుంటే మన మీడియా, కొందరు ఆకతాయులు వారికి ఇచ్చే బిరుదులు మాత్రం అవహేళనలే!! వీరి అవహేళనలు తెలంగాణా యువకులను మరింత రెచ్చగొట్టి మరింతమంది చనిపోవడానికి దారి తీస్తున్నాయి.

ఆత్మబలిదానాలను ఎవరూ సమర్ధించరు, కానీ ఆరొందలమంది కళ్లముందు చనిపోతే ఏమీ జరగనట్టు నటించడం ఏం మానవత్వం? ఆ బలిదానాలను అవహేళన చెయ్యడం ఎక్కడి సాడిజం? తెలంగాణాకు సంబంధంలేని పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని ఇక్కడి ఊరూరాపెట్టి గొప్పలు పొయ్యే వారూ, ఎవరైనా ఆకతాయి విగ్రహాన్ని అవమానం చేస్తే నెత్తీ నోరూ బాదుకునే వారూ కళ్ళముందు జరుగుతున్న బలిదానాలను మాత్రం చోద్యం చూడ్డమే కాదు, హేళన చేస్తారు. ఇంకా అంతా ఒకటే జాతి అని వీరు ఎవరిని నమ్మబలుకుతున్నారు? వందలమంది ప్రాణాలు నేలకొరుగుతుంటే నవ్విపొయ్యేవారు అన్నదమ్ములమంటె ఎవరు నమ్ముతారు?

Tuesday 15 March 2011

ఏది వార్త? ఏది చరిత్ర?

మిలియన్ మార్చ్‌ను అణచివెయ్యడానికి లక్షకు పైగా తెలంగాణా ప్రజలను, విద్యార్థులను అక్రమంగా అరెస్టులు చేసి జైల్లూ, పోలీస్ స్టేషన్‌లూ కూడా సరిపోకపోతే ఆడిటిరియాలూ, స్కూలు భవనాలలో రాక్షసంగా బంధిచిన విషయం ఒక్క లోకల్ న్యూస్ పేపర్, టీవీ చానెల్ కూడా కవర్ చెయ్యలేదు, కానీ రాష్ట్రంలోని ప్రాంతీయ వివక్షలకు దూరంగా ఉన్న బీబీసీ మాత్రం తన వెబ్సైటులో ఈ వార్తను రిపోర్ట్ చేసింది. బీబీసీ వార్తను ఇక్కడ చదవచ్చు.

ఒక ఈజిప్టులోనో, ట్యునీషియాలోనో, మాస్కోలోనో పోలీసుల దిగ్భంధాన్ని తప్పించుకుని వేలమంది ఒక మార్చ్ చేస్తే మనం అక్కడి ప్రజల ఆకాంక్షను మాత్రమే చూస్తాము, అందులో కూలిపోయిన విగ్రహాలను చూడం. కానీ మన సొంత రాష్ట్రంలో పదివేల మంది పోలీసులూ, స్పెషల్ ఫోర్షులను తప్పించుకుని, మూడు వందల చెక్ పోస్టులను దాటుకుని ప్రజలు మిలియన్ మార్చ్‌లో పాల్గొంటే మన తెలుగు మీడియా చూపించేది మాత్రం అక్కడ ప్రజల ఆకాంక్షను కాదు, కూలిన విగ్రహాలను మాత్రమే. అరెస్టులను గురించి ఏమాత్రం పట్టించుకోని మన ఈనాడు పత్రిక విగ్రహాలకోసం మూడు పేజీలు కేటాయించింది.బీబీసీ యాభై వేలమంది మార్చ్‌లో పాల్గొన్నారని రాస్తే మన మీడియా పదివేలని రాస్తుంది. ఇక్కడ మాత్రం మనకు ప్రజల ఆకాంక్షలు కనపడవు.

భూస్వామ్యవ్యవస్థకు వ్యతిరేకంగా తెలంగాణాలో జరిగిన తెలంగాణా సాయుధ పోరాటం గురించి జెర్మనీ, రష్యా, ఫ్రాన్స్ లాంటి దేశాల పాఠ్యపుస్తకాలు అదొక మహోన్నత పోరాటంగా అభివర్ణిస్తే మన రాష్ట్రంలో మనం చదువుకున్న సోషల్ పుస్తకాల్లో అసలు ఆ ఊసే ఉండదు. అసలు మొత్తంగా తెలంగాణా చరిత్రనే తుడిచేసి పొట్టి శ్రీరాములు త్యాగం ఫలితంగా ఆంధ్ర ప్రదేశ్ (ఆంధ్ర రాష్ట్రం కాదు) ఏర్పడింది, టంగుటూరి ప్రకాశం మన మొదటి ముఖ్యమంత్రి అని ఉంటుంది, బూర్గుల రామక్రిష్ణారావు మాత్రం భూతద్దం పెట్టుకొని వెతికినా ఏ పుస్తకంలోనూ కనపడడు.

Friday 11 March 2011

తీవ్రవాదం తయారుచెయ్యడం ఎలా?




మీకు ఫలానా పిల్లి అంటే నచ్చలేదా,అయ్యో ఎలా? ఊరికే పిల్లిని చంపితే అందరూ తప్పు పడతారే? మరేం ఫరవాలేదు, ముందు పిల్లిని ఒక గదిలో బంధించి బెత్తంతో కొడదాం. అప్పుడు పిల్లి తిరగబడితే పిల్లిపై తీవ్రవాది అని ముద్రవేసి చంపెయ్యొచ్చు. ఇదీ మన ప్రజాస్వామ్య ప్రభుత్వం, ఇంకా అనేక దేశాలు చేసే పని.

నిన్న ట్యాంక్ బండ్‌పై జరిగిన సంఘటన ఒక ఇసోలేటెడ్ సంఘటన అయి సాయంత్రం ఒక గంటజరిగిన సంఘటణలను మాత్రమే తీసుకుంటే ఇది మూర్ఖత్వం. కానీ విషయాన్ని అనలైజ్ చయ్యాలంటే ఒక్క గంట సమయాన్ని మాత్రమే తీసుకుంటే సరిపోదు, ఆరోజు, అంతకు మూడు రోజులు ముందునుంచి ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం చేస్తున్న పనులు, సంవత్సరం పైబడిన ఉద్యమ తీవ్రస్థాయి, యాభై ఏళ్ళ చరిత్ర తెలుసుకుంటే ఈపరిస్థితి ఎలా ఏర్పడిందో తెలుస్తుంది.

జగన్ ఓదార్పు యాత్రలకో, అద్వానీ రధయాత్రలకో రోజులతరబడి ప్రజాజీవనం స్థంభించిపోవడం, సెక్యూరిటీపరంగా ప్రభుత్వంపై ఖర్చు ఎంత జరిగినా సరే ప్రభుత్వం అలాంటివాటికి అనుమతులు ఇస్థుంది. యాత్రలు సజావుగా సాగడానికి సహకరిస్తుంది. కానీ తెలంగాణా ఉద్యమకారులు ఒక పిలుపును ఇస్తే దాన్ని ఎలా బలవంతంగా అణచివెయ్యాలనేదే ప్రభుత్వ ఆలోచన. అందుకోసం గత మూడురోజులుగా వేలమందిని తెలంగాణాలో అన్ని ప్రాంతాలలో అరెస్టులు చేశారు, లాకప్‌లలో పెట్టారు.అందరు ఉద్యమ నాయకులను అరెస్టులు చేశారు. అన్ని రోడ్లను పోలీసుల సహాయంతో అడ్డుకున్నారు. భాష్పవాయువులు ప్రయోగించారు. ఉస్మానియాలో విద్యార్థులను అడ్డుకున్నారు. మొత్తంగా ఇందుకోసం పదివేల పోలీసులను మొహరించారు.

ఇంతగా అణచివెయ్యాలనుకున్నప్పుడు దాని ఫలితం ఎలా ఉంటుందో చివరికి అలాగే జరిగింది. బహుషా ప్రభుత్వానికి కావలిసింది కూడా అదే, ఎదుటివారిని తప్పుచేసేలా రెచ్చగొడితేనే కదా అణచివెయ్యడానికి కారణం దొరికేది? బలవంతంగా అణచివేసే ప్రయత్నం చేసినపుడు అందులో కొందరు ఆత్మహత్యలకు ప్రయత్నించొచ్చు, మరికొందరు దాడులకు పాల్పడొచ్చు. ఉద్యమాన్ని అణచివెయ్యడానికి పెట్టిన ఎఫర్ట్‌లో సగం పెట్టి ఉద్యమాన్ని సజావుగా జరగడానికి ప్రయత్నించొచ్చు, కానీ అలా చేస్తే ఎదుటివారిని తీవ్రవాది అని ముద్ర వెయ్యలేం కదా?

బ్లాగుల్లో ఇది అప్రజాస్వామికం, ఘోరం, నేరం అంటూ గొంతు చించుకునే వారు ఎప్పటిలాగే అందుకు దారితీసిన పోలీసుల అణచివేతను మాత్రం కన్వీనియెంట్‌గా ఉపేక్షిస్తారు. ఒక పెద్ద మనిషి దీన్ని కరసేవకులు బాబ్ర్రి కూల్చివెయ్యడంతో పోల్చాడు. అసలా పోలికే తప్పు, కరసేవకులను ప్రభుత్వం పోలీసుబలంతో అణచివెయ్యడానికి చూడలేదు, రధయాత్రను సజావుగా సాగనించారు. ఇంతలో మరో పెద్దమనిషి కరసేవకులతో పోలిస్తే ఎలా వారు కట్టడాన్నే కూల్చివేశారు, తీవ్రవాదులతో పోల్చండి అంటాడు. అవును కట్టడం కూల్చడం దాడికాదు, అక్కడ దాడి చేసినవారు నామత పరిరక్షకులు కదా, ఏంచేసినా సమ్ర్ధించాలి మరి? అదే తెలంగాణా అయితే ఎవరిదో, వారిని ఎన్నైనా తిట్టొచ్చు.

ఇంకొంతమంది వాదం ఇంకో తీరు, ఉద్యమకారులను కంట్రోల్ చెయ్యలేని నాయకులు వీల్లేం నాయకులని విమర్శిస్తారు. అసలు నాయకులకు అంత అవకాశమెప్పుడిచ్చిందీ ప్రభుత్వం? దొరికినవారిని దొరికినట్టు అరెస్టుచేస్తుంటే పోలీసులనుంచి తప్పించుకోవడానికే వాల్ల శ్రమ అంతా పెడితే ఉద్యమమాన్ని నడిపించేదెప్పుడు?

1969లో తెలంగాణా ఉద్యమాన్ని దౌర్జన్యంగా అణచివెయ్యడంతో అక్కడ నక్సల్ ఉద్యమం పెరిగింది. ఇప్పుడు మల్లీ తెలంగాణా ఉద్యమాన్ని దౌర్జన్యంగా అణచివేసి మల్లీ తీవ్రవాదానికి ఆజ్యం పోస్తోందీ ప్రభుత్వం. ఇదీ మన ప్రజాస్వామ్యం. పోలీసులు విద్యార్హులను, ఆడ విద్యార్థులనూ హాస్టల్లలో తాళంపెట్టి లాఠీలతో కొట్టినప్పుడూ, ఒక్కొక్కరిపై వందలకొద్ది కేసులు పెట్టి జైల్లలో పెట్టినప్పుడూ ప్రజాస్వామ్యవిలువలగురించి ఒక్కరూ మాట్లాడరు. కనీసం సీమాంధ్రలో థెర్మల్ విద్యుత్ కేంద్రాలకు వ్యతిరేకంగా ప్రజాఉద్యమాలు నడుస్తుంటే ప్రభుత్వం కాల్పులు జరిపినప్పుడూ ప్రజాస్వామ్య విలువలు గుర్తుకురావు. కానీ ప్రాణం లేని విగ్రహాలు, అవీ ఏదో ప్రాచీన కళా సంపద కాదు, అతికిస్తే మల్లి నిలిచే విగ్రహాలపై మాత్రం అపారమైన ప్రేమ. అదేరోజు ఒక విద్యార్థి పోలీసుల దౌర్జన్యానికి నిరసనగా పురుగుల మందు తాగితే స్పందించే హృదయాలే కరువయ్యాయి, ఇదే మన మానవత్వం.

జై తెలంగాణా!!

Thursday 10 March 2011

బ్లాగుల్లో కాన్స్పిరసీ థీరీలు


చరిత్రలో కాన్స్పిరసీ థీరీలు అనేకం. 9-11 అంతా ఇన్‌సైడర్ జాబ్, అసలు నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ చంద్రునిపై కాలు పెట్టనే లేదు, జీసస్ క్రైస్ట్ కు సంతానం ఉండేది లాంటివి అనేక థీరీలు ఉన్నాయి. ఇవన్నీ చదవడానికి మాత్రం బాగుంటాయి, కానీ ఇవి సత్యదూరాలనేవి అందరూ ఒప్పుకునేవే. ఈ కాన్స్పిరసీ థీరీలకు సాధారణంగా ఎలాంటి ఎవిడెన్స్‌లూ ఉండవు, కేవలం కొన్ని ఊహజనిత కల్పనల ఆధారంగా ఇవి అల్లబడతాయి. ఇది ఇలా అయ్యుండొచ్చు, అలా జరిగుంటే వాడికి లాభం లాంటి వాదనలపైన ఈథీరీలు ఆధారపడతాయి కాబట్టి ఇవి ఎవరినయితే టార్గేట్ చేస్తాయో వారంటే ఇష్టం లేనివారు ఈథీరీలను సులభంగా నమ్ముతారు, లేక నమ్మినట్లు నటిస్తారు. ఉదాహరణకు అమెరికా అంటే గిట్టనివారు నాసా చంద్రునిపై లాండింగ్ ఫేక్ చేసిందంటే ఒప్పుకుంటారు, అది అబద్దమయినా.

సాధారణంగా కాన్స్పిరసీ థీరీల పుట్టుకకు రెండు కారణాలు ఉండొచ్చు. మొదటిది తమకు నచ్చని వారిపై దుమ్మెత్తి పొయ్యడానికి, నచ్చినవారిని నేరం నుంచి తప్పించడానికి కాన్స్పిరసీ థీరీలు వాడుకోవచ్చు. రెండవది కొందరు మానసిక జబ్బుతో బాధపడుతున్నవారు జరగని వాటిని జరిగినట్లు ఊహించుకొని ఎవరో తమపై కుట్ర చేస్తున్నారనే ఒక ఆందోళనతో బాధపడుతూ సంబంధం లేని డాట్స్‌ను కలుపుతూ థీరీని అల్లవచ్చు.

తెలుగు బ్లాగులు కూడా కాన్స్పిరసీ థీరీలకు కొత్తకాదు. అడపా దడపా ఎవరో ఒకరు "ఇది విన్నారా, చంద్రునిపై లాండింగ్ నాసా ఫేక్ చేసిందట" లాంటి టపాలు ఎవరో ఒకరు రాస్తూనే ఉంటారు, అదే ఫ్రీక్వెన్సీలో ఉన్నవారు కొందరు ఆవాదనను సమర్ధిస్తూ కామెంట్లు రాస్తారు. ఇవి ఎక్కడొ నెట్‌లో చదివిన థీరీలు. అయితే తెలుగుబ్లాగుల్లోనే పుట్టిన ఇండిజీనియస్ థీరీలు కూడా ఉన్నాయి. ఇందులో నాకు తెలిసినవి రెండు బ్లాగులు.

మొదటిది అందరికీ తెలిసిన అమ్మవొడి బ్లాగులోని సుదీర్ఘమయిన "భారత రాజాకీయ, ఆర్ధిక, సంస్కృతిక వ్యవస్థలపైన కణికవ్యవస్థ కుట్ర". ఇది చక్రవాకం సీరియల్‌లాగా ఎన్నటికీ అయిపోదు. పూర్తిగా ఊహాజనితం, ఏమాత్రం సంబంధం లేని చరిత్రలోని వేర్వేరు కాలాల, ప్రాంతాలకు చెందినివారిని కలుపుతూ అల్లిన కథ. దీని గూర్చి ఇంతకుముందు నేను రాసిన సటైరు ఇక్కడ చదవచ్చు.

రెండవది కలగూరగంపలోని కలగాపులగమయిన టపాలు. ఉదాహరణకు "నీళ్ళపై నిప్పులు: ఆర్డీఎస్ పై దాడి తెరాసవారే చేసి ఉండొచ్చు", "ఇండియన్ నేషనల్ కాంగ్రేస్ కుట్ర - తెరాస పుట్టుక". ఇవి చదివితే ఇందులో వాస్తవాలు సున్నా, ఇది కేవలం తెలంగాణాపై అక్కసుతో అల్లిన వంటకము మాత్రమే అని తెలుసుకోవడం అంతకష్టం కాదు. మూఖ్యంగా ఆర్డీఎస్ గురించి, అసలు చేసింది ఎవరనేది అందరికీ బహిర్గతం, అదేమీ రహస్యంగా చెయ్యలేదు,కొత్తగా చెయ్యలేదు, ఆతరువాతకూడా చేసినవారు బహిరంగంగానే స్టేట్‌మెంట్లు గుప్పిచ్చారు. అయినా ఇలా కేవలం గిట్టని వారిపై బురదజల్లడం కోసం మాత్రమే అల్లిన చత్త సిద్ధాంతాలవలన ఎవరికి లాభం?

Wednesday 9 March 2011

నాగంకు పొగ పెడుతున్న బాబు

పొమ్మనకుండా పొగ పెట్టడం ఎలాగో నేర్చుకోవాలంటే ఎవరైనా చంద్రబాబుదగ్గరే నేర్చుకోవాలి. ఎప్పుడూ ఎవరినీ పార్టీనుంచి తనుగా గెంటెయ్యడు, కానీ చల్లగా పొగపెట్టి వారికి వారే వెల్లిపొయ్యేలా చేస్తాడు. అందులోనూ తనపర్టీలో ఎవరయితే కాస్త సొంతంగా ఎదిగి ప్రజాబలం కూడగట్టుకొని తనకు భవిష్యత్‌లో ఎదురు తిరగొచ్చనే అనుమానం వస్తుందో వారిపైన తప్పకుండా పొగ పెడతాడు.

బాబుకు తాను ముఖ్యమంత్రినయినప్పటినుంచీ "నంబర్ టూ ఫోబియా" వచ్చింది. ఎవరయినా పార్టీలో కాస్త పలుకుబడి సంపాదించుకుని తనతర్వాతి స్థానంలోకి వస్తారో వారిని అస్సలు నమ్మడు. ఎక్కడ తను తన మామకు ఎసరు పెట్టినట్టు తనకు ఎసరు పెడతారేమోనని మెల్లగా అతన్ని పార్టీలో ఒంటరివాన్ని చేసి తనకు తానుగాగా వెల్లిపోయేట్లు చేస్తాడు. ఇన్నిరోజులూ కాంగ్రేసును తిట్టిపోసినవారు కాంగ్రేసులోకి ఎలాగూ వెల్లలేరు, వేరే ఇంకేదయినా పార్టీలోకి వెల్లినా లేక పొరపాటున కాంగ్రేసులోకే వెల్లినా అక్కడ ఇమడలేక తరువాత మల్లి తెదేపా లోకే వస్తారు, ఈసారి పార్టీలో తక్కువ ర్యాంకులో చేర్చుకున్నా మాట్లాడరు అనేది అతని ధీమా. ఇటీవలి కాలంలో దేవేందర్ గౌడ్ మంచి ఉదాహరణకాగా ఇంతకుముందు ఇలాగే హరిక్రిష్ణనూ, దగ్గుపాటినీ నట్టేట్లో ముంచాడు.

తెలంగాణా తెదేలో పెద్దలీడరుగా చలామణీ అవుతూ వైఎస్సార్ ఉన్నప్పుడు అయిదేల్లు పార్టీకి పెద్దదిక్కుగా ఉండి వైఎస్సార్‌పై పోరాటం చేసిన నాగంకు ఇప్పుడు రేవంత్ రెడ్డి, మొత్కుపల్లి, దేవేందర్ లాంటి వారిని ఎగదోసి పొగపెడుతున్నాడు. రేవంత్ రెడ్డి ఒక జూనియర్ కాగా మొత్కుపల్లి, దేవేందర్ ఇప్పటికే పార్టీ బయటికి వెల్లి దిక్కులేక తిరిగొచ్చినవారు కాబట్టి వాల్లతో తన ఆధిపత్యానికి ఢోకా ఉండదు, అదే నాగం అయితే తెలంగాణాలో తనను ఎదిరించగలడనేది అతడి ఆలోచన కావొచ్చు.

అయితే ప్రస్తుతం తెలంగాణాలో తెదేపా పరిస్థితి ఇంతకుముందు దేవేందర్‌ను పంపించినప్పటిలా లేదు. చంద్రబాబు పర్యటనకెల్తే తెలంగాణా ప్రజలిప్పుడు చెప్పులతో కొడతారు. కనీసం తెలంగాణాలో ఎక్కడయినా పార్టీ మీటింగ్ జరిగితే చంద్రబాబు ఫోటోకూడా పెట్తడం లేదు. ఇలాంటి పరిస్థితిలో నాగంకు పొగబెట్తడం తెదేపాకు ఆత్మహత్యే. కనీసం రిజిష్తర్డ్ కార్యకర్తలు కూడా గత ఉప ఎన్నికలలో తెదేకి వోటేయలేదంటే తెదే పరిస్థితి తెలంగాణాలో ఎలాఉందో అర్ధం చేసుకోవచ్చు. కార్యకర్తల్లో, జనంలో మంచిపట్టున్న నాగం టీఆరేస్ వెల్లినా, బీజేపీలో కలిసినా అది రాజకీయంగా నాగంకు లాభమే గానీ నష్టం మాత్రం కాదు.