Friday 6 May 2011

పోలవరం మోసం

పోలవరం ప్రాజెక్టు గురించి తెలియని తెలుగువారుండరు. రాష్ట్రానికి చెందిన అధికార, ప్రతిపక్ష నేతలు రోజూ ఎక్కడో ఒక చోట పోలవరానికి జాతీయహోదాలు ఇవ్వాలని డిమాండ్లు చేస్తారు. ఇప్పటికే పోలవరం కోసం చిరంజీవి ఒక యాత్ర చేయగా జగన్ ఒక లక్ష(?)దీక్ష చేశాడు. ఎలాంటి అనుమతులూ లేక ఒక రాష్ట్రం ఈప్రాజెక్టుపై కేసుపెట్టినప్పటికీ, భవిష్యత్తులో అనుమతులు లభించేది అనుమానాస్పదమయినప్పటికీ ఇప్పటికే రాష్ట్రప్రభుత్వం ఈప్రాజెక్టుపై కోట్ల రూపాయల ప్రజాధనాన్ని గుమ్మరించింది.

"Down to Earth" సైన్స్ అండ్ ఎన్విరన్మెంట్ పత్రిక వారు polavaram fraud అనే ఒక కధనాన్ని ప్రచురించారు. వారి కధనాన్ని ఇక్కడ చదవవచ్చు.

Tuesday 3 May 2011

నడ్డి విరిచే వడ్డీ రేట్లు





పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని (ఇన్‌ఫ్లేషన్) అదుపుచెయ్యడానికని రిజర్వ్ బ్యాంక్ మరోసారి వడ్డీరేట్లు పెంచింది. వడ్డీ ధరలు పెంచడం సంవత్సరకాలంలో ఇది బహుషా నాల్గోసారి అనుకుంటా. వడ్డీ రేట్లు ఎంతపెంచినా ఇన్‌ఫ్లేషన్ పెరుగుతుంది కానీ తగ్గడం లేదు. అసలింతకీ ఇన్‌ఫ్లేషన్‌కూ వడ్డీ రేట్లకూ సంబంధం ఏమిటి? మిగతా దేశాల్లో ఇంత పెరగని ఇన్‌ఫ్లేషన్ ఒక్క మన దేశంలోనే ఎందుకు పెరుగుతుంది? అసలు ఇన్‌ఫ్లేషన్ పెరుగుదల, వడ్డీ రేట్ల పెరుగుదల ఈ రెండింటిలో ఏది సామాన్యునిపై ఎక్కువ భారం వేస్తుంది? లాంటివన్ని మనబోటి వారికొచ్చే ధర్మ సందేహాలు.

"వడ్డీ రేట్లు పెరిగితే ద్రవ్యం విలువ పెరుగుతుంది, కాబట్టి డబ్బు సప్లై తగ్గుతుంది. డబ్బు సప్లై తగ్గితే వస్తువుల డిమాండ్ తగ్గుతుంది కాబట్టి ధరలు తగ్గుతాయి." ఇది ధరలకు, వడ్డిరేట్లకూ ఉన్న థీరిటికల్ లింకు. ధరలను తగ్గించడానికి మన ప్రభుత్వానికి తెలిసిన మొదటి సూత్రం ఇదే కాబట్టి ధరలు పెరిగినప్పుడల్లా వడ్డీరేట్లు తగ్గిస్తారు.కానీ నిజంగా ఈసూత్రం పనిచేసి ధరలు తగ్గుతాయా అనేది సందేహాస్పదం.

ఇంకా కుదరకపోతే ఆహార పదార్థాల ఎగుమతులపై ఆంక్షలు విధిస్తారు. అది ఈపాటికే చేసి చక్కర, బియ్యంలపై ఎగుమతులపై కంట్రోల్ పెట్టారు. దానివలన బయట చక్కర డిమాండ్ ఎక్కువ ఉన్నా మన చెరకు రైతుకు మాత్రం గిట్టుబాటు ధర రావట్లేదు.

మిడిల్ ఈస్ట్ క్రైసిస్ వలన క్రూడ్ ధరలు పెరుగుతున్నాయి, దానికి వడ్డీ రేట్లతో సంబంధం లేదు. వర్షాలు బాగోలేక, పంటలు పండక, తుఫానులు, వడగళ్ళ వానలు లాంటి ప్రతికూల పరిస్థితులవలన,దళారీలూ, అక్రమ నిలువలవలన ఆహారధరలు పెరుగుతున్నాయి. వడ్డీరేటు పెరిగినా తరిగినా ప్రజలు బతకడానికి తినడం తప్పదు కాబట్టి ఆహార ధరలు కూడా వడ్డీరేటు పెరగడం వలన తగ్గే అవకాశాలు లేవు.

ఇల్లధరలు బహుషా వడ్డీరేటు పెంచితే తగ్గొచ్చు కానీ దానివలన ఇన్‌ఫ్లేషన్ పెద్దగా తగ్గే అవకాశం లేదు. మరీ ఊరికే ఇలా వడ్డిధరలు పెంచడం వలన నిజంగా సాధించేది ఏమైనా ఉందా? వడ్డీ రేట్లు పెరగడం వలన ఇంఫ్రాస్ట్రక్చర్ కంపనీలు నష్టపొతాయి, కాబట్టి ఇంఫాస్ట్రక్చర్ గ్రోత్ తగ్గుతుంది. మధ్యతరగతి ప్రజలలో బ్యాంకులో డబ్బులు డిపాజిట్ చేసేవారికంటే అప్పులు తీసుకునేవారే ఎక్కువ. వారికి వడ్డీరేట్లు పెంచినప్పుడల్లా నడ్డివిరుగుతుంది. మరి ఈ వడ్డీ రేట్లు పెంచడం వలన ఇప్పుడు ఎవరికి లాభం?