Sunday 20 October 2013

నీళ్లు మింగేశారు!


-జీవోఎంకు సీమాంధ్ర తప్పుడు నీటి లెక్కలు.. పెన్నాకు కృష్ణాజలాలు, కృష్ణాకు గోదావరి జలాలు
-బేసిన్‌లు మార్చేశారు.. నదులను మళ్లించారు.. ఆవిరి గుప్పిట పట్టారు.. మిగులు జలాలు మింగేశారు
-6శాతం వాటాకు 30శాతం చూపించారు.. సుప్రీంను ఆశ్రయించనున్న రిటైర్డ్ ఇంజినీర్లు
-నీటి మంత్రి జైత్రయాత్రల్లో బిజీబిజీ

హైదరాబాద్, అక్టోబర్ 19 (టీ మీడియా):రాష్ట్ర విభజన వేళ ఆఖరి దోఖా జరుగుతోంది. రెండు జీవనదులున్న తెలంగాణకు నీళ్లు దక్కకుండా తరలించుకుపోయే కుట్ర జరుగుతోంది. సర్కారు వ్యవస్థపై నమ్మకంతో ఉన్న తెలంగాణ ప్రజలను కీలక స్థానాల్లో ఉన్న సీమాంధ్ర పెద్దలు ముంచుతున్నారు. ఎలాంటి అనుమతి లేకుండా అక్రమంగా నిర్మించిన వారి అక్రమ ప్రాజెక్టులన్నింటికీ నీటి కేటాయింపులు చూపించుకుంటూ లెక్కలు తయారు చేశారు. తెలంగాణ నాయకుడే మంత్రిగా ఉన్న నీటి పారుదలశాఖలో అధికారులు తప్పుడు లెక్కలు తయారుచేస్తుంటే సదరు నాయకుడు జైత్రయాత్రల్లో బిజీబిజీగా ఉన్నారు. సీమాంధ్ర సర్కారు పంపిన లెక్కల ప్రకారమే నీటి పంపకాలు జరిగితే తెలంగాణ మరో 37 ఏళ్లు నీటిపై హక్కుల కోసం కనీసం పోరాడే న్యాయమైన హక్కును కోల్పోయే ప్రమాదం ఉంది.
water-copy
కేంద్రం ప్రభుత్వం రాష్ట్ర విభజన కోసం ఏర్పాటు చేసిన కేంద్ర మంత్రుల బృందానికి రాష్ట్ర జలనవనరుల శాఖ తప్పుడు లెక్కలు పంపింది. సీమాంధ్రలోని అక్రమ ప్రాజెక్టులన్నింటికీ నీటి కేటాయింపులు అధికారికం చేసుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత కూడా నీటి దోపిడీని అధికారికంగా కొనసాగించే విధంగా కాకి లెక్కలు రూపొందించారు. ఏకంగా కృష్ణా నదిని శ్రీశైలం ప్రాజెక్టు నుంచి దర్జాగా మళ్లించుకునే విధంగా పకడ్బందీ లెక్కలు వేశారు. నదీ పరివాహక ప్రాంతం (క్యాచ్‌మెంట్ ఏరియా) ప్రకారం నీటి కేటాయింపులు జరిపితే తెలంగాణకు 548 టీ ఎంసీల నీటికి కేటాయించాలి. అయితే ఇప్పటి వరకు తెలంగాణకు కేటాయించిన జలాలు కేవలం 298.96 టీఎంసీలే. ఇపుడు ఈ నీటిని కూడా తెలంగాణకు దక్కకుండా చేస్తున్నారు. మిగులు జలాలను సీమాంవూధలోని పెన్నా బేసిన్‌కు తరలించారు. మిగులు జలాలు నికరంగా వస్తాయన్న ధీమా లేకపోవడంతో ఆస్థానంలో నికర జలాలనే తరలించాలని సీమాంధ్ర సర్కారు పెద్దలు నిర్ణయానికి వచ్చినట్లు జీవోఎంకు ఇచ్చిన నివేదిక ద్వారా తెలుస్తున్నది.

గోదావరి జలాలు కృష్ణాకట..: 
గోదావరిలోని నీటిని అక్రమ పద్దతుల్లో మళ్లించడానికి రూ.19,521 కోట్లతో దుమ్ముగూడెం-నాగార్జున సాగర్ నిర్మించి దీని ద్వారా 165 టీఎంసీల వరద నీటిని కృష్ణాకు మళ్లించేందుకు వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో కుట్ర జరిగింది. ఇందులో 130 టీఎంసీల నీటిని కృష్ణా నది మిగులు జలాల ఆధారంగా చేపట్టిన ప్రాజెక్టులకు వినియోగిస్తారని, దీంతో కృష్ణా నీటిని అదనంగా వినియోగించుకున్నట్లు కాదని సీమాంధ్ర సర్కారు కేంద్ర మంత్రి బృందానికి ఇచ్చిన నివేదికలో పేర్కొన్నది. వాస్తవానికి తెలంగాణ నుంచి వచ్చిన అభ్యంతరాలతో ఈ ప్రాజెక్టుపై సర్వేలకు, మొబిలైజేషన్ అడ్వాన్స్‌ల కింద దాదాపు రూ. 500 కోట్లు ఖర్చు చేసి తరువాత మూలకు పడేశారు. ఇది అస్తిత్వంలో లేదు.

అయినా దీనిని విభజన సందర్భంగా తెరపైకి తీసుకువచ్చి నీటి వాటా కొట్టేసేందుకు లెక్కలు వేసి పంపించారు. పైగా ఈ ప్రాజెక్టును తెలంగాణ కోటా కింద చూపించే యత్నం చేశారు. ఈ నీటిని కోస్తాంధ్రకు చూపించి శ్రీశైలం వద్ద కృష్ణా నదిని సీమ ప్రాజెక్టులకు మళ్లించుకునేందుకు వైఎస్ సర్కారు ఎత్తుగడలో ఈ ప్రాజెక్టు పుట్టుకొచ్చింది. దీనికి రాష్ట్ర విభజన సమయంలో ఆమోద ముద్ర వేయించుకునేందుకు సీమాంధ్ర సర్కారు కుట్ర చేసింది. తెలంగాణ సమాజం అభ్యంతరాలతో మూలకు పడిన ఈ ప్రాజెక్టు తెరపైకి తీసుకురావడం పట్ల తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. మరో వైపు పోలవరం ప్రాజెక్టు నుంచి కృష్ణా బేసిన్‌కు 80 టీ ఎంసీలు మళ్లించ వచ్చు, దీనిపై ట్రిబ్యునల్‌లో వచ్చిన వాదనల సందర్భంగా 54 టీఎంసీలు ఏపీ వాడుకుంటే మరో 35 టీఎంసీల నీరు కర్ణాటక, మహారాష్ట్ర వాడు కోవడానికి ట్రిబ్యునలే హక్కు కల్పించింది. కానీ జీవోఎంకు ఇచ్చిన నివేదికలో దీని ప్రస్తావనే లేదు. కృష్ణా జల్లాలో ట్రిబ్యునల్స్ కేటాయించిన 298.98 టీఎంసీల నీటిలో 245 టీఎంసీల నీటిని కాజేయాలని పన్నాగం పన్నారు.

వాదనల సమయంలోనే తెలంగాణకు అన్యాయం
బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ ముందు వాదనల సమయంలోనే తెలంగాణకు సీమాంధ్ర సర్కారు అన్యాయం చేసింది. కర్నాటక ప్రభుత్వం ఆల్మట్టి డ్యామ్‌ను 519 అడుగుల నుంచి 526 అడుగుల ఎత్తుకు పెంచుకొని 120 టీఎంసీల నీటిని నిల్వ చేసుకుంటామని, దీనికి ఆంధ్ర ప్రదేశ్ అనుమతిస్తే 50 టీఎంసీల నీటిని ఆల్మట్టిలో నిల్వ చేసి మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని ఆఫర్ ఇచ్చింది. దీనికి సర్కారు అనుమతి ఇస్తే 50 టీ ఎంసీల నీటిలో దాదాపు 40 టీఎంసీల నీటిని వెనుకబడిన జిల్లా మహబూబ్‌నగర్‌కు గ్రావిటి ద్వారా వచ్చేవి. కానీ దీనికి అంగీ కరించని సర్కారు కృష్ణా మిగులు జలాలపైనే ఆధారపడి పెన్నా బేసిన్‌లో పాజెక్టులు నిర్మి ంచామని, వాదనలు చేసింది. ఈ వాదనల్లో పసలేక పోవడంతో బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ 526 అడుగుల ఎత్తుకు ఆల్మట్టిని నిర్మించుకోవడానికి అనుమతిచ్చింది. దీంతో కర్ణాటక ఇస్తానన్న 50 టీఎంసీల నీటి ఆఫర్ కూడా చేజారింది. ఫలితంగా మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలు పూర్తిగా, వరంగల్, ఖమ్మం జిల్లాలు పాక్షికంగా నష్టపోయాయి.

బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ మిగులు జలాలను నదీ పరివాహక ప్రాంతాలకే కేటాయించాలని చెప్పింది. కృష్ణా నదీపరివాహక ప్రాంతం తెలంగాణలో 68 శాతానికి పైగా ఉంది. ఈ లెక్కన మిగులు జలాల్లో 68 శాతం తెలంగాణకే రావాల్సి ఉంది. అయితే కేవలం 30 శాతం మాత్రమే కేటాయించినట్లు జీవోఎంకు ఇప్పుడు నివేదిక పంపారు. మిగులు జలాల పంపిణీలో కూడా కేవలం 77 టీఎంసీలే తెలంగాణ కోటాకు చూపించారు. రాయలసీమకు 107 టీఎంసీలు, కోస్తాకు 43.50 టీఎంసీలు కేటాయించినట్లుగా చూపించారు. ఈ పద్దతుల్లో 100 టీఎంసీలను పోతిరెడ్డి పాడు హెడ్‌గ్యులేటర్ ద్వారా సీమకు మళ్లించుకున్నారు ఇక నాగార్జున సాగర్ డ్యామ్‌కు నాలుగు వేల కోట్ల రుణం ద్వారా ఆధునీకరణ చేపట్టినా ఒక్క టీఎంసీ నీరు కూడా ఆదా అయినట్లు లెక్కల్లో చూపించకపోవడం గమనార్హం. కనీసం 15 శాతం నీటిని ఆదా కింద వేసినా కనీసం 40 టీఎంసీల నీరు లెక్కల్లోకి వస్తుందంటున్నారు.

ఇదే జరిగితే తెలంగాణ ప్రాజెక్టులకు నీటి కేటాయింపు మరి కొంత ఆశాజనకంగా ఉంటుంది. ఇదే తీరుగా శ్రీశైలం డ్యామ్‌లో 33 టీఎంసీల నీరు ఆవిరి అవుతుందని, గోదావరి నదిపై అసలు ప్రాజక్టే లేని ఇచ్చంపల్లికి 35 టీఎంసీలు కేటాయించారు. ఇది కాకుండా 44 టీఎంసీల నీరు ఆవిరి అవుతుందని, దీనిని జలవిద్యుత్ ప్రాజెక్టు కింద వేరుగా చూపారు. ఇదెక్కడి లెక్కనో అర్థం కావడం లేదని ఇదేశాఖలో పనిచేసి పదవీవిరమణ చేసిన ఇంజనీర్లే విస్తు పోతున్నారు.

సుప్రీంను ఆశ్రయిస్తాం:
రాష్ట్ర ప్రభుత్వం నీటి పంపకాలపై కేంద్ర మంత్రివర్గ బృందం (జీవోఎం)కు ఇచ్చిన నివేదిక తెలంగాణకు భవిష్యత్‌లో కూడా న్యాయం జరిగే అవకాశం లేని విధంగా ఉందని తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్స్ ఫోరం ప్రధాన కార్యదర్శి మేరెడ్డి శ్యాంప్రసాదరెడ్డి అన్నారు. నీటి పంపకాలు నదీపరివాహక ప్రాంతాలకే పంపిణీ చేయాలన్నారు. ఒక బేసిన్ జలాలను మరో బేసిన్‌కు తరలిస్తున్నట్లు చూపించడం అక్రమమన్నారు. విభజన తరువాత తెలంగాణ రాష్ట్రం తరపున వాదనలు విని, తెలంగాణకు న్యాయం చేసే విధంగా తీర్పు ఇవ్వాలని అన్నారు. ఈ మేరకు ట్రిబ్యునల్ తీర్పును వాయిదా వేయాలని కోరారు. కేంద్రం అధికారికంగా రాష్ట్రాన్ని విభజించాలని నిర్ణయించిన నేపధ్యంలో తాము బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పును వాయిదా వేయాలని కోరుతూ సుప్రీం కోర్టును ఆశ్రయిస్తామన్నారు.

ఇచ్చంపల్లికి సమాధి...
ఇచ్చంపల్లి ప్రాజెక్టును సీమాంధ్ర సర్కారు సమాధి చేసింది. 1978లోనే ఈ ప్రాజెక్టుపై జరిగిన ముఖ్యమంత్రుల సమావేశం దీని నిర్మాణానికి పచ్చజెండా ఊపింది. ఆనాడు వెంటనే నిర్మాణం చేపట్టి ఉంటే తెలంగాణ ఎంతో అభివృద్ధి చెంది ఉండేది. అయితే సీమాంధ్ర ముఖ్యమంత్రులు మూలకు పడేశారు. ఫలితంగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు తరువాత కాటన్ బ్యారేజి వరకు 650 కిలో మీటర్లు ఒక్క ప్రాజెక్టు కూడా లేక తెలంగాణ తీవ్రంగా నష్టపోయింది.