ఈ మధ్య తెలుగు బ్లాగుల్లో ఈ చర్చ వాడి వేడిగా అందరికీ వినిపిస్తుంది. సందర్భానికి తగ్గట్లుగా ఉంటుందని ఈ టపాని వ్రాస్తున్నాను.
ఎవరైనా మతాన్ని విమర్శిస్తే వెంటనే కొందరు ఇది తమ మతం పైన దాడిగా భావించి తిప్పికొట్తడానికి ప్రయత్నిస్తారు. వీరు ఇచ్చే సమాధానం ఇది మతం తప్పిదం కాదు, మతాన్ని అర్ధం చేసుకోని మనిషిదేనని. అయితే ఇలా చెప్పే వారిలో ఎక్కువమంది ఇతర మతాన్ని విమర్శిస్తే చూసి ఆనందించే వారే. వీలయితే తాము కూడా ఒక చేయి వేస్తారు. తమ మతవిశ్వాసాలకి దెబ్బతగిలినప్పుడు మాత్రమే వీరికి అది తప్పుగా తోస్తుంది.
నిజంగా దోషం మతంలో లేదా? వీరన్నట్లు అన్ని అనర్ధాలకూ మూలం మతాన్ని అర్ధం చేసుకోని మనిషేనా? ఎక్కడొ ఒక దగ్గర లోపం ఉంది అనేది మాత్రం అంతా ఒప్పుకునే అంశం అనుకుంటా. అక్కడ కాంట్రావర్సీ ఏమీ కనపడ్డంలేదు. మరి లోపం ఎక్కడ ఉంది?
మతానికి మూలం మత గ్రంధాలు. మరి వీరు చెప్పినదే నిజమయితే మతగ్రంధాలలో ఉన్నది అంతా ఆచరణీయంగా ఉండాలి. అప్పుడు మాత్రమే మనిషి మతాన్ని సరిగ్గా ఆచరించగలడు. కానీ ఏ మత గ్రంధమయినా పూర్తిగా ఆచరణీయంగా ఉందా? "ఏమతం చూసినా ఏమున్నది గర్వకారణం, మతగ్రంధ సారం సమస్థం ద్వేషం, వివక్ష తత్వం" అన్నట్లు ఉన్నది మన గ్రంధాల పరిస్థితి. బైబిలు పాత నిబంధనా, ఖురానులలో ఎక్కువగా విగ్రహారాధకులపైని దాడులు ఉండగా వేదాల్లో స్త్రీలపై, శూద్రులపై వివక్ష కనిపిస్తుంది.ఇస్లాంలో కళలు (చిత్రకలా, గానం, సంగీతం లాంటివి) అన్నీ నిషిద్దం. మరి మతంలో నిజంగా దోషంలేనట్లయితే వీటిని యధాతధంగా ఆచరించగలమా?
అసలు మన సమాజంలో ఈ మాత్రం శాంతి ఇప్పుడు ఉన్నదంటే కారణం మనిషి మతాన్ని పూర్తిగా ఆచరించకుండా మెల్లి మెల్లిగా వాటిలోని కొన్ని చెడు అంశాలని వదిలివేయడమే.దీని అర్ధం మనం ఆచరించే మతం, అసలు మతం కన్నా కాస్తా నయం. అలాంటప్పుడు తప్పు మతానిది కాక మనిషిది ఎలా అవుతుంది?
అన్నిమతాల సారం ఒకటేనా?
ఉదారవాదులు ఎక్కువగా వాడే వాదం అన్ని మతాల సారం ఒకటే, మనిషుల ఆచరణలోనే విభేదాలు అని. మాక్రోలెవల్లో చూస్తే ఇది నిజమే: అన్ని మతాలు దేవుడు సృష్టికి మూలం అనే సూత్రం నుండి వచ్చినవే. అన్నింట్లో దేవుడు ఒక్కడే, అతనికి రూపం లేదు అని ఉంటుంది.
కానీ తరిచి చూస్తే ఏ రెండు మతాలు ఒకేసారి ఒప్పు కాలేవు. అన్నీ మ్యూచుయల్లీ ఎక్స్లూసివ్. క్రస్తవ ఇస్లాం మతాలు విగ్రహారాధనను వ్యతిరేకిస్తాయి. ఇస్లాం ప్రకారం మహమ్మద్ని ప్రవక్తగా కొలవనివాడు ఎంతమంచివాడయినా నరకానికే వెల్తాడు. హిందూ మతంలో దేవుడికి విగ్రహం ఉంటుంది, అనేక దేవతలు ఉన్నారు. అంటే ఒక మతం సత్యమయితే వేరొక మతం అసత్యం కావలసిందే.
మతమూ, మొరాలిటీ:
మనిషికి మొరాలిటీ (నైతిక విలువలు) అందించింది మతమేనా? మతం లేకుంటే తల్లికీ చెల్లికీ, తండ్రికీ, భర్తకీ తేడా ఉండేది కాదా?కుటుంబ వ్యవస్థకి మూలం మతమేనా?
ఈ వాదనే నిజమయితే ఏ మతమూ లేని అబోరిజన్లూ, మావరిలూ, ఆఫ్రికన్ తెగలూ, నేటివ్ ఇండియన్లలో కుటుంబ వ్యవస్థ ఉండకూడదు. కానీ అలా లేదే?
మనిషి నైతిక విలువలు మనిషి విగ్న్యానంతో పాటు evolve అవుతున్నాయి. ఒక వెయ్యేల్లకిందటికంటే వందేళ్ళక్రితం నైతిక విలువలు బెటరు, వందేళ్ళక్రితం కంటే ఈ రోజు బెటరు. దీనికి మతంతో సంబంధం లేదు.
మతం ఏది మంచో ఏది చేడొ చెబుతుంది. అయితే ఇది స్టాటిక్ స్టాండర్డ్. కానీ మంచీ చెడూల నిర్వచణాలు రోజు రోజుకూ మారుతుంటాయి. ఇప్పుడు గే మ్యారేజీలు తప్పు కాదు. కానీ మతం వాటిని తప్పంటుంది. కాబట్టి మతం అందించే మోరల్ కోడ్ ఆచరణీయం కాదు.
మతం వలన మనిషి మంచి నేర్చుకుంటాడా?
అన్ని మతాలూ ఇది తప్పు, ఇది ఒప్పు, ఈ తప్పు చేస్టే మనిషి చచ్చి నరకానికి వెల్తాడు లాంటి నమ్మకాలను భోదిస్తాయి. అయిటే ఇవి తెలుసుకొని మనిషి మంచి వైపు మల్లుతునాడా? ఇలా జరిగితే ఎక్కువమంది ఆస్తికులు ఉన్న మన దేశంలో పాపాలు తక్కువగా ఉండాలీ. ఎక్కువమంది నాస్తికులు ఉన్న స్వీడన్, డెన్మార్క్, నార్వే వంటి దేశాలలో పాపాలు ఎక్కువగా ఉండాలి. కానీ వాస్తవాలు అలా లేవు.
మతాల వలన జరిగిన మంచి కనపడడం లేదు, కానీ చెడుని చూస్తే చరిత్రలో ఎన్నో యుద్ధాలకి మతాలే కారణం. ఇప్పటికీ మత ఘర్షణలూ, తీవ్రవాదం లాంటి వాటికి కారణం మతమే.మతంతో సమంధం లేకుండా సమాజంలో మంచీ చెడూ రెండూ ఉంటాయి. కానీ మతం మంచి వారిని కూడా చెడువైపుకు మరలించడానికి ఉపకరిస్తుంది.
దీని గురించి స్టీవెన్ వీన్‌బర్గ్ మహాశయుడు ఇలా అన్నాడు: "మతంతో సంబంధం లేకుండా మంచివాడు మంచి పనులూ, చెడ్డవాడు చెడ్డపనులూ చేస్తాడు. అయితే మంచి వాడు చెడ్డపనులు చెయ్యడానికి కారణం మతమే."
మూలం: Richard Dawkins' "The God Delusion"