Thursday, 3 November 2011

వంచన దోపిడీ పునాదులుగా (నాటకం) -2


సీన్ - 3

టెంట్ హౌజ్ నుండి తెచ్చి వేసిన ఒక షామియాన కింద సంజీవ్, ప్రకాశ్, బ్రహ్మానంద్, గోపాల్ కూర్చుని మంతనాలు చేస్తుంటారు. పక్కనే కాస్త దూరంగా కొందరు మేకలు కాసుకునేవారు మాట్లాడుకుంటూ వీల్లే మన ముఖ్యమంత్రీ, మంత్రులూ నంట, ఈషామియానాలోనే మన పెబుత్వం నడుస్తుందంట నీకు తెలుసా అని చెవులు కొరుక్కుంటుంటారు.

సంజీవ్:                 శ్రీరాం గాడి చావు పుణ్యమా అని రాష్ట్రం, పదవులూ అయితే దక్కాయి గానీ ఏమిటీ విధి వైపరీత్యం? షామియానాలకింద అసెంబ్లీలూ, సెక్రెటేరియట్లూనూ!!

ప్రకాశ్:                  నా పరిస్థితి అయితే పెనం మీద నుండి పొయ్యిలో పడ్డట్టుంది. ఇంతకుముందు చక్కగా మంత్రి పదవి వెలగబెడుతూ క్రిష్ణా రామా అంటూ ఉండేవాడిని. ఇప్పుడు ముఖ్యమంత్రినయ్యాను గానీ ఒక అసెంబ్లీ లేదు, ఒక కారు లేదు. ఎండలో కూర్చోవాల్సి వస్తుంది. ఉద్యోగస్తులు జీతాలడుగుతున్నారు, ఇద్దామంటే ఒక్క పైసా లేదు.

గోపాల్:                ఇప్పుడేం చేద్దాం?

బ్రహ్మానంద్:          ఇలా ఎక్కువరోజులు భరించలేం, ఏదో ఒకటి చేసి ఈపరిస్థితినుండి బయట పడాలి. కేంద్రం ఏమన్నా డబ్బిస్తుందంటావా?

గోపాల్:                కేంద్రామా నా బొందా, ఒక చిప్ప ఇస్తుంది.

ప్రకాశ్:                ఎలాగోలా మనం భాగ్యనగర్‌ను దక్కించుకున్నామంటే మన కష్టాలన్నీ తీరిపోయి మల్లీ భాగ్యం చేతికొస్తుంది. దానికోసం ఏం చెయ్యాలో మార్గాలు వెతకాలి.

గోపాల్:               మనదగ్గర రాజధాని కాదు గదా ఒక జిల్లాను పరిపాలించడానికి కూడా సరిపోయే నగరం ఒక్కటంటే ఒక్కటి లేదు.

సంజీవ్:             మరెందుకాలస్యం? తొందరగా భాగ్యనగర్‌ను దక్కించుకునేందుకు పావులు కదుపుదాం. అక్కడ మిగులు బడ్జెట్ కూడా ఉందంట. మన కష్టాలన్నీ తీరిపోతాయి.

బ్రహ్మానంద్:           మనం కలవమంటే వాల్లు కలుస్తారా? మన సంగతి తెలిసినవారు ఎవరైనా మనల్ని నమ్ముతారంటావా?

సంజీవ్:           వాల్లు మనల్ని నమ్మరనేది నిజం, కానీ ఎలాగయినా నమ్మించాలి మరో మార్గం లేదు.

ప్రకాశ్:             ఐదుగురు పెద్దమనుషులను కూర్చోపెట్టి పంచాయితీ పెడదాం వాల్లేం అడిగితే అది ఒప్పుకుని సంతకాలు పెడదాం. అమలయేనాటికి ఎవడు బతికుంటాడో, ఎవడు చస్తాడో ఎవరికి తెలుసు?

సంజీవ్:           ఈ ఐడియా బాగానే ఉంది గానీ ముందు ఢిల్లీ ఒప్పుకుంటుందా?

ప్రకాశ్:            నీకన్నీ అనుమానాలే. మనం గట్టిగా లాబీయింగ్ చెయ్యాలి గానీ ఢిల్లీని ఒప్పించడం పెద్ద కష్టమా?

గోపాల్:           మరి అక్కడి ప్రజలసంగతో? వారు ఇందుకు అస్సలు ఒప్పుకోరు. మొదట్నుంచీ మన జనాలు వాల్లను తక్కువగా చూస్తారనీ, వాల్ల యాసను వెక్కిరిస్తారనీ వారికి తెలుసు కదా?

ప్రకాశ్:           అందరం తెలుగువాల్లమే అనీ, తెలుగు జాతి ఐక్యత అనీ ప్రచారం చెయ్యాలి. తెలుగుతల్లి విగ్రహాలు ఊరూరా పెట్టాలి. మన శ్రీరాం గాడి బొమ్మను కూడా అక్కడ ఊరూరా పెడదాం. మెల్లగా జనాలు దారికొస్తారు.


Wednesday, 2 November 2011

పొట్టి శ్రీరాములు గురించి తెలంగాణవాదిగా!!

ఈమధ్యన కొందరు తెలుగు బ్లాగరులు తెలంగాణవాదులు పొట్టిశ్రీరాములును ద్వేషిస్తున్నట్టూ, అవమానిస్తున్నట్టు ప్రచారాలు చేస్తున్నారు. నిజానికి పొట్టి శ్రీరాములుపై తెలంగాణవాదులకు ఎలాంటి ద్వేషం లేకపోగా ఒక గాంధేయవాదిగా, తాను నమ్మినదానికోసం ప్రాణాలు అర్పించిన వ్యక్తిగా గౌరవం ఉంది. తెలంగాణవాదులు ఎక్కడా పొట్టి శ్రీరాములును ద్వేషించలేదు, దూషించలేదు. కొండకచో కొందరు ఆవేశపూరిత ఉద్యమకారులు పొట్టి శ్రీములు విగ్రహాలను తొలగించడానికి ప్రయత్నం చేసినా అది పొట్టి శ్రీరాములుపై కోపం కాదు, తెలంగాణవాదుల కోపం కేవలం తమప్రాంతానికి సంబంధం లేని వ్యక్తి విగ్రహాన్ని తమ ప్రాంతంలో ఊరూరా (హైదరాబాద్ మాత్రమే కాదు, ప్రతి జిల్లాలో అని గమనించాలి) ప్రతిష్టించి తమ అభిజాత్యాన్ని నిరూపించుకునే ప్రయత్నం పైనా, చరిత్రను వక్రీకరిస్తూ ఆంధ్రప్రదేశ్ అవతరణకు పొట్టిశ్రీరాములుకు ముడిపెట్టడం పైనా.


ఆంధ్ర రాష్ట్ర అవతరణకు ముందుగా దీక్ష చేసింది గొల్లపూడి సీతారాం. అతని దీక్ష తరువాత కేంద్రప్రభుత్వం సూత్రప్రాయంగా ఆంధ్రరాష్ట్ర ఏర్పాటుకు ఒప్పుకుంది. ఆతరువాత పొట్టి శ్రీరాములు దీక్ష చేసింది మద్రాసు నగరం రాజధానిగా ఆంధ్రరాష్ట్రం ఏర్పడాలి అనే ప్రధాన డిమాండ్‌తో కాగా అతని డిమాండ్ తీరకుండానే పొట్టి శ్రీరాములు గతించారు.

నిజానికి ఎలాగూ దక్కదని తెలిసీ మద్రాసు నగరం కోసం పొట్టి శ్రీరాములును దీక్షకు ఉసిగొల్పిందీ, అతను దీక్షకు పూనుకుంటే ఈడిమాండ్ నెరవేరడం కాష్టమని చెప్పి  దీక్ష విరమణకోసం ప్రయత్నం చెయ్యనిదీ ఆంధ్ర నాయకులే. దీక్ష చివరిరోజుల్లో అపస్మారక స్థితిలో ఉండి తన స్వంత నిర్ణయం తీసుకోలేని స్థితిలో ఉన్నప్పుడు విరమింపజేయాల్సింది ఆంధ్రనాయకులే అయినా వారు దానికోసం ఎలాంటి ప్రయత్నాలు చెయ్యలేదు. ఈవిధంగా పరోక్షంగా పొట్టి శ్రీరాములు మృతికి కారణం ఆంధ్ర నాయకత్వమే.

ఇక స్వాతంత్ర్యం వచ్చిన తరువాత, ఆంధ్రరాష్ట్ర ఉద్త్యమానికి ముందు పొట్టి శ్రీరాములు ఒంటరిగా దళిత అభ్యున్నతికై ఉద్యమిస్తూ రోడ్డుపై బ్యానర్ పట్టుకుని  కాల్లకు చెప్పుల్లేకుండా తిరుగుతుంటే ఏఆంధ్రా నాయకులూ అతనికి సహకారం ఇచ్చిన పాపాన పోలేదు. అప్పుడు ఆంధ్రా ప్రజానీకమే పొట్టి శ్రీరాములును పిచ్చివాడికింద జమకట్టి అవమానించారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పడినతరువాత ఒక్కసారిగా పొట్టి శ్రీరాములు హీరోను చేసి ఆంధ్రాకంటే కూడా ఎక్కువ విహ్రహాలను తెలంగాణలో ప్రతిష్టించింది కూడా ఆంధ్రా నాయకులే. పాఠ్యపుస్తకాల్లో పొట్టి శ్రీరాములు మూలంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడిందనే అర్ధం వచ్చేలా పాఠాలు చొప్పించిందీ ఆంధ్రా నాయకత్వమే. పొట్టి శ్రీరాములు ఆత్మ నేడు ఎవరిచర్యలవల్ల క్షోభిస్తుందో!!

ఇప్పుడు తెలంగాణవాదులు మాకు సంబంధం లేని వ్యక్తుల విగ్రహాలు మాప్రాంతంలో వద్దు, చరిత్రను వక్రీకరించి నవంబరు ఒకటి ఆంధ్రప్రదేశ్ అవతరణకు, పొట్టి శ్రీరాములుకు ముడిపెట్టొద్దంటే తెలంగాణవాదులను ద్రోహులు అంటూ అవాకులు పేలుతున్నదీ ఆంధ్రా నాయకులూ, బ్లాగరులే.పొట్టి శ్రీరాములు విగ్రహానికి దండేయాల్సింది నవంబరు ఒకటిన కాదు, అక్టోబరు ఒకటి రోజు, ఆంధ్ర రాష్ట్ర అవతరణ గూర్చి.



వంచన, దోపిడీ పునాదులుగా (నాటకం) -1

సీన్-1:
ప్రకాశ్, గోపాల్, సంజీవ్, బ్రహ్మానంద్ కలిసి గదిలో మంతనాలు చేస్తున్నారు
.
సంజీవ్:                భజగోవిందం, భజగోవిందం. అంతా అయిపోయింది. ఆఖరుకు ఎమ్మెల్యే పదవి కూడా దక్కలేదు. ఈకమ్యూనిస్టులు చెయ్యబట్టి సొంత నియోజకవర్గంలో ఓడిపోయాను. ఇంతబతుకూ బతికి ఇంటెనుక చచ్చినట్టు ముఖ్యమంత్రినవుదామని కలలు గంటే ఎమ్మెల్యేగిరీ దక్కలేదు.

బ్రహ్మానంద్:  నాపరిస్థితి కూడా సేం టు సేం. నేనెవరితో చెప్పుకునేది?

గోపాల్:         బాగుంది వరస. నేను మాత్రం ఎమన్న ఎక్కువ బావుకున్నానా? నేనూ మీవంతే. ఇంగ్లీసోడి చదువులు చదువుకున్నందుకు ఇన్నాల్లూ కాంగ్రేస్ పార్టీలో నాయకత్వం వెలగబెట్టాము గానీ ఇప్పుడా ఇంగ్లీసోడు వెల్లిపొయ్యాక మన ఇంగ్లీసుకు విలువ లేదు. సొంతనియోజక వర్గంలో ప్రజలు మనల్ని నమ్మడం లేదు. ఇప్పుడేం మార్గం?

గోపాల్, సంజీవ్, బ్రహ్మానంద్:      ప్రకాశ్, నువ్వే ఏదో ఒక మార్గం చెప్పు. నువ్వు చక్కగా మంత్రి పదవి వెలగబెడుతున్నావుగా?

ప్రకాశ్:       నాగోడెవరితో చెప్పుకునేది? ఈ రాజా ఢిల్లీకి వెల్లినవాడు అక్కడే ఉండక వెనక్కొచ్చి ముఖ్యమంత్రి పదవి లాగేసుకున్నాడు. మనకు ఇక బతికుండగా ముఖ్యమంత్రి పదవి దక్కడం కష్టం.

సంజీవ్:      అయితే ఇప్పుడు ఏమిటి సాధనం?

ప్రకాశ్:        దీనికొక్కటే మార్గం ఉంది. మనం వెంటనే మనకో ప్రత్యేక రాష్ట్రం కావాలని ఆందోళన చేద్దాం. ప్రజల్లో మల్లీ పలుకుబడి వస్తుంది. ఒకవేళ రాష్ట్రం గానీ వస్తే గిస్తే మనం ముగ్గురం ముఖ్యమంత్రి పదవులు పంచుకోవచ్చు.

బ్రహ్మానంద్: మనం ఉద్యమం చేస్తే ఎవరు నమ్ముతారు? పోనీ నిరాహార దీక్షలూ గట్రా చేద్దామంటే మనకసలే అలవాటు లేదాయే?

ప్రకాశ్:          మన చేతికి మట్టంటించుకోవడం ఎందుకు? ఏదారే పోయే శ్రీరాం గాన్నో దీక్షకు కూర్చోపెడితే సరి, చస్తే వాడే చస్తాడు. పదవులు మనం కొట్టేయొచ్చు.

సంజీవ్:        బాగుంది ఈ ఐడియా. మరి ఎప్పుడు మొదలెడుదాం?

గోపాల్:    ఆలస్యం అమృతం విషం, శుభస్య శీఘ్రం. 

సీన్- 2:
ప్రకాశ్, గోపాల్, సంజీవ్, బ్రహ్మానంద్ గదిలో తీవ్రంగా వాదులాడుకుంటున్నారు.

సంజీవ్:           ముఖ్యమంత్రి పదవి నాకే దక్కాలి. లేకపోతే నేను నామద్దతు విరమించుకుంటాను. మా ప్రాంతం కొత్తరాష్ట్రంలో కలవనివ్వను.

గోపాల్:            నేనొప్పుకోను, నాకే దక్కాలి. నీక్కావాలంటే ఉపముఖ్యమంత్రి పదవి తీసుకో.

ప్రకాశ్: మీరు కాస్త ఊరుకోండి. వయసు పైబడ్డవాన్ని. ఈసారికి నన్ను ముఖ్యమంత్రిని కానివ్వండి. తరువాత మీఇష్టం.

పక్కగదిలో నుంచి బలహీనంగా మాటలు వినిపిస్తున్నాయి. "ఆకలి. ఆకలి. నాక్కాస్త అన్నం పెట్టండి. నేను తట్టుకోలేకపోతున్నాను. నాకింకా ఈదీక్ష వద్దు. కాస్త అన్నం పెట్టండి, వచ్చేజన్మలో మీకడుపులో పుడతాను."

గోపాల్:              చచ్చేట్టున్నాడు. ఏం చేద్దాం? కాస్త తిండి పడేద్దామా?

సంజీవ్:             పైవాడు ఇంకా మన ఉద్యమానికి పూర్తిగా స్పందించలేదు. ఇప్పుడు దీక్ష విరమిస్తే ఎలా?

ప్రకాశ్:              అవున్నిజమే. ఇప్పుడు తిండి ఇవ్వొద్దు.

పక్క గదిలో నుండి దబ్బుమని కింద పడ్డ శబ్దం. ముగ్గురూ అక్కడికి వెల్తారు.

సంజీవ్:             చచ్చినట్టున్నాడు. ఇప్పుడేమిటి చెయ్యడం?

ప్రకాశ్:               ఇదే మంచి అదును. మన వాల్లకు చెప్పి అల్లర్లు చేయిద్దాం. బెజవాడ, నెల్లూరు, వైజాగ్ అన్నీ ఒక్కసారి అదిరిపోవాలి. ఈదెబ్బకు కేంద్రం దిగి రావాలి.




Tuesday, 1 November 2011

జీడీపీలు సులభంగా పెంచండిలా!!

జీడీపీ, తలసరి ఆదాయాలగురించి వినని వారుండరు. చిన్నప్పుడు మనందరం సోషల్ పుస్తకాల్లో దేశాల ఆర్ధిక స్థితులను పోల్చడానికి ఈ ఇండెక్స్‌లు వాడడం చూసేఉంటాం. జీడీపీ (Gross Domestic product) ఒక ప్రాంతంలో ఒక సంవత్సరంలో జరిగిన ఉత్పత్తిని సూచిస్తే తలసరి ఆదాయం ఆప్రాంతంలో ఒక వ్యక్తి సగటు ఆదాయాన్ని సూచిస్తుంది.

ఈసూచీలు ఇంకా అనేక ఇతర సూచీలతో కలిపి చూసి మనం రెండు దేశాల ప్రజల జీవన ప్రమాణాలని పోల్చవచ్చు. అయితే statistics మీద అవగాహన లేనివారు వీటిని ఇష్టం ప్రకారం ఉపయోగిస్తే మొదటికే మోసం వస్తుంది. తలసరి ఆదాయం ఒక ప్రాంతంలో మనిషియొక్క సగటు ఆదాయాన్ని చెపుతుంది కానీ అక్కడ ఉన్న ఆర్ధిక అసమానతలు, బీదా బిక్కీ ప్రజల స్థితి తెలియదు. అందుకే మనదేశంలో వెనుకబడిన జిల్లాల పట్టీ తయారు చేసేప్పుడు మన కేంద్రప్రభుత్వం జీడీపీలూ, తలసరి ఆదాయాలు తీసుకోదు, అక్కడి కూలీ రేట్లు, వ్యవసాయం, జీవనోపాధి మార్గాలు, లిటరసీ రేట్లు లాంటి ఇతర ఇండికేటర్లను తీసుకుంటారు. 

ఉదాహరణకు ఫలానా జిల్లాలో తలసరి ఆదాయం బాగా తక్కువగా ఉందనుకోండి. అక్కడ నిజమైన అభివృద్ధి జరిగి ప్రజల జీవన ప్రమాణాలు పెరగాలంటే చాలా శ్రమించాలి. ప్రజలకు ఉపాధి అవకాశాలు పెంచాలి, వ్యవసాయం నీటిపారుదలలో అభివృద్ధి సాధించాలి ఇంకా ఎన్నో సాధించాలి. అయితే ఇవన్నీ చేయకుండా కూడా చాలా సులభంగా ఆజిల్లా ప్రజల తలసరి ఆదాయాన్ని పెంచొచ్చు. ఎలాగంటారా లగడపాటి, కావూరు, జగన్, చంద్రబాబు లాంటి కొందరు బడా బాబులను అక్కడి జనాభా లెక్కల్లో నమోదు చేస్తే సరి. వారి ఆదాయం కూడా అక్కడి ప్రాంతం లోకే వస్తుంది కాబట్టి తలసరి ఆదాయం అమాంతంగా పెరిగిపోతుంది.

ఇక జీడీపీ ఎలా పెంచాలంటారా? వెనుకబడిన ప్రాంతంలో ఎలాగూ వ్యవసాయభూములు తక్కువధరకు దొరుకుతాయి. అక్కడ కొన్ని భూములను ప్రభుత్వం లాగేసుకుని ఒక SEZ కట్టిందనుకోండి, అప్పుడు జీడీపీ అమాంతంగా పెరిగిపోతుంది. ఆSEZలో లోకల్ ప్రజలు   ఎలాగూ ఉండరు, అప్పటికే అభివృద్ధి సాధించిన ప్రాంతాల్లో విద్యావకాశాలు, చదువుకునే స్థోమత ఎక్కువ ఉంటాయి కనుక అక్కడివారే పెద్ద ఉద్యోగాలు ఎలాగూ చేజిక్కించుకుంటారు. కంపనీ ఎలాగూ అభివృద్ధి చెందిన ప్రాంతం వారే పెడతారు కాబట్టి కీలక పదవుల్లో అంతా వారి చుట్టాలో పక్కాలో అభివృద్ధి చెందిన ప్రాంతం వారే ఉంటారు.  చప్రాసీ ఉద్యోగాలకు కూడా తమ ప్రాంతంలోనే ఉన్న వెనుకబడిన వర్గాలను తెచ్చుకుంటే సరి. అంటే వెనుకబడిన ప్రాంతంలో ఒక్కరి ఆదాయం కూడా పెంచకుండానే అక్కడి జీడీపీని అమాంతం పెంచవచ్చు. అయినా బలిసిన వారు ఎక్కడన్నా తాముండే ప్రాంతంలో పరిశ్రమలు పెట్టుకుని తమప్రాంతంలో కాలుష్యం పెంచుకుంటారా మన పిచ్చిగానీ?

మరి బ్లాగుల్లో జీడీపీలూ, తలసరి ఆదాయాల లెక్కలు చూపించి తెలంగాణాయే అభివృద్ధి చెందిందని చెప్పే చౌదర్లకు ఇవన్నీ తెలియవా అంటే అన్నీ తెలుసు. కానీ చదివేవాల్లని అందర్నీ అమాయకులకింద జతకట్టేసి ఇలాంటి అవాకులు రాస్తుంటారు. ఇలాంటి అబద్ధపు రాతలు రాయడం ఎందుకు? రాష్ట్రం కలిసుంటే వీరికేం లాభం అంటారా? అదో చిదంబర రహస్యం. సమైక్య రాష్ట్రంలో వీరిది చాలా బలమయిన లాబీ. వ్యాపారాలు, రాజకీయాలు, మీడియా అన్నీ వీరిచేతుల్లోనే ఉంటాయి. విడిపోతే తెలంగాణా, మరీ ముఖ్యంగా హైదరాబాదు వీరి చేతుల్లోంచి బయటికి పోతుంది, అక్కడి కాంట్రాక్టులు వీరి వర్గం వారికి రావు అనేదే వీరి బాధ.

ఎవరి బాగుకై సమైక్య?



తేగీ!!
ఆరు వందల పదిజీవొ అమలుకాదు,
సాగునీటిపై దోపిడీ సమిసిపోదు
నిధుల తరలింపు ఆగదు నేటివరకు
ఎవరి బాగుకై సమైక్య? ఏది నీతి?

Thursday, 20 October 2011

ఇద్దరన్నదమ్ముల కథ

అనగనగా ఒక ఊర్లో ఇద్దరన్నదమ్ములు. అన్న ఏపని చేసేవాడు కాదు. ఉట్టినే బలాదూరుగా తిరగడం వల్ల ఊర్లో మంచి పలుకుబడి సంపాదించుకున్నాడు. తమ్ముడు అదో ఇదో పనిచేసి సంపాదిస్తే వచ్చిన డబ్బుతో కుటుంబం గడిచేది. సంపాదించేది తమ్ముడయినా పెద్దవాల్లు కాబట్టి ఇంట్లో అన్నా, అన్న భార్యల పెత్తనమే సాగేది.గంపెడు చాకిరీ చేస్తే తమ్ముడి భార్యకు తినడానికి కడుపునిండా భోజనం కూడా దొరికేది కాదు.

తమ్ముడి పెల్లయినప్పుడు తమ్ముడి భార్యకు అరణంగా పుట్టింటివారు ఒక ఆవును ఇచ్చారు. కాలం గడుస్తున్నకొద్దీ ఆవు పెద్దదయి బాగానే పాలిస్తుంది. అయితే పాలన్నీ అన్న పిల్లలే తాగేవారు. తమ్ముడి పిల్లలకు పాలూ, పెరుగు దొరికేవి కావు. ఇంట్లో ఒక దానిమ్మ చెట్టుండేది. ఆ దానిమ్మ పల్లు కూడా అన్ని అన్న పిల్లలే తినేవారు. కాలం గడుస్తున్నకొద్దీ సరైన ఆహారం దొరక్క తమ్ముడు, తమ్ముడి భార్యా పిల్లలూ బక్కచిక్కిపొయ్యారు. దాంతో వీరికంటే బలంగా తయారయిన అన్న పిల్లలు ఇంకాస్త దౌర్జన్యం చేసే వారు, తమ్ముడి పిల్లలను గేలిచేసేవారు.


కొన్నాల్లకు వల్లుమండిన తమ్ముడి భార్య  భర్తతో మనం దోపిడీకి గురవుతున్నాం, ఇలాగయితే కష్టం, ఉమ్మడి కుటుంబంలో తమకు ఇబ్బందిగా ఉంది, విడిపోదామని తెగేసి చెప్పింది. ఊర్లో పెద్దమనుషుల పంచాయితీ పెట్టి ఇలా నామొగుడు పనిచేసి సంపాదిస్తున్నా మాకు సరిగ్గా తిండి కూడా దొరకట్లేదు, అందుకే విడిపోవాలనుకుంటున్నామని చెప్పింది.


అప్పటిదాకా తమ్ముడి సంపాదనతో ఏ పనిచెయ్యకుండానే చక్కగా తింటున్న అన్నకుటుంబానికి ఈపరిణామం ఒక్కసారిగా షాక్ కొట్టినట్టయింది. అమ్మో విడిపోతే రేపటినుంచి తాను ఏం చేసి కుటుంబాన్ని పోషించాలి అని అన్న అనుకున్నాడు. అమ్మో ఇప్పుడు ఉన్నపళంగా విడిపోతే నాఇంటిపనీ, వంటపనీ నేనే చేసుకోవాలి ఎలాగా అని అన్న  భార్య అనుకుంది. అమ్మో ఇప్పుడు చక్కగా ఆవు పాలూ, పెరుగు తాగుతున్నాం, విడిపోతే ఈ ఆవు మనకు దక్కదు అని అన్న పిల్లలనుకున్నారు. అంతా కలిసి ఎలాగయినా తమ్ముడి కుటుంబం విడిపోకుండా అడ్డుకోవాలనుకుని తామూ విడిపోడానికి వీల్లేదంటూ పద్దమనుషులదగ్గర ఎదురు పంచాయితీ పెట్టారు. ఇక పంచాయితీ మొదలయింది.


అదేంటి, మేం విడిపోవడానికి వీల్లేదంటూ చెప్పే హక్కు మీకెక్కడుంది? కలిసుండాలా విడిపోవాలా అని నిర్ణయించుకునే హక్కు మాకుంది. మేం విడిపోతామంటే సొమ్ములు ఎలా పంచుకోవాలనే విషయంపై పంచాయితీ పెట్టాలి గానీ విడిపోవాడానికి వీల్లేదంటూ పంచాయితే పెడితే ఎలా అంటూ తమ్ముడు నోరుబాదుకున్నాడు. మనది ఒకే వంశం, ముందు నుండీ కలిసే ఉన్నాం, మనం ఎప్పటికీ ఇలాగే ఉండాలి, ఇదంతా ఆపక్కింటి ఎల్లయ్యగాడి కుట్రగని లేకపోతే విడిపోవాలనే పాడు బుద్ది నీకెలా వస్తుంది? అంటూ అన్న ఎదురు ప్రశ్న వేశాడు.


"చూడు తిండిసరిగా దొరక్క నాడొక్క ఎలా ఎండిపోయిందో? ఇన్నాల్లూ నాసంపాదన మీరు దోచుకున్నారు, ఇక మీతో కలిసి ఉండడం నాకు సాధ్యం కాదు" అంటూ వల్లుమండిన తమ్ముడు చెప్పాడు. అమ్మో అమ్మో మీ సంపాదన మేం దోచుకున్నామా? మమ్మ్మల్ని దోపిడీ దొంగలంటావా? ఇల్లాగయితే నిన్నస్సలు విడిపోనివ్వం అంటూ అన్న భార్య హుంకరించింది.


నీడొక్క ఎండిపోతే దానికి మేమెలా భాద్యులం? నీసమస్యకు మమ్మల్ని కారణమంటావేం అంటూ అన్న లాజిక్ పెట్టాడు. నాసమస్యకు కారణం నువ్వనడం లేదు, అసలు నాసమస్యే నువ్వు అందుకే విడిపోతున్నాం. తమ్ముడు బుర్ర గొక్కుంటూ సనిగాడు.


మమ్మల్ని దోచుకున్నామని నువ్వు, నీభార్యా ఫలానా రోజు పెద్దమనుషుల దగ్గర అన్నారు, మీరు లెక్కలు తీసుకొచ్చి మేము మిమ్మల్ని నిజంగానే దోచుకున్నట్టు నిరూపిస్తేగానీ విడిపోవడానికి వీల్లేదు. మమ్మల్ని ఈసంఘం దృష్టిలో దోపిడీదారులను చేద్దామనా నీ ఐడియా? అన్న భార్య హుంకరించింది. ఇంట్లో లెక్కలు రాసేదీ, సామాన్లూ కొనుక్కొచ్చేదీ అన్నీ అన్నే చేస్తాడు కాబట్టి అన్న ముందే లెక్కల పద్దు తనకు అనుకూలంగా రాసుకున్నాడు. తమ్ముడు లెక్కలు చెప్పబోతే అవి చెల్లవు, నేను  రాసిన ఈ మన ఉమ్మడికుటుంబం అధికారిక పద్దులు చూపిస్తేనే నేను ఒప్పుకుంటా, వేరే లెక్కలు నేనొప్పుకోను అంటూ అన్న తెలివి ప్రదర్శించాడు.


అసలు కలిసి ఉండాలనేభావన ఒక ఉమ్మడి కుటుంబంలోని విలువ, దాన్నీ ఇద్దరూ గౌరవించి ఎవరికీ అన్యాయం జరగకుండా ఉంటే బాగానే ఉంటుంది, అలా కుదరనప్పుడు విడిపోవడం నాహక్కు దానికి అసలు ఏలెక్కలు మాత్రం ఎందుకు? లేని హక్కు కోసం నువ్వెలా పంచాయితీ పెడతావు? తమ్ముడు వాపోయాడు.


నువ్వు విడిపోతామనేది మీకు అరణంగా మీపుట్టింటివారిచ్చిన ఆవు ఉంది కనుకే. ఆఅవు ఇప్పుడు మన ఉమ్మడి పెరట్లో గడ్డితిని బలిసింది కనుక అది ఉమ్మడి ఆస్థి, దాన్ని నువ్వొక్కడివే కొట్టేద్దామని చూస్తున్నావ్! అన్న తెలివి ప్రదర్శించాడు. అయ్యో అది నాకు మాపుట్టింటివారిచ్చిన ఆవు, ఇన్నాల్లూ మీరే మా ఆవు పాలు తాగారు, విడిపోతే నాఅవు నాకుదక్కాలనుకోవడం కూడా తప్పేనా అనుకుంది తమ్ముడి భార్య.


ఇదీ కథ! మాఇంట్లో జరిగిన కథ, రాష్ట్రంలో జరుగుతున్న కథ. ముగింపు ఎలాగుంటుందనేది కాలమే నిర్ణయించాలి.

Thursday, 6 October 2011

రెండు కళ్ళ సిద్దాంతాలు




"తెలంగాణ, సీమాంధ్రా నాకు రెండు కళ్ళలాంటివి, రెండు చోట్లా మాపార్టీని కాపాడుకోవడమే మాలక్ష్యం, తెలంగాణలో తెలంగాణకు అనుకూలంగా సీమాంధ్రలో సమైక్యాంధ్రకు అనుకూలంగా మేము ఉద్యమిస్తం, ఆవిధంగా చాలా స్పష్టమైన వైఖరితో ముందుకుపోతున్నాం" ఇదే మన చంద్రబాబు రెండు కళ్ళ సిద్ధాంతం. ఏమాత్రం నిజాయితీ ఉన్న మనిషైనా ఒక రాజకీయ పక్షం ఇలా రెండుకల్లవైఖరి కలిగిఉండడాన్ని ఒక నీతిబాహ్యమైన, మోసపూరిత విధానంగా ఒప్పుకుంటారు.

కానీ మన తెలుగుబ్లాగుల్లో పచ్చకామెర్లతో కల్లు పచ్చబారినవారికి మాత్రం విచిత్రంగా అందులో నీతి కనిపిస్తుందీ. అదేంటి మిగతా ఎవరికీ కనిపించని నీతి ఈపచ్చకల్ల మేధావులకు మాత్రం ఎలాకనిపిస్తుందని అనుకుంటున్నారా? దానికి వారి వివరణ తెలంగాణవాదులు తమ రంగుకల్లజోల్లని తీసి పచ్చకామెర్లవ్యాధిని తెచ్చుకుని కల్లను పచ్చగా తయారుచేసుకుంటే అందులో నీతి కనిపిస్తుందని.

ఒక ఇష్యూపై రెండువర్గాలు ఘర్షణపడుతున్నప్పుడు ఆప్రజలకు ప్రాతినిధ్యం వహించే ఒక రాజకీయపార్టీ తమవైఖరి ఏమిటో స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉంది. సరే వైఖరి చెప్పడం సాధ్యం కాదు అనుకుంటే కనీసం తటస్థంగా ఉండాలి, అంతేకానీ ఇలా రెండుచోట్లా ఉద్యమం చేసి రెండుచోట్లా రాజకీయంగా లాభపడదాం, కేంద్రం ఏవైఖరి చెప్పినా అందుకు వ్యతిరేక సెంటిమెంటును కొల్లగొడదాం అని వ్యవహరించడం పచ్చి అవకాశవాదం. మరి ఈఅవకాశవాదంలో నీతి పచ్చమేధావులకు ఎలాకనిపించిందంటే వారంతే, కొందరి రాతలను చూసి ఇలాంటి మనుషులు కూడా ఉంటారని తెలుసుకుని వదిలెయ్యాలంతే.

ప్రస్తుతం దేశంలో రగులుతున్న కొన్ని సమస్యలపై రెండుకల్లవిధానాన్ని అప్లై చేస్తే ఎలాగుంటుందో చూద్దాం:

అవినీతి, జన్‌లోక్‌పాల్ బిల్లు: మాపార్టీలో ఉన్న అవినీతిపరులైన నాయకులందరికీ జన్‌లోక్‌పాల్ బిల్లు ఇష్టం లేదు, ఆబిల్లు వస్తే వారికి అధికారంలో ఉన్నప్పుడు డబ్బులు దండుకోవడం కష్టం. కానీ మాపార్టీలో మధ్యతరగతి కార్యకర్తలు అవినీతికి వ్యతిరేకం. కాబట్టి మాలంచగొండి నేతలు ఈబిల్లుకు వ్యతిరేకంగా, మిడిల్ క్లాస్ కార్యకర్తలు బిల్లుకు అనుకూలంగా ఉద్యమిస్తారు. మాపార్టీ ఇద్దరికీ మద్దతిస్తుంది, ఉద్యమానికి కావల్సిన మెటీరియల్‌ను ఇద్దరికీ సప్లై చేస్తుంది, ఆవిధంగా మేము ముందుకు పొతా ఉంటాము.

మహిళా రిజర్వేషన్: మాపార్టీలో మహిళలు రిజర్వేషన్ కావాలంటున్నారు, కొందరు పురుషులు మాత్రం దానికి వ్యతిరేకం. కనుక మేము ఇద్దరినీ రెండువైపులా ఉద్యమించమని చెప్పాం. మేము ఇద్దరికీ మద్దతిస్తున్నాం, ఆవిధంగా మేము స్పష్టమైన వైఖరి కలిగి ఉన్నాం.

అయోధ్య, బాబ్రీ మసీదు: మాపార్టీలో ఉన్న హిందువులేమో అక్కడ గుడి కట్టాలంటున్నారు, ముస్లిములేమో మసీదు కట్టాలంటున్నారు. మేము ఇద్దరికీ అనుకూలం కనుక ఇద్దరికీ కత్తులు సప్లై చేసి పొడుచుకుని చావండని చెప్పాం. మాపార్టీ ఈవిషయంపై అన్ని పార్టీలకన్నా అత్యంత స్పష్టమైన వైఖరి కలిగి ఉంది.