Monday, 18 April 2011

మంత్రాలు చదివేది ఎక్కడివారయినా చింతకాయలు రాలవు!!

కేసీఆర్ గారూ, ఒకపక్క ఉద్యమం ఊపుమీద నడుస్తున్న సమయంలో తాబేలు లాగా అగ్నాతంలోకి వెల్లి చండీయాగం అంటూ తంతులతో కాలక్షేపం చేసింది చాలక పైగా ఆంధ్రా బ్రహ్మలకు నిష్ట తక్కువ, తెలంగాణా బ్రహ్మణులకు నిష్ట ఎక్కువ అంటూ అవాకులు పేలడం దేనికోసం? ఏం, తెలంగాణా అర్చకులు నిష్టతో చదివితే చింతకాయలేమన్నా రాలుతున్నాయా, ఆచింతకాయలతో తెలంగాణా సాధిస్తారా?

ఒకపక్క విమలక్క ధైర్యంగా వెల్లి లగడపాటి లాంకో హిల్స్‌లో జెండాలు పాతితే, మీరేమో ఇంట్లో కూర్చుని యాగాలు చేస్తారు కానీ కబ్జా భూములగురించి మాట్లాడరు. మాట్లాడ్డానికి ఇప్పుడు తెలంగాణాలో సవాలక్ష కారణాలు ఉన్నాయి. ఒక శ్రీక్రిష్ణ కమిటీ ఎనిమిదో అధ్యాయం గురించో, ఒక 177జీవో గురించో, కబ్జాకు గురవుతున్న భూముల గురించో మాట్లాడక ఎందుకు ఈ బ్రాహ్మల సంగతి? మీరు మంచి వక్త. ఏ విషయాన్ని ఎత్తుకున్నా అనర్గళంగా మాట్లాడగలరు. నిజానికి ప్రస్తుతం రాష్ట్రంలో తెలుగూ, ఇంగ్లీషు, హిందీ, ఉర్దూ భాషలన్నింటిలో అణర్గళంగా మాట్లాడగలిగేది మీరొక్కరే. అలాగే మాట్లాడేప్పుడు ముక్కుసూటిగా విషయాన్ని కుండబద్దలు కొట్టినట్లు చెప్పగలిగేదీ, వాదనకు కావలిసిన పాయింట్లను చటుక్కున పట్టుకోగలిగేదీ ఇంకెవరూ లేరు. మరి ఎందుకు ఇలా అనవసర విషయాలపై మాట్లాడి నాలుక కరుచుకునేది? బిర్యానీ గురించీ, అర్చకుల గురించీ వదిలేసి విషయం చూడండి.

Tuesday, 12 April 2011

దేముడికీ చావొస్తుంది!!-ముగింపు (కథ)

రోజులు గడుస్తున్న కొద్దీ సత్తిరాజు చింతచెట్టు ఆశ్రమానికి భక్తుల రాక విపరీతంగా పెరిగింది. హుండీలు చూస్తుండగానే నిండుతున్నాయి. వచ్చినడబ్బుతో చింతచెట్టు ఆశ్రమాన్ని పెద్ద రాజభవనం లాగా కట్తారు. ఇంకా అనేక చోట్లకూడా ఆశ్రమాలు స్థాపించి ప్రచారం మొదల్పెట్తారు. ఆశ్రమాలు పెరుగుతుండడంతో దానితోపాటు భక్తులు కూడా పెరుగుతున్నారు.

కొన్నాల్లు పొయ్యాక సత్తిరాజుకు, మిగతా శిష్యులకూ ఒక ఐడియా వచ్చింది. ఎన్నాల్లు ఇలా హుండీలు పెట్టి డబ్బులు తీసుకుంటాం, ఆశ్రమం తరఫున ఒక ట్రస్టును పెడితే ట్రస్టుపేరుచెప్పి దర్జాగా డబ్బులడుక్కోవచ్చు అనుకున్ని ఒక ట్రస్టును స్థాపించారు. ఇప్పటికే విదేశాల్లో కూడా ఆశ్రమాలు ఉండడంతో విదేశాల్లో కూడ ట్రస్టు పేరుతో డబ్బులు వసూలు చెయ్యడం మొదలుపెట్టారు. ఊరికే డబ్బులు తీసుకుంటే బాగుండదు కాబట్టి వచ్చిన డబ్బులో ఒక నయాపైసా వంతు ఖర్చుచేసి వారిజిల్లాలో మంచినీటి సౌకర్యాలు, ఒకట్రెండు హాస్పిటల్లూ పెట్టారు. దీంతో సత్తిరాజు ఒకే దెబ్బకు రెండు పిట్టలు పట్టాడు. తనభక్తులకు తనను సమర్ధించడానికి ఒక సాకు దొరికింది, దానితోపాటు ఇంకా ఎక్కువ డబ్బు వసూలు చెయ్యడానికి తనకు అవకాశం కూడా దొరికింది.

రంగడు అదే ఊర్లో ఉండి సత్తిరాజును మొదటినుంచీ ఎరిగినవాడు, ఆండాల్లమ్మ చెయ్యిపట్టుకున్నప్పుడు సత్తిరాజును కొట్టిన వారిలో ఒకడు. రంగడు ఈసత్తిరాజు దేముడు కాదు, వీడు ఒకప్పుడు ఒట్టి జులాయి అని అరిచాడు. రంగడి గోల ఎవరూ పట్టించుకోలేదు. ఏం, నీడబ్బులేమన్నా ఆశ్రమానికిచ్చావా నీకెందుకు అని ఒకడన్నాడు. ఔరా, నాదాకా వస్తే కానీ నేను మాట్లాడకూడదా అని రంగడు బుర్రగోక్కున్నాడు. మనఊరికి నీల్లిచ్చాడు కదా, మహిమలున్నా లేకపోయినా సత్తిరాజు దేముడే అని మరొకడన్నాడు. ఇదేపని ఎంతమంది రాజకీయ నాయకులు చెయ్యగలుగుతున్నారు, వారు చెయ్యలేనిపని నేడు మన సత్తిరాజు చేశాడు, సత్తిరాజు దేవుడే అని ఇంకోడన్నాడు. విదేశస్తుల దగ్గరినుండి డబ్బులు కొల్లగొట్టి మన ఊరికి నీళ్ళు తెచ్చాడు, సత్తిరాజు అభినవ రాబిన్‌హుడ్ అని మరొకడన్నాడు. డబ్బులిమ్మని ఎవ్వరినీ అడగలేదు కదా, ప్రజలు తమకు తాముగా వచ్చి డబ్బులిస్తే తీసుకుంటే తప్పేంటి అని ఇంకొకడన్నాడు. చేతనయితే నువ్వు దేవుడని చెప్పుకో ఎవరొద్దన్నారు అని ఇంకోడన్నాడు. నీదంతా ఉట్టి 'హేటు' వాదం, మేము మాట్లాడేదే వాస్తవం దబాయించారు.

రంగడికేమీ పాలు పోలేదు. అదేంటి రాజకీయనాయకులతో పోలుస్తున్నారు, వారినేమీ దేవుడని చెప్పి మొక్కట్లేదు కదా అనుకున్నాడు. ఏమిటి విదేశస్తులను మోసం చేస్తే అది మాత్రం మోసం కాదా, మనలను చేస్తేనే మోసమా అనుకున్నాడు. డబ్బులు అడిగి తీసుకుంటేనే మోసమా, దేవుడని చెప్పి నమ్మించి డబ్బులు తీసుకుంటే మోసం కాదా అనుకున్నాడు, పైగా ఆపని తాను చేసి చూపించాలంట. ఒకపక్క అదిమోసమని చెబుతుంటే అదే మోసం తనను చెయ్యమంటారు ఏంటో అనుకున్నాడు.

కొన్నాల్లకి సత్తిరాజుకు జబ్బు చేసింది. రేపో ఎల్లుండో అనేలా తయారయ్యాడు. భక్తులు దేశదేశాలనుండి వచ్చి సత్తిరాజుకోసం ఏడుస్తున్నారు, గుండెలు బాదుకుంటున్నారు. తనతోపాటు ఊరిలో పెరిగి, తను చూస్తుండగా చిల్లరదంగతనాలు చేసినవాడు, తనచేతిలో తన్నులు తిన్నవాడు ఈరోజు ఇలా దేవుడిలా వెలిగిపోతుంటే రంగడికేం పాలుపోలేదు. చివరి రంగడికి తత్వం బొధపడింది. దేముడికి కూడా చావొస్తుంది కానీ ప్రజల అమాయకత్వానికి చావు రాదు అనుకున్నాడు. సత్యానందస్వామి ఆరోగ్యం కుదుటపడాలని భజన చేస్తున్న జనంతో తనూ గొంతుకలిపాడు.

Monday, 4 April 2011

దేముడికీ చావొస్తుంది!! (కథ)

సత్తిరాజు ఆఊర్లో ఒక మంచి జులాయి. మంచి జులాయి అంటే నిజంగా మంచి తెలివయిన జులాయి అన్నమాట. అల్లరి తిరుగుళ్ళూ, చిల్లర దొంగతనాలే కాదు తెలివిగా జనాలను ఎలా మోసం చెయ్యాలో బాగా తెలిసిన వాడు. ఊర్లో సత్తిరాజంటే తెలియనివారూ, సత్తిరాజును తిట్టని వారూ ఎవరూ ఉండరేమో. ఒకరోజు సంతలో ఆండాళ్ళమ్మ చెయ్యి పట్టుకున్నందుకు అక్కడి జనం చక్కగా వడ్డించడమే కాదు, మళ్ళీ ఊర్లో కనిపిస్తే మక్కెలిరుగుతాయని వార్నింగు కూడా ఇచ్చారు.

సత్తిరాజుకు అహం దెబ్బతిన్నది. ఛ!ఎందుకీబతుకు అనుకున్నాడు. ఊరోళ్ళమీద బాగ కసి పుట్టింది. అసలీ ఊళ్ళోనే ఉండొద్దు అనుకున్నాడు. కానీ ఎక్కడికని వెల్లగలడు? ఊరిబయట చింతతోపులో అలా ఒంటరిగా నడుస్తున్నాడు. ఆలోచిస్తున్*నాడు. ఏమిటి చెయ్యాలి? తనను కొట్టిన ఈఊరివారిపై ఎలా కసి తీర్చుకోవాలి అని తెగ బుర్రగోక్కున్నాడు. సరే కొద్దిరోజులు పట్నం వెల్లి గడిపి అంతా సద్దుమణిగినతరువాత మల్లీ ఊరికి రావచ్చని పట్నం బస్సెక్కాడు.

ఫట్నంలో అలా ఒంటరిగా నడుస్తూ ఉంటే కాషాయం బట్టలు తొడుక్కుని గడ్డం పెంచుకుని, గంజాయి పీలుస్తూ గుడిపక్కన కూర్చున్న ఒక జంగమయ్య కనిపించాడు. జంగమయ్యను చూడగానే సత్తిరాజు బుర్రలో తళుక్కున ఒక ఐడియా మెరిసింది. ఔను, తానొక స్వామీజీ అవతారమెత్తి ఊరికెల్తే? ఊరివాల్లు నమ్ముతారా? తనను కొట్టినవారు ఇప్పుడు తనమాట వింటారా? ఏమయితే అదయింది, ఇంకా ఎన్నాల్లీ చిల్లర దొంగతనాలు, జీవితంలో ఏదో ఒకటి గట్టిగా చేసెయ్యాలనే మొండి ధైర్యం వచ్చింది. జేబులో ఉన్న ఐదొందల నోటుతో మార్కెటుకెల్లి ఒక కాషాయం రంగు తాను గుడ్డా, ఉంగరాలజుత్తుండే విగ్గూ కొనుక్కొచ్చాడు. దారిన కనపడ్డ టైలరు దగ్గర కాషాయం గుడ్డతో రెండు నైటీ టైపు గౌనులు కుట్టించుకున్నాడు. బూక్‌స్టాల్ కెల్లి తెలుగులో కనపడ్డ రెండు భక్తి పుస్తకాలు, తత్వాలు కొన్నాడు. ఒక నెలరోజులు అలాగే పట్నంలో ఉండి పుస్తకాల్లో దొరికిన తత్వం ముక్కలు బట్టి వేశాడు.

నెలరోజుల తరువాత ఒకరోజు రాత్రి సత్తిరాజు తిరిగి ఊరికెల్లాడు. చీకట్లోనే తనకు తెలిసిన ఇద్దరు చిల్లర దొంగలను కలుసుకుని తన ప్లాను చెప్పాడు. తెల్లవారగానే ఒక చెట్టుకింద కూర్చుని ఇద్దరు దొంగలనీ శిష్యులుగా చేసుకుని తత్వం మాట్లాడం మొదలుపెట్టాడు. ఆనోటా ఈనోటా ఊరిజనానికి అందరికీ సత్తిరాజు కొత్తావతారం గురించి తెలిసింది. మొదట నవ్వుకున్నారు, తరువాత సరేలే పోనిమ్మనుకున్నారు, మెల్లిగా ఏమో ఏ పుట్టలో ఏపాముందో? ఎక్కడికెల్లి ఏమహిమలు నేర్చుకున్నాడో అనుకున్నారు. మెల్లిమెల్లిగా సత్తిరాజు చింతచెట్టుకు జనం రాకపోకలు పెరిగిపొయ్యాయి. అన్నట్టు మరో విషయం! పట్నంలో ఉండగా ఒక గారడీవాడు రోడ్డుమీద ఆడుతుంటే సత్తిరాజు గంటలతరబడి చూసి కొన్ని చిన్నచిన్న విద్యలు నేర్చుకున్నాడు. ఇంతకుముందు జేబుదొంగతనాలు చేసే అనుభవం ఉండడంతో నేర్చుకోవడం పెద్ద కష్టం కాలేదు. ఇప్పుడు ఆ గారడీ బాగ కలిసొచ్చింది. చెట్టుదగ్గరికి వచ్చిన ఊరివారిని ఆకర్షించదంకోసం గారడీలు చెయ్యడం మొదలు పెట్టాడు. ఆండాళ్ళమ్మ విషయంలో తన ప్రేమ బెడిసికొట్టడం బాగ పనిచేసిందేమో, వచ్చినవారికి ప్రేమే దైవం అంటూ తత్వం చెప్పేవాడు.

ఇప్పుడు సత్తిరాజు వట్టి సత్తిరాజు కాదు, సత్యానందస్వామి. ఆనోటా ఈనోటా చుట్టుపక్కల ఉన్న ఊరివారందరికీ తెలిసిపొయ్యాడు. చింతచెట్టు చుట్టూ ఒక చిన్న ఆశ్రమం కట్టారు. జనాల రాకపోకలు పెరిగాయి. వచ్చినవారో అంతో ఇంతో డబ్బులు ఇచ్చేవారు, లేకపోతే ఏదయిన వస్తువు ఇచ్చేవారు. ఇప్పుడు సత్తిరాజుకూ, శిష్యులకూ రోజులూ బాగా గడుస్తున్నాయి. ఆశ్రమంలో కొంతమంది పెర్మనెంట్ భక్తులు ఏర్పడ్డారు. ఒకరోజు శివరాత్రినాడు మంచి టైం చూసుకుని సత్తిరాజు భక్తులకు తాను దేవున్ననీ, ఫలానా అవతారమనీ చెప్పుకున్నాడు. భక్తులు నిజమే కాబోలనుకున్నారు. దేవుడికి అతిదగ్గరి భక్తబృందంలో తామున్నందుకు మురిసిపొయ్యారు, తమవంతు ప్రచారం చేశారు. చూస్తుండగానే సత్యస్వామికి రాష్ట్రం మొత్తంలో భక్తులు పెరిగిపొయ్యారు.
(ఇంకాఉంది)

Sunday, 3 April 2011

దేవుడి ఆరోగ్యంపై ముఖ్యమంత్రి ఆందోళన

కలియుగ దైవం, శిర్డీసాయి, దత్తాత్రేయుల అవతారమైన సత్యసాయిబాబా ఆరోగ్యం పాపం కొద్దిరోజులనుండీ బాగోలేదట. తప్పదు మరి ఎంత అవతారమూర్తి అయినా వయసు మీదపడితే ఇంకేం చేస్తాడు. అయితే మనరాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రం ఈవిషయంపై ఉన్నతస్థాయిలో ఆరోగ్యశాఖలోని అధికారులతో సమీక్షలు జరుపుతున్నాడట. నిపుణులను పుట్టపర్థికి పంపాలని ఆదేశించాడట. మన ఆరోగ్యమంత్రి గీతారెడ్డి కూడా పుట్టపర్థికి వెల్లి రెండురోజులుగా అక్కడే క్యాంప్‌వేసి మరీ ఆయన ఆరోగ్యాన్ని సమీక్షిస్తుందట.

ముఖ్యమంత్రి గారూ, దేవుడి ఆరోగ్యం గురించి మీరేం వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు, ఆయన చూసుకుంటాడు. మీరు రాష్ట్రం ఆరోగ్యం గురించి చూడండి. వయసు మీదపడ్డాక దేవుడికైనా మృత్యువు తప్పదు, రాష్ట్రంలో ఎందరో ఆరోగ్యసదుపాయాలు అందక వయసునిండకుండానే మరణిస్తున్నారు, కాస్త వారి సంగతి చూడండి.

Thursday, 31 March 2011

రామోజీ షేరుధర ఐదులక్షలా?

రామోజీరావు తన ఈనాడు వందరూపాయల షేరునొ ఒక్కోటి రు.5,28,630/- కు అమ్ముకోగా సాక్షి 10రూపాయల షేరును 350/- కు అమ్ముకుంటే తప్పేంటి?" ఇది సాక్షిలో పెట్టుబడులను సమర్ధిస్తూ వైఎస్సార్ అసెంబ్లీలో చెప్పిన సమాధానం, జగన్ సమర్ధీకులు నిత్యం టీవీల్లో కోడై కూసే విషయం, సాక్షి అనేకసార్లు తన పేపర్లో పెట్టుబడులను సమర్ధించుకుంటూ రాసుకున్న విషయం, ఇవ్వాల్టితో సహా. ఇంతకూ ఒకషేరుధర 5 లక్షలు అయితే ఎక్కువ ధర పెట్టినట్టు, రు. 350అయితే తక్కువ ధర పెట్టినట్లా? ఈ లెక్కన టెక్‌మహింద్రా షేరు ధర 670, విప్రో షేరుధర 450 కాబట్టి టెక్‌మహింద్రా విప్రోకంటే పెద్ద కంపెనీ అవుతుందా?

ఒక కోటి రూపాయల విలువైన వ్యాపారాన్ని నాలుగు వాటాలు చేస్తే ఒక్కో షేరు ధర 25 లక్షలు, అదే నాలుగు లక్షల వాటాలు చేస్తే ఒక్కో షేరు ధర 25 రూపాయలు. ఈవ్యాపారంలో పావలా వంతు ఎవరికైనా అమాలంటే ఒక్క 25లక్షల షేరు అమ్మినా, లేక లక్ష 25/-ల షేర్లు అమ్మినా తేడా ఏమీ వుండదు. కాబట్టి షేరు ధర ఎంత అనే వాదన అనవసరం, ఎంత వాటాను ఎంత ధరకు అమ్మాడనేదే అక్కడ ముఖ్యం. మరలాంటప్పుడూ అదేపనిగా అసెంబ్లీలోనూ, టీవీల్లోనూ ఇలా రామోజీ 5లక్షలకు ఒక షేరును అమ్మగా సాక్షి ఒక షేరును 350కి అమ్మితే తప్పేమిటని వాదన ఎందుకు?

రామోజీ తన ఉషోదయా పబ్లికేషన్స్‌లో 26 శాతం వాటాను సుమారు వెయ్యిఖోట్లకు అమ్ముకున్నాడు. ఈలెక్కన ఉషోదయ పబ్లికేషన్స్ మొత్తం విలువ నాలుగు వేలకోట్లు. ఈనాడుకు ఉన్న సర్క్యులేషన్‌కు, లాభాలకు, డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్‌కూ కలిపి బహుసా అంత విలువ ఉండొచ్చు. సాక్షి ఏ ఇరవైఐదేల్లనుంచో ఉన్న పేపర్ కాదు, ఇప్పుడే మొదలయింది. అందులో వాటాదారులందరికీ వారివారి పెట్టుబడులను బట్టి సుమారు అదే రేషియోలో వాటా రావాలి. కాబట్టి సాక్షి తన పెట్టుబడులను సమర్ధించుకోవాలంటే అందులో తన పెట్టుబడి ఎంత, అందుకు తన వాతా ఎంత, మిగతా వారి పెట్టుబడీ ఎంత, వారి వాటా ఎంత అనే విషయం చెప్పాలి, అంతే కానీ ఇలా అవసరంలేని, ప్రాముఖ్యత లేని షేరు ధరలు మాట్లాడి సమర్ధించుకుంటే ఏం లాభం లేదు. అయితే ఈవిషయంలో మన ముఖ్యమంత్రులూ, మత్రులూ, మీడియా తమ మోసాల్ను కప్పిపుచ్చుకోవడానికి ఎంత చక్కగా, నిస్సిగ్గుగా అబద్దాలను చెప్పి నిజాలను మసిపూసి మారేడుగాయలు చేస్తాయో మాత్రం తెలుస్తుంది. ఇలాంటి చర్చలు జరిగే అసెంబ్లీలో చర్చలకు ఉన్న విలువెంత? అలాంటి అసెంబ్లీలో విషయాలు చర్చిస్తే ఉపయోగమెంత?

Monday, 28 March 2011

డ్రైవర్ మల్లేష్, మంత్రి వివేకా

అసెంబ్లీ ఆవరణలో ఒక ఎమ్మెల్యేపై చిన్న దెబ్బ వేసినందుకు డ్రైవర్ మల్లేష్ పాపం అరెస్తయ్యాడు. ఏం కేసులు పెట్టారో, ఎప్పుడు వదులుతారో తెలియదు.

అసెంబ్లీ లోపల ఒక ఎమ్మెల్యేపై నేడొక మంత్రి చెయ్యిచేసుకున్నాడు. మరి ఇప్పుడు మంత్రిపై ఏం కేసులు పెడతారు? మంత్రిని అరెస్టు చేస్తారా? చట్టం సామాన్యుడిపై మాత్రమే అమలు, మంత్రులు చట్టాలకు అతీతులా?