వోటు వేసినా, వేయక పోయినా మన రాష్ట్రంలో అందరూ గౌరవించే పార్టీ నీతివంతమయిన రాజకీయాలను తీసుకురావడానికి పూనుకున్న లోక్ సత్తా పార్టీ మాత్రమే. ఉచిత విద్యూత్తు, ఆరోగ్యశ్రీ, జనాకర్షణ పధకాలు, గనులు లాంటి అనేక విషయాలలో కప్పదాటులు లేకుండా నిర్ద్వందంగా తమ అభిప్రాయాన్ని చెప్పింది ఒక్క లోక్‌సత్త మాత్రమే.
అయితే ఒక్క తెలంగాణా విషయంపై మాత్రం లొక్‌సత్తా మరియూ జయప్రకాష్ నారాయణ మొదటి నుంచి కప్పదాటు ధోరణి అవలంబిస్తూ గోడమీది పిల్లి వాటం సమాధానాలు మాత్రమే చెప్పి తప్పించుకోజూషారు. కాకపోతే కాంగ్రేస్, తెలుగు దేశం పార్టీల మాదిరిగా మేము తెలంగాణాకు వ్యతిరేకం కాదు అని చెప్పి మాట మార్చనందుకు వీరిని అభినందించాలి. అలాగే శ్రీక్రిష్ణ కమిటీ ఏర్పాటయి తమ అభిప్రాయాన్ని ఖచ్చితంగా చెప్పాల్సిన సమయంలో వీరు పార్టీ తరఫున ఒక నివేదికను ఇవ్వటం అభినందనీయం.
బహుషా ఆంధ్రా ప్రాంతం నుంచి వచ్చి తెలంగాణాలో గెలిచినందుకు కావొచ్చు వీరు ముందునుంచీ సుముఖంగా లేరు. తెలంగాణా రాష్ట్రం అవసరంలేదు, తమ పార్టీ విధానమయిన జిల్లా ప్రభుత్వాలద్వారా తెలంగాణాను అభివ్రుద్ధి పరచవచ్చు అనేది వీరి రిపోర్టు సారాంశం.లోక్‌సత్తా నివేదికను ఇక్కడ చూడవచ్చు. లగడపాటి లాంటి వారిచ్చిన వేల పేజీల నివేదిక అర్ధవంతంగా ఉంటుందని ఎవరూ ఆశించకపోయినా, జేపీ గారు ఇచ్చే నివేదిక మీద పెద్ద ఆశే పెట్టుకున్న నాబోటి వారికి ఈ నివేదిక చూస్తే ఆశాభంగమే.
ఈ రిపోర్టులో తమ వాదనను సమర్ధించడం కోసం వీరు అనేక టేబుల్లను, డాటాను జతపరచారు. నాకు మాత్రం వీరి డాటా, రిపోర్టూ అంతా కూడా తాము ముందే అనుకున్న సారాంశాన్ని నిరూపించడానికి వండిన డాటా లాగా అనిపించింది తప్ప డాటా ఉపయోగించుకుని కంక్లూజన్‌కి రాలేదనిపించింది. మేము ఇంజనీరింగు చదివే రోజుల్లో ల్యాబు ఎక్షాముల్లో గ్రాఫులను కరెక్టుగా రావడానికి అవసరమయిన డాటా మాత్రమే తీసుకునే వాళ్ళం. ఇది కూడా అలాగే ఉంది. మనకు కంక్లూజన్ ఎలా కావాలో అలాంటి డాటాని సేకరించడం పెద్ద కష్టం కాదు.
తెలంగాణా అవసరాన్ని నిర్ణయించడానికి వీరు ఎన్నుకున్న విధం 1) తెలంగాణాపై పై వ్యవస్తీక్రుత వివక్ష ఉందా అని 2) వివిధ ప్రాంతాలలో అభివ్రుద్ధి రేటు. తెలంగాణా పై పాలనాపరమయిన వివక్ష లేదు అని చెప్పడానికి వీరి ఉదాహరణలు వివిధ ప్రాంతాలలో తెల్ల కార్డుల సంఖ్య, రెండు రూపాయలు కిలో బియ్యం, ఆరోగ్యశ్రీ లాంటి పధకాల అమలు.కనీసం రోజూ ఒక సారి ఇదే జయప్రకాష్ నారాయణ ఇవి వోట్లకోసం ప్రజలను బిచ్చగాళ్ళుగా మార్చే పధకాలు అని చెబుతాడు. మరి వోట్లు తెలంగాణాలోనయినా ఆంధ్రాలో నయినా ఊరికే రావు కనుక ప్రజలను బిచ్చగాళ్ళుగా మార్చే పధకాలు ఎక్కడయినా సమానంగానే ఉంటాయి. వీటిని చూపించి వివక్ష ఏమీ లేదనడం ఎలా సబబో జేపీగారే చెప్పాలి.
అతిముఖ్యమయిన నదీ జలాల పంపకాల విషయంలో మనకు స్పష్టంగా కప్పదాటు ధోరణి కనిపిస్తుంది. ఆంధ్రా ప్రాంతం కొద్దిగా ఎక్కువ నీరు పొందడానికి కారణం ప్రయర్ యూసేజ్ (రాష్ట్ర ఆవిర్భావానికి ముందే ఉపయోగంలో ఉన్న ప్రాజెక్టులు అని అర్ధం??) మరియు టోపాలజీ (నైసర్గిక స్వరూపం) మాత్రమే కారణమని చెప్పుకొచ్చారు. మరి ఏ టోపాలజీ మరియూ ప్రయర్ యూసేజ్ కారణంగా శ్రీశైలం ఎడమకాలువకి ఎన్నటికీ మోక్షం రాకపోయినా కుడి కాలువ శుబ్బరంగా కర్నూలు, తిరుపతి, మద్రాసుతో పాటు రాజా వారి సిమెంటు కంపనీకి కూడా నీరిస్తుందో చెప్పలేదు. ఏ టోపాలజీ కారణం వల్ల నాగార్జున సాగర్ ఎడమ కాలువ కుదింపు, రాజోలి బండ పేలుళ్ళు, శ్రీరామ సాగర్‌కు నలభై ఏల్లకు కూడ మోక్షం రాకపోవడం కారణమో వివరించలేదు.
తెలంగాణా వెనుకబడలేదు అని నిరూపించడానికి వీరు చెప్పింది తలసరి ఆదాయము తెలంగాణాలోని ఐదు జిల్లాలు:హైదరాబాద్, రంగారడ్డి,నల్గొండ, మెదక్,కరీంనగర్ రాష్ట్ర సగటు తలసరి ఆదాయం కంటే ఎక్కువ అని. ఇందులో నాలుగు జిల్లాలు ఎక్కువ పరిశ్రమలున్న హైదరాబాదు, దాని చుట్టు పక్కల జిల్లాలు కాగా, మిగిలిన కరీం నగర్ బొగ్గు గనులు ఎక్కువగా ఉన్న జిల్లా. పరిశ్రమలలో ఎక్కువ శాతం ఉద్యోగులు ఆంధ్రా ప్రాంతం వారన్నది నిస్సందేహం కాగా కరీం నగర్ బొగ్గు గనులలో ఉన్నతోద్యోగుల్లో ఎక్కువ ఆంధ్రా ప్రాంతం వారే. ఈ తలసరి ఆదాయంలో సగటు తెలంగాణా జీవి ఆదాయం ఎంతో తెలియదు.
చివరగా వీరిచ్చే సజెషన్స్ తెలంగాణా సమస్య జిల్లా ప్రభుత్వాలవల్లే సాధ్యమని చెప్పడం, రీజనల్ కమిటీలు. ఎనభై శాతం ప్రజలు వ్యవసాయంపైన ఆధారపడ్డ మనదేశంలో జలవణరులు లేకుండా అభివ్రుద్ధి చెందిన ప్రాంతం ఏదీ లేదు. మరి తమ ప్రాంతపు జలవణరులను తమకే కాకుండా చేస్తున్న ప్రభుత్వాల నుంచి జిల్లా ప్రభుత్వాలు తమకు ఎలా మేలు చేయగలవో జేపీ గారే చెప్పాలి.
పాజిటివ్ అంశాలు తీసుకుంటే విడిపోతే తెలంగాణా కోల్పోయే తీర ప్రాంతపు ఆక్సెస్, వ్యవసాయానికి ఎక్కువగా పంపుసెట్లపై ఆధారపడే తెలంగాణాకు వచ్చే విద్యుత్ లోటు లాంటి వాటిని చక్కగా వివరించారు. ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణా వాదులని భయపెట్టే ప్రయత్నం చేసారు.
వీరి రిపోర్టులో వివక్ష గురించి చెప్పినప్పుడు, సచివాలయ, న్యాయశాఖ, ఇతర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులలో వివక్ష ఉందో లేదో కొన్ని సర్వేలు నిర్వహించి తెలుసుకుంటే బాగుండేది. 1956లో ఆంధ్ర ప్రదేష్ రాష్ట్రం ఏర్పడకముందు పరిస్తితులూ, పెద్దమనుషుల ఒప్పందం లాంటి విషయాలు నివేదికలో ఎక్కడా కనపడవు. ఏదేమైనా వీరి రిపోర్టు స్టాటిస్టిక్స్ ద్వారా దేన్నైనా నిరూపించవచ్చుననే సామెతను మాత్రం నిరూపించింది.