Thursday, 21 April 2011

ఎవరెవరు వేర్పాటు వాదులు?

తెలంగాణా ఉద్యమాన్ని, తెలంగాణా కోరుకునేవారిని కించపరచడానికి తరుచుగా మీడియా, కొందరు సీమాంధ్రా నాయకులు, తెలుగులో కొందరు బ్లాగరులు విరివిగా వాడెపదం "వేర్పాటు వాదులు". ముందుగా ఈపదాన్ని వాడింది లగడపాటి కాగా తరువాత తరువాత తెలంగాణా వ్యతిరేకించే నాయకులూ, సీమాంధ్రా మీడియా అందరూ వాడ్డం మొదలు పెట్టారు. ఎవరయినా అలా అనకూడదని చెబితే వీరిచ్చే సమాధానం విడిపోవడాన్నికి వేరుపడడం పర్యాయపదం, విడిపోవాలనుకునే వారిని వేర్పాటువాదులనే అంటారు అని.

నిజమే తెలుగులో విడిపోవడం, వేరు పడడం రెండూ ఒకటే. కానీ దానిపక్కన వాదం చేర్చినపుడు అది మామూలు వేరుపడడం కాదు, అర్ధం మారిపోతుంది. ఈ వేర్పాటువాదం అనేపదం ఆంగ్లంలోని separatism, secessionism అనే పదాలకు సరిసమానమయిన అర్ధం కోసం తెలుగులో వాడే పదం. separatism అనే పదం అర్ధం ఒక దేశ సార్వభుమత్వాన్ని ధిక్కరిస్తూ విడిపోవాలనుకునే భావజాలం. ఉదాహరణకు కాశ్మీర్, పంజాబ్, నాగాలాండ్, ఉల్ఫా లాంటి తీవ్రవాదులకుద్దేషించడానికి మనదేశంలో వేర్పాటువాదులు అనే పదాన్ని వాడతారు. అంతే కానీ ఒకదేశంలో ఆదేశ రాజ్యాంగానికి లోబడి ఒక కొత్త రాష్ట్రం కావాలనుకోవడం వేర్పాటువాదం కాదు. ఒకవేళ అది వేర్పాటువాదమయితే అసలు మన రాజ్యాంగంలో కొత్త రాష్ట్రాల ఏర్పాటుకు అసలు వీలుండకూడదు, రాజ్యాంగం అమలులోకి వచ్చినపుడు ఎన్ని రాష్ట్రాలు ఉంటే ఎప్పటికీ అన్నే ఉండాలి. కానీ మన రాజ్యాంగం రాసినవారు అంత తెలివితక్కువ వారు కాదు, మన రాజ్యాంగం ప్రకారం ప్రజల, పాలన అవసరాలను బట్టి కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేయొచ్చు.

వీరు చ్ప్పేట్లు ఒక రాష్ట్రాన్ని విడగొట్టడమే వేర్పాటువాదమయితే మనదేశంలో ఎవరెవరు వేర్పాటువాదులు? వారిలెక్క ప్రకారం వేర్పాటువాదానికి ఆద్యులు స్వాతంత్రం వచ్చినతరువాత మొట్టమొదటిగా రాష్ట్ర ఏర్పాటుకు ఉద్యమం చేసిన సీమాంధ్రా నాయకులు, ప్రజలు. అంటే వీరు వేర్పాటువాదులు అన్న ప్రతిసారీ పొట్టి శ్రీరాములు, టంగుటూరి లాంటి వారిని తీవ్రవాదులతో పోల్చినట్లు. ఇంకా మొన్నీమధ్యనే మూడు కొత్తరాష్ట్రాలను ఏర్పాటుచేసిన బీజేపీ ఒక వేర్పాటువాద రాజకీయపార్టీ. ఇంకా తెలంగాణాకు మద్దతు ఇస్తున్న మమతా బెనర్జీ, షరద్ పవార్, బీజేపీ లాంటి వారంతా వేర్పాటువాదులే. ఇంకా తమతమ పార్టీ మానిఫెస్టోలలో పెట్టినందుకు, ఎప్పుడో ఒకప్పుడు తెలంగాణాకు మద్దతిచ్చినందుకు టీడీపీ, కాంగ్రేస్లు కూడా వేర్పాటువాదులే. అన్నింటికన్నా ముఖ్యంగా తెలంగాణా ఏర్పాటుకు అనుకూలంగా ప్రకటన చేసిన మన యూనియన్ హోం మినిష్టరు చిదంబరం కూడా వేర్పాటువాదే!! హతవిధీ, ఇలా చూస్తే ఈపదాన్ని ఉపయోగించే తెలంగాణా ద్వేషులు మొత్తంగా మన భారత శాంతిభద్రతల మంత్రినే తీవ్రవాదితో పోల్చారన్నమాట.

Wednesday, 20 April 2011

ముసుగేస్తే దాగదీ వివక్ష - ఇరిగేషన్


Image credits: http://www.gideetelangana.blogspot.com/

మన స్వయప్రకటిత మేధావి నాయకుడు జయప్రకాశ్ నారాయణ తెలంగాణా అంశంపై చాన్నాల్లపాటూ గోడమీద పిల్లిలా విన్యాసాలు చేసి ఇక తప్పనిసరి పరిస్థితిలో సమైక్యాంధ్రకు అనుకూలంగా శ్రీక్రిష్ణ కమీషనుకు ఒక రిపోర్టును వండాడు. ఈ రిపోర్టులో తెలంగాణాపై వివక్ష ఏమీ జరగలేదని నిరూపించడానికి అనేక లెక్కలను వండివార్చాడు. దీనిపై గతంలో నేను రాసిన టపా ఇక్కడ చూడొచ్చు. ఈమధ్యనే కొత్తగా వెలిసిన "విషాంధ" మహాసభ అనే ఒక బ్లాగువారు ఈమధ్య తెలుగుజాతిని కలిపి ఉంచే మహత్తర భాద్యతలో భాగంగా తెలంగాణా వాదులపై విషం చిమ్ముతూ పనిలో పనిగా అసలు ఇరిగేషన్‌లో తెలంగాణాపై ఎలాంటి వివక్ష జరగలేదు, అన్నీ కట్టుకథలు అని చెబుతూ ఒక టపా రాశారు. దానికోసం వారు పాపం మన జేపీగారి రిపోర్టును అరువు తెచ్చుకున్నారు.

వీరి వాదన టూకీగా గోదావరి భౌగోళిక స్వరూపంవల్ల శ్రీరాంసాగర్ తరువాత పోలవరం వరకూ ఎక్కడా డాం కట్టడానికి అనువైన స్థలం లేదు, ఎత్తిపోతలు ఖర్చుతో కూడినపని (అంటే ఇచ్చాపురం ప్రాణహిత-చేవెళ్ళ పధకాన్ని అటకెక్కించాలి). కనుక గోదావరి జలాలను తెలంగాణాలో వాడకంలో తేవడం సాధ్యం కాదు, పోలవరం దగ్గర ప్రాజెక్టు కట్టి నీటిని క్రిష్ణా డెల్టాకు మల్లించాలి, తద్వారా మిగిలిన క్రిష్ణా నీటిని రాయలసీమకు మల్లించాలి, తెలంగాణా నోట్లో మొత్తంగా మట్టికొట్టాలి. మన ప్రభుత్వ ఉద్దేషంకూడా ఇదే కానీ బయటికి చెప్పక తెలంగాణాలో కూడా ప్రాజెక్టులు చేస్తున్నాం అని కథలు చెబుతూ ప్రజలను ఏమారుస్తారు, వీరు మేధావులు కనుక బహిరంగంగానే తెలంగాణా నోట్లో మట్టికొట్టాలని ప్రవచిస్తారు. వీరి వాదనలో ఎక్కడా క్రిష్ణా నది ఊసెత్తరు, ఎందుకంటే అక్కడ జరిగే వివక్షను ఏమార్చడం ఇంతమేధావులవల్ల కూడా కాలేదు మరి.

ఇప్పటికే క్రిష్ణా పూర్తిగా తెలంగాణాకు కాకుండా పోయింది. మిగిలిన గోదావరిని కూడా తెలంగాణాకు కాకుండా చెయ్యడం అనే తమ ప్రణాలికను ఒకవైపు చెబుతూనే మరోవైపు తెలంగాణాపై వివక్షలేదని చెప్పడం వీరి వాదన. మీ ప్రాంతంలో నీల్లివ్వడం కష్టం, మీకు వ్యవసాయం లాభదాయకం కాదు, రైతులందరూ వ్యవసాయం వదిలేసి మీ భూములను సెజ్జులకిచ్చేయండి, ఆతరువాత ఆసెజ్జులు కట్టేప్పుడు రోజుకూలీలుగా పనిచేసి పొట్టపోసుకోండి, కడుపు నిండకపోతే ముంబైకో దుబాయికో వలస పోండి, కానీ మీకు ఎవరైనా వచ్చి ఇక్కడి సాగునీటి వాడకంలో మోసం జరిగిందంటే మాత్రం అస్సలు నమ్మొద్దు. ఇదీ వీరి వాదన.

శ్రీరాం సాగర్ ప్రాజెక్టు: తెలంగాణాపై ఎప్పుడు వివక్ష ఊసొచ్చినా సమైక్యవాదులు ఇచ్చే ఏకైక ఉదాహరణ శ్రీరాంసాగర్. చూశారా శ్రీరాంసాగర్ మీనిజాం కట్టించలేదు, సమైక్య ప్రభుత్వమే కట్టించింది. ఎంతసేపూ అందులో పూర్తిగాని స్టేజీలనే ఎందుకు మాట్లాడుతారు? పూర్తయిన చిన్నముక్కను చూసి సంతోషించొచ్చు కదా?

శ్రీరాంసాగర్ ప్రాజెక్టును సమైక్య ప్రభుత్వం తెలంగాణాపై ప్రేమతోనో, తమ భాద్యత గుర్తొచ్చో ఇవ్వలేదు. ఇక్కడి ప్రజలు 69లో రాష్ట్రం కొరకు ఉద్యమం చేస్తే ఉద్యమాన్ని బలవంతంగా అణచివేసినతరువాత ఏదో ఒకటి చెయ్యకపోతే ఎక్కువకాలం ఏమార్చలేమని ఈప్రాజెక్టును మొదలుపెట్టారు. గోదావరి నదిపై శ్రీరాం సాగర్ ఉన్న ప్రాంతం అత్యంత ఎత్తుపై ఉన్న ప్రాంతం, ఆప్రాజెక్టు ద్వారా గోదావరి నీటిని కరీమ్నగర్, ఆదిలాబాద్, ఖమ్మం, నల్లగొండ, వరంగల్ జిల్లాలన్నింటికీ ఇచ్చే ప్రణాలికతో మొదలయిన ప్రాజెక్టు. పూర్తయితే ఇరవై లక్షల ఎకరాలకు సాగునీరివ్వాల్సిన ప్రాజెక్టు అన్ని క్లియరెన్సులూ వచ్చిన తరువాత నలభై ఏల్లు గడచిన తరువాత కూడా ఇంకా ఐదు లక్షల ఎకరాలకు కూడా ఇవ్వలేకపోతుంది. నల్లగొండ, వరంగల్ జిల్లాల ప్రజలు ఎప్పటికైనా తమకు పోచంపాడు(శ్రీరాంసాగర్) నీల్లొస్తాయని ఇంకా ఎదురుచూస్తూనే ఉన్నారు.

మన దేశంలో ప్రాజెక్టులన్ని ఇలాగే లేటవుతాయి అందులో పెద్ద వివక్ష ఏమీ లేదు అని తేల్చే వారు ఒక్క సారి మన రాష్ట్రంలోని నాగార్జునసాగర్, తెలుగు గంగ ప్రాజెక్టులు, ఇతర రాష్ట్రాలలోని పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఎన్ని రోజుల్లో అయ్యాయో గమనించాలి.

లిఫ్ట్ ఇరిగేషన్ పై అపోహలు: లిఫ్ట్ ఇరిగేషన్లో నదిపై అనువైన ప్రాంతంలో ఒక బ్యారేజీ కట్టి, స్టోరయిన నీళ్ళను ఒక ఎత్తయిన ప్రదేశంలో కట్టిన రిజర్వాయరుకు తరలిస్తారు. అక్కడినుంచి కాలువల ద్వారానో మరో విధంగానో ఆయకట్టుకు నీటిని తరలించొచ్చు. లిఫ్ట్ ఇరిగేషన్‌పై వచ్చే విమర్శలు ఏమిటంటే దీనివలన విద్యుత్ ఖర్చవుతుంది, ఇది అదనపు భారం. గ్రావిటీ ద్వారా నయితే ఫ్రీగా నీటిని తరలించొచ్చు.

నిజమే నీటిని లిఫ్ట్ చెయ్యాలంటే విద్యుత్ కావాలి. ఐతే మన దేశంలో 70 శాతం ప్రజల జీవనాధారం వ్యవసాయం. ఏదో అభివృద్ధి చెందిన దేశాల్లో లాగా మనం వ్యవసాయం లాభసాటి అయితేనే చెయ్యం, వ్యవసాయం ఇక్కడ ఎందరికో జీవన విధానం. కాలువల ద్వారా నీరు రాకపోతే ప్రతి రైతూ ఒక బావి తవ్వుకోవాలి, బావిలో నీల్లు సరిపోవు కనుక అందులో ఒక బోరు వేసుకోవాలి, రెండు మోటార్లు పెట్టి బోరునీటిని పొలానికి తరలించాలి. అంటే రైతు కాలువవ్యవసాయం కంటే అదనంగా బావికి, బోరుకు, మోటార్లకు, విద్యుత్తుకు ఖర్చు చెయ్యాలి. ఆ విద్యత్తుకు ప్రభుత్వం సబ్సిడీ ఇస్తే ప్రపంచ బ్యాంకు ఏడుపులు. ప్రతి రైతూ తన బోరుకోసం విద్యౌత్‌పై చేసే ఖర్చూ, అందుకు ప్రభుత్వ సబ్సిడీ అన్నీ చూసుకుంటే లిఫ్ట్ ఇరిగేషన్‌లో అయ్యే విద్యుత్ ఖర్చు చాలా తక్కువ. తీరా వచ్చే కరెంటు కనీసం ఆరుగంటలు కూడా ఉండదు, అది ఎప్పుడొస్తుందో తెలియక నిద్రాహారాలు మాని పొలం దగ్గర పడిగాపులు చెయ్యాలి. ఇంతఖర్చు చేసి చివరికి పొలం ఎండిపోతే రైతులు అప్పులభాధకు ఆత్మహత్యలు చేసుకోవాలి.

మరి ఒక ప్రాజెక్టుకింద వ్యవసాయం చేసేవారు ఏదో నామమాత్రంగా ఎకరాకు యాభై రూపాయలు ప్రభుత్వానికిస్తాడు. మరి ప్రాజెక్టు కట్టిన ఖర్చూ, కాలువలు తవ్విన ఖర్చూ, వాటి మెయింటెనన్సు ఖర్చులూ, ప్రాజెక్టు కట్టినప్పుడు నిర్వాసితులకు పునరావాస ఖర్చు ఇవన్నీ ఖర్చులు కావా? ఇవన్ని ఎవరి జేబులోనుంచి వెల్తున్నాయి? కాబట్టి రైతుకు నీటిని ఇవ్వడం అనేది ప్రభుత్వ భాద్యత, అందులో లాభనష్టాలు బేరీజు వేసుకుని ఎక్కడ కాలువ తావ్వడం తక్కువ ఖర్చుతో అవుతుందో అక్కడే తవ్వుతాం, ఎక్కడ ఖర్చెక్కువ అవుతుందో అక్కడ తవ్వం అని ఏప్రభుత్వమూ లెక్కలు కట్టదు, ఒక్క మన ప్రభుత్వం తప్ప. మన పక్క రాష్ట్రం అయిన మహారాష్ట్రలో, మిగతా చాలా చోట్ల చక్కగా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములు ఏర్పాటు చేసుకున్నారు, వారి వాటా నీటిని వాడుకున్నారు అంతే కానీ డెల్టా ప్రాంతం మాకు లేదు, డెల్టా అంతా కోస్తా ఆంధ్రలో ఉంది అక్కడయితే తేలిగ్గా నీటిని సరఫరా చెయ్యొచ్చు కాబట్టి ఈనీళ్ళను వారికే వదిలేద్దం అనుకోలేదు.మన రాష్ట్రంలోమాత్రం గడచిన యాభై ఏల్లలో శ్రీరాంసాగర్ నుంచి ధవలేశ్వరం మధ్యలో ఒక్క ప్రాజెక్టూ కట్టకపోవడానికి చూపించే సాకు గ్రావిటీ.

వాటర్ బేసిన్ ఉల్లంఘణలు: ఏ నదీ జలాలను ఆ నది బేసిన్‌లోనే వాడాలనేది ఇరిగేషన్‌లో ఒక ప్రాధమిక సూత్రం. మన రాష్ట్రం మాత్రం క్రిష్ణా జలాలను పూర్తిగా పెన్నా బేసిన్లో ఉన్న రాయలసీమకు,నెల్లూరుకూ తరలించి కనీసం పది శాతం కూడా తెలంగాణకు ఇవ్వట్లేదు. ఈ ఉల్లంఘణవల్ల నష్టం తెలంగాణాకు మాత్రమే కాదు, క్రిష్ణా ట్రిబ్యునల్ వద్ద కర్నాటక మనరాష్ట్ర రివర్ బేసిన్ వియోలేషన్లను సాకుగా చూపించి తను ఎక్కువ నీటి వాటాను పొందుతుంది. ఈ వాటర్ బేసిన్ ఉల్లంగణలవల్ల క్రిష్ణా ట్రిబ్యునల్ తీర్పులో మనరాష్ట్రానికి (మొత్తం ఆంధ్ర ప్రదేశ్‌కు, తెలంగాణకు మాత్రమే కాదు) జరిగిన నష్తం గురించి నేను గతంలో రాసిన టపా ఇక్కడ చూడొచ్చు.

మన ప్రభుత్వం మేం మిగులు జలాలను మాత్రమే వేరే ప్రాంతాలకు తరలిస్తున్నామని కుంటి సాకులు చెబుతూ వచ్చింది, నికరజలాలను వాడకుండా మిగులు జలాలు ఎలావాడుతారో చెప్పలేకపోయి క్రిష్ణాలో వాటాను తగ్గించుకుంది. ఇప్పుడు గోదావరి విషయంలో కూడా తెలంగాణాలో గ్రావిటీ సాకు చూపించి గొడావరి నీటిని ఇతర బేసిన్లకు తరలించే ప్రయత్నం చేస్తుంది. దాన్ని మన జేపీగారి మేధావి వర్గం అప్రూవ్ చేస్తుంది.

పోలవరం: ఇక గోదావరి నీటిని తెలంగాణాలో వాడడానికి గ్రావిటీ బూచిని చూపిస్తున్నవారు పోలవరంపై మాత్రం గగ్గోలు పెడతారు. లక్షల మంది ఆదివాసీలను నిర్వాసితులను చేసి, ఎంతో ప్రకృతి సంపదను, పాపికొండలనూ, వన్యమృగాలనూ ముంచేసే పోలవరంపై వీరికి అపార ప్రేమ. తెలంగాణాలో అన్ని క్లియరెన్సులూ వచ్చేసి దశాబ్దాలు పెండింగులో ఉన్న ప్రాజెక్టులను వదిలేసి ఎన్విరన్‌మెంట్ అనుమతి లేని పోలవరంపై మాత్రం ఉద్యమాలు చేస్తారు.పోలవరంపై ఆదివాసీల అభిప్రాయాలు ఈవీడియోలో చూడొచ్చు.రాష్ట్రం ఏర్పడితే తెలంగాణకు ఏం లాభం?: ఇప్పుడు ప్రత్యేక రాష్ట్రాలవడం వలన మహారాష్ట్ర, కర్ణాటక, చత్తీస్ఘర్ గోదవరిపై తమ హక్కును ఎలా కాపాడుకుంటున్నాయో అలాగే తెలంగాణ కూడా తమ గోదావరి జలాలపై తమహక్కును కాపాడుకుంటుంది. ఇది తెలుసుకోవడానికి సివిల్ ఇంజనీరింగ్ అక్కరలేదు, మేధావులు కానక్కర్లేదు. ఎలా గ్రావిటీ సమస్యను అధిగమిస్తారు నీటిని ఎలా పంపు చేస్తారు అనేది తెలంగాణ ప్రజలకు సంబంధించిన విషయం. ఇక గోదావరిపై తెలంగాణకు అన్యాయం ఏమీ జరగలేదని మోసపు రాతలు రాసేవారు మీ రాతలను కట్తబెట్టి మీపని మీరు చూసుకోవచ్చు.

Monday, 18 April 2011

మంత్రాలు చదివేది ఎక్కడివారయినా చింతకాయలు రాలవు!!

కేసీఆర్ గారూ, ఒకపక్క ఉద్యమం ఊపుమీద నడుస్తున్న సమయంలో తాబేలు లాగా అగ్నాతంలోకి వెల్లి చండీయాగం అంటూ తంతులతో కాలక్షేపం చేసింది చాలక పైగా ఆంధ్రా బ్రహ్మలకు నిష్ట తక్కువ, తెలంగాణా బ్రహ్మణులకు నిష్ట ఎక్కువ అంటూ అవాకులు పేలడం దేనికోసం? ఏం, తెలంగాణా అర్చకులు నిష్టతో చదివితే చింతకాయలేమన్నా రాలుతున్నాయా, ఆచింతకాయలతో తెలంగాణా సాధిస్తారా?

ఒకపక్క విమలక్క ధైర్యంగా వెల్లి లగడపాటి లాంకో హిల్స్‌లో జెండాలు పాతితే, మీరేమో ఇంట్లో కూర్చుని యాగాలు చేస్తారు కానీ కబ్జా భూములగురించి మాట్లాడరు. మాట్లాడ్డానికి ఇప్పుడు తెలంగాణాలో సవాలక్ష కారణాలు ఉన్నాయి. ఒక శ్రీక్రిష్ణ కమిటీ ఎనిమిదో అధ్యాయం గురించో, ఒక 177జీవో గురించో, కబ్జాకు గురవుతున్న భూముల గురించో మాట్లాడక ఎందుకు ఈ బ్రాహ్మల సంగతి? మీరు మంచి వక్త. ఏ విషయాన్ని ఎత్తుకున్నా అనర్గళంగా మాట్లాడగలరు. నిజానికి ప్రస్తుతం రాష్ట్రంలో తెలుగూ, ఇంగ్లీషు, హిందీ, ఉర్దూ భాషలన్నింటిలో అణర్గళంగా మాట్లాడగలిగేది మీరొక్కరే. అలాగే మాట్లాడేప్పుడు ముక్కుసూటిగా విషయాన్ని కుండబద్దలు కొట్టినట్లు చెప్పగలిగేదీ, వాదనకు కావలిసిన పాయింట్లను చటుక్కున పట్టుకోగలిగేదీ ఇంకెవరూ లేరు. మరి ఎందుకు ఇలా అనవసర విషయాలపై మాట్లాడి నాలుక కరుచుకునేది? బిర్యానీ గురించీ, అర్చకుల గురించీ వదిలేసి విషయం చూడండి.

Tuesday, 12 April 2011

దేముడికీ చావొస్తుంది!!-ముగింపు (కథ)

రోజులు గడుస్తున్న కొద్దీ సత్తిరాజు చింతచెట్టు ఆశ్రమానికి భక్తుల రాక విపరీతంగా పెరిగింది. హుండీలు చూస్తుండగానే నిండుతున్నాయి. వచ్చినడబ్బుతో చింతచెట్టు ఆశ్రమాన్ని పెద్ద రాజభవనం లాగా కట్తారు. ఇంకా అనేక చోట్లకూడా ఆశ్రమాలు స్థాపించి ప్రచారం మొదల్పెట్తారు. ఆశ్రమాలు పెరుగుతుండడంతో దానితోపాటు భక్తులు కూడా పెరుగుతున్నారు.

కొన్నాల్లు పొయ్యాక సత్తిరాజుకు, మిగతా శిష్యులకూ ఒక ఐడియా వచ్చింది. ఎన్నాల్లు ఇలా హుండీలు పెట్టి డబ్బులు తీసుకుంటాం, ఆశ్రమం తరఫున ఒక ట్రస్టును పెడితే ట్రస్టుపేరుచెప్పి దర్జాగా డబ్బులడుక్కోవచ్చు అనుకున్ని ఒక ట్రస్టును స్థాపించారు. ఇప్పటికే విదేశాల్లో కూడా ఆశ్రమాలు ఉండడంతో విదేశాల్లో కూడ ట్రస్టు పేరుతో డబ్బులు వసూలు చెయ్యడం మొదలుపెట్టారు. ఊరికే డబ్బులు తీసుకుంటే బాగుండదు కాబట్టి వచ్చిన డబ్బులో ఒక నయాపైసా వంతు ఖర్చుచేసి వారిజిల్లాలో మంచినీటి సౌకర్యాలు, ఒకట్రెండు హాస్పిటల్లూ పెట్టారు. దీంతో సత్తిరాజు ఒకే దెబ్బకు రెండు పిట్టలు పట్టాడు. తనభక్తులకు తనను సమర్ధించడానికి ఒక సాకు దొరికింది, దానితోపాటు ఇంకా ఎక్కువ డబ్బు వసూలు చెయ్యడానికి తనకు అవకాశం కూడా దొరికింది.

రంగడు అదే ఊర్లో ఉండి సత్తిరాజును మొదటినుంచీ ఎరిగినవాడు, ఆండాల్లమ్మ చెయ్యిపట్టుకున్నప్పుడు సత్తిరాజును కొట్టిన వారిలో ఒకడు. రంగడు ఈసత్తిరాజు దేముడు కాదు, వీడు ఒకప్పుడు ఒట్టి జులాయి అని అరిచాడు. రంగడి గోల ఎవరూ పట్టించుకోలేదు. ఏం, నీడబ్బులేమన్నా ఆశ్రమానికిచ్చావా నీకెందుకు అని ఒకడన్నాడు. ఔరా, నాదాకా వస్తే కానీ నేను మాట్లాడకూడదా అని రంగడు బుర్రగోక్కున్నాడు. మనఊరికి నీల్లిచ్చాడు కదా, మహిమలున్నా లేకపోయినా సత్తిరాజు దేముడే అని మరొకడన్నాడు. ఇదేపని ఎంతమంది రాజకీయ నాయకులు చెయ్యగలుగుతున్నారు, వారు చెయ్యలేనిపని నేడు మన సత్తిరాజు చేశాడు, సత్తిరాజు దేవుడే అని ఇంకోడన్నాడు. విదేశస్తుల దగ్గరినుండి డబ్బులు కొల్లగొట్టి మన ఊరికి నీళ్ళు తెచ్చాడు, సత్తిరాజు అభినవ రాబిన్‌హుడ్ అని మరొకడన్నాడు. డబ్బులిమ్మని ఎవ్వరినీ అడగలేదు కదా, ప్రజలు తమకు తాముగా వచ్చి డబ్బులిస్తే తీసుకుంటే తప్పేంటి అని ఇంకొకడన్నాడు. చేతనయితే నువ్వు దేవుడని చెప్పుకో ఎవరొద్దన్నారు అని ఇంకోడన్నాడు. నీదంతా ఉట్టి 'హేటు' వాదం, మేము మాట్లాడేదే వాస్తవం దబాయించారు.

రంగడికేమీ పాలు పోలేదు. అదేంటి రాజకీయనాయకులతో పోలుస్తున్నారు, వారినేమీ దేవుడని చెప్పి మొక్కట్లేదు కదా అనుకున్నాడు. ఏమిటి విదేశస్తులను మోసం చేస్తే అది మాత్రం మోసం కాదా, మనలను చేస్తేనే మోసమా అనుకున్నాడు. డబ్బులు అడిగి తీసుకుంటేనే మోసమా, దేవుడని చెప్పి నమ్మించి డబ్బులు తీసుకుంటే మోసం కాదా అనుకున్నాడు, పైగా ఆపని తాను చేసి చూపించాలంట. ఒకపక్క అదిమోసమని చెబుతుంటే అదే మోసం తనను చెయ్యమంటారు ఏంటో అనుకున్నాడు.

కొన్నాల్లకి సత్తిరాజుకు జబ్బు చేసింది. రేపో ఎల్లుండో అనేలా తయారయ్యాడు. భక్తులు దేశదేశాలనుండి వచ్చి సత్తిరాజుకోసం ఏడుస్తున్నారు, గుండెలు బాదుకుంటున్నారు. తనతోపాటు ఊరిలో పెరిగి, తను చూస్తుండగా చిల్లరదంగతనాలు చేసినవాడు, తనచేతిలో తన్నులు తిన్నవాడు ఈరోజు ఇలా దేవుడిలా వెలిగిపోతుంటే రంగడికేం పాలుపోలేదు. చివరి రంగడికి తత్వం బొధపడింది. దేముడికి కూడా చావొస్తుంది కానీ ప్రజల అమాయకత్వానికి చావు రాదు అనుకున్నాడు. సత్యానందస్వామి ఆరోగ్యం కుదుటపడాలని భజన చేస్తున్న జనంతో తనూ గొంతుకలిపాడు.

Monday, 4 April 2011

దేముడికీ చావొస్తుంది!! (కథ)

సత్తిరాజు ఆఊర్లో ఒక మంచి జులాయి. మంచి జులాయి అంటే నిజంగా మంచి తెలివయిన జులాయి అన్నమాట. అల్లరి తిరుగుళ్ళూ, చిల్లర దొంగతనాలే కాదు తెలివిగా జనాలను ఎలా మోసం చెయ్యాలో బాగా తెలిసిన వాడు. ఊర్లో సత్తిరాజంటే తెలియనివారూ, సత్తిరాజును తిట్టని వారూ ఎవరూ ఉండరేమో. ఒకరోజు సంతలో ఆండాళ్ళమ్మ చెయ్యి పట్టుకున్నందుకు అక్కడి జనం చక్కగా వడ్డించడమే కాదు, మళ్ళీ ఊర్లో కనిపిస్తే మక్కెలిరుగుతాయని వార్నింగు కూడా ఇచ్చారు.

సత్తిరాజుకు అహం దెబ్బతిన్నది. ఛ!ఎందుకీబతుకు అనుకున్నాడు. ఊరోళ్ళమీద బాగ కసి పుట్టింది. అసలీ ఊళ్ళోనే ఉండొద్దు అనుకున్నాడు. కానీ ఎక్కడికని వెల్లగలడు? ఊరిబయట చింతతోపులో అలా ఒంటరిగా నడుస్తున్నాడు. ఆలోచిస్తున్*నాడు. ఏమిటి చెయ్యాలి? తనను కొట్టిన ఈఊరివారిపై ఎలా కసి తీర్చుకోవాలి అని తెగ బుర్రగోక్కున్నాడు. సరే కొద్దిరోజులు పట్నం వెల్లి గడిపి అంతా సద్దుమణిగినతరువాత మల్లీ ఊరికి రావచ్చని పట్నం బస్సెక్కాడు.

ఫట్నంలో అలా ఒంటరిగా నడుస్తూ ఉంటే కాషాయం బట్టలు తొడుక్కుని గడ్డం పెంచుకుని, గంజాయి పీలుస్తూ గుడిపక్కన కూర్చున్న ఒక జంగమయ్య కనిపించాడు. జంగమయ్యను చూడగానే సత్తిరాజు బుర్రలో తళుక్కున ఒక ఐడియా మెరిసింది. ఔను, తానొక స్వామీజీ అవతారమెత్తి ఊరికెల్తే? ఊరివాల్లు నమ్ముతారా? తనను కొట్టినవారు ఇప్పుడు తనమాట వింటారా? ఏమయితే అదయింది, ఇంకా ఎన్నాల్లీ చిల్లర దొంగతనాలు, జీవితంలో ఏదో ఒకటి గట్టిగా చేసెయ్యాలనే మొండి ధైర్యం వచ్చింది. జేబులో ఉన్న ఐదొందల నోటుతో మార్కెటుకెల్లి ఒక కాషాయం రంగు తాను గుడ్డా, ఉంగరాలజుత్తుండే విగ్గూ కొనుక్కొచ్చాడు. దారిన కనపడ్డ టైలరు దగ్గర కాషాయం గుడ్డతో రెండు నైటీ టైపు గౌనులు కుట్టించుకున్నాడు. బూక్‌స్టాల్ కెల్లి తెలుగులో కనపడ్డ రెండు భక్తి పుస్తకాలు, తత్వాలు కొన్నాడు. ఒక నెలరోజులు అలాగే పట్నంలో ఉండి పుస్తకాల్లో దొరికిన తత్వం ముక్కలు బట్టి వేశాడు.

నెలరోజుల తరువాత ఒకరోజు రాత్రి సత్తిరాజు తిరిగి ఊరికెల్లాడు. చీకట్లోనే తనకు తెలిసిన ఇద్దరు చిల్లర దొంగలను కలుసుకుని తన ప్లాను చెప్పాడు. తెల్లవారగానే ఒక చెట్టుకింద కూర్చుని ఇద్దరు దొంగలనీ శిష్యులుగా చేసుకుని తత్వం మాట్లాడం మొదలుపెట్టాడు. ఆనోటా ఈనోటా ఊరిజనానికి అందరికీ సత్తిరాజు కొత్తావతారం గురించి తెలిసింది. మొదట నవ్వుకున్నారు, తరువాత సరేలే పోనిమ్మనుకున్నారు, మెల్లిగా ఏమో ఏ పుట్టలో ఏపాముందో? ఎక్కడికెల్లి ఏమహిమలు నేర్చుకున్నాడో అనుకున్నారు. మెల్లిమెల్లిగా సత్తిరాజు చింతచెట్టుకు జనం రాకపోకలు పెరిగిపొయ్యాయి. అన్నట్టు మరో విషయం! పట్నంలో ఉండగా ఒక గారడీవాడు రోడ్డుమీద ఆడుతుంటే సత్తిరాజు గంటలతరబడి చూసి కొన్ని చిన్నచిన్న విద్యలు నేర్చుకున్నాడు. ఇంతకుముందు జేబుదొంగతనాలు చేసే అనుభవం ఉండడంతో నేర్చుకోవడం పెద్ద కష్టం కాలేదు. ఇప్పుడు ఆ గారడీ బాగ కలిసొచ్చింది. చెట్టుదగ్గరికి వచ్చిన ఊరివారిని ఆకర్షించదంకోసం గారడీలు చెయ్యడం మొదలు పెట్టాడు. ఆండాళ్ళమ్మ విషయంలో తన ప్రేమ బెడిసికొట్టడం బాగ పనిచేసిందేమో, వచ్చినవారికి ప్రేమే దైవం అంటూ తత్వం చెప్పేవాడు.

ఇప్పుడు సత్తిరాజు వట్టి సత్తిరాజు కాదు, సత్యానందస్వామి. ఆనోటా ఈనోటా చుట్టుపక్కల ఉన్న ఊరివారందరికీ తెలిసిపొయ్యాడు. చింతచెట్టు చుట్టూ ఒక చిన్న ఆశ్రమం కట్టారు. జనాల రాకపోకలు పెరిగాయి. వచ్చినవారో అంతో ఇంతో డబ్బులు ఇచ్చేవారు, లేకపోతే ఏదయిన వస్తువు ఇచ్చేవారు. ఇప్పుడు సత్తిరాజుకూ, శిష్యులకూ రోజులూ బాగా గడుస్తున్నాయి. ఆశ్రమంలో కొంతమంది పెర్మనెంట్ భక్తులు ఏర్పడ్డారు. ఒకరోజు శివరాత్రినాడు మంచి టైం చూసుకుని సత్తిరాజు భక్తులకు తాను దేవున్ననీ, ఫలానా అవతారమనీ చెప్పుకున్నాడు. భక్తులు నిజమే కాబోలనుకున్నారు. దేవుడికి అతిదగ్గరి భక్తబృందంలో తామున్నందుకు మురిసిపొయ్యారు, తమవంతు ప్రచారం చేశారు. చూస్తుండగానే సత్యస్వామికి రాష్ట్రం మొత్తంలో భక్తులు పెరిగిపొయ్యారు.
(ఇంకాఉంది)

Sunday, 3 April 2011

దేవుడి ఆరోగ్యంపై ముఖ్యమంత్రి ఆందోళన

కలియుగ దైవం, శిర్డీసాయి, దత్తాత్రేయుల అవతారమైన సత్యసాయిబాబా ఆరోగ్యం పాపం కొద్దిరోజులనుండీ బాగోలేదట. తప్పదు మరి ఎంత అవతారమూర్తి అయినా వయసు మీదపడితే ఇంకేం చేస్తాడు. అయితే మనరాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రం ఈవిషయంపై ఉన్నతస్థాయిలో ఆరోగ్యశాఖలోని అధికారులతో సమీక్షలు జరుపుతున్నాడట. నిపుణులను పుట్టపర్థికి పంపాలని ఆదేశించాడట. మన ఆరోగ్యమంత్రి గీతారెడ్డి కూడా పుట్టపర్థికి వెల్లి రెండురోజులుగా అక్కడే క్యాంప్‌వేసి మరీ ఆయన ఆరోగ్యాన్ని సమీక్షిస్తుందట.

ముఖ్యమంత్రి గారూ, దేవుడి ఆరోగ్యం గురించి మీరేం వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు, ఆయన చూసుకుంటాడు. మీరు రాష్ట్రం ఆరోగ్యం గురించి చూడండి. వయసు మీదపడ్డాక దేవుడికైనా మృత్యువు తప్పదు, రాష్ట్రంలో ఎందరో ఆరోగ్యసదుపాయాలు అందక వయసునిండకుండానే మరణిస్తున్నారు, కాస్త వారి సంగతి చూడండి.