Thursday, 23 December 2010

తొంభై ఐదేళ్ళ యువకుడు

శ్రీ కొండా లక్ష్మన్ బాపూజీ గారు ప్రస్తుత తరం ప్రజలకి అంతగా తెలియని వెనుకటి తరం కాంగ్రేస్ నాయకుడు. తొంభై అయిదు సంవత్సరాలు పైబడ్డ వయసులో కూడా కొండా లక్ష్మన్ గారు తెలంగాణా ఉద్యమంలో అత్యంత చురుగ్గా పాల్గొంటూ అనేక కార్యక్రమాలలో ముఖ్య అథిధిగా, వక్తగా ఉద్యమానికి తోడ్పడుతున్నారు..

స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్న కొండా లక్ష్మన్ గారు 1956లొ ఆంధ్రప్రదేశ్ అవతరణ తరువాతి మొట్టమొదటి అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్‌గా పనిచేశారు. ఆ తరువాత రాష్ట్ర మంత్రిగా విభిన్న ప్రభుత్వాలలో పనిచేసిన ఈ నేత 1969లో తెలంగాణా ఉద్యమానికి మద్దతుగా తన పదవికి రాజీనామా చేశి ఉద్యమంలో భాగస్వామ్యం తీసుకున్నారు. ఆదిలాబాద్ వాస్తవ్యుడైనప్పటికీ నల్లగొండ జిల్లా నుండి అసెంబ్లీకి ప్రాతినిఘ్యం వహించారు. తెలంగాణా ప్రజా సమతి ఫౌండింగ్ మెంబర్ కూడా అయిన కొండా లక్ష్మన్ గారు నేటికీ అదే ఉద్యమస్ఫూర్తిని ప్రదర్శిస్తున్నారు.

సుమారు నలభై ఏళ్ళుగా తెలంగాణా ఆశయం కోసం పనిచేసిన కొండా లక్ష్మన్ గారు టీఆరెస్ పార్టీ ఆఫీసు కోసం తన నివాస గృహాన్ని అద్దె లేకుండానే ఇవ్వగా అక్కసుతో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టాంక్‌బండ్ పక్కన ఉన్న వారి ఇంటిని అధికారబలంతో రాత్రికి రాత్రి నేలమట్టం చేయించాడు.

తన ఇద్దరు కొడుకులలో ఒక కొడుకు ఇండియన్ ఎయిర్‌ఫోర్సులో పైలట్‌గా పని చేసి విమాన ప్రమాదంలో మృతి చెందగా మరో కొడుకు అమెరికాలో ఉంటూ ఇటీవలే అనారోగ్యంతో చనిపోయారు. తొంభై ఏల్ల వయసులో కూడా తన ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్న బాపూజీ గారు ఈ వయసులో కూడా ఉద్యమానికి సంబంధించి ఎవరు ఏ సమావేశానికి ఆహ్వానించినా తప్పకుండా వెలుతారు. ఈ తొంభై అయిదేళ్ళ యువకుడి ఉద్యమస్ఫూర్తికి నా జోహార్లు.

Wednesday, 25 August 2010

"రహస్య గూఢాచారి aka కణిక నీతి" (డా విన్‌చీ కోడ్ కు స్వేచ్చానువాదం)

గోల్కొండ కోటలో తానీషా జైలు దగ్గర ఉండే వాచ్‌మన్ ఒకరోజు హఠాత్తుగా మరణిస్తాడు. ఎవరో అతన్ని తుపాకీతో కాల్చివేశారు. ఆ తరువాత బుల్లెట్ గాయంతో వాచ్‌మన్ 10 మీటర్లు నడిచి ఒక బురుజు దగ్గర హిందీ 'ర ' ఆకారంలో ముడుచుకుని ప్రాణం విడుస్తాడు. అప్పుడే ప్రఖ్యాత కుట్రకోణాల స్పెషలిస్టూ గోల్కొండ కోట చూడ్డానికి వస్తుంది. పోలీసులు ఆవిడే వాచ్‌మన్ను చంపిందేమో నని వెంబడిస్తారు.

ఆ తరువాత వరుసగా భీమోజి ఫిల్మ్ సిటీలో ఒక తోట మాలీ, తానియా గాంధీ సెక్యూరిటీ వాడూ, కిద్వానీకి అంట్లు తోమే వాడూ, టాటా కారు డ్రైవరూ అంతా ఒకేసారి హత్య కావించబడుతారు.

తనపై వచ్చిన నేరారోపణని తుడిచేయడం కోసం, ఈ నాలుగు హత్యల రహస్యం తెలుసుకోవడం కోసం హీరోయిన్ అయిన కుట్రకోణాల స్పెషలిస్టూ ప్రయత్నం చేస్తుంది. తన పరిశోధనలో తెలిసేదేమంటే భారత దేశం ఆర్ధిక, రాజకీయ, ఇతిహాసాలపై నాలుగు వందల సంవత్సరాలుగా ఒక మహా కుట్ర జరుగుతుంటుంది. ఈ కుట్ర ఒక కణిక వ్యవస్థ నడుపుతుంటుంది. వీరంతా ఒక నెట్ వర్క్ లాగా ఏర్పడి తరతరాలుగా ఈ రహస్యాన్ని తరువాతి తరాలకి అందిస్తూ ఉంటారు.

వీరి కుట్ర యొక్క రహస్యం ఇంకో రహస్య గ్రూపుకి తెలిసి ఉంటుంది. ఈ రెండో రహస్య గ్రూపు కణిక వ్యవస్థలో ఒక్కొక్కరి ఇంటిలో పని వారు గానూ, వాచ్మన్, కారు డ్రవరుల్లాగా ఉంటారు. కణిక వ్యవస్థ నాయకుడైన భీమోజీకి ఈ రహస్యం తెలిసి ఒక కాంట్రక్ట్ కిల్లర్ ద్వారా అందరినీ ఒకే సారి చంపేస్తాడు. ఇప్పుడు ఆ రహస్యం తెలిసిన వారంతా చనిపోయారు, మరి మన కధానాయకురాలు ఈ రహస్యాన్ని ఎలా చేదిస్తుంది?

ఈ రహస్యాలను తెలిసిన భీమోజీ పత్రికలోని ఒక రిపోర్టర్ చిన్న చిన్న క్లూలను మనకు అందిస్తూ ఉంటాడు. అవి న్యూస్ హెడ్డింగులు గానూ, కార్టూన్ల రూపంలోనూ, అంతర్యామి లాంటి కాలంలలోనూ కనిపిస్తూ ఉంటాయి.

మధ్యలో ఫ్లాష్ బాక్ లో హీరోయిన్ హీరో ల సంభాషణ ద్వారా తెలిసేదేమంటే ఈ కణిక నెట్‌వర్క్ ఇప్పుడు మొదలు కాలేదు, బ్రిటిషు వారు ఇండియాను ఆక్రమించుకోవడానికీ, ఇందిరా గంధీ, రాజీవ్ గాంధీ ల హత్యలకీ, 911 సంఘటనకీ అన్నింటికీ మూలం ఈ కణిక వ్యవస్థే. త్వరలో విడుదల, గొప్ప అద్భుత థ్రిల్లర్.

Saturday, 31 July 2010

తెలంగాణా విద్యార్థి ఆత్మహత్య - మూఢ నమ్మకాల ఫలితం


మరో తెలంగాణా విద్యార్థి ఈరోజు ఆత్మహత్య చేసుకున్నాడు. తెలంగాణాలో ఇప్పుడు విద్యార్థుల ఆత్మహత్యలు కొత్తవిషయం కాదు, వందలాది విద్యార్థులు తెలంగాణా ఉద్యమం కోసం ఆత్మహత్యలకు పాల్పడ్డారు, నేడు ఆత్మహత్య ఇషాన్‌రెడ్డి వంతయింది.

అయితే ఈ ఆత్మహత్య మిగతా ఆత్మహత్యలకంటే భిన్నమయినది. ఇషాన్ అందరిలా తెలంగాణా వాదం బలపడాలి అనో, లేక తన చావుతో కేంద్రం తెలంగాణా ఇస్తుందనో భ్రమ పడి ఆత్మహత్య చేసుకోలేదు. ఇతను పీసీసీ ప్రెసిడెంట్ డీఎస్ ఓడిపోవాలని మైసమ్మకు మొక్కుకొని, తన కోరిక నెరవేరడంతో మైసమ్మకు తన మొక్కును తీర్చుకోవడం కోసం ఆత్మహత్య చేసుకున్నట్లు అతని స్యూసైడ్ నోట్ ద్వారా తెలుస్తుంది.

మైసమ్మ, పోచమ్మ, పెద్దమ్మ, ఎల్లమ్మ అంతా తెలంగాణా పళ్ళెళ్ళో గ్రామ దేవతలు. ఇక్కడి ప్రజలు ఈ గ్రామదేవతలదగ్గర తమ కోరికలు తీరిస్తే కోడిని కోస్తాను, మేకను కోస్తాను అని మొక్కుకుంటారు. ఇషాన్ ఇంకాస్తా ముందుకెళ్ళి తన ప్రాణాలనే అర్పిస్తానని మొక్కుకున్నాడు.

కొందరు తమ కోరికలు నెరవేరితే తిరుపతి వెంకటేష్వరునికి తలనీలాలు ఇస్తామని, హుండీలో డబ్బులు వేస్తామనీ మొక్కుకుంటారు. మరికొందరు సత్యనారాయణ వ్రతం చేస్తానని మొక్కుకుంటారు. ఇంత సోఫిస్టికేటెడ్ కాని కొందరు పోచమ్మకు మేకని బలి ఇస్తానని, మైసమ్మకు కోడిని ఇస్తామని మొక్కుకుంటారు.నేడొక తెలంగాణా విద్యార్థి తన సొంత ప్రాణాలనే మొక్కుకున్నాడు. ఇతని చావుకు కారణం దేవుడు లంచాలు తీసుకుని మొక్కులు తీరుస్తాడని బ్రెయిన్ వాష్ చేసిన మన సమాజమే అని నాకనిపిస్తుంది.
Friday, 23 July 2010

శ్రీక్రిష్ణ కమిటీకి లోక్‌సత్తా చత్త నివేదిక


వోటు వేసినా, వేయక పోయినా మన రాష్ట్రంలో అందరూ గౌరవించే పార్టీ నీతివంతమయిన రాజకీయాలను తీసుకురావడానికి పూనుకున్న లోక్ సత్తా పార్టీ మాత్రమే. ఉచిత విద్యూత్తు, ఆరోగ్యశ్రీ, జనాకర్షణ పధకాలు, గనులు లాంటి అనేక విషయాలలో కప్పదాటులు లేకుండా నిర్ద్వందంగా తమ అభిప్రాయాన్ని చెప్పింది ఒక్క లోక్‌సత్త మాత్రమే.

అయితే ఒక్క తెలంగాణా విషయంపై మాత్రం లొక్‌సత్తా మరియూ జయప్రకాష్ నారాయణ మొదటి నుంచి కప్పదాటు ధోరణి అవలంబిస్తూ గోడమీది పిల్లి వాటం సమాధానాలు మాత్రమే చెప్పి తప్పించుకోజూషారు. కాకపోతే కాంగ్రేస్, తెలుగు దేశం పార్టీల మాదిరిగా మేము తెలంగాణాకు వ్యతిరేకం కాదు అని చెప్పి మాట మార్చనందుకు వీరిని అభినందించాలి. అలాగే శ్రీక్రిష్ణ కమిటీ ఏర్పాటయి తమ అభిప్రాయాన్ని ఖచ్చితంగా చెప్పాల్సిన సమయంలో వీరు పార్టీ తరఫున ఒక నివేదికను ఇవ్వటం అభినందనీయం.

బహుషా ఆంధ్రా ప్రాంతం నుంచి వచ్చి తెలంగాణాలో గెలిచినందుకు కావొచ్చు వీరు ముందునుంచీ సుముఖంగా లేరు. తెలంగాణా రాష్ట్రం అవసరంలేదు, తమ పార్టీ విధానమయిన జిల్లా ప్రభుత్వాలద్వారా తెలంగాణాను అభివ్రుద్ధి పరచవచ్చు అనేది వీరి రిపోర్టు సారాంశం.లోక్‌సత్తా నివేదికను ఇక్కడ చూడవచ్చు. లగడపాటి లాంటి వారిచ్చిన వేల పేజీల నివేదిక అర్ధవంతంగా ఉంటుందని ఎవరూ ఆశించకపోయినా, జేపీ గారు ఇచ్చే నివేదిక మీద పెద్ద ఆశే పెట్టుకున్న నాబోటి వారికి ఈ నివేదిక చూస్తే ఆశాభంగమే.

ఈ రిపోర్టులో తమ వాదనను సమర్ధించడం కోసం వీరు అనేక టేబుల్లను, డాటాను జతపరచారు. నాకు మాత్రం వీరి డాటా, రిపోర్టూ అంతా కూడా తాము ముందే అనుకున్న సారాంశాన్ని నిరూపించడానికి వండిన డాటా లాగా అనిపించింది తప్ప డాటా ఉపయోగించుకుని కంక్లూజన్‌కి రాలేదనిపించింది. మేము ఇంజనీరింగు చదివే రోజుల్లో ల్యాబు ఎక్షాముల్లో గ్రాఫులను కరెక్టుగా రావడానికి అవసరమయిన డాటా మాత్రమే తీసుకునే వాళ్ళం. ఇది కూడా అలాగే ఉంది. మనకు కంక్లూజన్ ఎలా కావాలో అలాంటి డాటాని సేకరించడం పెద్ద కష్టం కాదు.

తెలంగాణా అవసరాన్ని నిర్ణయించడానికి వీరు ఎన్నుకున్న విధం 1) తెలంగాణాపై పై వ్యవస్తీక్రుత వివక్ష ఉందా అని 2) వివిధ ప్రాంతాలలో అభివ్రుద్ధి రేటు. తెలంగాణా పై పాలనాపరమయిన వివక్ష లేదు అని చెప్పడానికి వీరి ఉదాహరణలు వివిధ ప్రాంతాలలో తెల్ల కార్డుల సంఖ్య, రెండు రూపాయలు కిలో బియ్యం, ఆరోగ్యశ్రీ లాంటి పధకాల అమలు.కనీసం రోజూ ఒక సారి ఇదే జయప్రకాష్ నారాయణ ఇవి వోట్లకోసం ప్రజలను బిచ్చగాళ్ళుగా మార్చే పధకాలు అని చెబుతాడు. మరి వోట్లు తెలంగాణాలోనయినా ఆంధ్రాలో నయినా ఊరికే రావు కనుక ప్రజలను బిచ్చగాళ్ళుగా మార్చే పధకాలు ఎక్కడయినా సమానంగానే ఉంటాయి. వీటిని చూపించి వివక్ష ఏమీ లేదనడం ఎలా సబబో జేపీగారే చెప్పాలి.


అతిముఖ్యమయిన నదీ జలాల పంపకాల విషయంలో మనకు స్పష్టంగా కప్పదాటు ధోరణి కనిపిస్తుంది. ఆంధ్రా ప్రాంతం కొద్దిగా ఎక్కువ నీరు పొందడానికి కారణం ప్రయర్ యూసేజ్ (రాష్ట్ర ఆవిర్భావానికి ముందే ఉపయోగంలో ఉన్న ప్రాజెక్టులు అని అర్ధం??) మరియు టోపాలజీ (నైసర్గిక స్వరూపం) మాత్రమే కారణమని చెప్పుకొచ్చారు. మరి ఏ టోపాలజీ మరియూ ప్రయర్ యూసేజ్ కారణంగా శ్రీశైలం ఎడమకాలువకి ఎన్నటికీ మోక్షం రాకపోయినా కుడి కాలువ శుబ్బరంగా కర్నూలు, తిరుపతి, మద్రాసుతో పాటు రాజా వారి సిమెంటు కంపనీకి కూడా నీరిస్తుందో చెప్పలేదు. ఏ టోపాలజీ కారణం వల్ల నాగార్జున సాగర్ ఎడమ కాలువ కుదింపు, రాజోలి బండ పేలుళ్ళు, శ్రీరామ సాగర్‌కు నలభై ఏల్లకు కూడ మోక్షం రాకపోవడం కారణమో వివరించలేదు.


తెలంగాణా వెనుకబడలేదు అని నిరూపించడానికి వీరు చెప్పింది తలసరి ఆదాయము తెలంగాణాలోని ఐదు జిల్లాలు:హైదరాబాద్, రంగారడ్డి,నల్గొండ, మెదక్,కరీంనగర్ రాష్ట్ర సగటు తలసరి ఆదాయం కంటే ఎక్కువ అని. ఇందులో నాలుగు జిల్లాలు ఎక్కువ పరిశ్రమలున్న హైదరాబాదు, దాని చుట్టు పక్కల జిల్లాలు కాగా, మిగిలిన కరీం నగర్ బొగ్గు గనులు ఎక్కువగా ఉన్న జిల్లా. పరిశ్రమలలో ఎక్కువ శాతం ఉద్యోగులు ఆంధ్రా ప్రాంతం వారన్నది నిస్సందేహం కాగా కరీం నగర్ బొగ్గు గనులలో ఉన్నతోద్యోగుల్లో ఎక్కువ ఆంధ్రా ప్రాంతం వారే. ఈ తలసరి ఆదాయంలో సగటు తెలంగాణా జీవి ఆదాయం ఎంతో తెలియదు.

చివరగా వీరిచ్చే సజెషన్స్ తెలంగాణా సమస్య జిల్లా ప్రభుత్వాలవల్లే సాధ్యమని చెప్పడం, రీజనల్ కమిటీలు. ఎనభై శాతం ప్రజలు వ్యవసాయంపైన ఆధారపడ్డ మనదేశంలో జలవణరులు లేకుండా అభివ్రుద్ధి చెందిన ప్రాంతం ఏదీ లేదు. మరి తమ ప్రాంతపు జలవణరులను తమకే కాకుండా చేస్తున్న ప్రభుత్వాల నుంచి జిల్లా ప్రభుత్వాలు తమకు ఎలా మేలు చేయగలవో జేపీ గారే చెప్పాలి.

పాజిటివ్ అంశాలు తీసుకుంటే విడిపోతే తెలంగాణా కోల్పోయే తీర ప్రాంతపు ఆక్సెస్, వ్యవసాయానికి ఎక్కువగా పంపుసెట్లపై ఆధారపడే తెలంగాణాకు వచ్చే విద్యుత్ లోటు లాంటి వాటిని చక్కగా వివరించారు. ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణా వాదులని భయపెట్టే ప్రయత్నం చేసారు.

వీరి రిపోర్టులో వివక్ష గురించి చెప్పినప్పుడు, సచివాలయ, న్యాయశాఖ, ఇతర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులలో వివక్ష ఉందో లేదో కొన్ని సర్వేలు నిర్వహించి తెలుసుకుంటే బాగుండేది. 1956లో ఆంధ్ర ప్రదేష్ రాష్ట్రం ఏర్పడకముందు పరిస్తితులూ, పెద్దమనుషుల ఒప్పందం లాంటి విషయాలు నివేదికలో ఎక్కడా కనపడవు. ఏదేమైనా వీరి రిపోర్టు స్టాటిస్టిక్స్ ద్వారా దేన్నైనా నిరూపించవచ్చుననే సామెతను మాత్రం నిరూపించింది.


Sunday, 18 July 2010

లాజికల్ కన్సిస్టెన్సీ టెస్టు


దేవుడు ఉన్నాడా లేడా అన్న విషయంపై ఎవరి ఫిలాసఫికల్ స్టాండు వారిది. అయితే తమ తమ స్టాండులో ఎంత కన్సిస్టెంటుగా మనుషులు ఉండగలరు? ఈ క్రింది టెస్టు వారి లాజిక కన్సిస్టెన్సీని టెస్టు చేస్తుంది. మీరూ ట్రై చెయ్యండి

మరి!!

**********

Can your beliefs about religion make it across our intellectual battleground?

In this activity you’ll be asked a series of 17 questions about God and religion. In each case, apart from Question 1, you need to answer True or False. The aim of the activity is not to judge whether these answers are correct or not. Our battleground is that of rational consistency. This means to get across without taking any hits, you’ll need to answer in a way which is rationally consistent. What this means is you need to avoid choosing answers which contradict each other. If you answer in a way which is rationally consistent but which has strange or unpalatable implications, you’ll be forced to bite a bullet.


http://www.philosophersnet.com/cgi-bin/god_game1.cgi?num=0&hits=0&bullets=0&bulletcount=0&hitcount=0

Saturday, 5 June 2010

ఆడిన మాట తప్పకూడదా?


"మాట తప్పని, మడమ తిప్పని వంశం మాది", "రాజకీయాల్లో విశ్వసనీయత ముఖ్యం", "రాజశేఖర్ రెడ్డి పధకాలకు ఈ ప్రభుత్వం తూట్లు పొడుస్తుంది", "పావురాల గుట్టపైనే నేను మాట ఇచ్చాను" ఇవన్నీ గత కొన్ని సంవత్సరాలుగా వైఎస్సార్, జగన్ చెప్పిన కొన్ని మాటలు మరియూ సాక్షి పేపరులో ఎడిటొరియల్సూ!

వైఎస్సారు, జగన్ తమని తాము ఆడిన మాట తప్పని రాచవంశీకులుగా ప్రొజెక్ట్ చేసుకోవడానికి చేసిన ప్రయత్నమే ఈ మాటలు. వీరు నిజంగానే మాట తప్పరా అన్న విషయం జోళికి వెల్లకుండా, అసలు మాట తప్పడం అంత పెద్ద నేరమా, మాట తప్పకపోవడం రాజకీయాల్లో పెద్ద క్వాలిఫికేషనా అని ఒక సారి చర్చిద్దాం.

వెనుకటికి రాజులు ఇచ్చిన మాత నిలబెట్టుకోవడానికి అవసరమయితే రాజ్యాలనే వదులుకున్నారని పుస్తకాల్లో, కధల్లో చదువుకున్నాం. అయితే ఇప్పుడున్నది రాచరిక పాలన కాదు, ప్రజాస్వామ్యం. వ్యక్తుల ఈగోలకన్నా, ప్రజల సంక్షేమం ముఖ్యం. పనికిరాని వాగదానాలు ఇచ్చినప్పుడు వాటిని పాటించడం మరో తప్పిదమే కానీ అది ఎన్నటికీ ఒక క్రెడిట్ కాదు. చత్త హామీలను నిలబెట్టుకుంటే విశ్వసనీయత పెరుగదు, తగ్గుతుంది.

ఎన్నికల్లో గెలవడానికి అన్ని పార్టీలు తలా కొన్ని ఆచరణ సాధ్యం కాని పధకాలను, హామీలుగా ఇచ్చేసింది. ఇందులో ఏ పార్టీ మినహాయింపు కాదు. కనీసం గెలిచాకనయినా ఆ హామీలు ప్రభుత్వం నడ్డి విరుస్తున్నాయి అని తెలుసుకున్నప్పుడు వాటిని వదిలివేయాలా లేక మాట ఇచ్చాము కదా అని కొనసాగించాలా?

మాట నిలపెట్టుకోవడం ముఖ్యం కాదు, ప్రజల శ్రేయస్సు ముఖ్యం అంటే, మరి రాజకీయ పార్టీలు ఎడా పెడా ఎన్నికలముందు వాగ్దానాలు చేయడం సమర్ధనీయమేనా అంటే కానే కాదు. సాధ్యాసాధ్యాలతో, ప్రజల శ్రేయస్సుతో, దేశ అభివృద్ధితో సంబంధం లేకుండా కేవలం వోట్లకోసం వాగ్దానాలు చెయ్యడం ఎంతమాత్రమూ సమర్ధనీయం కాదు. అయితే ఇలాంటి రాష్ట్రాన్ని వెనక్కి తీసుకెల్లే వాగ్దానాలు చెయ్యడం ఒక నేరం కాగా మాట ఇచ్చాం కదా అని వాటిని ఎలాగయినా నిలుపుకోవాలని పంతానికి పోయి దేశాన్ని ఇంకొంచెం వెనక్కి తీసుకెల్లడం మరో నేరం అవుతుంది.

రోశయ్య గారూ, ఇకనైనా సాక్షి పత్రిక ఏదో రాస్తుంది, జగన్ వర్గం తప్పు పడుతుంది అని భయపడి ఈ సం"క్షామ" పధకాలను కొనసాగించకుండా వాటిని ఒక్కసారి కడిగేయండి. మీరు వీటిని అమలు చేసినా, చెయ్యకపొయ్యినా వచ్చే ఎలక్షనులో ఏ వోటరూ వాటిని చూసి వోటేయడు. ఒకవేళ ఏసినా ముఖ్యమంత్రిగా ఉండేది మీరు ఎలాగూ కాదు కాబట్టి మీకా భయం అస్సలు అవసరం లేదు.

Friday, 4 June 2010

దేవుడి అస్తిత్వంపై పాస్కల్ వేజర్

దేవుడి అస్తిత్వం పైన ఫ్రెంచ్ తత్వవేత్త బ్లైస్ పాస్కల్ ఈ విధంగా చెప్పాడు. దేవుడు ఉన్నాడో, లేదో ఒక నిర్ణయానికి మనిషి రావడం కష్టం. ఇక మనం చెయ్యగలిగింద ఏదో ఒక వర్గంవైపు మొగ్గడం.

మరి ఏ వర్గం వైపు మొగ్గడం మనిషికి లాభదాయకం? దేవుడు ఉండడానికీ, లేకపోవడానికీ ఫిఫ్టీ ఫిఫ్టీ చాన్సెస్ ఉన్నాయంటే మనిషి ఎటువైపు మొగ్గొచ్చు? దేవుడు ఉన్నాడని నమ్మి, చివరికి దేవుడు లేకపోతే వచ్చే నష్టం ఏమీ లేదు. కానీ ఒక వేల మనిషి దేవుడిని నమ్మక నాస్తికుడిలాగా ఉండగా, నిజానికి దేవుడు ఉన్నాడు అనుకోండి, అప్పుడు దేవుడి పుస్తకంలో మనిషికి మంచి స్థానం ఉండదు. కనుక దేవుడు ఉన్నాడని నమ్మడం మంచి బెట్.

దీనికి రిచర్డ్ డాకిన్స్ వాదన ఇలా ఉంది. ఒక వేళ దేవుడు ఉన్నా ఆ దేవుడు మనం నమ్మే దేవుడు కాక మరొక దేవుడు కావొచ్చు. లేక పోతే అసలు మనకు తెలిసిన దేవుళ్ళెవరూ కాకుండా మరో కొత్త దేవుడు అయ్యుండొచ్చు. అప్పుడు ఆ దేవుడికి మన పూజా విధానాలేవీ నచ్చకపోవచ్చు. అసలు దేవుడు ఉంటే అతను పొగడ్తలకి, పూజలకి బోల్తాపడే వాడయ్యుండడు. కాబట్టి దేవుడిని మనిషి నమ్మి దేవుడు నిజంగా ఉన్నా పెద్ద లాభం ఏమీ ఉండదు. దేవుడిని అసలు నమ్మని మనిషియొక్క ఆత్మ విశ్వాసాన్ని ఆ దేవుడు మెచ్చుకోవచ్చు కూడా.

అలా కాక దేవుడు లేడన్నిదే నిజమయి మనిషికి చివరికి ఆ విషయం తెలిస్తే ఇన్నాళ్ళూ తాను అలాంటి విశ్వాసాన్ని ఏర్పరుచుకున్నందుకు అసంతృప్తి మిగులుతుంది.

Sunday, 30 May 2010

జగన్‌కి వరంగల్‌లో ఓదార్పు యాత్ర చేసే హక్కు ఉండాలా?

ఓదార్పు యాత్ర వెనుక జగన్ అసలు ఉద్దేషం, జగన్ యొక్క ఓదార్పు గుణం, ఓదార్పు యాత్ర ఆవశ్యకత లాంటి అంశాలజోళికి వెల్లకుండా నిజంగా వీరు చెప్పేట్లు జగన్ హక్కుని ప్రభుత్వం, తెలంగాణా వాదులు కాలరాశారన్న వాదనలో నిజం ఉందా?

ఒక వ్యక్తిగా జగన్‌కి గానీ, మరెవరికయినా దేశంలో ఎక్కడికయినా స్వేచ్చగా వెళ్ళే హక్కు ఉండాలి. దురదృష్టవశాత్తూ మనదేశంలో పౌరులు ఎన్నో చోట్లకు ఒంటరిగా వెళ్ళలేని స్థితి ఉంది. జగన్ ప్రాతినిధ్యం వహించే రాయలసీమలో చాలా చోట్ల ఒక వర్గం వారు ఇంకో ప్రాంతంలోకి వెళ్ళాలంటే శాంతిభద్రతల కారణాల దృష్ట్యా పోలీసులు అనుమతి ఇవ్వరు.

ఈ ఓదార్పు యాత్రలో జగన్ ఒక వ్యక్తిగా వెళ్ళడం లేదు, రెండువేలమని అనుచర బృందం, మందీ మార్బలం, వ్యక్తిగత రక్షణ సిబ్బందీ, వారి ఆయుధాలూ వగైరాలతో వెల్తున్నారు. వారిని రిసీవ్ చేసుకోవడానికి కాచుకు కూర్చున్న కొండా దంపతులు వరంగల్ జిల్లాలో సమాంతర ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. వీరికి మాత్రం తమ యాత్రలకు అనుమతి కావాలి, అందులో ఏవయిన గొడవలు జరిగితే భాద్యత ప్రభుత్వానిదీ, తెలంగాణా వాదులదీ కానీ విరిది కాదు.

మరి ఇంత మంది గుమి గూడి ఊరేగింపుగా వెల్లడానికి అనుకూలమయిన పరిస్థితులు వరంగల్ జిల్లాలో లేనే లేవు. తెలంగాణా ఉద్యమానికి ఆయువు పట్టయిన వరంగల్, నల్గొండా, కరీం నగర్, నిజామాబాద్ లాంటి జిల్లాలలో సీమాంధ్ర నాయకులు నిరశన జ్వాలలు ఎదుర్కోక తప్పదు.

కేసీఆర్ నిరాహార దీక్ష చేసుకునే హక్కును బలవంతంగా కాలరాసి ముందస్తు అరెస్టు చేసి ఖమ్మం సెంట్రల్ జైలుకి తరలించిన ఈ ప్రభుత్వం జగన్ అరెస్టుకు ఎందుకు ఘర్షణలు చెలెరేగే దాకా ఆగినట్లు? శాంతిభద్రతలను కాపాడవలసిన హోం మినిష్టరు వ్యక్తిగత హోదాలో రాయబారాలు ఎందుకు చేసినట్లు?

తమ హక్కును కాలరాశారని మొసలి ఏడుపులు ఏడ్చే ఈ జగన్, సురేఖలు తమ తమ నియోజక వర్గాలలో ఆటవిక పాలన కొనసాగిస్తూ, సమాంతర ప్రభుత్వాలను నడిపిస్తూ ఇతర పార్టీ నాయకుల ప్రచారాన్ని అడ్డుకోవడం వాస్తవం కాదా?

ఇక అక్కడ నిజంగా తెలంగాణా వాదులు రాళ్ళు విసిరి రెచ్చగొట్టారా, లేక జగన్ వర్గీయులే ముందు రాళ్ళు వేసి కవ్వించారా అనేది మనకు తెలియని విషయం. విచిత్రంగా అక్కడ గాయపడిన వారంతా విద్యార్థులే. ఒక్క జగన్ యువసైనికుడు కానీ, కాంగ్రేస్ కార్యకర్త గానీ గాయపడలేదు. కాల్పులు జరిపింది రక్షణ సిబ్బంది మాత్రమే కాదు కొండా మురళి , మరియూ అతని అనుచరులు కూడా అనేది బహిరంగ రహస్యం.

ఈ మొత్తం వ్యవహారం చూస్తే ఎలాగయినా విద్వేషాలు రెచ్చగొట్టి రోశయ్య ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడం జగన్ వ్యూహం కాగా, కాగల కార్యం గంధర్వులే తీరుస్తారనే పీవీ సూత్రం రోశయ్య చాణక్య నీతిలాగుంది. తమ స్వార్ధం కోసం టీఆరెస్ నాయకులతో సహా అంతా పంతాలకు పోతే పావులుగా మారి ప్రాణాలమీదికి తెచ్చుకుంది మాత్రం పేద విద్యార్థులే.

Friday, 28 May 2010

మేధావులు పాలనకు అసమర్ధులా?

మన్మోహన్‌సింగ్ దేశ ప్రధానమంత్రి భాధ్యత స్వీకరించినపుడు కాంగ్రెస్‌ని ఎప్పుడూ సమర్ధించని నేను కూడా ఒక విద్యావేత్తా, మేధావి, అర్ధికవేత్త, మనం దేశపు ప్రగతిశీల ఆర్ధిక విధానాల సృష్టికర్త ప్రధానమంత్రి అయినందుకు సంతోషించాను. కానీ అదే మన్మోహన్‌సింగుని ప్రతిపక్ష నేత అయిన అద్వానీ పదే పదే "నికమ్మా" అని పిలిచాడు. రాజశెఖర్‌రెడ్డి మృతి తరువాత రోశయ్య ముఖ్యమంత్రి అయినపుడుకూడా నేను ఎన్నోసార్లు ఆర్ధికమంత్రిగా బుడ్జెట్‌ని ప్రతిపాదించినవ్యక్తీ, అనుభవశాలీ అయిన రోశయ్య ముఖ్యమంత్రి అయినందుకు సంతోషించాను. కానీ ప్రతిపక్షమయిన టీడీపీతో సహా అనేకమంది రోజూ టీవీలలో ముఖ్యమంత్రిని అసమర్ధుడు అని అంటున్నారు.

ఒక రకంగా వీరిమాటలో నిజంలేకపోలేదు. వీరిద్దరు కూడా అనేక విషయాలలో ఖఠినంగా ఉండలేకపోతునారు. ఇద్దరికీ కూడా సోనియా అనుఙ్న్య లేనిదే ఏ నిర్ణయమూ తీసుకోలేరు. సోనియమ్మ లేకపోతే వీరి మాటలు కేబినెట్ కూడా వినదు. మన రాష్ట్రంలో రోశయ్య ముఖ్యమంత్రి అయినతరువాత అన్నీ కష్టాలే పాపం.

మరి మనదేశంలో పరిపాలన చెయ్యాలంటే కుటిల రాజకీయాలు తెలిసినవారు, గూండాగిరీలో ఆరితేరినవారూ తప్ప మేధావులకి సాధ్యం కాదా? గొర్రెలమందని కర్రతో అదిలించినట్లు మన ప్రజలని కూడా ఎప్పుడూ అదిలించేవాడే పరిపాలన చెయ్యగలడా? ఎందుకిలా?

Wednesday, 26 May 2010

అబద్దానికి పరాకాష్ఠ - ఓదార్పు యాత్ర జరగదేమోనని హఠాన్మరణం

ఒక అబద్దాన్ని ఎంత వరకు సాగదీయవచ్చు? అది అబద్దమని అందరికీ తెలిసిన తరువాత కూడా ఆ అబద్దానికి తోడుగా మళ్ళీ మళ్ళి అబద్ధాలు చెప్పడం ఎలా సాధ్యం? మరి మన రాజకీయ నాయకులు తలుచుకుంటే ఏదయినా సాధ్యమే కదా?

హెలికాప్టర్ కూలి వైఎస్సార్ చనిపోయిన తరువాత మొదటిగా వరంగల్ జిల్లాలో ఒక కుగ్రామంలో ఒక కుండలు చేసుకునే కుమ్మరి రోజులతరబడి అచేతనంగా ఉండి కూడా విచిత్రంగా వైఎస్సార్ మరణవార్త విని హఠాన్మరణం చెందాడు. విచిత్రంగా వాళ్ళింట్లో టీవీ కూడా లేకుండానే అతగాడు వైఎస్సర్ సంక్షేమ పధకాలగూర్చి తెలుసుకుని, అతను చనిపోతే ఆ పధకాలు ఉండవేమో అని చనిపోయాడట!!

వరంగల్లో ఒక వైఎస్సార్ అనుంగు భక్తురాలైన రాజకీయ నాయకురాలు, మాజీ మంత్రిణి మొదలు పెట్టిన ఈ కొత్త ఆట రాష్ట్రమంతటికీ పాకి వారం రోజుల్లో ఐదు వందల మరణాలు రికార్డు అయ్యాయి. మరి ఆ వారం రోజుల్లో రాష్ర్టంలో ఇతర సహజ మరణాలు ఏవీ జరగలేదు, అనీ వైఎస్సార్ చనిపోతే తట్టుకోలేక గుండె ఆగిన చావులే!!ఆ అబద్ధాన్ని మన యువరాజు ఇంకాస్త పొడిగించి ఒదార్పు యాత్ర పేరుతో ఒక రాజకీయ యాత్రను సాగదీస్తున్నాడు. ఏది పెద్ద అబద్ధం? గుండాగిన చావు వార్తలా, లేక ఆ చావులకు ఓదార్పులా అని నాకు సందేహం వచ్చింది.

ఇప్పుడు ఆ రెండు అబద్దాలకంటే మరో పెద్ద అబద్దాల ఆట మళ్ళీ అదే రాజకీయ నాయకురాలు మొదలు పెట్టింది. వరంగల్ జిల్లాలో ఒక వ్యక్తి వై ఎస్ జగన్ యాత్రకు అడ్డంకులు కలుగుతున్నాయనే ఆవేదనతో షాక్ మరణం చెందాదట!! ఆయన షాక్ తిని చనిపోవడం ఏమో గానీ ఆ వార్త నాకు షాక్ ఇచ్చింది. అమ్మో..నేను కూడ ఒక సారి నా గుండెని టెస్టు చేయించుకోవాలి..ఇలాంటి వార్తలు విని నా గుండె తట్టుకునేలా లేదు!!

Monday, 24 May 2010

నాస్తికవాదం కూడా ఒక నమ్మకమేనా?

నాస్తికుల వాదనను తిప్పికొట్టడానికి ఆస్తికులు ఉప్యోగించే ఒక ఆయుధం ఈ వాదన:"నాస్తికత్వం కూడా ఒక నమ్మకమే! దేవుడు ఉన్నాడని మేమెలా నమ్ముతామో, లేదని మీరు అలాగే నమ్ముతారు" అని. మరి ఈ వాదనలో నిజం ఉందా?

నాస్తికులు దేవుడు లేడు అని నమ్మరు. కేవలం వారు దేవుడు అనే ఒక నమ్మకం కలిగిఉండరు. ఏ నమ్మకమూ లేకపోవడమూ కూడా ఒక నమ్మకమే అవుతుందా? ఇది చిన్నప్పుడు మనం చదువుకున్న మౌల్వీ నసీరుద్దిన్ జోకు లాంటి వాదన. ఏ కారూ లేని వాడి దగ్గరకి వెళ్ళి నువ్వు నోకార్ (no car)కలిగి ఉన్నావు, రోడ్డు టాక్సు చెల్లించాల్సిందే అన్నట్లు.

లేనిదానిని నిరూపించడం అసాధ్యం అవుతుంది. ఎప్పుడైనా నిరూపించాల్సిన భాద్యత ఉన్నదని క్లెయిము చేసే వారిదే. దీనికి బెర్‌ట్రాండ్ రస్సెల్ ఇలా చెప్పాడు: నేను ఆకాశంలో శుక్రుడికీ, గురుడికీ మధ్యన ఒక టీ కప్పు తిరుగుతుంది అని చెప్పితే ఎవరైనా ఆకాశం అంతా తిరిగి ఆ టీ కప్పు లేదు అని నిరూపించగలరా? కాబట్టి దేవుడు లేడు అని నిరూపించమని నాస్తికులను అడగడం సరి అయిన వాదన కాదు.

Saturday, 22 May 2010

దోషం మతంలో ఉందా లేక మనిషిలో ఉందా?


ఈ మధ్య తెలుగు బ్లాగుల్లో ఈ చర్చ వాడి వేడిగా అందరికీ వినిపిస్తుంది. సందర్భానికి తగ్గట్లుగా ఉంటుందని ఈ టపాని వ్రాస్తున్నాను.

ఎవరైనా మతాన్ని విమర్శిస్తే వెంటనే కొందరు ఇది తమ మతం పైన దాడిగా భావించి తిప్పికొట్తడానికి ప్రయత్నిస్తారు. వీరు ఇచ్చే సమాధానం ఇది మతం తప్పిదం కాదు, మతాన్ని అర్ధం చేసుకోని మనిషిదేనని. అయితే ఇలా చెప్పే వారిలో ఎక్కువమంది ఇతర మతాన్ని విమర్శిస్తే చూసి ఆనందించే వారే. వీలయితే తాము కూడా ఒక చేయి వేస్తారు. తమ మతవిశ్వాసాలకి దెబ్బతగిలినప్పుడు మాత్రమే వీరికి అది తప్పుగా తోస్తుంది.

నిజంగా దోషం మతంలో లేదా? వీరన్నట్లు అన్ని అనర్ధాలకూ మూలం మతాన్ని అర్ధం చేసుకోని మనిషేనా? ఎక్కడొ ఒక దగ్గర లోపం ఉంది అనేది మాత్రం అంతా ఒప్పుకునే అంశం అనుకుంటా. అక్కడ కాంట్రావర్సీ ఏమీ కనపడ్డంలేదు. మరి లోపం ఎక్కడ ఉంది?

మతం పూర్తిగా ఆచరణీయమా?

మతానికి మూలం మత గ్రంధాలు. మరి వీరు చెప్పినదే నిజమయితే మతగ్రంధాలలో ఉన్నది అంతా ఆచరణీయంగా ఉండాలి. అప్పుడు మాత్రమే మనిషి మతాన్ని సరిగ్గా ఆచరించగలడు. కానీ ఏ మత గ్రంధమయినా పూర్తిగా ఆచరణీయంగా ఉందా? "ఏమతం చూసినా ఏమున్నది గర్వకారణం, మతగ్రంధ సారం సమస్థం ద్వేషం, వివక్ష తత్వం" అన్నట్లు ఉన్నది మన గ్రంధాల పరిస్థితి. బైబిలు పాత నిబంధనా, ఖురానులలో ఎక్కువగా విగ్రహారాధకులపైని దాడులు ఉండగా వేదాల్లో స్త్రీలపై, శూద్రులపై వివక్ష కనిపిస్తుంది.ఇస్లాంలో కళలు (చిత్రకలా, గానం, సంగీతం లాంటివి) అన్నీ నిషిద్దం. మరి మతంలో నిజంగా దోషంలేనట్లయితే వీటిని యధాతధంగా ఆచరించగలమా?

అసలు మన సమాజంలో ఈ మాత్రం శాంతి ఇప్పుడు ఉన్నదంటే కారణం మనిషి మతాన్ని పూర్తిగా ఆచరించకుండా మెల్లి మెల్లిగా వాటిలోని కొన్ని చెడు అంశాలని వదిలివేయడమే.దీని అర్ధం మనం ఆచరించే మతం, అసలు మతం కన్నా కాస్తా నయం. అలాంటప్పుడు తప్పు మతానిది కాక మనిషిది ఎలా అవుతుంది?

అన్నిమతాల సారం ఒకటేనా?

ఉదారవాదులు ఎక్కువగా వాడే వాదం అన్ని మతాల సారం ఒకటే, మనిషుల ఆచరణలోనే విభేదాలు అని. మాక్రోలెవల్లో చూస్తే ఇది నిజమే: అన్ని మతాలు దేవుడు సృష్టికి మూలం అనే సూత్రం నుండి వచ్చినవే. అన్నింట్లో దేవుడు ఒక్కడే, అతనికి రూపం లేదు అని ఉంటుంది.

కానీ తరిచి చూస్తే ఏ రెండు మతాలు ఒకేసారి ఒప్పు కాలేవు. అన్నీ మ్యూచుయల్లీ ఎక్స్లూసివ్. క్రస్తవ ఇస్లాం మతాలు విగ్రహారాధనను వ్యతిరేకిస్తాయి. ఇస్లాం ప్రకారం మహమ్మద్ని ప్రవక్తగా కొలవనివాడు ఎంతమంచివాడయినా నరకానికే వెల్తాడు. హిందూ మతంలో దేవుడికి విగ్రహం ఉంటుంది, అనేక దేవతలు ఉన్నారు. అంటే ఒక మతం సత్యమయితే వేరొక మతం అసత్యం కావలసిందే.

మతమూ, మొరాలిటీ:

మనిషికి మొరాలిటీ (నైతిక విలువలు) అందించింది మతమేనా? మతం లేకుంటే తల్లికీ చెల్లికీ, తండ్రికీ, భర్తకీ తేడా ఉండేది కాదా?కుటుంబ వ్యవస్థకి మూలం మతమేనా?

ఈ వాదనే నిజమయితే ఏ మతమూ లేని అబోరిజన్లూ, మావరిలూ, ఆఫ్రికన్ తెగలూ, నేటివ్ ఇండియన్లలో కుటుంబ వ్యవస్థ ఉండకూడదు. కానీ అలా లేదే?

మనిషి నైతిక విలువలు మనిషి విగ్న్యానంతో పాటు evolve అవుతున్నాయి. ఒక వెయ్యేల్లకిందటికంటే వందేళ్ళక్రితం నైతిక విలువలు బెటరు, వందేళ్ళక్రితం కంటే ఈ రోజు బెటరు. దీనికి మతంతో సంబంధం లేదు.

మతం ఏది మంచో ఏది చేడొ చెబుతుంది. అయితే ఇది స్టాటిక్ స్టాండర్డ్. కానీ మంచీ చెడూల నిర్వచణాలు రోజు రోజుకూ మారుతుంటాయి. ఇప్పుడు గే మ్యారేజీలు తప్పు కాదు. కానీ మతం వాటిని తప్పంటుంది. కాబట్టి మతం అందించే మోరల్ కోడ్ ఆచరణీయం కాదు.

మతం వలన మనిషి మంచి నేర్చుకుంటాడా?

అన్ని మతాలూ ఇది తప్పు, ఇది ఒప్పు, ఈ తప్పు చేస్టే మనిషి చచ్చి నరకానికి వెల్తాడు లాంటి నమ్మకాలను భోదిస్తాయి. అయిటే ఇవి తెలుసుకొని మనిషి మంచి వైపు మల్లుతునాడా? ఇలా జరిగితే ఎక్కువమంది ఆస్తికులు ఉన్న మన దేశంలో పాపాలు తక్కువగా ఉండాలీ. ఎక్కువమంది నాస్తికులు ఉన్న స్వీడన్, డెన్మార్క్, నార్వే వంటి దేశాలలో పాపాలు ఎక్కువగా ఉండాలి. కానీ వాస్తవాలు అలా లేవు.

మతాల వలన జరిగిన మంచి కనపడడం లేదు, కానీ చెడుని చూస్తే చరిత్రలో ఎన్నో యుద్ధాలకి మతాలే కారణం. ఇప్పటికీ మత ఘర్షణలూ, తీవ్రవాదం లాంటి వాటికి కారణం మతమే.మతంతో సమంధం లేకుండా సమాజంలో మంచీ చెడూ రెండూ ఉంటాయి. కానీ మతం మంచి వారిని కూడా చెడువైపుకు మరలించడానికి ఉపకరిస్తుంది.


దీని గురించి స్టీవెన్ వీన్‌బర్గ్ మహాశయుడు ఇలా అన్నాడు: "మతంతో సంబంధం లేకుండా మంచివాడు మంచి పనులూ, చెడ్డవాడు చెడ్డపనులూ చేస్తాడు. అయితే మంచి వాడు చెడ్డపనులు చెయ్యడానికి కారణం మతమే."

మూలం: Richard Dawkins' "The God Delusion"


Saturday, 24 April 2010

దొరికితేనే దొంగ బాబా!!

పాపం నిత్యానంద స్వామి! ఒక నెల క్రింది వరకూ రాజభోగాలు అనుభవించాడు, ఎందరో భక్తులను కూడ గట్టుకున్నాడు. చక్కగా డబ్బున్న భక్తులనుండి సేకరించిన విరాళాలతో ఎన్నో ఆశ్రమాలను స్తాపించి ఆశ్రమాల ముసుగులో తన ఇహలోక కోరికలన్నీ తీర్చుకున్నాడు. భక్తులకి మాత్రం జనన మరణ బంధాల విముక్తి గురించి భోదనలు చేశాడు. సీక్రెట్ కెమెరాల పుణ్యమా అని ఒక్కసారిగా ఆయన జీవితం పూర్తిగా మారిపోయి ఇప్పుడు ఊచలు లెక్కబెడుతున్నాడు.


ఒక్క వీడియోతో ఒక్కసారిగా ఎన్నో కొత్త కేసులు బయటికి రాసాగాయి. నిత్యానంద ఆశ్రమాల మీద దాడులవల్ల ఆయన రాసలీలలపై ఎన్నో ఆధారాలు బయట బడ్డాయి.


అయితే ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే మన దేశంలో నిత్యానంద ఒక్కడే కాదు, ఇంకా ఎందరో దొంగ స్వాములు, దొంగ బాబాలూ తామే దేవుళ్ళమని చెప్పుకుని వెర్రి జనాలని మోసగిస్తున్నారు. ఇంకా ఎక్కువ విరాళాలు సేకరిస్తున్నారు, ఎక్కువ సంపాదిస్తున్నారు. ఆశ్రమాలమాటున ఎన్నో ఇల్లీగల్ చర్యలకు పాల్పడుతున్నారు. వారిని టచ్ చేసే ధైర్యం మీడియాకి గానీ, న్యాయవ్యవస్తకి గానీ ఇంకా రాలేదు.


పోనీ ఈ ఇతర బాబాలమీద ఇప్పటివరకూ ఆరోపణలు ఏమీ లేవా అంటే అలా కాదు. వీరిపై నిత్యానందపై వచ్చిన ఆరోపణలకంటే పెద్ద ఆరోపణలు ఎన్నో వచ్చాయి. మరి ఎందుకు ఎవరూ వీరి గురించి అడిగే సాహసం చెయ్యరూ అంటే కారణం వారు నిత్యానంద లాగా అడ్డంగా దొరికిపోలేదు. వారిపై ఇంతకుముందు వచ్చిన వీడియోలు నిత్యానంద లాగ క్రిస్టల్ క్లియర్గా కనపడలేదు. అందుకే ఈ బాబాలెవరూ పూర్తిగా దొరకక దొంగ బాబాలుగా కాక నిజం బాబాలుగా చలామనీ అవుతున్నారు.


మొత్తానికి నిత్యానంద ఎపిసోడ్ ఫలితంగా మీడియాలో దొంగ బాబాలగురించిన వార్తలు గత నెలరోజులుగా పెరిగాయి. అయితే ఇవి కేవలం ఏ కాళేశ్వర్ బాబా లేక మరో చోటా మోటా బాబాకో మాత్రమే పరిమితమయ్యాయి. అంతే కానీ తాము దేవుళ్ళ అవతారాలుగా చెప్పుకునే బడా బాబాల జోళికి మీడియా వెల్లలేక పోయింది.


నిత్యానంద ఎపిసోడ్ కంటే కొద్దిరోజులు ముందుగా కల్కి అమ్మ భగవాన్ గురించిన వార్తలు కొన్ని చానెల్స్లో వచ్చాయి. ఆ వార్తలలో చూపించినది మీడియా సొంత ఇన్వెస్టిగేషన్ కాదు, కొంతమంది మాజీ భక్తులు కల్కి బాగోతాన్ని వీడియో తీసి మీడియాకి ఇచ్చారు.


నిజానికి కల్కి భగవాన్ పైన వచ్చిన అరోపణలు నిత్యానంద కంటే సీరియస్ ఆరోపణలు. నిత్యానంద కేవలం ఒక సినీ తారతో రాసలీలలు జరిపి దొరికిపోయాడు. ఇది చట్టపరంగా నేరమేమీ కాదు. కాని ఆ వీడియో ఒక్కసారిగా సెన్సేషన్ క్రియేట్ చేసింది. పోలీస్ వ్యవస్థ కూడా రంగంలోకి దిగింది, చివరికి నిత్యానందని అరెస్టు చేశారు. అయితే కల్కి భగవాన్ భక్తి పేరుతో భక్తులను మత్తుమందులకి బానిసలు చేస్తున్నట్లు, భక్తులతో మత్తులో ముంచి కామక్ర్రిడలు చేస్తున్నట్లు ఆరోపణలు. అయినా కల్కి భగవాన్ పైన ఎలాంటి చర్యా తీసుకోబడలేదు.


ఇక సత్య సాయి, ఆసరం బాపు, బాల సాయి లాంటి బాబాల జోలికి చట్టం కాదు కదా, వారిని తప్పు పడితే సగం మంది బ్లాగరులే మన మీదికి దాడి చేస్తారు. మరి ఈ బడా దొంగబాబాలు దొరికేదెప్పుడు?

Wednesday, 14 April 2010

మహబూబ్ నగర్, నల్లగొండే కాదు, ఉత్తరాంధ్ర, రాయలసీమ కూడా అభివ్రుద్ధి చెందలేదు కదా??!!

మహబూబ్ నగర్, నల్లగొండే కాదు, ఉత్తరాంధ్ర, రాయలసీమ కూడా అభివ్రుద్ధి చెందలేదు కదా?ఇది సమైఖ్య వాదుల రెగ్యులర్ వాదన. ఎప్పుడు ఎవరైనా తెలంగాణా వాడు నల్లగొండ, మహబూబ్ నగర్ అభివృద్ధి చెందలేదు అనగానే సమైఖ్య వాదులు వెంటనే ఈ వాదన మొదలు పెడతారు. దీనికి తెలంగాణా వాదులు సమాధానం ఇచ్చీ ఇచ్చీ ఇప్పటికే బహుషా విసిగి పోయి ఉంటారు. కానీ సంఖ్యా బలం సమైఖ్య వాదులలో ఎక్కువ కనుక వాల్ల పోస్ట్లుల మధ్య సాధారణంగా తెలంగాణా బక్క గొంతులు వినపడవు. రోజూ లగడపాటి టీవీలో జోరుగా ఇదే వాదన వినిపిస్తాడు. దానికి సమాధానం ఎన్ని సార్లు చెప్పినా ఆయన చెవికెక్కదు. ఈ వితండ వాదాలు చేసే సమైఖ్య వాదులకోసం ఈ టపా!!

నిజమే!! సమిఖ్య వాదుల వాదన అక్షర సత్యం. తెలంగాణా యే కాదు, శ్రీకాకుళం, విజయనగరం, అనంతపురం, కడప అన్నీ వెనుక బడినవే. ఇది ఎవరయినా ఒప్పుకొని తీరాల్సిందే. అయితే ఇక్కడ గమనించవలసిందేమంటే ఉత్తరాంధ్రా, అనంతపురం, కడప, చిత్తూరు లాంటి జిల్లాలలో జల వనరులు లేవు, వర్షపాతం తక్కువ. అయితే మహబూబ్ నగర్, నల్లగొండ జిల్లాల సమస్య వీటికి విరుద్ధం. ఇక్కడ పక్కనే క్రిష్ణా ఉండి కూడా ఇవి వెనుక బడ్డాయి. ఒకవేల పంజాబ్, హర్యాణా లను ఎండపెట్టి నీళ్ళన్నింటినీ రాజస్థాన్ కి తరలించారనుకోండి, అప్పుడు పంజాబ్ వాళ్ళు ఊరుకుంటారా? మరి అలాంటప్పుడు రాజస్తాన్ వెనుకబడలేదా నీటిని రాజస్థాంకి తరలిస్తే తప్పేమిటనే వాదన వితండ వాదమే కదా?

ఏ ప్రాంతం ప్రజలకి ఆ ప్రాంతపు వనరులపై అధికారం ఉంటుంది. జలవనరులపై మొదటి హక్కు నదీ పరీవాహిక ప్రాంత వాసులకి ఉంటుంది. అక్కడి ప్రజల అవసరాలు తీరిన తరువాత మాత్రమే వాటిని మిగతా ప్రాంతాలకు కేటాయించాలి. ఈ మాత్రం సమైఖ్య మేధావులకి తెలియదని కాదు, కానీ వాదనలో ఎదుటివారి నోరు మూయించడమే వీరి విధానం, నిజానిజాలు గాలికే వదిలేస్తారు. మహబూబ్నగర్ ఎండిపోతే మాకేంటి, మా కర్నూలు, గుంటూరు, క్రిష్ణా, అనంతపురం, కడప,చిత్తూరు, మద్రాసు అన్నింటికీ క్రిష్ణా జలాలు కావాలి అనేది వీరి అభిప్రాయం కాబోలు. ఇంకా ఏమన్నా మిగిలితే అవి కడప రాజా గారి సిమెంటు ఫాక్టరీలకు తరలిస్తారు. వడ్డిచేవాడు మనవాడయితే వెనుక వరసలో ఉన్న విస్తరి నిండా అన్నీ బాగానే దొరుకుతాయి మరి.

ఇక సమైఖ్య వాదుల రెండో వాదన.. క్రిష్ణా, గుంటూరు, గోదావరి జిల్లలలో మాత్రం పేదవారు లేరా? పేదరికం ఎక్కడ లేదు అని. అవును, అమెరికా, జెర్మనీలలో కూడా పేదవారు ఉన్నారు. అంత మాత్రాన అవి పేద దేశాలయిపోవు. పేదవాళ్ళెందరు, ధనవంతులెందరు, సగటు ఆదాయం ఎంత అనేవి అక్కడ ముఖ్యం.

ఇక ఇవేవీ నడవకపోతే చివరగా సమైఖ్యవాదులు తమ బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగిస్తారు. మీ తెలంగాణా జిల్లాలకి నీరు అందకపోతే మీ నాయకులేం చేస్తునారు అనే వాదన బ్రహ్మాస్త్రం. దీనికి తిరుగులేదు..తప్పు అవతలి వాడి పైకి తోసేస్తే సరిపోతుంది. తెలంగాణా నుండి ఎంతమంది ముఖ్యమంత్రులు ఎన్ని సంవత్సరాలు చేశారేంటి? పొరపాటున ఎవరైనా ఒక్కసారి అయితే వెంటనే వారిని దించడానికి రాయలసీమ, అవనిగడ్డ రౌడీలు హైదరాబాద్ వచ్చేసి గొడవలు చేస్తారు.

ఇవన్నీ సమైఖ్యవాదులకి తెలియవని కాదు. కానీ బయటపడరు. లేకపోతే తమ అధిపత్యాన్ని కాపాడుకోవడం ఎలా?

Saturday, 23 January 2010

సమైఖ్య వాద బ్లాగరుల కొన్ని వింత వాదనలు..మీ ప్రాంత అభివృద్ధికి మీ నాయకులని అడగండి!!??##


మైఖ్య సీమంధ్ర వాదుల మరో ఆయుధం ఏమిటంటే, ఎ పాయింటు దొరకనప్పుడు మీ ప్రాంత అభివృద్ధి కోసం మీ నాయకులని నిలదియక రాష్ట్రం కావాలన్తారెంటి అంటారు. నిజమే, మా ప్రాంత నాయకులంతా వట్టి దగుల్బాజీలు. అయితే ఇలాంటి వాళ్లకి టికేట్లిచ్చి వాళ్ళని నాయకులని చేసింది అధికారం వెలగబెట్టే సిమాంధ్ర నేతలే కదా? ఇప్పుడు ఉద్యమం చేస్తుంది నాయకులు కాదు, ప్రజలు. మా రాష్ట్రం మాకిస్తే ఆ తరువాత మాకు కావలిసిన నాయకులని మేము ఎన్నుకుంటాము.

ఇప్పుడు తప్పనిసరి పరిస్థితిలో మరో దారి లేక ఐ నాయకులంతా తెలంగాణా వాదం సమర్ధిస్తున్నారు..లేకపోతె ప్రజలలో చులకన అయిపోతామని తెలుసు కాబట్టి. కానీ వీల్లన్తా నిన్నటిదాకా జగన్ జపం లేక చంద్రబాబు జపం చేస్తున్న వాళ్ళే కదా? మరి ఇలాంటి వాళ్లకు ఎందుకు వోటు వేస్తున్నారు అంటే మరో దారి లేదు..అన్ని పార్టీలలో సీమాధ్ర నేతలే అధికారం గుఉపిట్లో ఉంచుకొని తమ కిలుబోమ్మలకి తికేట్లిస్తున్నారాయే. ఉన్న వాళ్ళలో ఎవరో ఒకరికి వోటు వేయాలి కదా?

ఇక మరికొందరు సమైఖ్య వాదులు తమ బాణాలని కేసీఆర్ మిఇడ ఎక్కు పెడతారు. వాళ్ళు గుర్తించాల్సిన విషయం ఏమిటంటే కేసీఆర్ తెలంగాణా వాదాన్ని సృష్టించలేదు. కేవలం దాన్ని వాడుకొన్నాడు. ఈ తెలంగాణా సమస్య ఇలా ఉన్నంతకాలం కేసీఆర్ లేకపోతె మరో డీసీఆర్ నాయకుదయ్యే వాడు. కాబట్టి వ్యక్తులపై విమర్శలు మాని సమైఖ్య వాదులు విషయంపై చర్చించడం మొదలు పెడితే అర్ధవంతంగా ఉంటుంది.

Friday, 22 January 2010

సమైఖ్య వాద బ్లాగరుల కొన్ని వింత వాదనలు.. హైదరాబాద్ ఉమ్మడి ఆస్థి. ??@#!!


1. హైదరాబాద్ ఉమ్మడి ఆస్థి. హైదరాబాద్ అబ్భివ్రుద్ధిలో అందరి వాటా ఉంది??

- ఒక విధంగా మనం ఇలా చెప్పే వాళ్ళను అభినందించవచ్చు. నిజాయితిగా వీల్లు తమ అసలు సమస్య హైదరాబాదే, సమైఖ్యమనే డొంక తిరుగుడు వాదం కేవలం ఒక కుంటి సాకు మాత్రమె అని ఒప్పెసుకున్తున్నట్లే. హైదరాబాద్ గురించి అప్పుడే అడిగితె చులకన అయిపోతామని వీరు సమైఖ్యమనే ముసుగు తొడుక్కుంటారు.

ఇక్కడ విషయం ఏమిటంటే హైదరాబాద్ ఒక్కటే కాదు, హైదరాబాద్ తో పాటు వైజాగ్, కాకినాడ, తిరుపతి లాంటి నగరాలు కుఉడా చక్కగా అభివృద్ధి చెందాయి. హైదరాబాద్ యాభై ఎల్లకిండా కూడా దేశంలో ఐదో స్థానంలో ఉన్న నగరమే, ఇప్పుడు కూడా దేశంలో ఐదో స్థానంలోనే ఉన్నది. విజాగ్ హైదరాబాద్ కంటే ఎక్కువ వేగంగా అభివృద్ధి చెందినా నగరం. స్టీల్ ఫాక్టరీ, పోర్టు, నేవీ లాటివన్నీ వైజాగ్లో వచ్చాయి. కాకినాడలో ఎన్నో ఫెర్టిలైజర్ ఫాక్టరీలున్నాయి. అంత మాత్రం చేత తెలంగాణా వాదులు ఎమీ ఆ నగరాలలో వాటా అడగట్లేదు కదా? నిజాం కాలంలోనే ఏంటో అభివృద్ధి చెందినా హైదరాబాద్ గురించి ఎందుకు ఏడుపు? దీనికి ఒక బ్లాగరు చెప్పే సమాధానం ఏమంటే హైదరాబాదులో వచ్చే ఆదాయం మిగతా మొత్తం రాష్ట్రంలో వచ్చే ఆదాయం కంటే చాలా ఎక్కువట. అసలు ఏడుపు బయట పెట్టాడు.

మరి హైదరాబాద్ ఆదాయం ఈ మధ్యే పెరిగిందా ఒక్కసారిగా, లేక 1956 నుంచి ఎక్కువేనా? ఒక వేల 1956 నుచి ఎక్కువే అయితే అప్పుడు హైదరాబాద్ ఉమ్మడి ఆస్తి అనడంలో లాజిక్ ఏమిటి? హైదారాబాద్ ఆదాయాన్నే మిగతా ప్రాంతాల్లో ఖర్చు చేసినట్లు కదా? అందులో సింహ భాగం సీమాంధ్రకే ఖర్చు జరిగి ఉంటుందనడంలో సందేహం ఉంటుందా? ఇటీవల హైదరాబాద్లో ఇబ్బడి ముబ్బడిగా తెగనమ్మిన ప్రభుత్వ భూములనుండి వచ్చిన ఆదాయంలో ఎంత భాగం సీమాంధ్రకి జలవనరులని తరలించే జలయజ్ఞ ప్రాజెక్టులకి ఖర్చు చేసి ఉంటారో? మరి ఇవన్ని లెక్కలు తోడితే ఎవరు ఏవరికి ఋణం ఉన్నట్లో తెలిసి పోతుంది.

ఇంకో సారి అదే బ్లాగరు పెద్ద మనిషి ఏమంటాడంటే హైదరాబాదు రాజధాని కనుక దాని అభివృద్ధి కోసం మిగతా ప్రాంతాల అభివృద్ధిని పణంగా పెట్టారట. ఏవిధంగా పణంగా పెట్టారు, ఒక వైపు వైజాగ్ అభివృద్ధి రేటు హైదరాబాదు కంటే ఎక్కువ, హైదరాబాద్ 1956 లో దేశంలో ఎ స్థానంలో ఉందొ ఇప్పుడూ అదే స్థానంలో ఉంది. హైదరాబాద్ రాజధాని కనుక రాజధాని అవసరాలకు ఏమైనా నిధులు ఖర్చు పెట్టారా అంటే అన్నీ నిజాం కాలంలో కట్టిన భవనాలే. మరి పరిరమలకూ, వ్యాపార సంస్థ లకూ ఎక్కడ అనువైన వాతావరణం ఉంటె అక్కడ అబివృద్ధి చెందుతాయి. ధిల్లీ రాజధాని కదా అని ముంబాయి, మద్రాసు, కోల్కతా లాంటి నగరాలు అభివృద్ధి చెందడంలేదా? ఎ విధంగా మిగతా ప్రాంతాల అభివృద్ధిని పణంగా పెట్టారు? ఇలాంటి ప్రశ్నలకు ఆయన వద్ద సమాధానం ఉండదు.

అసలు ఆంద్ర రాష్ట్ర నాయకులు హైదరాబాదు రాష్ట్రంతో కలవడానికి ముఖ్యమైన ఉద్దేశం వాళ్లకు ఆంద్ర రాష్ట్రంలో సరైన రాజధాని లేకపోవడమే. కర్నూలు లో డెరాలలో సేక్రతెరిఅత్ని పెట్టుకుని దాన్ని రాజధాని అవసరాలకు నిర్మించుకోవడానికి ఏంటో ఖర్చు అవుతుంది కనుక హైదరాబాదుతో కలిస్తే ఫ్రీగా రాజధాని లభిస్తుందని అప్పుడు ఆంద్ర ప్రదేశ్ ఏర్పాటుకు పట్టుబట్టారు. తమ అవసరాలకోసం హైదరాబాదుని రాజధానిగా చేసుకుని ఇప్పుడు అదే నగరంలో వాటా అడుగుతున్నారు. తిన్న ఇంటి వాసాలు లేక్కబెత్తడమంటే ఇదే కదా మరి?

తెలంగాణా రాష్ట్రాన్ని ఏర్పరచడం ఇష్టం లేనట్లయితే ఎందుకు అది సరి కాదో చెప్పాలి. ప్రత్యెక రాష్ట్రం కావాలని నిర్నయిన్చినట్లయితే ఆ తరువాత విభజనకు ఉన్న ఇబ్బండులేమితో చెప్పాలి. కానీ ఒక పక్క సమైఖ్యరాగం పలుకుతూ ఇంకో వైపు హైదరాబాదులో మాకూ వాటా వుందని లంకె పెట్టడం ఏవిధంగా సరి అయిన వాడమో తమను తాము తెలివైన వాళ్ళుగా భావించే సీమాంధ్ర సమైఖ్య వాదులే చెప్పాలి.

Sunday, 10 January 2010

చిరంజీవి అమెరికా, రష్యాల వాదన


ఈ మధ్యన చిరంజీవి సమైఖ్య వాదం గురించి చెబుతూ తరుచుగా అమెరికా, రష్యా, జెర్మనీల గురించి జనాలను ఊదరగొదుతున్నాడు. బహుషా మాట్లాడ్డానికి పాయింటులు ఏమీ దొరక్క ఆలోచిస్తుంటే అల్లు అరవిందో, మరొకడో చెప్పి ఉంటాడీ అమెరికా, సోవిఎట్ రష్యా ల ఉదాహరణ. తనకు వాటిపై ఏమాత్రం అవగాహన లేకున్నా మీడియా ముందర వాటినే ఊదరగొడుతున్నాడు.

చిరంజీవి చెప్పేదేమంటే, యునైటెడ్ స్తేట్స్ గా కలిసి ఉండడం వల్ల అమెరికా అభివ్రుద్ధి చెందింది, కానీ విడిపోవడం వల్ల సోవిఎట్ రష్యా భాగస్వామ్య దేశాలు అభివ్రుద్ధి చెందడం లేదని.

తెలంగాణా రాష్ట్రం ఏర్పడితే అప్పుడు అది మాత్రం యునైటెడ్ ఇండియాలో భాగం కాదా? తెలంగాణా వాల్లు ఏమైనా ఈ దేశం నుండి విడిపోతామని అంటున్నారా? అసలు అమెరికా ఉదాహరణే తీసుకుంటే ఇరవై కోట్ల జనాభా ఉన్న అమెరికాలో యాభై రాష్ట్రాలు ఉండగా వంద కోట్ల జనాభా ఉన్న మనదేశంలో మరో కొత్త రాష్ట్రానికి స్థానం లేదా?

అమెరికా ఒక ఫెడరల్ రిపబ్లిక్. అక్కడ రాష్ట్రాలకు ఎక్కువ అధికారాలు ఉంటాయి, ఎక్కువ ఆదాయం ఉంటుంది. ఆదాయపు, అమ్మకపు పన్నుల్లో రాష్ట్రాలకు ఎక్కువ వాటా ఉంటుంది. మన దేశంలో రాష్ట్రాలకు ఉండే అధికారాలు చాల పరిమితం. ప్రతి చిన్న విషయానికీ కేంద్రందగ్గర చెయ్యి చాచాల్సిన పరిస్థితి. అలాంటప్పుడు మనం అమెరికా ఉదాహరణ తీసుకోవాలంటే ఇంకా ఎక్కువ రాష్ట్రాలను ఏర్పాటు చేసి, ఎక్కువ అధికారాలను రాష్ట్రాలకు బదిలీ చెయ్యాలి. కానీ ఈయన ఏంటి, అమెరికాను చూసి సమైఖ్యంగా ఉండడం నేర్చుకుందామంటాడు మరి?

ఇక సోవిఎట్ రష్యా విషయానికి వస్తే, సోవిఎట్ రష్యాలో అంతర్భాగమైన రిపుబ్లిక్లన్నీ బలవంతంగానే సోవిఎట్ రష్యాతో కలిసి ఉన్నాయి, కానీ వాల్లెప్పుడూ స్వతంత్రంగా ఉండడానికే మక్కువ చూపారు. ఇప్పుడు ఈయన చెప్పిన సిద్ధాంతం వినిపించి పాత సోవిఎట్ అంతర్భాగ రిపబ్లిక్లని రష్యా తో కలవమంటే వాల్లు ఇష్టపడతారా? ఇకపోతే ఉత్పత్తిలో గానీ, జీవన ప్రమాణాల్లోగానీ ఆ దేశాలు అప్పటికంటే ఇప్పుడు వెనుకపడ్డయనడానికి చిరంజీవి దగ్గర ఆధారాలు ఎమైనా ఉన్నాయా? అప్పటి కమ్యూనిస్టు నియంత్రిత మీడియా ఇచ్చిన ప్రమాణాలనే వాస్తవాలుగా తీసుకుంటే ఎలా?

ఇలాంటి ప్రపంచ విషయాలపై ఏమాత్రం అవగాహన లేని నాయకులని మనం నేతలుగా ఎన్నుకుంటే సమైఖ్యంగా ఉన్నా విడిపోయినా మన దేస్శం ఎన్నటికీ అభివ్రుద్ధి చెందదు మరి.

Wednesday, 6 January 2010

సమైక్యాంధ్ర వాదుల వితండ వాదాలూ, అబద్దపు ప్రచారాలు -2


1. నీటి ప్రాజెక్టులకోసం మీ నాయకులని నిలదీయక రాష్ట్రం కావలంటారేం?

అక్కడికి జలవనరులపై నిర్నయాలు అన్నీ నియోజకవర్గం నాయకులే చేస్తున్నట్టు తెలంగానా వాల్లు వాటికోసం నాయకులని నిలదీయాలట. ఎమ్మెల్యేలకూ, ఎంపీలకూ వాటర్ ప్రాజెక్టులపై నిర్నయాలు తీసుకునే అదికారం ఉందా? ఏ పార్టీ ఎమ్మెల్యే ఐనా వాల్ల అధినేత మాట కాదని ఆ పార్టీలో మన గలడా? పీ జనార్ధన్ రెడ్డి లాంటి అసమ్మతి నేతల మాటలు ఎప్పుడైనా గెలుస్తాయా, అధికారంలో ఉన్నవాడి మాట నెగ్గుతుంది కానీ?

2. తెలంగాణాలో అంతా ప్రత్యేక రాష్ట్రం కోరుకుంటే టీఆరెస్ గెలవలేదేం?

తెలంగానా ఉద్యమం టీఆరెస్తో రాలేదు. అంతకు చాలా ముందు నుంచే ఉంది. టీఆరెస్లో కొన్ని నాయక్త్వలోపాలు ఉన్న మాట నిజమే కావొచ్చు, టీఆరెస్ గతిపై ప్రజలకు కొన్ని అనుమానాలు ఉండడం నిజమే. వాల్లు టీఆరెస్కి వోటేయనంత మాత్రాన తెలంగాణా కోరుకోనట్లు ఎలా అవుతుంది? టీఆరెస్ కాకుండా మిగతా పార్టీలు ఏవీ కూడా (ఒక్క సీపీఎం తప్ప) మేము తెలంగాణా రాష్ట్రానికి వ్యతిరేకం, సమైక్యాంధ్రనే కోరుకుంటున్నాం అని చెప్పరా? మొనటి దాకా అన్ని పార్టీలూ తెలంగాణాకి కట్టుబడి ఉన్నామనేకదా చెప్పాయి?

3. తెలంగాణా వాదులంతా వాల్ల నాయకుల మాయ మాటలు విని అదే నిజమనుకుంటున్నారు.

ఇది చాలా గమ్మత్తైన వాదన. తెలంగాణా మద్దతుదారులను ఎవరిని అడిగినా విడిపోవడానికి ఓ పది కారణాలు ఈజీగా చెబుతాడు. అదే సమైక్యాంధ్ర వాదులు ఎందుకు కలిసి ఉండాలో అడిగితే నీల్లు నమలుతారు. మరి నాయకుల మాటలు వినేది తెలంగానా వాదులా, లేక సమైక్యవాదులా? ఈ సమైక్య వాదులంతా చిరంజీవి అమెరికా, జెర్మనీ, సోవిఎట్ రష్యా గురించి చెప్పగానే ఒక్కసారిగా కల్లు తెరుచుని కలిసి ఉంటే కలదు సుఖం అనుకుంటున్నారా?

4. తెలుగు వాల్లను కలిసి ఉండకుండా విడగొడుతున్నారు.

ఇదేమిటి? తెలుగు వాల్లంతా ఒకే రాష్ట్రంగా ఉండాలని రూలు ఎక్కడుంది? హిందీ మాట్లాడే వాల్లు అనేక రాష్ట్రాలుగ విభజించబడలేదా?

5. చిన్న రాష్ట్రాలకు కేంద్రంలో పరపతి ఉండదు.

చిన్న రాష్ట్రాలైన కేరల, హర్యానా, హిమాచల్ లాంటి రాష్ట్రాలు చక్కగా అభివ్రుద్ధి చెందుతాయి. కేంద్రం నుంచి చక్కగా ఫండ్స్ వస్తాయి. కేబినెట్ మినిస్ట్రీలు వస్తాయి. వీల్ల వాదనేమనంటే ఇంతపెద్ద రాష్ట్రమ్ళో ముప్పై నాలుగు ఆరు మంది ఎంపీలు ఉంటే కేబినెట్ మినిస్ట్రీలు రాలేదు, చిన్న రాష్ట్రాలుగా ఉంటే ఎలా వస్తాయని. కేబినెట్ మినిస్త్రీలు రావాలంటే సంఖ్య కాదు, సరకు ఉన్న ఎంపీలు ఉంటే చాలు అన్న విషయం వీల్లు తెలుసుకోరు.

Tuesday, 5 January 2010


సమైక్యాంధ్ర వాదుల వితండ వాదాలూ, అబద్దపు ప్రచారాలు -1
తెలంగానా రాష్ట్రం కొరకు ఉద్యమం యాభై ఏల్లుగా సాగుతుంటే, డిసెంబరు పది చిదంబరం ప్రకటనతో రాత్రికి రాత్రి మొదలయ్యిన సమైక్యాంధ్ర ఉద్యమానికి మద్దతుగా తెలుగు బ్లాగర్లలో ఈ మధ్య ప్రచారం మొదలయ్యింది. అయితే ఇలా రాత్రికి రాత్రి మొదలైన ఉద్యమానికి కారనాలు ఏమి చెప్పాలో ఎవరికీ అర్ధం కాక, ఎదో ఒకటి చెప్పి గోబెల్సు లాగే దాన్నే పదే పదే గట్టిగా అంటే సరిపోతుంది..పెద్దగ వినపడ్డం వల్ల జనం మన మాటే నమ్ముతారని వాల్లు ఆశ పడుతున్నారు లాగుంది. వీల్ల వాదనలు చాలా చిత్రంగా తలా తోకా లేకుండా, అసలు వాల్లు దేనికోసం ఉద్యమం చేస్తున్నారో కూడా తెలియనంత విచిత్రంగా ఉంటాయి. మచ్చుకు కొన్ని సమైక్య వాదుల వాదనలు.

1. రాష్ట్ర విభజన దేశ సమగ్రతకు పెద్ద సమస్య. ఇది వేర్పాటు వాదుల కుట్ర.

ఈ వాదన చూస్తే కాస్త బుర్ర ఉన్న ఎవ్వరికైనా నవ్వు రాక మానదు. ఒక రాష్ట్ర విభజనకీ, దేశ సమగ్రతకి సంబంధం ఏమిటి? అసలు దేశంలో రాష్ట్రాలే లేకుండా అంతా కలిసి ఉంటే సమగ్రత ఎక్కువగా ఉంటుందా? తెలంగాణా వాల్లేమైనా ఈదేశం నుండి విడిపోతామంటున్నారా? కొత్త రాష్ట్రం ఎర్పడితే అది ఈ దేశంలో భాగం కాద? మద్రాసు నుంచి విడిపోయి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డప్పుడూ, ఝార్ఖండ్, ఉత్తరాంచల్, చత్తిస్గర్హ్ ఏర్పడ్డప్పుడూ ఈ దేశ సమగ్రతకు ముప్పు ఏమన్నా వచ్చిందా?

2. మీడియా, పోలీసులు తెలంగానా పక్షం??!!

అసలు మీడియా అంతా ఆంధ్రా వాల్ల చేతుల్లో ఉంది. మీడియా తెలంగాన పక్షం అని చెప్పడం విచిత్రంగా లేదూ? వీల్లు చెప్పేదేమంటే మీడియా ఎప్పుడూ తెలంగానా వాల్ల ఉద్యమాన్నే చూపిస్తుంది, ఆంధ్రా వాల్లు విశాఖ పట్నం లోనో, విజయవాడలోనో చేసేది చూపించరని. అవును అసలు ప్రజల్లో ఏమాత్రం మద్దతు లేని, కొంతమంది బడా నాయకులు తమ ప్రాబల్యం కోసం డబ్బులిచ్చి చేపిస్తున్న ఈ రాత్రికి రాత్రి మొదలయిన ఉద్యమాన్ని ఎవడు చూపిస్తాడు, చూపిస్తే ఎవడు చూస్తాడు? అక్కడొ పది మంది, ఇక్కడొ నలుగురు కలిసి ధర్నాలు చేసి దాన్ని ఎవరూ చూపించట్లేదంటారు.

ఇక వీల్లు చెప్పే మరో కారణం ఏమిటంటే తెలంగాణా నాయకుల సమావేషాలు, ప్రసంగాలు ఎక్కువగా చూపిస్తారు, ఆంధ్రా వాల్లవి చూపించరని. మరి అది నిజమే కదా? మిడియా ఎవరి ప్రసంగాలు ప్రజలు వినాలని కోరుకుంటున్నారో వాల్లవే చూపిస్తారు. చిరంజీవి, లగడపాటిల ఉపన్యాసాలు ఎవడైనా వింటాడా మరి?

ఇకపోతే విచిత్రమైన విషయం ఏమిటంటే పోలీసులు తెలంగానా వాల్లవైపట!! ఉస్మానియా విద్యార్తులు క్యాంపస్ లో ఉంటే హాస్టల్లలోకి వచ్చి కొట్టిన పోలీసులు అనంతపురంలో బీఎస్సెన్నెల్ గోడౌన్లు కాలుస్తున్నా అక్కడే ఉండి చూస్తూ ఊరుకున్నారు. కేసీఆర్ని దారి కాచి ఖమ్మం జైలుకి తరలించిన పోలీసులు లగడపాటి హాస్పిటల్ నుండి సినిమాలో లాగా తప్పించుకుని హైదరాబాదు వచ్చినా చోద్యం చూసారు. అయినా వీల్ల కల్లకు పోలీసులు తెలంగానా పక్షపాతుల్లాగానే కనిపిస్తారు.

3. తెలంగానా రాష్ట్రం ఏర్పడ్డంత మాత్రానా అభివ్రుద్ధి సాధ్యమని గ్యారంటీ ఉందా?

అసలు దేనికయినా గ్యారంటీ ఉంటుందా? ఏదైనా మార్పుని కోరుకునే వాడు మార్పు మంచి ఫలితాన్ని ఇస్తుందని ఆషిస్తాడు. కలిసి ఉంటే అభివ్రుద్ధి జరుగుతుందేమోనని యాభై ఏల్లు వేచి చూసారు. ఇంకా ఎంత కాలం చూడమంటారో చెప్పండి.

4. ఈ విభజన వాదుల బందుల వల్ల నష్టం జరుగుతుంది.

నిజమే మరి. ఎవరు మాత్రం ఇలా బందులూ, ధర్నాలు ఉండాలని కోరుకుంటారు చెప్పండి? తెలంగాణా ప్రక్రియ మొదలవుతుందని చిదంబరం చెప్పగానే మీరు కేంద్ర ప్రభుత్వ నిర్నయానికి కట్టుబడి ఉంటే ఈ గొడవలన్నీ ఉండేవి కావు కదా? సమైక్య వాదులేమైనా బందులూ, ధర్నాలూ, నిరాహార దీక్షలూ లాంటివేవీ చేయకుండా ఊరుకున్నారా మరి? అప్పుడేమయింది మీ ఈ విచక్షణ?