Wednesday, 28 November 2012

హెడ్‌క్వార్టర్స్ చంచల్‌గూడజైళ్ళో ఎవరుంటారు? నేరంచేసి శిక్షననుభవిస్తున్న ఖైదీలూ లేదా నేరారోపణలతో విచారణనెదుర్కుంటున్నవారు ఉంటారు.  అప్పుడప్పుడూ వారిని కలుసుకోవడానికి వారి కుటుంబ సభ్యులు వెల్లి స్వీట్లు లాంటివి ఇస్తుంటారు. అయితే ప్రస్తుతం మన రాష్ట్రంలో మాత్రం గమ్మత్తయిన పరిస్తితి ఏర్పడింది. ఒక పార్టీ హెడ్‌క్వార్టరుగా చంచల్‌గూడ జైలు సేవలందిస్తుంది.

కాంగ్రేస్ పార్టీ ఆఫీసుగా గాంధీభవన్, తెదేపా ఆఫీసుగా ఎంటీఆర్‌ట్రస్టు భవన్ , తెరాస పార్టీ ఆఫీసుగా తెలంగాణభవన్ వ్యవహరిస్తుంటే  వైకాప ఆఫీసుగా మాత్రం ప్రభుత్వభవనం చంచల్‌గూడ జైలు మారింది.చక్కగా కిరాయి చెల్లించాల్సిన అవసరం కూడా లేదు.  పార్టీ కార్యకలాపాలు, పాదయాత్ర ప్లానింగు మొత్తం జైలునుండే నడుస్తుంది.

ముంబయి మాఫియా అంతా దుబాయి నుండి దావూద్ ఇబ్రహీం నడపడం మనం గతంలో విని ఉన్నాం. సూరి లాంటి కొందరు ఫాక్షనిస్టు లీడర్లు గతంలో జైలు నుండే ప్లానింగ్ చేసి ప్రతీకారాలు తీర్చుకోవడం చూశాం. జైలు నుండి పోటీచేసి ఎలక్షన్లలో గెలిచినవారిని చూశాం. ఇప్పుడు వెరైటీగా పార్టీకి జైలు హెడ్‌క్వార్టరుగా మారడం చూస్తున్నాం.

చంచల్‌గూడలో విజిటర్లు కుటుంబ సభ్యులు, వైకాప పార్టీ నాయకులు మాత్రమే కాదు. రోజుకొక తెదేపా నాయకుడు చంచల్‌గూడకు వెల్లడం, తెల్లారి అతను సస్పెన్షన్‌కు గురికావడం ఒక తంతుగా మారింది. మొన్న నాని, నిన్న ప్రవెణ్‌రెడ్డి, ఈరోజు ఉమ్మారెడ్డి..రేపెవరో!! చంద్రబాబుకు  చంచల్‌గూడ జైలు వెన్నులో చలి పుట్టిస్తుంది.


పక్కపార్టీలనుండి లీడర్లను కొనడానికి తండ్రిపాలనలో దోచుకున్న లక్షకోట్లు, కిరాయి అవసరం లేని పార్టీ ఆఫీసు, జైల్లో ఉన్నందుకు తల్లీ చెల్లెల్లూ ఏడుస్తూ కూడగట్టుతున్న సింపతీ. ఎలక్షన్లయ్యాక గెలిచినపార్టీకి మద్దతిస్తే కేసులు కూడా మాఫీ కావచ్చు. మొత్తానికి జగన్‌కి అంతా అనుకూలంగా నడుస్తున్నట్టుంది.

అయితే జగన్‌కూ చంద్రబాబుకూ చాలా పోలికలు కనబడుతున్నాయి. ఇద్దరిదీ రెండు కళ్ళసిద్ధాంతం, ఇద్దరూ తమ లేదా  తమ తండ్రి పాలన స్వర్ణయుగమని, అవతలివారిది దుష్టపాలన అనీ చెప్పుకుంటారు. ఇద్దరూ మరోవ్యక్తిని నమ్మరు. ఇద్దరి పార్టీల్లోనూ నంబర్ టూ ఎవరూ ఉండరు. ఇప్పుడు జగన్ జైల్లో పడ్డట్టే బహుషా భవిష్యత్తులో చంద్రబాబు కూడా జైలుకెల్లే వంతు వస్తుందేమో.

Saturday, 17 November 2012

వ్యతిరేకం కాదు (కథ)"ఈదోమలు పాడుబడ, ఒక్కటె శెవులల్ల గుయ్య్ గుయ్య్ మంటయ్!" నిద్రపట్టక పక్కమీద మెసులుతున్న చిన్నారావు గొణిగిండు.

"సప్పుడు జెయ్యకుంట పండుకోరాదు?" నిద్రలోనే కసిరింది భార్య రాజమ్మ.

పడుకోనయితె పడుకుండుగని చిన్నారావుకు ఎంతకూ నిద్ర ఒస్తలేదు. ఒక్కటే ఆలోచనలు...ఏం జేశేది? ఈసారి ఎలక్షన్లలో గెలిచేది ఎట్ల?

తన సమస్య అట్లాంటిది మరి. చిన్నారావు ఊరికి సర్పంచి. మంచి మాటకారీ, రాజకీయ చతురుడు. కొండగడపలొ రాజకీయాలల్లో పట్టున్న నాయకుడు. తను అగ్రకులం వాడే అయినా ఊళ్ళోని బీసీలు, దళితులు అందరినీ మాయజేసి, మభ్యపెట్టి మరీ అందరి మద్దతునూ కూడగట్టి రెండుసార్లు ఊరికి సర్పంచి అయిండు. ఊళ్ళో రాజకీయంగా చిన్నారావుకు  తిరుగులేదు. ఇప్పటిదాకా అంతాబాగానే ఉందిగానీ ఇప్పుడు కొత్తగాతన బామ్మర్ది జెయ్యబట్టి చిన్నారావుకు సమస్యొచ్చింది.

చిన్నారావు బామ్మర్ది ఏడుకొండలు డిగ్రీ ఫెయిలయి ఇంట్లో ఉంటుంటే తన చేతికింద ఉంటడని రాజమ్మ తన ఇంట్లోనే ఉంచుకుంటుంది. ఏడుకొండలు కాస్త రౌడీటైపు. తాగడం, ఆడవారిపై అసభ్యంగా ప్రవర్తించడం లాంటి అలవాట్లు మొదట్నుంచీ ఉన్నాయి.

ఊర్లో మంచినీళ్ళబాయి దగ్గరికొచ్చిన మాలపిల్ల గౌరిని ఏడిపించబోతే అక్కడ ఉన్న కొందరు దళిత యువకులు చితక్కొట్టి పంపించారు.పక్కూరికి పనికెల్లి వస్తున్న నలుగురు దళితయువకులను దారికాచి దాడిచేశాడు. దాడిలో దళిత యువకులకు బాగా కత్తి గాట్లుపడి ఇప్పుడు వాళ్ళు పట్నంలో పెద్దదావకాన్ల ఉన్నరు.బామ్మర్దిది తప్పని ఒప్పుకుందామంటే ఇంట్లో భార్యక్కోపం. సర్లే మనకేంది అని ఊరుకుందామంటే రెండునెలల్లో ఎన్నికలాయె, దళితుల వోట్లు లేనిదే గెలవడమెట్ల?ఇట్లనే ఆలోచిస్తుంటె చిన్నారావుకు అంతకుముందు పేపర్లో జదివిన రెండుకళ్ళ సిద్ధాంతం యాదికొచ్చింది. "అరె, నాపరిస్థితి గుడ గిట్లనె ఉంది, గిదేజేద్దాం. రేప్పొద్దున ఏదో ఒకటి జెప్పి మాలోల్ల నోరు మూయిద్దంలే", అనుకుంటూ నిద్రలోకి జారుకుండు.

* * * * *


తెల్లారి తనదొడ్డిలో పనిజేసే కిష్టయ్య, యాదయ్యలను తీసుకుని దళితవాడకు బయల్దేరిండు. కిష్టయ్య, యాదయ్యలు దళితులే..వాళ్ళకూ జరిగిన అన్యాయం చూస్తుంటే కోపమొస్తుంది. అట్లని యజమాని మాట యినకబోతె పొట్టగడిచేదెట్ల అనుకుని సప్పుడు గాకుండ ఉంటుండ్రు.


సర్పంచి వచ్చిండు, బామ్మర్ది గురించి ఏం మాట్లాడుదమో ఇందమని గూడెంల పెద్దలందరు గుడిసెలనుంచి బయటకొచ్చిన్రు.


యాపచెట్టుకింద ఉన్న గుండ్రాయి మీద గూసొని చిన్నారావు వచ్చినోళ్ళను గుడ కూసొమ్మని సైగ జేశిండు.

"నర్సప్పా! ఎల్లయ్య! కూసుండ్రా. మీపిలగాండ్లకు దెబ్బలు దాకినయని తెలిశింది, నాకు శాన బాదయింది. గిది జెప్పుదామనె గిట్లొచ్చిన."


"ఇది జేయించింది మీ బామ్మర్ది ఏడుకొండలే" కాస్త దూరంగా నిల్చున్న శేఖర్ అన్నడు. శేఖర్ దళితుడే అయినా పట్నంల హాస్టల్ల ఉండి చదువుకుంటుండు.

"నాకు మీరొకటి, నా బామ్మర్ది ఒకటి కాదు. మీరు, నాకుటుంబం, నాకు రెండు కండ్లసుంటోళ్ళు. నాపరిస్థితి అర్ధం జేసుకోండ్రి."

"మరి తప్పు జేశినందుకు మీబామ్మర్దికి ఏం శిక్ష ఏస్తరు?"

"అరె ఏంది శేకర్, గట్ల మాట్లాడుతవ్? శిక్ష ఏసెటొందుకు నేనెవర్ని? దానికి కోర్టులున్నయ్!"

"పోలీస్ స్టేషన్ల మా దరకాస్తుగుడ దీసుకుంటలేరు. అడిగితె ఎస్సై మీపేరు జెపుతుండు."


"నేనత్లెందుకు జెపుత నర్సప్పా? ఇదంత నాశత్రువులు నామీద జేస్తున్న కుట్ర. జెర మీరు నన్నర్దం జేసుకోండ్రి. ఇగొ, నాపొలంల పనిజేసే కిష్టయ్య, యాదయ్యలను గుడ తీసుకొచ్చిన. వీళ్ళు మీకులపొల్లె. వీల్లు కుడ నాతరఫున మీతోపాటు పోరాటం జేస్తరు."

"మరి మాపొరగాండ్లను కొట్టింది కుడ నీమనుషులేగద దొర?దానికేం జెయ్యాలె?రెండు దిక్కుల మీరే కొట్లాడుతరా?"

కాస్సేపు చిన్నారావుకేమనాలో తోచలేదు. చివరికి మెల్లగా అన్నాడు. "నేను మీ పోరాటానికి వ్యతిరేకం కాదు, నా మాట నమ్ముండ్రి."

"గట్లనా! అయితే మాతో పాటు పోలీస్ స్టేషన్లకొచ్చి మాపిర్యాదు తీసుకొమ్మని ఎస్సైకి జెప్పున్రి. శేయించింది మీ బామ్మర్ది, మీ మనుషులేనని సాక్ష్యం జెప్పున్రి".

"అరె, గట్ల మాట్లాడుతరేంది నర్సప్ప? నేను మీకు వ్యతిరేకం గాదన్న గని అనుకూలమన్ననా? మీపంచాయితి మీరు జూసుకోండ్రి."

"మా పంచాయితి మేము జేస్తుంటె పోలీస్ స్టేషన్ల మోకాలడ్డం బెట్టింది మీరే కద?ఊరికి సర్పంచిగ ఇవిషయంల మీ వైఖరేంది?""

"గిదంత నా శత్రువుల కుట్రని శెప్పినగద, మల్ల గట్లడుగుతరేంది? మీరు మాత్రం ఎలక్షన్లల్ల మీ వోట్లు నాకే ఎయ్యలి, మరిశిపోకుండ్రీ."

"ఏస్తమేస్తం. గట్లనె మీ బావబామ్మర్దుల నాటకాలన్ని జూస్తం." ఆవేశంతో అన్నాడు శేఖర్.

"ఇన్నిరోజులు నేనేం జెప్పినా నమ్మెటోండ్లు, ఇప్పుడు వీళ్ళుగుడ తెలివి మీరిండ్రు. ఇంక వీళ్ళను మోసం జేయడం కష్టం. ఊర్లొ పోశమ్మ గుడి సుట్టు పొర్లుదండాలు బెడితెనన్న గెలుస్తనో?" అనుకుంటూ చిన్నారావు అక్కడినుంచి కదిలిండు.Friday, 16 November 2012

పాపం పురోహితులు...


--ఘంటా చక్రపాణిఇప్పుడు రాష్ట్రంలో రాజకీయాలకంటే సినిమాలే ఎక్కువ వివాదాస్పదం అవుతున్నాయి. ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ మొదలైన గొడవలు‘దేనికైనాడీ’అని మోహన్‌బాబు కుటుంబం నడివీధిలో నిలబడి బ్రాహ్మణులను సవాలు చేయడంతో తారాస్థాయికి చేరుకున్నాయి. ‘వుమెన్ ఇన్ బ్రాహ్మనిజం’ సినిమా బ్రాహ్మణులను ముఖ్యంగా బ్రాహ్మణ స్త్రీలను కించపరిచే విధంగా అసభ్యంగా చూపిందని, అలాగే దేనికైనాడీ సినిమాలో కూడా బ్రాహ్మణకులాన్ని వెకిలిగాచూపి అవమానించారన్నది బ్రాహ్మ ణ సంఘాల అభియోగం. అయితే ఒకటి రెండు దళిత సంఘాలు మినహా ఈ అభియోగాలను ఎవరూ పెద్దగా పట్టించుకున్నట్టు లేదు. మోహన్‌బాబు ఇంటిముందు, సినిమా థియేటర్ల ముందు బ్రాహ్మణులు చేస్తున్న ధర్నాలు, ఆందోళనల్లో కూడా మిగతా కులసంఘాలు ప్రజాసంఘాలు పాల్గొంటున్నట్టు లేదు. అలాగే రాజకీయ పార్టీలు కూడా బ్రాహ్మణుల ఆందోళనలో భాగం కావడం లేదు. దేవుడికి అపచారం జరిగిందనో, గుడి దగ్గర గొడవ జరిగిందనో ఆందోళనలకు దిగే హిందూ మత ప్రచారక సంఘాలు, పార్టీలు కూడా ఈ విషయంలో పెదవి మెదపడం లేదు. పోనీ బ్రాహ్మణులంతా సంఘటితంగా ఉన్నారా అంటే అదీ లేదు.

ఇప్పుడు సాగుతున్న ఆందోళనల్లో ఆత్మాభిమానం కలిగిన పేద బ్రాహ్మణులు, కొద్దో గొప్పో ఉద్యమాలతో మమేకమై కదిలిన వాళ్ళు మినహా అగ్రవర్గ బ్రాహ్మణుపూవరూ కనిపించడం లేదు. ఈ బలహీనత తెలిసే మోహన్‌బాబు మరింత రెచ్చగొట్టే రీతిలో మాట్లాడుతున్నా డు. ఈ సినిమా ఎంత రచ్చకెక్కితే ఆయనకు అంత వ్యాపారం జరుగుతుంది. చాలా కాలంగా పరాజయాల పాలై చితికిపోయిన ఆయన కుటుంబానికి ఒక రకంగా బ్రాహ్మణుల ఆం దోళన జీవం పోసింది. ఆ సినిమాల్లో ఏముంది? ఎందుకవి వివాదాస్పదమయ్యాయి? అన్న విషయా లు వదిలేస్తే, ఏ కులాన్నైనా వెకిలిగా చూపడం, అవమానపరిచే రీతిలో కుల పాత్రలను రూపొందించి కథ నడపడం అనైతికం. కానీ తెలుగు సినిమాలో విలన్లు, రౌడీలు తెలంగాణ ప్రాంతం వాల్లైనట్టే పనిమనుషులు ఉత్తరాంధ్ర వాళ్ళో లేక ఇంకొక వెనుకబడిన ప్రాతం వాళ్ళో అయి ఉంటారు. అలాగే దేశ ద్రోహులు, దుర్మార్గులు మైనారిటీలో, దళితులో లేదా బహుజన కులాల వాళ్ళో అయి ఉంటారు. తెలుగు సినిమా మొదటినుంచీ కులాన్ని, మతాన్ని ప్రస్తావించకుండానే ఆయా పాత్రల వేషధారణ వాళ్ళు ఏ కులం వాళ్ళో చెప్పేస్తుంది. పాత సినిమాల్లో స్మగ్లర్లంతా రాబర్ట్‌లో, థామస్‌లో ఉన్నట్టే, వాంప్‌లు లూసీలు, జూలీ లు ఉంటారు. అలాగే ఈ కాలంలో వీధి రౌడీలంతా నర్సింగ్‌లు, శ్రీశైలం పేర్లతోనే ఉంటారు. ఒక్క రాయలసీమ ఫ్యాక్షన్ సినిమాల్లో తప్ప మరెక్కడా ప్రతినాయకులకు అగ్రవర్ణం పేర్లుండవు.

సమాజంలో బ్రాహ్మణులు అగ్రవర్ణాక్షిగేసరులే అయినప్పటికీ సినిమా రం గం మాత్రం వాళ్ళను అల్పులుగానే చూపిస్తోంది. బూతులు మాట్లాడేవాళ్ళు, మోసాలు చేసేవాళ్ళు, చాపల్యం ఉన్నవాళ్ళు, తిండిపోతులు ఇట్లా అనేక అల్పపు పాత్రల్లో వారి వేషధారణ, చేష్టలతోనే చెప్పించే సన్నివేశాల్లో మొదటి నుంచీ బ్రాహ్మణులే కనిపిస్తారు. తెలుగు సినిమా మొదటి నుంచీ బ్రాహ్మణుడిని విదూషకుడిగానే పరిగణిస్తూ వచ్చింది తప్ప ఎప్పుడూ నాయకుడిగా చూపలేదు. దానికి తమిళ సినిమా ప్రభావం, ద్రావిడ ఉద్యమం కూడా ఒక కారణమై ఉండవచ్చు. దానికి తోడు సినిమారంగంలో పెట్టుబడి ఒక కార ణం. తెలుగు సినిమా ఇవాళ ఈస్థాయికి రావడానికి ఒకటి రెండు కులాలు, ఒకటి రెండు జిల్లాలే కారణం. మొదటి నుంచీ కోస్తా ప్రాంతంలోని కృష్ణా, గుంటూరు జిల్లాలే సినిమాను ఏలుతూ వచ్చాయి. ఆ తరువాత గోదావరి జిల్లాలు తోడయ్యాయి.

ఈ జిల్లాల్లో హరిత విప్లవం, భూస్వామ్యం, వ్యవసాయరంగ విస్తరణ, అభివృద్ధి, అది తెచ్చిన సంపద నేరుగా మద్రాస్‌కు వెళ్లి పెట్టుబడిగా మారి సినిమా రంగాన్ని ఆక్రమించింది. అప్పటిదాకా గ్రామాల్లో పెత్తనం సాగించిన భూస్వాములు, రైసు మిల్లర్లు, చిన్న చితకా రాజకీయ నాయకులు నేరుగా నిర్మాతలుగా, కొంత తెలివితేటలు ఉన్న వాళ్ళు డైరెక్టర్లు గా మారిపోయారు. మొదట నాటక రంగంలో అనుభవం ఉన్నవాళ్ళు, అభినయం తెలిసిన వాళ్ళు, సినిమాకు పనికొచ్చే వాక్‌శుద్ధి ఉన్నవాళ్ళు బ్రాహ్మణులే అయినందువల్ల వాళ్ళు నటులుగా ఉండేవాళ్ళు. కానీ భూస్వామ్య కుటుంబాల పిల్లలు ఎదిగి వచ్చాక వాళ్ళే కథానాయకులుగా తెరమీదికి వచ్చారు. వాళ్ళే గడిచిన మూడు తరాలుగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నా రు.

ఒక దశలో కమ్మ భూస్వామ్య వర్గాలు తెలుగు సినిమా రంగాన్ని పూర్తిగా కైవసం చేసుకున్నాయి. అయితే దాన్ని గోదావరి జిల్లాల కాపులు తరువాతి కాలంలో కొంతమేరకు నిలువరించే ప్రయత్నం చేశారు. తొలి తరంలో కొద్దో గొప్పో త్రిపురనేని రామస్వామి చౌదరి, రఘుపతి వెంకయ్య లాంటి వారి సంస్కరణవాదుల ప్రభావం ఉండడం, వాళ్ళ సినిమాల్లో కొద్దో గొప్పో సం దేశం, సామాజిక ఎజెండా ఉండేది. తరువాతి కాలంలో ఈ వర్గాలే సినిమా స్టూడియోలు స్థాపించి క్రమక్షికమంగా దాన్నొక లాభసాటి వ్యాపారం చేసుకున్నాయి. మధ్యలో కొంత కమ్యూనిస్టు భావాలున్న వాళ్ళు, ప్రజానాట్యమండలిలో పనిచేసి అభ్యుదయ భావాలున్న అనేకమంది సినిమా రంగంలో చేరి కొంతకాలం ప్రజాపక్షం ఉండే విధంగా చూశారు. ఆ తరం అంతరించిపోయాక సినిమా పూర్తిగా ఏకపక్షమే అయ్యింది. ఈ వ్యాపారులు నేరుగా కులం పేర్లతో నరసింహనాయుడు, చెన్నకేశవరెడ్డి వంటి కులాల పేర్లు కలిగిన సినిమాలు తీయడం మొదలుపెట్టి వాళ్లే ఆ గ్రామాన్ని, ప్రాంతాన్ని మొత్తం సమాజాన్ని కాపాడేవాళ్లుగా సినిమాలు తీసే స్థాయికి చేరుకున్నారు. సినిమా రంగాన్ని శాసిస్తున్న కులాలు, ప్రాంతమే ఇప్పుడు పత్రికలు, టీవీ మాధ్యమాల మీద కూడా ఆధిపత్యం సాగిస్తున్నాయి. మొత్తంగా సమాజం మీద బలమైన భావ ప్రసరణ, ప్రభావం కలిగించే మాధ్యమాలన్నీ ఒకేవర్గం చేతుల్లో ఉన్నాయి. కాబట్టి బ్రాహ్మణులు ఆత్మగౌరవం కోసం చేస్తున్న నిరసన పెద్దగా ప్రచారానికి కూడా నోచుకోవడం లేదు.

తెలుగు సినిమాలో బ్రాహ్మణుల పాత్ర గానీ, భాగస్వామ్యం గానీ లేకుం డా పోవడం దీనికి ఒక కారణమైతే, మొత్తం సామాజిక వ్యవస్థకు వాళ్ళు దూరం కావడమే ఇవాళ్టి దురవస్థకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. మాటల రచయితలుగా, కవులుగా, గాయకులుగా చాలాకాలమే ఉన్నా వాళ్ళు పెట్టుబడిదారుడైన నిర్మాత చేతిలో డబ్బుకు దాసోహమైపోయారు. అందుకే మోహన్‌బాబు తన సినిమా కథ రాసింది, నటించిందీ బ్రాహ్మణులేనని దబాయిస్తున్నారు. ఈ మాటే ఒక టీవీ చర్చలో నేను ఏవీఎస్ అనే నటున్ని అడిగితే ‘మేం పొట్టకూటి కోసం నిర్మాతలు ఏం చెపితే అది చేసేవాళ్ళం’ అని చె ప్పారు. అంతే కాదు ‘డబ్బులు ఇస్తున్నాడు కాబట్టి వాళ్ళు చెప్పింది చేయాల్సి ఉంటుంది’ అని కూడా అన్నారు.

ఆయన మాటల్లో తన నిస్సహాయత కనిపించింది. బ్రాహ్మణులను కించపరిచే సన్నివేశాలను వేషాలు వేసి బతికేవాళ్ళు అడ్డుకోవాలనుకోవడం భ్రమ. అది వాళ్ళ వృత్తి. నిజానికి సినిమా రంగంలో చిల్లర వేషాల్లో తప్ప బ్రాహ్మణులు పెద్దగా కనిపించరు. బ్రాహ్మణులు అందివచ్చిన అవకాశాల్ని ఉపయోగించుకుని సృజనాత్మక కళారంగాలు వదిలి మిగతా వృత్తులలోకి మారిపోయారు. చదువుకున్న వాళ్ళు ఉద్యోగాల్లో, డబ్బులున్న వాళ్ళు వ్యాపారాల్లో, వారసత్వ బలమో బలగమో ఉన్న వాళ్ళు రాజకీయాల్లో స్థిరపడిపోయారు. ఒక రకంగా ఇప్పుడు సినిమా రంగంలో మిగతా కులాల్లాగే బ్రాహ్మలూ మైనారిటీలే. వాళ్ళు చాలా కాలం కిందే వదిలేసిన రచ నా వ్యాసంగంలో శూద్ర కులాల్లోని సృజనశీలురు చేరిపోయారు. అయినంత మాత్రాన బ్రాహ్మణులను కించపరచవచ్చా అన్నది మనం ఆలోచించాల్సిన విషయం. నిజానికి ఏ కులాన్ని గానీ కులవృత్తిని గానీ కించపరిచే విధంగా చిత్రించడం అవివేకం, హక్కుల ఉల్లంఘన కూడా. అది బ్రాహ్మణులైనా, దళితులైనా, ఇతర ఏ కులమైనా వర్తించవలసిన నియమం. కానీ తెలుగు సినిమా నీతి నియమాలను వదిలేసి ఇప్పుడు పూర్తిగా కార్పొరేట్ వ్యాపారమై కూర్చుంది. ఇప్పుడు తెలుగు సినిమా ఒక బ్రాండ్స్ ఫ్యాక్టరీ! ఆ నాలుగు కుటుంబాల్లోని వారసులను బట్టి కథలు, వాళ్ళ రేంజ్‌కి తగిన మాటలు, పాటలు ఆ మేరకు వందల కోట్ల పెట్టుబడి దానినుంచి వేలకోట్ల వ్యాపారం.

వ్యాపారంలో లాభానష్టాలే ఉంటాయి తప్ప నైతిక విలువలు ఉండవు. సినిమా కూడా అంతే. కానీ ఇప్పుడు బ్రాహ్మణులు అందులో నీతి ఉండాల ని అంటున్నారు. అది ఒక రకంగా అత్యాశే అవుతుంది. ఎందుకంటే ఒకప్పటిలా సమాజం ఎలా ఉండాలో శాసించే స్థాయిలో ఇప్పుడు బ్రాహ్మణులు లేరు. పైగా సమాజంలోని చాలా వర్గాలకు బ్రాహ్మణులు చాలా దూరంగా ఉంటూ వచ్చారు. పైగా ఇప్పుడు బ్రాహ్మణ వ్యతిరేక భావజాలం బలపడడం కూడా ఒక కారణం. బ్రాహ్మణవాద విలువలకు, బ్రాహ్మణీయ సంస్కృతికి వ్యతిరేకంగా కూడా చాలా సినిమాలే వచ్చాయి. స్వయంగా ఎన్టీఆరే పలు సినిమాలు బ్రాహ్మణీయ విలువలను విమర్శిస్తూ యమగోల వంటి పలు సినిమాలు తీశారు. అప్పుడు కూడా వ్యతిరేకత వచ్చినా ఆ సినిమాల్లో ఆయన భావజాల విమర్శ చేశారు తప్ప వెకిలి తనంతో బ్రాహ్మణులను అవమాన పర్చలేదు.అడ్డదిడ్డంగా మాట్లాడలేదు. కానీ ఇప్పుడు మోహన్‌బాబు మాత్రం ఆ పని చేస్తున్నాడు. బ్రాహ్మణుల సామాజిక బలహీనత ఆయనకు అర్థమయ్యింది.

దేశంలో సినిమా రంగానికి ఉన్న స్వేచ్ఛ మరే రంగానికీ లేదు. ఎవరైనా ఎలాంటి సినిమాలైనా తీయవచ్చు. సెన్సార్ సర్టిఫికేట్ ఉంటే చాలు ఎక్కడైనా ప్రదర్శించుకోవచ్చు. మన సెన్సార్ బోర్డు పూర్తిగా రాజకీయ నాయకుల తాబేదార్లతో, ప్రొడ్యూసర్‌ల ఏజెంట్లతో, బ్రోకర్లతో నిండిపోయింది. అందు లో విలువల గురించి ఆలోచించే వాళ్లున్నా వాళ్ళ మాట చెల్లుబాటు కాదు. ఒక దశలో సెన్సార్ బోర్డ్ దేనికైనాడీ సినిమాను ఆలస్యం చేసింది. కానీ మోహన్‌బాబు తనదైన శైలిలో సెన్సార్ బోర్డ్ మీద విరుచుకుపడ్డారు. దీంతో సెన్సార్‌బోర్డులో ఉన్న బ్రాహ్మణ సభ్యులు కూడా కళ్ళు మూసుకుని సినిమాను చూసి నోరు మెదపకుండా విడుదల చేశారు. సినిమా కేవలం వ్యాపారమే పరమావధిగా ఉండదు. కీలకమైన విషయాల పట్ల సమాజపు ఆలోచ నా ధోరణిని మార్చే ప్రయత్నం కూడా చేస్తుంది. చాలా సినిమాల్లో ఒకానొక ముస్లిం పేరుతో విలన్ ఉంటాడు.

అత డు దుబాయిలో ఉండే డాన్ అని సినిమాలో చెప్తున్నా అంతర్లీనంగా అటువంటి ముస్లింలు మన అంతర్గత భద్రతకు ముప్పు అనే సందేశం అందులో ఉంటుంది. అటువంటి ప్రయత్నమే తెలంగాణ విషయంలో కూడా అనేక సినిమాల్లో జరిగింది. తాజాగా కెమెరామెన్ గంగతో రాంబాబు అనేక పాత్రల్లో, సంభాషణల్లో, సన్నివేశాల్లో తెలంగాణవాదాన్ని,వాదుల్ని చీల్చిచెండాడే ప్రయత్నం చేసింది. ఒక్క సినిమాలే కాదు, మొత్తం మీడి యా ఇప్పుడు తెలంగాణ అనేది ఒక సమస్య అనే భావిస్తున్నాయి తప్ప అది అనేక చారివూతక సమస్యలకు, తప్పిదాలకు పరిష్కారమని చెప్పలేకపోతున్నాయి.

ఒక రకంగా బ్రాహ్మణులు ఒక కులంగా సామాజిక వర్గంగా హక్కులకోసం ఆత్మ గౌరవం కోసం పోరాడుతున్నప్పుడు వారికి మద్దతునివ్వడం ప్రజాస్వామిక లక్షణం. కానీ వారికి ఆశించినంత మద్దతు దొరకకపోవడం విచారకరం. సమాజంతో బ్రాహ్మణులు మమేకం కాకపోవ డం కూడా ఇవ్వా ళ వారిది ఒంటరి పోరాటం కావడానికి కారణం. తెలుగు సినిమాల్లో అశ్లీలత రెండు మూడు దశాబ్దాలుగా వెర్రితలలు వేస్తూనే ఉన్నది. స్త్రీని భోగ వస్తువు గా మాత్రమే చూపే సినిమాలు, వాటికి వ్యతిరేకంగా అనేక రూపాల్లో పోరాటాలు జరిగాయి. చైతన్యవంతమైన మహిళా సంఘాలు, విద్యార్థి వర్గాలు వీటికి వ్యతిరేకంగా పోరాడుతూనే ఉన్నాయి. ఆ సందర్భంగా ఒక్క బ్రాహ్మణులే కాదు, కుల సంఘాలేవీ అందులో క్రియాశీలంగా పాల్గొన లేదు. మన సమాజానికి స్త్రీని అసభ్యంగా చూపిస్తే ఎదిరించే శక్తి లేదు. అటువంటి స్పృహ ఉంటే ‘వుమెన్ ఇన్ బ్రాహ్మనిజం’ వంటి సినిమా వచ్చేది కాదు. కేవలం బ్రాహ్మణ స్త్రీలనే కాదు, ఏ స్త్రీని కూడా అలా చూపకూడదన్న సార్వజనీన విలువ గానీ, అటువంటి ప్రయత్నాలకు మద్దతు గానీ లేకపోవడం వల్ల అటువంటి సినిమాలు వస్తున్నాయి.

అలాగే దళితులనో, మిగతా వృత్తుల వాళ్లనో కించపరుస్తూ సినిమాలు తీసినప్పుడో, వార్తలు రాసినప్పుడో బ్రాహ్మణులు కూడా వాటిని వ్యతిరేకించి ఉంటే, అటువంటి ప్రయత్నాలను వ్యతిరేకిస్తూ సాగిన పోరాటాల్లో బ్రాహ్మణులు కూడా భాగస్వాములై ఉంటె ఇవాళ బ్రాహ్మ ణ సంఘాల ప్రయత్నానికి మరింత బలం చేకూరేది.కేవలం సినిమాల్లోనే కాదు మొత్తం సామాజిక రాజకీయ రంగాల్లో బ్రాహ్మణులు ఒంటరివాైరై పోతున్నారు. ఇటువంటి వివాదాలు తలెత్తినప్పుడు జోక్యం చేసుకోవలసినవూపభుత్వం చోద్యం చూస్తున్నది. గతంలో అనేక సందర్భాల్లో సినిమాల పట్ల అభ్యంతరాలు వ్యక్తమైనప్పుడు ప్రభుత్వం జోక్యం చేసుకుని ఆ సినిమాలను నిలిపివేసిన సందర్భాలున్నాయి. ప్రభుత్వం స్వయంగా ఏర్పాటు చేసిన అధికారుల కమిటీ ఆ సినిమా చూసి అభ్యంతరాలు నిజమేనని చెప్పినప్పటికి ప్రభుత్వం జోక్యం చేసుకోకుండా ఈ వ్యవహారం కోర్టుకు వెళ్లేదాకా మిన్నకుండిపోయింది. ఇది బ్రాహ్మణుల రాజకీయ బలహీనతను సూచిస్తున్నది. బ్రాహ్మణ మేధావులు కూడా ఇప్పుడు బ్రాహ్మణుల గురించి మాట్లాడడం అంటేనే భయపడుతున్నారు. బహుశా రెండు మూడు దశాబ్దాలుగా జరుగుతున్న సిద్ధాంత చర్చలు, కులవ్యవస్థ వ్యతిరేక ఉద్యమాలు అవి వ్యాపింప చేసిన భావజాలం కారణంకావచ్చు.

అవేవీ బ్రాహ్మణులకు వ్యతిరేకం కాదు. ఆ భావజాలానికి వ్యతిరేకం. కులం పుట్టుకకు కారణాలు ఎలావున్నా ఆ కులా న్ని పోషించడంలో, కాపాడడంలో రాజ్యంతో పాటు ఇతర కులాల పాత్రను విస్మరించలేము. బ్రాహ్మణులు ఈ సమాజంలో భాగం. పౌరులకు లభించే అన్నిహక్కులు బ్రాహ్మణులకు కూడా ఉంటాయి. రాజ్యాంగం పౌరులకు కల్పించిన హక్కులన్నీ బ్రహ్మణులకు కూడా ఉంటాయి. ఉండాలి. అటువంటి ప్రజాస్వామిక ధోరణి అలవాటు కాకపోవడం వల్లే ఇవ్వాళ బ్రాహ్మణులు ఏకాకులుగా మిగిలిపోయారు. రేపు ఎవరినైనా ఏ కాకులు చేయగలిగే సత్తా ఈ పెట్టుబడికి, ఉన్నది. అది గమనించాలి. 
-ఘంటా చక్రపాణి
సమాజశాస్త్ర ఆచార్యులు, రాజకీయ విశ్లేషకులు
ghantapatham@gmail.com

---నమస్తే తెలంగాణ నుంచి