Wednesday 25 August 2010

"రహస్య గూఢాచారి aka కణిక నీతి" (డా విన్‌చీ కోడ్ కు స్వేచ్చానువాదం)

గోల్కొండ కోటలో తానీషా జైలు దగ్గర ఉండే వాచ్‌మన్ ఒకరోజు హఠాత్తుగా మరణిస్తాడు. ఎవరో అతన్ని తుపాకీతో కాల్చివేశారు. ఆ తరువాత బుల్లెట్ గాయంతో వాచ్‌మన్ 10 మీటర్లు నడిచి ఒక బురుజు దగ్గర హిందీ 'ర ' ఆకారంలో ముడుచుకుని ప్రాణం విడుస్తాడు. అప్పుడే ప్రఖ్యాత కుట్రకోణాల స్పెషలిస్టూ గోల్కొండ కోట చూడ్డానికి వస్తుంది. పోలీసులు ఆవిడే వాచ్‌మన్ను చంపిందేమో నని వెంబడిస్తారు.

ఆ తరువాత వరుసగా భీమోజి ఫిల్మ్ సిటీలో ఒక తోట మాలీ, తానియా గాంధీ సెక్యూరిటీ వాడూ, కిద్వానీకి అంట్లు తోమే వాడూ, టాటా కారు డ్రైవరూ అంతా ఒకేసారి హత్య కావించబడుతారు.

తనపై వచ్చిన నేరారోపణని తుడిచేయడం కోసం, ఈ నాలుగు హత్యల రహస్యం తెలుసుకోవడం కోసం హీరోయిన్ అయిన కుట్రకోణాల స్పెషలిస్టూ ప్రయత్నం చేస్తుంది. తన పరిశోధనలో తెలిసేదేమంటే భారత దేశం ఆర్ధిక, రాజకీయ, ఇతిహాసాలపై నాలుగు వందల సంవత్సరాలుగా ఒక మహా కుట్ర జరుగుతుంటుంది. ఈ కుట్ర ఒక కణిక వ్యవస్థ నడుపుతుంటుంది. వీరంతా ఒక నెట్ వర్క్ లాగా ఏర్పడి తరతరాలుగా ఈ రహస్యాన్ని తరువాతి తరాలకి అందిస్తూ ఉంటారు.

వీరి కుట్ర యొక్క రహస్యం ఇంకో రహస్య గ్రూపుకి తెలిసి ఉంటుంది. ఈ రెండో రహస్య గ్రూపు కణిక వ్యవస్థలో ఒక్కొక్కరి ఇంటిలో పని వారు గానూ, వాచ్మన్, కారు డ్రవరుల్లాగా ఉంటారు. కణిక వ్యవస్థ నాయకుడైన భీమోజీకి ఈ రహస్యం తెలిసి ఒక కాంట్రక్ట్ కిల్లర్ ద్వారా అందరినీ ఒకే సారి చంపేస్తాడు. ఇప్పుడు ఆ రహస్యం తెలిసిన వారంతా చనిపోయారు, మరి మన కధానాయకురాలు ఈ రహస్యాన్ని ఎలా చేదిస్తుంది?

ఈ రహస్యాలను తెలిసిన భీమోజీ పత్రికలోని ఒక రిపోర్టర్ చిన్న చిన్న క్లూలను మనకు అందిస్తూ ఉంటాడు. అవి న్యూస్ హెడ్డింగులు గానూ, కార్టూన్ల రూపంలోనూ, అంతర్యామి లాంటి కాలంలలోనూ కనిపిస్తూ ఉంటాయి.

మధ్యలో ఫ్లాష్ బాక్ లో హీరోయిన్ హీరో ల సంభాషణ ద్వారా తెలిసేదేమంటే ఈ కణిక నెట్‌వర్క్ ఇప్పుడు మొదలు కాలేదు, బ్రిటిషు వారు ఇండియాను ఆక్రమించుకోవడానికీ, ఇందిరా గంధీ, రాజీవ్ గాంధీ ల హత్యలకీ, 911 సంఘటనకీ అన్నింటికీ మూలం ఈ కణిక వ్యవస్థే. త్వరలో విడుదల, గొప్ప అద్భుత థ్రిల్లర్.