Showing posts with label రాజకీయాలు. Show all posts
Showing posts with label రాజకీయాలు. Show all posts

Monday, 15 August 2011

లేని హక్కుల సాధనకోసం, హక్కులను కాలరాయడం కోసం ఉద్యమాలు


ఉద్యమాలు, నిరశనలు అనేవి ప్రజాస్వామ్య దేశంలో ప్రజలు తమ హక్కుల సాధనకోసం ఉపయోగించే ఆయుధాలు. ప్రజలు ప్రజాస్వామ్యంలో తమందరి తరఫునా నిర్ణయాలు తీసుకోవడం కోసం కొందరు ప్రతినిధులను గెలిపించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయిస్తారు. అలాంటి ప్రభుత్వం తమ న్యాయమైన హక్కులను కాలరాస్తే మనకు ఆప్రభుత్వాన్ని వెంటనే దించివేసే హక్కులేదు, ఐదేళ్ళదాకా ఆగాల్సిందే. కనుక ప్రజలు తమ హక్కుల సాధనకోసం ఉద్యమాలు, నిరశనలు చేస్తారు. ఈనిరశనలు బందులూ, రాస్తారోకోలూ, సమ్మెలూ లాంటి అనేక విధానాలద్వారా చేస్తారు.

అయితే ప్రజలు లేని హక్కులకోసం ఉద్యమాలు చేస్తే అది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చెయ్యడమే. ఇప్పుడు మన రాష్ట్రంలో జరుగుతోందదే. ఆరోజోన్లో ఉద్యోగాలు ఆరోజోన్ వాసుల హక్కు. దానికోసం సీమాంధ్ర వారు బందులు చెయ్యడం, ఉద్యమాలు చెయ్యడం తమకు లేని హక్కును కోరడమే కాక ఆరోజోన్ ప్రజల హక్కులు హరించడమే. ఈసాంప్రదాయం ఇలాగే కొనసాగితే రేప్పొద్దున రాజస్థాన్ రాష్ట్రప్రభుత్వ ఉద్యోగాలకోసం కూడా ఇదే సీమాంధ్రులు ఉద్యమాలు చెయ్యగలరు..రాజస్థాన్ వారికి మాత్రం తమ ప్రభుత్వోద్యోగాల్లో అర్హత ఇస్తే ఒప్పుకోరు. ఇలాంటి అన్యాయపు డీమాండ్లను కొందరు చెయ్యడం, వారికి కొందరు రాజకీయ నాయకులు వత్తాసు పలకడం క్షమించరాని నేరం.

అసలు సమైక్యవాదులు అని చెప్పుకునే వారు చేసే ఉద్యమమే ఒక హాస్యాస్పద ఉద్యమం. దీనికి అబద్దాలను జోడించి కావూరి సాంబశివరావు లాంటి నేతలు తెలంగాణవారు తెలంగాణ కావాలనుకుంటే సీమాంధ్రలో ప్రజలంతా రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుకుంటున్నారు కాబట్టి రాష్ట్రాన్ని విడదియ్యడానికి వీల్లేదని చెప్పడం హాస్యాస్పదం. ముందుగా సీమాంధ్రలో అందరూ సమైక్యరాష్ట్రాన్ని కోరుకోవడమే పచ్చి అబద్దం, ఇక ఒకవేళ ఇది నిజమనుకున్నా రాష్ట్రాన్ని కలిపి ఉంచాలని ఒక్కపక్షం వారే నిర్ణయించలేరు, అదివారి హక్కు కాదు.

ఒకభాగస్వామ్యం నచ్చనప్పుడు ఒకభాగస్వామి నాకీ పొత్తు నచ్చడం లేదు, నేను విడిపోతాను అని చెప్పగలడు, అలా చెప్పేహాక్కు ఒకభాగస్వామికి ఉంటుంది. అప్పుడు మరో భాగస్వామి మాత్రం విడిపోవడానికి వీల్లేదు, మనం కలిసే ఉండాలి అని చెప్పే హక్కు ఉండదు, ఉండేహక్కల్లా విడిపోయే పక్షంలో తన సమస్యలను పరిష్కరించుకోవడమే.

ఒకవేళ ఇద్దరు భాగస్వాములూ కలిసే ఉందామని ఇష్టపడుతున్నా ఎవరైనా బలవంతంగా విడగొడుతుంటే అప్పుడు ఇద్దరు భాగస్వాములూ కలిసి మేం కలిసే ఉంటామని చెప్పడం ఒక హక్కవుతుంది. దానికోసం, బలవంతపు విభజనకు వ్యతిరేకంగా ఇరు పక్షాలూ కలిసి ఉద్యమించవచ్చు. కానీ ఒక పక్షం వారంతా మేం విడిపోతాం మొర్రో అంటుంటే లేదు మీరు కలిసే ఉండాలని చెప్పడం హక్కు కాదు కదా, ఎదుటి వారి హక్కులను కాలరాయడమే.

ఇలా ఎదుటివారి హక్కులను హరించే ఉద్యమాలను కొందరు చదువుకున్నవారు కూడా సమర్ధించడం, దానికి రాజకీయనాయకులు వత్తాసు తెలపడం మాత్రమే కాక ఆనాయకులే ఇలాంటి ఉద్యమాలను సృష్టించడం మనదేశంలో ప్రజాస్వామ్య భావనకే ఒక దెబ్బ. ఇలాంటి దొంగ ఉద్యమాలను లేవదీసేవారు ఎంతమాత్రం క్షమార్హులు కారు.

Friday, 6 May 2011

పోలవరం మోసం

పోలవరం ప్రాజెక్టు గురించి తెలియని తెలుగువారుండరు. రాష్ట్రానికి చెందిన అధికార, ప్రతిపక్ష నేతలు రోజూ ఎక్కడో ఒక చోట పోలవరానికి జాతీయహోదాలు ఇవ్వాలని డిమాండ్లు చేస్తారు. ఇప్పటికే పోలవరం కోసం చిరంజీవి ఒక యాత్ర చేయగా జగన్ ఒక లక్ష(?)దీక్ష చేశాడు. ఎలాంటి అనుమతులూ లేక ఒక రాష్ట్రం ఈప్రాజెక్టుపై కేసుపెట్టినప్పటికీ, భవిష్యత్తులో అనుమతులు లభించేది అనుమానాస్పదమయినప్పటికీ ఇప్పటికే రాష్ట్రప్రభుత్వం ఈప్రాజెక్టుపై కోట్ల రూపాయల ప్రజాధనాన్ని గుమ్మరించింది.

"Down to Earth" సైన్స్ అండ్ ఎన్విరన్మెంట్ పత్రిక వారు polavaram fraud అనే ఒక కధనాన్ని ప్రచురించారు. వారి కధనాన్ని ఇక్కడ చదవవచ్చు.

Monday, 18 April 2011

మంత్రాలు చదివేది ఎక్కడివారయినా చింతకాయలు రాలవు!!

కేసీఆర్ గారూ, ఒకపక్క ఉద్యమం ఊపుమీద నడుస్తున్న సమయంలో తాబేలు లాగా అగ్నాతంలోకి వెల్లి చండీయాగం అంటూ తంతులతో కాలక్షేపం చేసింది చాలక పైగా ఆంధ్రా బ్రహ్మలకు నిష్ట తక్కువ, తెలంగాణా బ్రహ్మణులకు నిష్ట ఎక్కువ అంటూ అవాకులు పేలడం దేనికోసం? ఏం, తెలంగాణా అర్చకులు నిష్టతో చదివితే చింతకాయలేమన్నా రాలుతున్నాయా, ఆచింతకాయలతో తెలంగాణా సాధిస్తారా?

ఒకపక్క విమలక్క ధైర్యంగా వెల్లి లగడపాటి లాంకో హిల్స్‌లో జెండాలు పాతితే, మీరేమో ఇంట్లో కూర్చుని యాగాలు చేస్తారు కానీ కబ్జా భూములగురించి మాట్లాడరు. మాట్లాడ్డానికి ఇప్పుడు తెలంగాణాలో సవాలక్ష కారణాలు ఉన్నాయి. ఒక శ్రీక్రిష్ణ కమిటీ ఎనిమిదో అధ్యాయం గురించో, ఒక 177జీవో గురించో, కబ్జాకు గురవుతున్న భూముల గురించో మాట్లాడక ఎందుకు ఈ బ్రాహ్మల సంగతి? మీరు మంచి వక్త. ఏ విషయాన్ని ఎత్తుకున్నా అనర్గళంగా మాట్లాడగలరు. నిజానికి ప్రస్తుతం రాష్ట్రంలో తెలుగూ, ఇంగ్లీషు, హిందీ, ఉర్దూ భాషలన్నింటిలో అణర్గళంగా మాట్లాడగలిగేది మీరొక్కరే. అలాగే మాట్లాడేప్పుడు ముక్కుసూటిగా విషయాన్ని కుండబద్దలు కొట్టినట్లు చెప్పగలిగేదీ, వాదనకు కావలిసిన పాయింట్లను చటుక్కున పట్టుకోగలిగేదీ ఇంకెవరూ లేరు. మరి ఎందుకు ఇలా అనవసర విషయాలపై మాట్లాడి నాలుక కరుచుకునేది? బిర్యానీ గురించీ, అర్చకుల గురించీ వదిలేసి విషయం చూడండి.

Thursday, 31 March 2011

రామోజీ షేరుధర ఐదులక్షలా?

రామోజీరావు తన ఈనాడు వందరూపాయల షేరునొ ఒక్కోటి రు.5,28,630/- కు అమ్ముకోగా సాక్షి 10రూపాయల షేరును 350/- కు అమ్ముకుంటే తప్పేంటి?" ఇది సాక్షిలో పెట్టుబడులను సమర్ధిస్తూ వైఎస్సార్ అసెంబ్లీలో చెప్పిన సమాధానం, జగన్ సమర్ధీకులు నిత్యం టీవీల్లో కోడై కూసే విషయం, సాక్షి అనేకసార్లు తన పేపర్లో పెట్టుబడులను సమర్ధించుకుంటూ రాసుకున్న విషయం, ఇవ్వాల్టితో సహా. ఇంతకూ ఒకషేరుధర 5 లక్షలు అయితే ఎక్కువ ధర పెట్టినట్టు, రు. 350అయితే తక్కువ ధర పెట్టినట్లా? ఈ లెక్కన టెక్‌మహింద్రా షేరు ధర 670, విప్రో షేరుధర 450 కాబట్టి టెక్‌మహింద్రా విప్రోకంటే పెద్ద కంపెనీ అవుతుందా?

ఒక కోటి రూపాయల విలువైన వ్యాపారాన్ని నాలుగు వాటాలు చేస్తే ఒక్కో షేరు ధర 25 లక్షలు, అదే నాలుగు లక్షల వాటాలు చేస్తే ఒక్కో షేరు ధర 25 రూపాయలు. ఈవ్యాపారంలో పావలా వంతు ఎవరికైనా అమాలంటే ఒక్క 25లక్షల షేరు అమ్మినా, లేక లక్ష 25/-ల షేర్లు అమ్మినా తేడా ఏమీ వుండదు. కాబట్టి షేరు ధర ఎంత అనే వాదన అనవసరం, ఎంత వాటాను ఎంత ధరకు అమ్మాడనేదే అక్కడ ముఖ్యం. మరలాంటప్పుడూ అదేపనిగా అసెంబ్లీలోనూ, టీవీల్లోనూ ఇలా రామోజీ 5లక్షలకు ఒక షేరును అమ్మగా సాక్షి ఒక షేరును 350కి అమ్మితే తప్పేమిటని వాదన ఎందుకు?

రామోజీ తన ఉషోదయా పబ్లికేషన్స్‌లో 26 శాతం వాటాను సుమారు వెయ్యిఖోట్లకు అమ్ముకున్నాడు. ఈలెక్కన ఉషోదయ పబ్లికేషన్స్ మొత్తం విలువ నాలుగు వేలకోట్లు. ఈనాడుకు ఉన్న సర్క్యులేషన్‌కు, లాభాలకు, డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్‌కూ కలిపి బహుసా అంత విలువ ఉండొచ్చు. సాక్షి ఏ ఇరవైఐదేల్లనుంచో ఉన్న పేపర్ కాదు, ఇప్పుడే మొదలయింది. అందులో వాటాదారులందరికీ వారివారి పెట్టుబడులను బట్టి సుమారు అదే రేషియోలో వాటా రావాలి. కాబట్టి సాక్షి తన పెట్టుబడులను సమర్ధించుకోవాలంటే అందులో తన పెట్టుబడి ఎంత, అందుకు తన వాతా ఎంత, మిగతా వారి పెట్టుబడీ ఎంత, వారి వాటా ఎంత అనే విషయం చెప్పాలి, అంతే కానీ ఇలా అవసరంలేని, ప్రాముఖ్యత లేని షేరు ధరలు మాట్లాడి సమర్ధించుకుంటే ఏం లాభం లేదు. అయితే ఈవిషయంలో మన ముఖ్యమంత్రులూ, మత్రులూ, మీడియా తమ మోసాల్ను కప్పిపుచ్చుకోవడానికి ఎంత చక్కగా, నిస్సిగ్గుగా అబద్దాలను చెప్పి నిజాలను మసిపూసి మారేడుగాయలు చేస్తాయో మాత్రం తెలుస్తుంది. ఇలాంటి చర్చలు జరిగే అసెంబ్లీలో చర్చలకు ఉన్న విలువెంత? అలాంటి అసెంబ్లీలో విషయాలు చర్చిస్తే ఉపయోగమెంత?

Monday, 28 March 2011

డ్రైవర్ మల్లేష్, మంత్రి వివేకా

అసెంబ్లీ ఆవరణలో ఒక ఎమ్మెల్యేపై చిన్న దెబ్బ వేసినందుకు డ్రైవర్ మల్లేష్ పాపం అరెస్తయ్యాడు. ఏం కేసులు పెట్టారో, ఎప్పుడు వదులుతారో తెలియదు.

అసెంబ్లీ లోపల ఒక ఎమ్మెల్యేపై నేడొక మంత్రి చెయ్యిచేసుకున్నాడు. మరి ఇప్పుడు మంత్రిపై ఏం కేసులు పెడతారు? మంత్రిని అరెస్టు చేస్తారా? చట్టం సామాన్యుడిపై మాత్రమే అమలు, మంత్రులు చట్టాలకు అతీతులా?

Friday, 25 March 2011

మేధావి వర్గం వివక్షాధోరణి

"చెడ్డవారి దుర్మార్గం కంటే మంచివారి మౌనం ప్రమాదకరం" ఇది మన మేధావివర్గ రాజకీయనాయకుడు జేపీగారు పదేపదే వినిపించే డైలాగు. జేపీగారూ, వినండి: మంచివారి మౌనం కంటే కూడా మేధావివర్గం వివక్షాధోరణి ప్రమాదకరం. ఈ మేధావి వర్గం వారిమాటలతో ప్రమాదం ఎంతంటే వీరుమాట్లాడే నీతులన్ని వింటుంటే ఎంతో బాగున్నట్టుగా ఉంటాయి, నిజమే సుమీ ఎంత అన్యాయం జరుగుతుందీ అనిపిస్తుంది. కానీ వీరి నీతులు చాలా సెలెక్టివ్‌గా ఉంటాయి. తామకు ఎవరు నచ్చకపోతే వారికి మాత్రమే నీతులు వినిపిస్తారు, తమకు నచ్చిన వాడు లేదా తనకంటే బలంగా ఉండి తను నీతులు చెబితే రెండు తగిలించే వాడికి మాత్రం వీరు నీతులు చెప్పరు. చెడ్డవారి దుర్మార్గం సామాన్యుడి బ్రతుకులను మాత్రమే అణచివేస్తాయి, మేధావుల వివక్ష సామాన్యుడి మనసులనే మానిపులేట్ చేస్తాయి.

మన మేధావినాయకుడు జేపీ విగ్రహాలకూల్చివేత సందర్భంగా అరగంటసేపు అసెంబ్లీలో చానా ఆవేశంతో, మధ్యమధ్యలో జాషువా పద్యాలతో, గురజాడ కవిత్వాన్ని ఉపయోగిస్తూ మాట్లాడాడు. కాస్త న్యూట్రల్‌గా ఉంటూ కాస్త విషయాలను గూర్చి పెద్దగా లోతుకు వెల్లని సామాన్య జనం విని ఆహా ఎంతబాగా మాట్లాడాడు జేపీ, ఇది విని కూడా ఫలానా వారికి బుద్ధిరాదేమో అనుకునేలా మాట్లాడాడు. మరి ఇదే పెద్దమనిషి దేశంలోని అతున్నత న్యాయస్థానంలో న్యాయమూర్తిగా పనిచేసిన వ్యక్తి అధ్యక్షతన తెలంగాణా విషయంపై నిజానిజాలు తేల్చమని ఒక కమిటీ వేస్తే ఆ కమిటీ ఉద్యమాన్ని ఎలా అణచివెయ్యాలి, నాయకులను ఎలా కొనాలి, మీడియాను ఎలా మానిపులేట్ చెయ్యాలి అన్న పాఠాలతో ఒక కుట్రపూరితమైన రిపోర్టును వండితే దానిపై మాత్రం అసలేం స్పందించడు. రాష్ట్ర హైకోర్టు కమిటీ అలాంటి రిపోర్టును ఇచ్చినందుకు నిందిస్తే ఇతనికి మాత్రం పట్టదు.

ఉస్మానియా విద్యార్థులను రాక్షసంగా హాస్టల్లలో బంధించి గంటలతరబడి కొడితే రాష్ట్ర హైకోర్టు ఇది మానవహక్కుల ఉల్లంఘన అని చెప్పినా ఇతను మాత్రం అసలేం స్పందించడు. పైగా ఒక టీవీ షోలో మాట్లాడుతూ తెలంగాణాలో విద్యార్థుల ఆత్మాహుతిని చాలా తక్కువగా చేస్తూ ఈ దేశంలో రోజుకు ఎంతమంది ఆత్మహత్యలు చేసుకోవడంలేదు అని వాఖ్యానిస్తాడు. అప్పులకు తట్టుకోక చేసుకొనే రైతు ఆత్మహత్యలకూ, ఉద్యమంలో ఆత్మాహుతి చేసుకునే వారికీ ఈయన దృష్టిలో తేడా ఏంలేదు. ఒక తెలంగాణా సగటుపౌరుడు ఈయన నెత్తిపై ఒకటి ఇచ్చినతరువాత కూడా ఈయన తనవివక్షను మానుకోలేదు.

ఇక మన సీపీఎం మేధావులు మరోతీరు. ఊరందరిదీ ఒకదారైతే ఉలిపికట్టెది మరో దారన్నట్లు వీరి మార్క్సిస్టు మేధస్సు ఎప్పుడూ అడ్డదిడ్డంగానే ఆలోచిస్తుంది. వీరిదృష్టిలో హిందువులకు కొమ్ముకాసేవారు మతతత్వ శక్తులు, ముస్లిములకు కొమ్ముకాసేవారు మాత్రం కాదు. రాష్ట్ర హైకోర్టు శ్రీక్రిష్ణ రిపోర్టు ఎనిమిదో అధ్యాయాన్ని కమీషను తమ విధులను విస్మరించి కొందరికి కొమ్ముగాస్తూ రాసిందని చెప్పి రిపోర్టును బహిర్గతం చెయ్యాలని తీర్పిస్తే ఈ సీపీఎం మేధావులు క్రిష్ణకమిటీని తప్పు పట్టరు, తీర్పిచ్చిన న్యాయమూర్తిని తప్పుపడతారు. పైగా మీడియానూ, పార్టీలనూ మేనేజ్ చెయ్యాలనే అనైతికమయిన పనులను చెప్పిన రిపోర్టును సమర్ధిస్తూ ఇవన్ని ఎవరికీ తెలియని విషయాలంటూ విషయాన్ని పలుచన చేస్తారు.

Wednesday, 9 March 2011

నాగంకు పొగ పెడుతున్న బాబు

పొమ్మనకుండా పొగ పెట్టడం ఎలాగో నేర్చుకోవాలంటే ఎవరైనా చంద్రబాబుదగ్గరే నేర్చుకోవాలి. ఎప్పుడూ ఎవరినీ పార్టీనుంచి తనుగా గెంటెయ్యడు, కానీ చల్లగా పొగపెట్టి వారికి వారే వెల్లిపొయ్యేలా చేస్తాడు. అందులోనూ తనపర్టీలో ఎవరయితే కాస్త సొంతంగా ఎదిగి ప్రజాబలం కూడగట్టుకొని తనకు భవిష్యత్‌లో ఎదురు తిరగొచ్చనే అనుమానం వస్తుందో వారిపైన తప్పకుండా పొగ పెడతాడు.

బాబుకు తాను ముఖ్యమంత్రినయినప్పటినుంచీ "నంబర్ టూ ఫోబియా" వచ్చింది. ఎవరయినా పార్టీలో కాస్త పలుకుబడి సంపాదించుకుని తనతర్వాతి స్థానంలోకి వస్తారో వారిని అస్సలు నమ్మడు. ఎక్కడ తను తన మామకు ఎసరు పెట్టినట్టు తనకు ఎసరు పెడతారేమోనని మెల్లగా అతన్ని పార్టీలో ఒంటరివాన్ని చేసి తనకు తానుగాగా వెల్లిపోయేట్లు చేస్తాడు. ఇన్నిరోజులూ కాంగ్రేసును తిట్టిపోసినవారు కాంగ్రేసులోకి ఎలాగూ వెల్లలేరు, వేరే ఇంకేదయినా పార్టీలోకి వెల్లినా లేక పొరపాటున కాంగ్రేసులోకే వెల్లినా అక్కడ ఇమడలేక తరువాత మల్లి తెదేపా లోకే వస్తారు, ఈసారి పార్టీలో తక్కువ ర్యాంకులో చేర్చుకున్నా మాట్లాడరు అనేది అతని ధీమా. ఇటీవలి కాలంలో దేవేందర్ గౌడ్ మంచి ఉదాహరణకాగా ఇంతకుముందు ఇలాగే హరిక్రిష్ణనూ, దగ్గుపాటినీ నట్టేట్లో ముంచాడు.

తెలంగాణా తెదేలో పెద్దలీడరుగా చలామణీ అవుతూ వైఎస్సార్ ఉన్నప్పుడు అయిదేల్లు పార్టీకి పెద్దదిక్కుగా ఉండి వైఎస్సార్‌పై పోరాటం చేసిన నాగంకు ఇప్పుడు రేవంత్ రెడ్డి, మొత్కుపల్లి, దేవేందర్ లాంటి వారిని ఎగదోసి పొగపెడుతున్నాడు. రేవంత్ రెడ్డి ఒక జూనియర్ కాగా మొత్కుపల్లి, దేవేందర్ ఇప్పటికే పార్టీ బయటికి వెల్లి దిక్కులేక తిరిగొచ్చినవారు కాబట్టి వాల్లతో తన ఆధిపత్యానికి ఢోకా ఉండదు, అదే నాగం అయితే తెలంగాణాలో తనను ఎదిరించగలడనేది అతడి ఆలోచన కావొచ్చు.

అయితే ప్రస్తుతం తెలంగాణాలో తెదేపా పరిస్థితి ఇంతకుముందు దేవేందర్‌ను పంపించినప్పటిలా లేదు. చంద్రబాబు పర్యటనకెల్తే తెలంగాణా ప్రజలిప్పుడు చెప్పులతో కొడతారు. కనీసం తెలంగాణాలో ఎక్కడయినా పార్టీ మీటింగ్ జరిగితే చంద్రబాబు ఫోటోకూడా పెట్తడం లేదు. ఇలాంటి పరిస్థితిలో నాగంకు పొగబెట్తడం తెదేపాకు ఆత్మహత్యే. కనీసం రిజిష్తర్డ్ కార్యకర్తలు కూడా గత ఉప ఎన్నికలలో తెదేకి వోటేయలేదంటే తెదే పరిస్థితి తెలంగాణాలో ఎలాఉందో అర్ధం చేసుకోవచ్చు. కార్యకర్తల్లో, జనంలో మంచిపట్టున్న నాగం టీఆరేస్ వెల్లినా, బీజేపీలో కలిసినా అది రాజకీయంగా నాగంకు లాభమే గానీ నష్టం మాత్రం కాదు.

Wednesday, 23 February 2011

తెలంగాణాకు సీమాంధ్ర దళిత, బీసీల మద్దతు

నెల్లూరులో ఫిబ్రవరి 20న జరిగిన దళితమహాసభ రాష్ట్ర విభజనకు తమ మద్దతు ప్రకటించింది. దళిత మహాసభ ఫౌండర్ కత్తి పద్మారావు అధ్యక్షతన జరిగిన ఈ దళితమహాసభ రాష్ట్ర విభజనకోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు కలిసి ఉద్యమనిచాలని పిలుపునిచ్చింది. సమైఖ్య రాష్ట్రంలో దళితులకు న్యాయం జరగడంలేదు, కేవలం కొన్ని అగ్రకులాలవారే ఆధిప్త్యం చేస్తున్నారు, దళితులపై దాడులు మానడంలేదు. రాష్ట్ర విభజన జరిగితేనే దళితులకు న్యాయం జ్రుగుతుందని వారు స్పష్టం చేశారు. సమీక్యాంధ్ర JAC దళితమహాసభ వారిని విభజనకు మద్దతు ఇవ్వొద్దని కోరినా, వారు పట్టించుకోలేదు. ఇందుకు సంబంధించిన వార్తను డెక్కన్ క్రానికల్‌లో ఇక్కడ చూడవచ్చు. తెలుగు మీడియా మాత్రం దళితమహాసభ గురించి ఎక్కడ ప్రస్తావించినట్లు లేదు.

ఇప్పటికే బీసీ నాయకుడు ఆర్.క్రిష్నయ్య అధ్యక్షతలోని బీసీ ఐక్యవేదిక తెలంగాణాకు మద్దతు ప్రకటించింది. సీమాంధ్రకు చెందిన దళిత, బీసీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు చాలామంది ఇప్పటికే బహిరంగంగా విభజనకు మద్దతు ఇవ్వగా కొంతమంది మద్దతు ఇస్థున్నా ఇంకా బయటపడట్లేదు. విభజన కోరుతున్న సీమాంధ్ర నాయకులలో బొత్సా సత్యనారాయణ, హర్షకుమార్, మోపిదేవి వెంకటరమణ ప్రముఖులు.

సమైఖ్య రాష్ట్రంలో తెలంగాణాలోనయినా, సిమాంధ్రలోనయినా అగ్రకులాలదే అద్ధిపత్యం. సమైఖ్య రాష్ట్రంలో పెద్ద నెట్‌వర్క్‌తో బలంగా ఉన్న దోపిడీ వ్యవస్థను ఎదిరించడం కష్టం, చిన్నరాష్ట్రాలయితేనే సులువు అనేది వీరి వాదన. చిన్న రాష్ట్రాలను కోరిన అంబేద్కర్ ఆశయం కూడా ఇదే ధోరణిలో ఉంది. ఎనభై శాతం ఉన్న దళిత, బీసీలు సీమాంధ్రలో తెలంగాణాకు మద్దతు ఇస్థుండగా మరి సమిఖ్యవాదం ఎవరికోసం? ఇరవై శాతం మించని అగ్రకులాలకోసమేనా?

Sunday, 13 February 2011

ప్రేమికుల దినం వచ్చింది ప్రేమికులారా జాగ్రత్త!!


వాలైంటెయిన్స్ డే వచ్చింది, ఇక మల్లీ డ్రామా మొదలవుతుంది. పార్కుల్లోనూ, కాఫీ క్లబ్బుల్లోనూ ఎక్కడయినా ఒక అమ్మాయి, అబ్బయి కనింపించారంటే చాలు, స్వయంప్రకటిత మోరల్ పోలీసులు వచ్చి తరిమి కొడతారు లేదా పెళ్ళిల్లు చేస్తారు. అక్కడ కలిసి ఉంది అన్న చెల్లెల్లు కావొచ్చు, ఆటో డ్రైవరు, ఒక ప్రయాణీకురాలు కావొచ్చు ఇంకెవరయినా కావొచ్చు. ఎవరయినా సరే తాళి కట్టి తీరాల్సిందే.

గత సంవత్సరం నాకు గుర్తున్న వార్తలు: ఒక అమ్మాయి ఏదో పరీక్షకోసం వెలితే తోడుగా ఇంకో అబ్బయి వెళ్ళి మధ్యలో కాస్త టైముంటే పార్కులో కూర్చున్నారు, వారికి తీళి కట్టించేశారు. ఒక అమ్మాయి ఆటోను ఎంగేజ్ చేసుకుని కాస్త వేచి ఉండాల్సి రావడంతో ఆటొ డ్రైవరుతో పార్కుకెలితే వారితో కూడా తాళి కట్టించారు. రేపిలాంటి వార్తలు ఎన్ని వినాలో! సంవత్సరమంతా ప్రేమికులు రోజూ పార్కుల్లో కూర్చుని ముద్దూ ముచ్చటలాడుకోవచ్చు, ఎవరూ పట్టించుకోరు. కానీ ఒకా ఫిబ్రవరి 14 రోజు మాత్రమే ఏ జంట ఎక్కడా కనపడకూడదు. ఆ రోజు కనపడితే తాళి కట్టడానికి రడీగా ఉండాలి.
మనదేశంలో ఒక గుంపుతో కలిసి ఎలాంటి అసాంఘిక కార్యక్రమమయినా చెయ్యొచ్చు. అది ప్రభుత్వ అస్తిత్వానికి, అధికారంలో ఉన్న వారికి కావలిసినవారికి ఆర్ధికంగా నష్తపరచనంతవరకూ ఎలాంటి చర్యలూ ఉండవు.

Sunday, 6 February 2011

మూడేళ్ళలో మెగాస్టార్ నుంచి జోకర్ స్థాయికి



పాపం చిరంజీవి!! మెగాస్టార్‌గా వెలిగినవాడు చివరికి పేకాటలో జోకరైపొయ్యాడు. లక్షలమంది అభిమానుల అభిమానాన్ని కాసిని మంత్రిపదవులకోసం సోనియా వద్ద తాకట్టు పెట్టాడు. ఎలాగైతేనేం, ఎన్నాళ్ళనుండో జెండా పీకేద్దమనుకున్నా బయటికి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించాడు గానీ చివరికి జెండా పీకేశాడు, దుకాణం అమ్మేసాడు.

కష్టపడి ఒకోమెట్టూ ఎక్కి సినిమాల్లో చిన్నస్థాయి నుంచి అగ్రస్థానంలోకి వెళ్ళాడు. కానీ కష్టపడకుండానే అధికారంలోకి రావాలనుకొని బుక్కైపొయ్యాడు. సినిమాల్లో డైరెక్టరు చెప్పినట్లు నటించడమే అలవాటు. రాజకీయాల్లో సరైన దర్శకుడు దొరక్క బామ్మర్దికే దర్శకత్వం భాద్యతలు ఇచ్చాడు. బామ్మరిదేమో సినిమా హిట్టైతేనేం, ఫట్టయితేనేం ఓపెనింగు కలెక్షన్లు అదిరిపోతే చాలునని నమ్మే ఫక్తు కమర్షియల్ ప్రొడ్యూసరు. ఇంకేం, సినిమాల్లో డిస్ట్రిబ్యూటర్లదగ్గర అడ్వాన్సులు తీసుకొని సినిమా తీసి బాక్సులమ్ముకున్నట్లుగా టిక్కెట్లు అమ్మేసి దొరికిపొయ్యాడు.

సామాజిక తెలంగాణా తీసుకొస్తానన్నాడు, తరువాత సమైఖ్యవాదం అందుకున్నాడు. జెండా పీకడం ఎవరికైనా సాధ్యామా అన్నాడు, జెండా పీకేసాడు, సామాజిక న్యాయం తెస్తానన్నాడు, ఇప్పుడేమో కాంగ్రేస్ ద్వారా సామాజికి న్యాయం తెస్తానంటున్నాడు. మాటపై నిలకడలేనివాడికి గౌరవం ఎలా ఉంటుంది?

బహుషా రాజకీయాల్లోకి ఎందుకొచ్చానురా బాబూ అని ఎన్నో సార్లు చిరంజీవి అనుకొని ఉండొచ్చు. సరే ఎలాగో ఇన్నాల్లూ నెట్టుకొచ్చాడు. ఇంకా మూడేల్లు పార్టీని నడపడం కూడా కష్టమే. ఇలాంటి పరిస్థితిలో తనను నమ్మి పార్టీలోకి వచ్చిన కార్యకర్తలనూ, టికెట్లు కొనుక్కున్న ఎమ్మెల్యేలనూ నట్టేట్లో వదలకుండా కాంగ్రేస్లో పార్టీని కలపడం ఒక విధంగా మంచిదే. అయితే ఇకనైనా తనకు అచ్చిరాని రాజకీయాలకు గుడ్‌బై చెప్పి తమ్ముడు పవన్‌లాగా దూరంగా ఉంటే కాస్త మర్యాదన్నా దక్కేది. ఇప్పుడు కాంగ్రేస్ ఇచ్చే మంత్రి పదవికి కక్కుర్తి పడి ఎప్పటికైనా ముఖ్యమంత్రి కాలేనా అని కలలు కంటే మాత్రం చివరికి పేకాటలో జోకర్ కాస్తా కూరలో కరివేపాకు కావడం ఖాయం.

కొసమెరుపు: అసలు చిరంజీవి పార్టీ పెట్టడం తెలుగుదేశాన్ని ఓడించడానికి ఒకానొక వైఎస్సార్ వ్యూహమే, అంతా మొదటినుంచే మ్యాచ్‌ఫిక్సింగే, పీఆర్పీ ఎప్పటికైనా కాంగ్రేస్‌లో కలిసేదే అని చాలామంది ఇంతకుపూర్వం అనుమానాలు వ్యక్తం చేశారు. ఇప్పుడు ఆ అనుమానాల్లో ఏదయినా నిజం ఉందేమో అని నాక్కూడా డౌటు వస్తుంది.

Sunday, 23 January 2011

నేతల రీతులు!!



తెలంగాణా కాంగ్రేస్ నేత మనోగతం:

పదవే ముఖ్యము నాకు,
ప్రజలెట్ట బోతె నేమి?
రాజీనామా మాత్రం
నేనసలే జెయ్యనంట!!

ఊరికి రానివ్వకుంటె
పట్నంలో పడి ఉంటా!
ముఖం మీద ఉమ్మేస్తే
దస్తి పెట్టి తుడుచుకుంట!!

వచ్చే ఎన్నికలోగా
నా ఖజాన నింపుకుంట!
నా మనవడి కొడుకు కొరకు
నేనిపుడే కూడబెడుత!!

తెలంగాణా తెదేపా మనోగతం:

జనం తీరు జూడబోతె
గుండెలదిరి పోతున్నయి,
అధినేతను ఎదిరించే
గుండెదమ్ము లేకపాయె!!

పార్టీలో కొనసాగితె
కరివేపాకయితున్నం,
పార్ట్టీ వీడుదమంటే
తీసుకునేదెవ్వరంట?

ముందునుయ్యి, వెనుక గొయ్యి
ఎటుపోనూ దారిలేదు,
తెలంగాణ వచ్చుదాక
నోరుమూసుకుంటె బెటరు!!


సీమాంధ్రా కాంగ్రేస్ నాయకులు:

కల్లెబొల్లి మాటలతో
ఇన్నాల్లూ నెట్టుకొస్తె
చిదంబరం ప్రకటనతో
గట్టి షాకు ఇచ్చినాడు!!

మేమేం తక్కువ తిన్నమ?
దొంగ ఉద్యమం జేస్తిమి,
తెలంగాణ ఏర్పాటుకు
మోకాలడ్డం పెడితిమి!!

తెలంగాణ వచ్చెలోపు
అధికారం మనదేగద!
కబ్జా చేసిన భూములు
తొందరగా అమ్మాలిక!!


చిరంజీవి మనోగతం:

సామాజిక తెలంగాణ
ఓట్లేమీ రాల్చలేదు,
సమైక్య వాదంజేస్తే
క్రెడిటేమీ దక్కలేదు!!

ప్రజలమనసులో ఉన్నది
తెలుసుకోవడం ఎట్లా?
బామ్మర్దిని అడుగబోతె
అడ్రస్సే లేకపాయె!!

కాంగ్రేసుకు మద్దతిస్తె
మంత్రిపదవి వస్తదేమొ!
ఈలోగా నా జెండా
పీకకుండ జూసుటెట్ల?

Friday, 21 January 2011

ఒక ఉద్యమం అంతా అబద్ధమే - 2



తెలంగాణా ఉద్యమం ఏల్లతరబడి ప్రభుత్వపు పాలనా వివక్ష ఫలితంగా ఏర్పడ్డ ఆకలి పోరాటం అయితే సీమాంధ్ర ఉద్యమం అక్కడి నాయకుల, వ్యాపారస్థుల ధన దాహం, ఆరాటం. ఒక ప్రజా ఉద్యమం పూర్తిస్థాయికి చేరుకోవడానికి ఎంతో సమయం, శ్రమ, ఎన్నో త్యాగాలు అవసరమవుతాయి. ఉద్యమం ఒక గతిని, రీతినీ తీసుకోవడానికి ముందు ఎన్నో బాలార్ష్టాలను ఎదుర్కుంటుంది. కానీ డబ్బూ, అధికారం, మీడియాల సహాయంతో తయారయిన కృత్రిమ ఉద్యమాలకు ఇవేవీ అక్కరలేదు..రాత్రికి రాత్రే ఊపందుకుంటాయి, అంతే వేగంగా కనుమరుగయితాయి.

ఈ సీమాంధ్రా కృత్రిమ ఉద్యమాన్ని సమర్ధించుకోవడానికి వారి నాయకులూ కొందరు బ్లాగరులూ ఎంటో కష్టపడ్డారు. అందులో ఒకతనంటాడు: "మా ఉద్యమం ప్రజలనుంచి రావలసిన అవసరం లేదు, మా నాయకులు మా ప్రయోజనాలకోసం మా తరఫున మొదలు పెట్టారు. మాలో రాజకీయ చైతన్యం ఎక్కువ అని." మరి ఇదే నాయకులు ఒకరోజు మందర అమ్మా సోనియా మీరేం నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటాము అని ఎందుకన్నారు? బిల్లు పెట్తండి మేము సమర్ధిస్తాము అన్నారు? ఇక తెలుగు దేశంలో నయితే ఎవరి అధ్వర్యంలో పార్టీ కమీషను ఏర్పాటు చేసి తెలంగాణాకు మద్దతు ప్రకటించిందో అతనే చివరికి కౌంటరు ఉద్యమం మొదలు పెట్టాడు. ఏ ప్రజలు అధికారం ఇచ్చారు వీరికి ఇలా కప్పగంతులు వేయమని? నిజంగా ప్రజలనుండి వ్యతిరేకత వస్తే అప్పుడు ఉద్యమం ప్రారంభించినా ఒక అర్ధం వుంది, కానీ నిముషాల్లోనే ఉద్యమం శృష్టించారే? పోనీ తాము ఒక మాటకు కట్టుబడి ఉంటే కనీసం మర్యాదన్న దక్కేది సీపీఎం లాగా. అదికూడా లేదే? ఎందుకీ నయవంచన?

Wednesday, 19 January 2011

ఒక ఉద్యమం.. అంతా అబద్దమే!!




"సమైఖ్యాంధ్ర ఉద్యమం!!" డిసెంబరు తొమ్మిది చిదంబరం ప్రకటన తరువాత తెలంగాణా ఇవ్వకుండా మోకాలు అడ్డు పెట్టటానికి సీమాంధ్ర నాయకులు ఆడిన నాటకానికి వారు పెట్టుకున్న పేరు ఇది. పదిహేనురోజులు నడిచిన ఈ నాటకానికి వీరు పెట్టుకున్న పేరుతో సహా ఇందులో అంతా అబద్దమే. సమైఖ్యత అనే భావనే ఎన్నడు చూపని వారు, ఏళ్ళతరబడి తెలంగాణా ఉద్యమం నడుస్తున్నా, అన్నీ రాజకీయ పార్టీలు తెలంగాణాకు మద్దతు చెప్పి తమ తమ ఎలక్షను మానిఫెస్టోలలో కూడా తెలంగాణా అంశాన్ని చేర్చినా ఏనాడూ మాట్లాడని నాయకులంతా ఒక్కసారి రాత్రికి రాత్రి మొదలుపెట్టిన మహా దొంగనాటం ఇది.



ఉద్యమాలు ప్రజలలోంచి పుడతాయి. నాయకులు ఉద్యమాలను నడపరు, ఉద్యమాలే నాయకులను తయారు చేస్తాయి. నాయకులు కేవలం ప్రజల ఆశలను వినిపించడానికి ఒక వేదికను తయారు చేస్తారు, ఉద్యమానికి ఒక రీతి, నడవడి తయారు చేస్తారు. ఉద్యమాలు ప్రజల్లో అంతర్లీనంగా మొదలయి, మెల్లిగా ఒక గతిని ఏర్పాటు చేసుకుంటాయి. కానీ ఈ ఉద్యమం ప్రజలలోంచి పుట్టలేదు. అసలు ఈ ఉద్యమానికి అంత సమయం కూడా లేదు. ఇది మొదలయింది లగడపాటి అనే ఒక వ్యాపారస్తుడైన ఎంపీ తన పెట్టుబడులను, అందులో భాగమయిన కబ్జాలను కాపాడుకోవడం కోసం ప్రకటన వెలువడిన కొన్ని నిముషాలలోనే రాజీనామా చేయడంతో మొదలయింది. ఆ తరువాత చైన్ రియాక్షను లాగా ఒకరితరువాత ఒకరుగా అందరు సీమాంధ్ర ఎంపీలూ, ఎమ్మెల్యేలూ ఎక్కడ తాము ఈ నాటకంలో వెనుకబడుతామేమోనని ఆదరబాదరగా రాజీనామాలు చేసి దీక్షలు మొదలుపెట్టారు. అంటే అసలు ప్రజల భాగస్వామ్యమే లేకుండా, ప్రజల రియాక్షనుకు టైము కూడా ఇవ్వకుండా నాయకులు మొదలుపెట్టిన నాటకం తప్పితే ఇది ప్రజా ఉద్యమం కాబోదు.

ప్రభుత్వ పెద్దల అండదండలు దండిగా ఉండడంతో ఈ నాయకులు ఒకవైపు దీక్షలు చేస్తూ మరో వైపు తమ మనుషుల ద్వారా పదిహేను రోజుల్లో జరిపిన ప్రభుత్వ ఆస్థుల ధ్వంసం సంవత్సర కాలంలో తెలంగాణాలో జరిగినదానికన్నా చాలా ఎక్కువ. చాలా చోట్ల పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారు. ఇందులో చెప్పుకోవాల్సింది అనంతపురం బీఎస్సెన్నెల్ కేబుల్ల ధ్వంసం. కోట్ల విలువచేసే బీఎస్సెన్నెల్ ఆస్తులు పోలీసుల కల్లముందే ధ్వంసం అయ్యాయి.ఇంకా రైల్వే స్టేషనులు, పోస్టాఫీసులు, దూరదర్శన్ కేంద్రాలు, రైలు భోగీలు ఎన్నో ధ్వంసం చేశారు.

ప్రజలు తమ హక్కుల సాధనకోసం ఉద్యమం చేస్తారు. అంతే కానీ ఎదుటివారి హక్కులకు అడ్డుపడటానికి ఉద్యమాలు చెయ్యరు. రెండు ప్రాంతాలవారు కలిసి చేస్తే అది సమైఖ్య ఉద్యమం అవుతుంది కానీ ఒక ప్రాంతం వారు చేస్తే అది సమైఖ్య ఉద్యమం కాబోదు. ఎవరి స్వలాభాలకోసం వారు పోరాడుతారు.. అందులో తప్పులేదు. కానీ తమ స్వార్ధప్రయోజనం కోసం ఎదుటివారు తమతో కలిసి ఉండాలని శాసించరు!! అది ఎదుటివారి హక్కులను హరించడమే.

చరిత్రలో ఇంతకుముందు సమైఖ్య ఉద్యమాలు జరిగాయి. ఉదాహరణకు ప్రజల ఇష్టాలకు వ్యతిరేకంగా బెర్లిన్లో గోడకట్టి తూర్పు, పశ్చిమ జెర్మనీలుగా విడగొట్టినప్పుడు జెర్మన్లు కలిసి ఉండడంకోసం ఉద్యమించారు. రెండువైపులవారు సమానంగా కలిసిఉండాలనే కోరికతో ఉద్యమించారు. కానీ ఎక్కడా అవతలి వారికి ఇష్టం లేకున్నా తమతో కలిసి ఉండాలని ప్రజాస్వామ్య ఉద్యమాలు చెయ్యలేదు, కేవలం యుద్ధాలు చేశారు. సీమాంధ్ర నేతలు తమ కాంక్షలను తీర్చుకోవడంకోసం, తెలంగాణా ప్రజల హక్కులు కాలరాయడం కోసం ఈ అభినవ యుద్ధానికి తెరలేపారు, దానికి సమైఖ్యాంధ్ర ఉద్యమమని పేరు పెట్టుకున్నారు.

ఈ విధంగా ఈ మోకాలడ్డే కార్యక్రమం ఉద్యమం అనడమే అబద్ధం, దాని ఉద్దేశమూ అబద్ధం. ఈ అబద్దపు ఉద్యమాన్ని పెద్దది చేసి చూపేందుకు సీమాంధ్ర నేతల కనుసన్నలలో నడిచే మీడియా అష్టకష్టాలు పడింది. పదిమంది టెంటేసుకుని కూర్చుంటే దాన్నే పెద్దచేసి, పదికోణాల్లో చూపించింది. ఒస్మానియాలో హాస్టల్లకు వచ్చి వీరంగం సృష్టించే పోలీసులు, అధికార యంత్రాంగం కూడా ఈ నాటకానికి తమ సహకారం పూర్తిగా ఇచ్చారు. కొద్దిమంది అల్లరిమూకలు బస్సులు తగలబెడుతుంటే, ఆస్థులు ధ్వంసం చేస్తుంటే చూస్తూ కూర్చున్నారు. అక్కడ మాత్రం హాస్టల్లను మూసివేయలేదు, హాస్టల్లలో దూరి కొట్టలేదు, ఎవరిపైనా కేసులూ పెట్టలేదు. ప్రజల ఉద్యమాలను బూటుకాల్లతో అణచివేసే ప్రభుత్వయంత్రాంగం ఈ నాయకుల కిరాయిమూకల విధ్వంసానికి మాత్రం ఎప్పటిలాగే అడ్డుపడలేదు.

ఈ ఉద్యమాన్ని నడిపించింది ప్రధానంగా సీమాంధ్రకు చెందిన కాంగ్రేసు, తెలుగుదేశం నేతలు. వీరు తమ నాయకులు తెలంగాణాకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నప్పుడు, మానిఫెస్టోల్లో జోడించినప్పుడూ ఎన్నడూ అడ్డుపడలేదు. కానీ ఒక్కసారిగా నాటకంలో తామెక్కడ వెనుకబడుతామోనని ప్రకతన వెలువడగానే గొంతుచించడం మొదలుపెట్టారు. పార్టీలు మరిచి, పాతకక్షలు మరిచి భాయీ భాయీలయిపొయ్యారు. బయటివారితో యుద్ధం చేసేప్పుడు ఇంటివారు తమ గొడవలు మరిచిపొయినట్లు కలిసి మరీ యుద్ధం చేశారు. పేరుకు మాత్రం ఇది సమైఖ్య ఉద్యమం, తెలంగాణా వారితో సోదరభావం ఉన్నట్లు ఫోజులు..అంతా అబద్ధమే. పెట్టుబడికీ ఫాక్షనిజానికీ పుట్టిన అక్రమసంతానం ఈ అబద్ధపు ఉద్యమం.

Sunday, 2 January 2011

జలయగ్నం డొల్లతనం ఫలితం - క్రిష్ణా ట్రిబ్యునల్ తీర్పు

క్రిష్ణా ట్రిబ్యునల్ తాజా తీర్పు మన రాష్ట్రానికి అశనిపాతంలా మారింది. ప్రస్తుతం రాష్ర్ట్రంలో అంతా శ్రీక్రిష్ణ కమీషన్ రిపోర్టుకై ఎదురుచూస్తున్న తరుణంలో ఈ తీర్పు ఎక్కువగా మీడియాలో ప్రభావం చూపడం లేదు కానీ భవిష్యత్తులో రాష్ట్రం విడిపోయినా కలిసి ఉన్నా ఈ తీర్పు తెలంగాణాకూ సీమాంధ్రకూ గణనీయమైన నష్టం కలిగిస్తుందనేది నిస్సందేహం. అయితే ఇలాంటి తీర్పు రావడానికి కారణాలు ఏమిటి, అందులో మన పాలకుల నిర్వాకం, సరైన ప్రణాలికలేని మన జలయగ్నం యొక్క ప్రభావం ఎంతమేరకు ఉందనేది మనం గమనించాల్సిన విషయాలు.

నదీ జలాల వినియోగంపై హక్కులు ఆ నదీ పరివాహికప్రాంతం (క్యాచ్మెంట్ ఏరియా) కే చెందుతాయనేది అంతర్జాతీయంగా పాటించబడుతున్న సూత్రం. క్రిష్ణా జలాల వినియోగంలో మనరాష్ట్రం మొదటినుంచీ ఈ సూత్రాన్ని తుంగలో తొక్కుతూ పెన్నా క్యాచ్మెంట్ ఏరియాకి క్రిష్ణా జలాలను తరలిస్తూ వస్తుంది. ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు విషయంలో మనరాష్ట్రం అభ్యంతరాలను తోసిపుచ్చుతూ అనేక సంవత్సరాలుగా కర్ణాటక చేస్తున్న వాదన కూడా ఇదే: నిభంధనలకు వ్యతిరేకంగా ఆంధ్ర ప్రదేశ్ క్రిష్ణా జలాలను ఇతర నదీ ప్రవాహిక ప్రాంతాలకు తరలిస్తుందనేది. దీనికి మన రాష్ట్రం నుండి సరైన సమాధానం లేకపోవడంతో ఆల్మట్టి విషయంలో ఇంతకుముందే మనకు నష్టం జరిగింది.ఇప్పుడు అక్రమమన్న ఆల్మట్టి ఎత్తు చట్టబద్దం కాగా, ఇంకా ఎత్తు పెంచుకోవడానికి అనుమతి లభించింది. క్రిష్ణా నది క్యాచ్మెంటును ఈ క్రింది పటంలో చూడవచ్చు.




నిభంధనలకు వ్యతిరేకంగా ఇతర నదీ క్యాచ్మెంటు ఏరియాలకు క్రిష్ణాజలాలను తరలించడాన్ని మన రాష్ట్రం మేము మిగులు జలాలను మాత్రమే ఇతరక్యాచ్మెంట్ ఏరియాలకు తరలిస్తున్నామని సమర్ధించుకుంటుంది. అయితే నికరజలాల వాటాను వాడుకోకుండా మిగులు జలాలు ఎలా వాడుకుంటారనేది సందేహం. క్రిష్ణా పై చేపట్టిన ప్రాజెక్టులు ఈ క్రింది పటంలో చూడవచ్చు.



ఎవరైనా ముందు నికర హక్కులు కలిగిన ప్రాజెక్టులను ముందు పూర్తి చేసి జలాలను వినియోగంలోకి తీసుకుంటారు. ఆ తరువాత మిగులు జలాలకు సంబంధించిన ప్రాజెక్టులు చేపడతారు. అయితే మన సమైఖ్య రాష్ట్రంలో నికరజలాలపై బచావత్ ట్రిబ్యునల్ హక్కులు కల్గిన శ్రీశైలం ఎడమకాలువ, భీమ లాంటి ప్రాజెక్టులను దశాబ్దాలు గడుస్తున్నా చేపట్టక, చేపట్టిన ప్రాజెక్టులను పూర్తిచేయక కాలం గడిపేస్తూ మిగులు జలాలపై మాత్రం ఆఘమేఘాలపై వెలిగొండ, హంద్రి-నీవా, పోతిరెడ్డిపాడు లాంటి ప్రాజెక్టులు చేపట్టింది.

మన రాష్ట్రంలో తెలంగాణా వారికి సమాధనం చెప్పేప్పుడు మాత్రం పోతిరెడ్డిపాడు, వెలిగొండ, హంద్రినీవా,గాలేరు-నగరి లాంటి ప్రాజెక్టులన్నీ మిగులు జలాలను మాత్రమే వాడుకుంటాయని చెప్పి క్రిష్ణా ట్రిబ్యునల్ దగ్గర అసలు మిగులు జలాలే లేవని రెండు నాల్కలధోరణి ప్రదర్శించి రాష్ట్రానికి తీరని అన్యాయం చేశారు. మిగులు జలాల ఆధారంగా ఆంధ్రా ఇన్ని ప్రాజెక్టులను చేపడుతుందంటే మిగులు జలాలు చాలా ఎక్కువగా ఉంటాయనే అనుమానాలకు ఈ వాదన దారి తీసింది. ఈ విధంగా నికరజలాల హక్కులు కల్గిన తెలంగాణా ప్రాంతానికి మొండి చెయ్యిచూపించి అలా మిగిలిన "మిగులు" జలాలను సీమాంధ్రకు తరలిద్దామనుకున్న రాజశేఖరరెడ్డి పధకం రాష్ట్ర ప్రయోజనాలకే బెడిసికొట్టింది.పైగా అసలుకే ఎసరయ్యింది. జలయగ్నం ధనజలయగ్నం మాత్రమే కాదు, క్రిష్ణా జలాలను తెలంగాణాకు కాకుండా చేసే మహా పన్నాగం అన్న అనుమానాలను నిజం చేసింది.

Saturday, 5 June 2010

ఆడిన మాట తప్పకూడదా?


"మాట తప్పని, మడమ తిప్పని వంశం మాది", "రాజకీయాల్లో విశ్వసనీయత ముఖ్యం", "రాజశేఖర్ రెడ్డి పధకాలకు ఈ ప్రభుత్వం తూట్లు పొడుస్తుంది", "పావురాల గుట్టపైనే నేను మాట ఇచ్చాను" ఇవన్నీ గత కొన్ని సంవత్సరాలుగా వైఎస్సార్, జగన్ చెప్పిన కొన్ని మాటలు మరియూ సాక్షి పేపరులో ఎడిటొరియల్సూ!

వైఎస్సారు, జగన్ తమని తాము ఆడిన మాట తప్పని రాచవంశీకులుగా ప్రొజెక్ట్ చేసుకోవడానికి చేసిన ప్రయత్నమే ఈ మాటలు. వీరు నిజంగానే మాట తప్పరా అన్న విషయం జోళికి వెల్లకుండా, అసలు మాట తప్పడం అంత పెద్ద నేరమా, మాట తప్పకపోవడం రాజకీయాల్లో పెద్ద క్వాలిఫికేషనా అని ఒక సారి చర్చిద్దాం.

వెనుకటికి రాజులు ఇచ్చిన మాత నిలబెట్టుకోవడానికి అవసరమయితే రాజ్యాలనే వదులుకున్నారని పుస్తకాల్లో, కధల్లో చదువుకున్నాం. అయితే ఇప్పుడున్నది రాచరిక పాలన కాదు, ప్రజాస్వామ్యం. వ్యక్తుల ఈగోలకన్నా, ప్రజల సంక్షేమం ముఖ్యం. పనికిరాని వాగదానాలు ఇచ్చినప్పుడు వాటిని పాటించడం మరో తప్పిదమే కానీ అది ఎన్నటికీ ఒక క్రెడిట్ కాదు. చత్త హామీలను నిలబెట్టుకుంటే విశ్వసనీయత పెరుగదు, తగ్గుతుంది.

ఎన్నికల్లో గెలవడానికి అన్ని పార్టీలు తలా కొన్ని ఆచరణ సాధ్యం కాని పధకాలను, హామీలుగా ఇచ్చేసింది. ఇందులో ఏ పార్టీ మినహాయింపు కాదు. కనీసం గెలిచాకనయినా ఆ హామీలు ప్రభుత్వం నడ్డి విరుస్తున్నాయి అని తెలుసుకున్నప్పుడు వాటిని వదిలివేయాలా లేక మాట ఇచ్చాము కదా అని కొనసాగించాలా?

మాట నిలపెట్టుకోవడం ముఖ్యం కాదు, ప్రజల శ్రేయస్సు ముఖ్యం అంటే, మరి రాజకీయ పార్టీలు ఎడా పెడా ఎన్నికలముందు వాగ్దానాలు చేయడం సమర్ధనీయమేనా అంటే కానే కాదు. సాధ్యాసాధ్యాలతో, ప్రజల శ్రేయస్సుతో, దేశ అభివృద్ధితో సంబంధం లేకుండా కేవలం వోట్లకోసం వాగ్దానాలు చెయ్యడం ఎంతమాత్రమూ సమర్ధనీయం కాదు. అయితే ఇలాంటి రాష్ట్రాన్ని వెనక్కి తీసుకెల్లే వాగ్దానాలు చెయ్యడం ఒక నేరం కాగా మాట ఇచ్చాం కదా అని వాటిని ఎలాగయినా నిలుపుకోవాలని పంతానికి పోయి దేశాన్ని ఇంకొంచెం వెనక్కి తీసుకెల్లడం మరో నేరం అవుతుంది.

రోశయ్య గారూ, ఇకనైనా సాక్షి పత్రిక ఏదో రాస్తుంది, జగన్ వర్గం తప్పు పడుతుంది అని భయపడి ఈ సం"క్షామ" పధకాలను కొనసాగించకుండా వాటిని ఒక్కసారి కడిగేయండి. మీరు వీటిని అమలు చేసినా, చెయ్యకపొయ్యినా వచ్చే ఎలక్షనులో ఏ వోటరూ వాటిని చూసి వోటేయడు. ఒకవేళ ఏసినా ముఖ్యమంత్రిగా ఉండేది మీరు ఎలాగూ కాదు కాబట్టి మీకా భయం అస్సలు అవసరం లేదు.

Sunday, 30 May 2010

జగన్‌కి వరంగల్‌లో ఓదార్పు యాత్ర చేసే హక్కు ఉండాలా?

ఓదార్పు యాత్ర వెనుక జగన్ అసలు ఉద్దేషం, జగన్ యొక్క ఓదార్పు గుణం, ఓదార్పు యాత్ర ఆవశ్యకత లాంటి అంశాలజోళికి వెల్లకుండా నిజంగా వీరు చెప్పేట్లు జగన్ హక్కుని ప్రభుత్వం, తెలంగాణా వాదులు కాలరాశారన్న వాదనలో నిజం ఉందా?

ఒక వ్యక్తిగా జగన్‌కి గానీ, మరెవరికయినా దేశంలో ఎక్కడికయినా స్వేచ్చగా వెళ్ళే హక్కు ఉండాలి. దురదృష్టవశాత్తూ మనదేశంలో పౌరులు ఎన్నో చోట్లకు ఒంటరిగా వెళ్ళలేని స్థితి ఉంది. జగన్ ప్రాతినిధ్యం వహించే రాయలసీమలో చాలా చోట్ల ఒక వర్గం వారు ఇంకో ప్రాంతంలోకి వెళ్ళాలంటే శాంతిభద్రతల కారణాల దృష్ట్యా పోలీసులు అనుమతి ఇవ్వరు.

ఈ ఓదార్పు యాత్రలో జగన్ ఒక వ్యక్తిగా వెళ్ళడం లేదు, రెండువేలమని అనుచర బృందం, మందీ మార్బలం, వ్యక్తిగత రక్షణ సిబ్బందీ, వారి ఆయుధాలూ వగైరాలతో వెల్తున్నారు. వారిని రిసీవ్ చేసుకోవడానికి కాచుకు కూర్చున్న కొండా దంపతులు వరంగల్ జిల్లాలో సమాంతర ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. వీరికి మాత్రం తమ యాత్రలకు అనుమతి కావాలి, అందులో ఏవయిన గొడవలు జరిగితే భాద్యత ప్రభుత్వానిదీ, తెలంగాణా వాదులదీ కానీ విరిది కాదు.

మరి ఇంత మంది గుమి గూడి ఊరేగింపుగా వెల్లడానికి అనుకూలమయిన పరిస్థితులు వరంగల్ జిల్లాలో లేనే లేవు. తెలంగాణా ఉద్యమానికి ఆయువు పట్టయిన వరంగల్, నల్గొండా, కరీం నగర్, నిజామాబాద్ లాంటి జిల్లాలలో సీమాంధ్ర నాయకులు నిరశన జ్వాలలు ఎదుర్కోక తప్పదు.

కేసీఆర్ నిరాహార దీక్ష చేసుకునే హక్కును బలవంతంగా కాలరాసి ముందస్తు అరెస్టు చేసి ఖమ్మం సెంట్రల్ జైలుకి తరలించిన ఈ ప్రభుత్వం జగన్ అరెస్టుకు ఎందుకు ఘర్షణలు చెలెరేగే దాకా ఆగినట్లు? శాంతిభద్రతలను కాపాడవలసిన హోం మినిష్టరు వ్యక్తిగత హోదాలో రాయబారాలు ఎందుకు చేసినట్లు?

తమ హక్కును కాలరాశారని మొసలి ఏడుపులు ఏడ్చే ఈ జగన్, సురేఖలు తమ తమ నియోజక వర్గాలలో ఆటవిక పాలన కొనసాగిస్తూ, సమాంతర ప్రభుత్వాలను నడిపిస్తూ ఇతర పార్టీ నాయకుల ప్రచారాన్ని అడ్డుకోవడం వాస్తవం కాదా?

ఇక అక్కడ నిజంగా తెలంగాణా వాదులు రాళ్ళు విసిరి రెచ్చగొట్టారా, లేక జగన్ వర్గీయులే ముందు రాళ్ళు వేసి కవ్వించారా అనేది మనకు తెలియని విషయం. విచిత్రంగా అక్కడ గాయపడిన వారంతా విద్యార్థులే. ఒక్క జగన్ యువసైనికుడు కానీ, కాంగ్రేస్ కార్యకర్త గానీ గాయపడలేదు. కాల్పులు జరిపింది రక్షణ సిబ్బంది మాత్రమే కాదు కొండా మురళి , మరియూ అతని అనుచరులు కూడా అనేది బహిరంగ రహస్యం.

ఈ మొత్తం వ్యవహారం చూస్తే ఎలాగయినా విద్వేషాలు రెచ్చగొట్టి రోశయ్య ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడం జగన్ వ్యూహం కాగా, కాగల కార్యం గంధర్వులే తీరుస్తారనే పీవీ సూత్రం రోశయ్య చాణక్య నీతిలాగుంది. తమ స్వార్ధం కోసం టీఆరెస్ నాయకులతో సహా అంతా పంతాలకు పోతే పావులుగా మారి ప్రాణాలమీదికి తెచ్చుకుంది మాత్రం పేద విద్యార్థులే.

Wednesday, 26 May 2010

అబద్దానికి పరాకాష్ఠ - ఓదార్పు యాత్ర జరగదేమోనని హఠాన్మరణం

ఒక అబద్దాన్ని ఎంత వరకు సాగదీయవచ్చు? అది అబద్దమని అందరికీ తెలిసిన తరువాత కూడా ఆ అబద్దానికి తోడుగా మళ్ళీ మళ్ళి అబద్ధాలు చెప్పడం ఎలా సాధ్యం? మరి మన రాజకీయ నాయకులు తలుచుకుంటే ఏదయినా సాధ్యమే కదా?

హెలికాప్టర్ కూలి వైఎస్సార్ చనిపోయిన తరువాత మొదటిగా వరంగల్ జిల్లాలో ఒక కుగ్రామంలో ఒక కుండలు చేసుకునే కుమ్మరి రోజులతరబడి అచేతనంగా ఉండి కూడా విచిత్రంగా వైఎస్సార్ మరణవార్త విని హఠాన్మరణం చెందాడు. విచిత్రంగా వాళ్ళింట్లో టీవీ కూడా లేకుండానే అతగాడు వైఎస్సర్ సంక్షేమ పధకాలగూర్చి తెలుసుకుని, అతను చనిపోతే ఆ పధకాలు ఉండవేమో అని చనిపోయాడట!!

వరంగల్లో ఒక వైఎస్సార్ అనుంగు భక్తురాలైన రాజకీయ నాయకురాలు, మాజీ మంత్రిణి మొదలు పెట్టిన ఈ కొత్త ఆట రాష్ట్రమంతటికీ పాకి వారం రోజుల్లో ఐదు వందల మరణాలు రికార్డు అయ్యాయి. మరి ఆ వారం రోజుల్లో రాష్ర్టంలో ఇతర సహజ మరణాలు ఏవీ జరగలేదు, అనీ వైఎస్సార్ చనిపోతే తట్టుకోలేక గుండె ఆగిన చావులే!!ఆ అబద్ధాన్ని మన యువరాజు ఇంకాస్త పొడిగించి ఒదార్పు యాత్ర పేరుతో ఒక రాజకీయ యాత్రను సాగదీస్తున్నాడు. ఏది పెద్ద అబద్ధం? గుండాగిన చావు వార్తలా, లేక ఆ చావులకు ఓదార్పులా అని నాకు సందేహం వచ్చింది.

ఇప్పుడు ఆ రెండు అబద్దాలకంటే మరో పెద్ద అబద్దాల ఆట మళ్ళీ అదే రాజకీయ నాయకురాలు మొదలు పెట్టింది. వరంగల్ జిల్లాలో ఒక వ్యక్తి వై ఎస్ జగన్ యాత్రకు అడ్డంకులు కలుగుతున్నాయనే ఆవేదనతో షాక్ మరణం చెందాదట!! ఆయన షాక్ తిని చనిపోవడం ఏమో గానీ ఆ వార్త నాకు షాక్ ఇచ్చింది. అమ్మో..నేను కూడ ఒక సారి నా గుండెని టెస్టు చేయించుకోవాలి..ఇలాంటి వార్తలు విని నా గుండె తట్టుకునేలా లేదు!!