Showing posts with label అభిప్రాయం. Show all posts
Showing posts with label అభిప్రాయం. Show all posts

Monday, 21 November 2011

పసలేని పరకాలవాదం


మూడు నాల్గు పార్టీలు మారి నాలుగుసార్లు ఎలక్షన్లలో నిలబడి డిపాజిట్టు కోల్పోయినప్పటికీ రాష్ట్రంలో పరకాల అంటే పెద్దగా ఇంతకుముందు ఎవరికీ తెలియదు. పీఆర్పీలో టికెట్ దొరక్క బయటికి వచ్చి అదోవిషవృక్షం అంటూ పరకాల హడావిడీ చేసినతరువాత మాత్రం కొన్నిరోజులు పరకాలకు టీవీల్లో మంచి పబ్లిసిటీ దొరికింది. ఆతరువాత మల్లీ ఎవరూ పట్టించుకోకపోయేసరికి ఎలాగోలా మల్లీ టీవీ హెడ్లైన్లలోకెక్కాలని ఈమధ్యన విశాలాంధ్ర మహాసభ అంటూ ఒక వెబ్‌సైటు పెట్టుకుని హడావిడీ చేస్తున్నాడు. అసలిది విశాలాంధ్ర మహాసభ కాదు, ఇదొక విషాంధ్ర మహాసభ, వీరికంటూ ఒక వాదం గట్రా ఏంఈలేదు, తెలంగాణా వాదాన్ని, తెలంగాణ ఉద్యమకారులను తిట్టడమే వీరి ఏకైక అజెండా అని జనాలు చెప్పుతున్నారనేది వేరే విషయం.

సరే ఈవెబ్సైటుతో మీడియా వర్క్‌షాప్ గట్రా అంటూ హడావిడీ చేసి తెలంగాణవాదుల్ని రెచ్చగొట్టి ఎలాగయితేనేం పరకాల మల్లీ వార్తల్లోకి వచ్చాడు. ఎలాగూ పరకాలకు కావల్సిందదే, వార్తల్లోకి ఎక్కడం, పబ్లిసిటీ పెంచుకోవడం. ఇప్పటికే మూడు పార్టీలు మార్చి వెల్తూ వెల్తూ పీఆర్పీని తిట్టిని తిట్లకు ఎలాగూ ఇప్పుడూ ఎవరూ ఈయన్న పార్టీలోకి చేర్చుకోరు.

ఈవిషాంధ్ర మహాసభ వెబ్‌సైటూ, బ్లాగూ నడుపుతూ ఇంతవరకూ సాధించింది ఏంతయ్యా అంటే ఫలానా తెలంగాణ నాయకుడు ఫలానా టైంలో సమైక్యాంధ్రకు జైకొట్టాడు అంటూ పేపర్ కటింగులు పెట్టడం, లేదా తెలంగాణ వాదుల్ని వేర్పాటువాదులు అంటూ తిట్టిపొయ్యడం. మొదట్లో కొన్నిరోజులు అసలు తెలంగాణకు నీటిపారుదలలో ఎలాంటి వివక్షా జరగలేదంటూ లోక్‌సత్తా రిపోర్టును సాక్ష్యంగా చూపుతూ హడావిడీ చేశారు కానీ అవన్నీ తప్పని బ్లాగుల్లో నిరూపించబడడంతో సమాధానం చెప్పలేక నోర్మూసుకున్నారు.

పరకాల ఈమధ్య టీవీల్లో బాగా హడావిడీ చేస్తున్నాడు. పరకాలకు, ప్రొఫెసర్ హరగోపాల్‌కు మధ్యన  మహాటీవీలో ఒక చర్చా కార్యక్రమం జరిగింది. ఆసక్తి కరంగా ఉంది కదా అని నేనూ ఓపిగ్గా అన్ని వీడియోలు చూశాను. లండన్లో పీహెచ్డీ చేసిన ఈమహానుభావుడు ఏంచెబుతాడో చూద్దామంటే అసలు ఎంతసేపూ చెప్పిందే చెప్పి బోరుకొట్టించడం లేకపోతే ఎదుటివారిని ఎగతాళి చెయ్యడం తప్ప ఈయన వాదన శూన్యం. కాలికేస్తే మెడకేస్తాను, మెడకేస్తే కాలికేస్తాను అదే నావాదన అని నిరూపించుకుంటున్న ఈయన ఒకే అర్ధం వచ్చే విషయానికి వరుసగా పది పర్యాయపదాలు చెబుతూ అదే వాదన అని భ్రమ పడుతున్నాడు.

"సమైక్యవాదం ఒక గొప్ప ఉదాత్తమమయిన వాదం, తెలంగాణ అన్నిరంగాలలోనూ ఈఈ సూచీల్లో మిగతా ప్రాతాల్లోకన్నా ముందుంది, తెలంగాణలో లక్షలాది ప్రజలు రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుకుంటున్నారు." ఇవే విషయాలను పదే పదే వల్లించడం తప్ప ఇంక ముందుకు వెల్లడు, ఆయా వాదనలపై హరగోపాల్ అడిగే సహేతుక ప్రశ్నలకు ఈఅయన దగ్గర సమాధానం ఉండదు, పైగా మల్లీ మల్లీ వేర్పాటువాదుల వాదనలో పస లేదు అంటూ అరవడం. అసలు తెలంగాణవాదుల్ని వేర్పాటువాదులు అని పిలిచేవారినీ, అలా పిలవడాన్ని సమర్ధించే టీవీ చానెల్లను బొక్కలో వెయ్యాలని నా అభిప్రాయం, ప్రస్తుతం ఉన్న సీమాంధ్రప్రభుత్వంలో అది సాధ్యం కాదుగానీ.

జీడీపీలు, తలసరి ఆదాయాలు అభివృద్ధిని చెప్పలేవు, వాస్తవపరిస్థుతులు అలాలేవు. అన్నీ బాగా ఉంటే మరి క్రిష్నా పక్కనే ఉండగా నల్లగొండలో ఫ్లోరైడ్ సమస్య, మహబూబ్నగర్లో కరువు ఎందుకు ఉంటుంది అంటే అందుకు సీమాంధ్ర ఎలా కారణం అంటూ దాటవేస్తాడు. తెలంగాణ అన్ని రంగాల్లో మిగతాప్రాంతాలకంటే చాలా అభ్వృద్ధి చెందిందనే ఈయన వాస్తవపరిస్థుతులు చెబుతుంటే తప్పించుకోవడం ఎందుకు? అక్కడ వాదన మహబూబ్నగర్ ఎండిపోవడానికి సీమాంధ్ర ప్రజలే కారణమని కాదు, ఈయన చెప్పే తెలంగాణ చాలా అభివృద్ధి చెందింది అనేది తప్పని చెప్పడం.

లక్షలాది ప్రజలు తెలంగాణలో రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుకుంటున్నారు అని పదేపదే వల్లిస్తాడు, మరి అందుకు సాక్ష్యం ఏది, ఏదయినా మహాసభ నిర్వహించారా, ర్యాలీ జరిగిందా అంటే సమాధానం ఉండదు. కానీ ఇదిగో నలమోతు తెలంగాణవాడే అని చెబుతాడు. ఆ బాషా ఒక్కసారి చెబితే వంద సార్లు చెప్పినట్టయితే ఈయనకు నలమోతు ఒక్కడే లక్షలాది ప్రజల్లాగా కనిపిస్తున్నారేమో.

సమైక్యభావన గొప్ప ఉదాత్తమమయిన భావన అనేది ఈయన మరో పాయింటు. మరి సమైక్యవాదంలో ప్రజలను సంతృప్తి పరచడానికి ఏదయిన ఆదాయవనరు ఉందా, సమైక్యవాదంలో కలిపిఉంచే అంశమేంటి అనడిగితే దానికీ సమాధానం ఉండదు. ఊరికే మమ్మల్ని సమైక్యవాదం ప్రచారం చేసుకోనీయట్లేదు అంటూ దొంగ ఏడుపులు మాత్రం ఏడుస్తుంటాడు. అయ్యా పరకాలా, నీవాదానికి నిజంగా నువ్వు చెప్పేట్లు లక్షలాది ప్రజల మద్దతు ఉంటే ఒకరు నీవాదాన్ని వినిపించకుండా ఆపలేరు, ప్రజలే నీకు మద్దతుగా వస్తారు, ఇక్కడ ఎవరూ సమైక్యంగా ఉండాలని కోరుకోవట్లేదు కాబట్టే నీకు ఒక మీటింగు పెట్టుకోవడం కూడా గగనమవుతుంది.  నువ్విక్కడీకొచ్చి వేర్పాటువాదులూ లాంటి భాషను ఉపయోగితూ ప్రొఫెసర్ జయశంకర్ లాంటి పెద్దలను అగౌరవపరచడం రెచ్చగొట్టడం తప్ప మరోటి కాదు, ఈవిషయం నీక్కూడా తెలుసుననుకో, అయినా ఇలా చెప్పాల్సి వస్తుంది.

Monday, 15 August 2011

లేని హక్కుల సాధనకోసం, హక్కులను కాలరాయడం కోసం ఉద్యమాలు


ఉద్యమాలు, నిరశనలు అనేవి ప్రజాస్వామ్య దేశంలో ప్రజలు తమ హక్కుల సాధనకోసం ఉపయోగించే ఆయుధాలు. ప్రజలు ప్రజాస్వామ్యంలో తమందరి తరఫునా నిర్ణయాలు తీసుకోవడం కోసం కొందరు ప్రతినిధులను గెలిపించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయిస్తారు. అలాంటి ప్రభుత్వం తమ న్యాయమైన హక్కులను కాలరాస్తే మనకు ఆప్రభుత్వాన్ని వెంటనే దించివేసే హక్కులేదు, ఐదేళ్ళదాకా ఆగాల్సిందే. కనుక ప్రజలు తమ హక్కుల సాధనకోసం ఉద్యమాలు, నిరశనలు చేస్తారు. ఈనిరశనలు బందులూ, రాస్తారోకోలూ, సమ్మెలూ లాంటి అనేక విధానాలద్వారా చేస్తారు.

అయితే ప్రజలు లేని హక్కులకోసం ఉద్యమాలు చేస్తే అది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చెయ్యడమే. ఇప్పుడు మన రాష్ట్రంలో జరుగుతోందదే. ఆరోజోన్లో ఉద్యోగాలు ఆరోజోన్ వాసుల హక్కు. దానికోసం సీమాంధ్ర వారు బందులు చెయ్యడం, ఉద్యమాలు చెయ్యడం తమకు లేని హక్కును కోరడమే కాక ఆరోజోన్ ప్రజల హక్కులు హరించడమే. ఈసాంప్రదాయం ఇలాగే కొనసాగితే రేప్పొద్దున రాజస్థాన్ రాష్ట్రప్రభుత్వ ఉద్యోగాలకోసం కూడా ఇదే సీమాంధ్రులు ఉద్యమాలు చెయ్యగలరు..రాజస్థాన్ వారికి మాత్రం తమ ప్రభుత్వోద్యోగాల్లో అర్హత ఇస్తే ఒప్పుకోరు. ఇలాంటి అన్యాయపు డీమాండ్లను కొందరు చెయ్యడం, వారికి కొందరు రాజకీయ నాయకులు వత్తాసు పలకడం క్షమించరాని నేరం.

అసలు సమైక్యవాదులు అని చెప్పుకునే వారు చేసే ఉద్యమమే ఒక హాస్యాస్పద ఉద్యమం. దీనికి అబద్దాలను జోడించి కావూరి సాంబశివరావు లాంటి నేతలు తెలంగాణవారు తెలంగాణ కావాలనుకుంటే సీమాంధ్రలో ప్రజలంతా రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుకుంటున్నారు కాబట్టి రాష్ట్రాన్ని విడదియ్యడానికి వీల్లేదని చెప్పడం హాస్యాస్పదం. ముందుగా సీమాంధ్రలో అందరూ సమైక్యరాష్ట్రాన్ని కోరుకోవడమే పచ్చి అబద్దం, ఇక ఒకవేళ ఇది నిజమనుకున్నా రాష్ట్రాన్ని కలిపి ఉంచాలని ఒక్కపక్షం వారే నిర్ణయించలేరు, అదివారి హక్కు కాదు.

ఒకభాగస్వామ్యం నచ్చనప్పుడు ఒకభాగస్వామి నాకీ పొత్తు నచ్చడం లేదు, నేను విడిపోతాను అని చెప్పగలడు, అలా చెప్పేహాక్కు ఒకభాగస్వామికి ఉంటుంది. అప్పుడు మరో భాగస్వామి మాత్రం విడిపోవడానికి వీల్లేదు, మనం కలిసే ఉండాలి అని చెప్పే హక్కు ఉండదు, ఉండేహక్కల్లా విడిపోయే పక్షంలో తన సమస్యలను పరిష్కరించుకోవడమే.

ఒకవేళ ఇద్దరు భాగస్వాములూ కలిసే ఉందామని ఇష్టపడుతున్నా ఎవరైనా బలవంతంగా విడగొడుతుంటే అప్పుడు ఇద్దరు భాగస్వాములూ కలిసి మేం కలిసే ఉంటామని చెప్పడం ఒక హక్కవుతుంది. దానికోసం, బలవంతపు విభజనకు వ్యతిరేకంగా ఇరు పక్షాలూ కలిసి ఉద్యమించవచ్చు. కానీ ఒక పక్షం వారంతా మేం విడిపోతాం మొర్రో అంటుంటే లేదు మీరు కలిసే ఉండాలని చెప్పడం హక్కు కాదు కదా, ఎదుటి వారి హక్కులను కాలరాయడమే.

ఇలా ఎదుటివారి హక్కులను హరించే ఉద్యమాలను కొందరు చదువుకున్నవారు కూడా సమర్ధించడం, దానికి రాజకీయనాయకులు వత్తాసు తెలపడం మాత్రమే కాక ఆనాయకులే ఇలాంటి ఉద్యమాలను సృష్టించడం మనదేశంలో ప్రజాస్వామ్య భావనకే ఒక దెబ్బ. ఇలాంటి దొంగ ఉద్యమాలను లేవదీసేవారు ఎంతమాత్రం క్షమార్హులు కారు.

Sunday, 10 July 2011

భాద్యత కేంద్రానిదే..కానీ వ్యతిరేకించడం మా హక్కు


చివరికి అంతా అనుకున్నదే అయ్యింది. జగన్ తెలంగాణ విషయంపై చేతులెత్తేశాడు. తెలంగాణ ఇచ్చే లేదా ఆపే హక్కు నాకు లేదు, తేల్చాల్సింది కేంద్రమే అంటూ తానూ గోడమీద పిల్లినే అని చెప్పకనే చెప్పాడు. ఇదేమాట ఇన్ని రోజులూ రెండు కల్లూ సొట్టబోయిన చంద్రబాబూ చెబుతున్నాడు కనుక జగన్ కొత్తగా చెప్పిందేం లేదు.

తేల్చాల్సింది కేంద్రమేనంటూ భాద్యత కేంద్రంపై నెట్టివేసే ఈనేతలు కేంద్రం ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు నిర్ణయానికి కట్టుబడి ఉన్నారా? కేంద్రం నిర్ణయానికి కట్టుబడడం అటుంచి తామే అంతకు కొన్ని గంటలముందు ఇచ్చిన హామీలకు కట్టుబడే ఉన్నారా అంటే లేదు.. ఇదే చంద్రబాబు స్వయంగా సీమాంధ్రలో తమ పార్టీనాయకులచేత కృత్రిమ ఉద్యమం సృష్టించడమే కాకుండా అందుకు కావల్సిన మెటీరియల్ మొత్తాన్ని తానే ఎంటీఆర్ భవన్ నుండి సమకూర్చాడు. మరోసారి కేంద్రం తెలంగాణ అనుకూల నిర్ణయం తీసుకుంటే రేపు చంద్రబాబు లాగే జగన్ కూడా అదే పని చేస్తాడు.ప్రస్తుతానికి ఇద్దరూ తెలంగాణలో తమ పార్టీ ప్రతినిధులచేత తామే రాజీనామాలు చేయించి తాము తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకం కాదు అని ప్రజలను భ్రమింపజేద్దామని ప్రయత్నం చేస్తున్నారు.

అంటే ఈరాజకీయ పార్టీలకు తెలంగాణపై నిర్ణయంలో భాగం పంచుకునే భాద్యత లేదు, కానీ కేంద్రం ఏ నిర్ణయాన్ని తీసుకున్నా కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకించే హక్కు మాత్రం ఉందన్నమాట. ఇలాంటి అవకాశవాద రాజకీయాలు ఇప్పటిదాకా చంద్రబాబు దగ్గర ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఇప్పుడు నేను విశ్వసనీయతకు మారుపేరు అని చెప్పుకునే జగన్ కూడా చేస్తూ తానూ ఆతానుముక్కనే అని నిరూపించుకున్నాడు. విశ్వసనీయత అంటే ఆచరణ సాధ్యం కాని ఉచిత పధకాలను గుప్పించి ఖజానాను గుల్లచేసి తన సొంత ఖజానా నింపుకోవడం కాబోలు.

ఇంతకూ చంద్రబాబుకూ జగన్‌కూ ఉన్న తేడా ఏమిటి? ఒకడు వేలకోట్ల అవినీతి చేస్తే మరొకడు లక్షల కోట్లకు అవినీతిని పెంచాడు. కాలం గడుస్తున్నకొద్దీ మన రాష్ట్ర బడ్జెట్ పెరిగినట్లే అవినీతి స్థాయి పెరగడంలో ఆశ్చర్యం లేదు. రేపు చంద్రబాబుకు అధికరం ఇస్తే అతను లక్షలకోట్ల అవినీతిని కోటికోట్లకు పెంచగల సమర్ధుడు. ఒకడు మామకు వెన్నుపోటు పొడిస్తే మరొకడు తండ్రి పదవి అడ్డం పెట్టుకుని లక్షలకోట్లు మేసి ఆస్తితోపాటు అధికారానికీ వారసున్ని నేనేనంటున్నాడు. ఇద్దరూ చేసేది కులరాజకీయాలు, ధన రాజకీయాలే..కానీ తాము రెప్రజెంట్ చేసే కులాల్లో తేడా, అందుకే వారి వారి సమర్ధకులు కూడా మారుతారు, రాష్ట్ర విభజన విషయం వచ్చేవరకూ అందరూ సీమాంధ్ర వాదాన్నే సమర్ధిస్తారు. ఈమాత్రం దానికి కొందరు మాబాబు గొప్ప అంటే కొందరు మా జగన్ గొప్ప అంటూ కేవలం తాము ఏసామాజిక వర్గానికి చెందినవారో చెప్పకనే చెబుతున్నారు.

Thursday, 7 July 2011

కేంద్రం ఇప్పుడు ఏంచెయ్యాలి?

రాష్ట్రవిభజన ప్రస్తుత పరిస్థుతుల్లో కాంగ్రేస్‌కు అనివార్యమని క్రితం పోస్టులో చెప్పుకున్నాం. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న విపత్కర పరిస్థితిని పరిష్కరించి భవిష్యత్లో తమిలనాడులో లాగా కాంగ్రేస్ పూర్తిగా మనుగడ కోల్పోకుండా ఉండాలంటే రాష్ట్రాన్ని ఇప్పుడు విభజించాల్సిందే. అయితే రాష్ట్రాన్ని ఎలా విభజిస్తే ఎక్కువమందిని ఒప్పించి లాజికల్‌గా విభజించి కాంగ్రేస్‌కూడా లబ్ది పొందవచ్చు?

తెలంగాణ మాత్రం విభజించి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే పూర్తిగా 1956 క్రితం పరిస్థితిలోకి, ఫజల్ అలి శిఫార్సుల్లో మొదటి సిఫార్సుకి వెల్లినట్టు అవుతుంది. అయితే ఇలా చేస్తే తెరాసకు పూర్తిగా తల వంచినట్లవుతుంది. తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా కాంగ్రేస్ తెరాసపై ఆధారపడాల్సి వస్తుంది. అలాగే కొందరు కావూరు లాంటి నేతలు రాష్ట్ర విభజనకు ఒక ప్రాతిపాదిక ఉండాలి, తెరాస చెప్పినట్లు జరగదు అంటున్నారు. ఇవన్ని దృష్టిలో పెట్టుకుని మేము కాస్త శాస్త్రీయంగా విభజన చేశాం అని కాంగ్రేస్ చెప్పుకోవచ్చు కూడా. అయితే రాష్ట్రాన్ని ఎలా ఎన్ని ముక్కలు చెయ్యొచ్చు?

1) మూడు ప్రాంతాలను మూడు రాష్ట్రాలు చెయ్యడం ఒక వాదన. అయితే రాయలసీమకు ఒక రాష్ట్రంగా మనగలిగే అంత వనరులు లెవ్వు కనుక ఇది సాధ్యం కాదు.
2) గ్రేటర్ హైదరాబాద్‌ను ఒక రాష్ట్రంగా మార్చాలనేది ఒక వాదన...గ్రేటర్ హైదరాబాద్ తాగునీటివిషయంలో మిగతా ప్రాంతాలపై ఆధారపడాల్సి ఉంటుంది కనుక ఇది కూడా సాధ్యం కాదు. పైగా హైదరాబాద్‌ను చేస్తే మిగతా అన్ని మహానగరాలనూ రాష్ట్రాలుగా మార్చాలని డిమాండ్ రావొచ్చు..ఇది ప్రాక్టికల్ కాదు.
3)మహబూబ్ నగర్ను కలిపి గ్రేటర్ రాయలసీమ ఏర్పాటు చెయ్యటం...ఇప్పటిఏ సమైక్య రాష్ట్రంలో పూర్తిగా వెనుకబడి నీల్లున్నప్పటికీ తమకు దొరకని పరిస్థితిలో ఉన్న మహబూబ్‌నగర్ వాసులు దీన్ని ఎంతమాత్రం ఒప్పుకోరు.
4) రాయల తెలంగాణ...ఇది ఇద్దరికీ ఇస్టం ఉండని మరో బలవంతపు పెల్లి జరపడమే. పైగా అంతపెద్ద రాష్ట్రానికి తీరప్రాంతం అస్సలు ఉండదు.
5. పైవన్నీ కాకుండా ఉత్తరాంధ్రను తెలంగాణలో కలిపి రాష్ట్రాన్ని ఉత్తర దక్షిన భాగాలుగా ఈమ్యాపులో చూపినట్లు విభజిస్తే చాలా సమస్యలు తీరుతాయి. ప్రస్తుతం ఎలక్షన్లు జరిగేటప్పుడు ఈవిధంగానే మొదటి, రెండో ఫేజుల్లో జరుగుతయి. గత ఎన్నికల్లో వైఎస్సార్ పై ప్రాంతపు ఎన్నికలు కాగానే మాటమార్చి హైదరాబాద్ వెల్లాలంటే వీసాలు తీసుకోవాలా అన్న విషయం తెలిసిందే.


ఉదాహరణకు:
1) రెండు రాష్ట్రాలకూ సముద్ర తీరం దొరుకుతుంది.
2) ఉత్తరాంధ్ర కూడా తెలంగాణాలాగే వివక్షకు గురవుతున్న ప్రాంతం.. విడిపోతే మధ్యకోస్తా వారు తమకు అన్యాయం చేస్తారని వీరికి భయం ఉంది.
3) ఉత్తరాంధ్ర, తెలాంగాణ ప్రాంతాల సామాజిక, ఆర్ధిక పరిస్థితుల్లో పోలిక ఉంటుంది. రెండూ వెనుకబడిన ప్రాంతాలు, రెండు చోట్లా దళిత, బీసీ వర్గాలు ఎక్కువ.
4) తెలంగాణలో ఉత్తరాంధ్ర కూడా ఉండడం వలన పూర్తి తెరాస ఆధిపత్యం కాకుండా కాంగ్రేస్ తన ఆధిపత్యాన్ని నిలుపుకునే ప్రయత్నం చెయ్యొచ్చు.
5) ఉత్తరాంధ్రలో బలం పెంచుకుంటున్న జగన్‌కు చెక్ చెప్పినట్లవుతుంది.

Sunday, 3 July 2011

హైదరాబాదులో రాజకీయ మతకల్లోహాలు ఏనాటివి?

మనదేశంలో మతకల్లోహాలు కొత్తగాదు, హిందువులూ, ముస్లిముల ఘర్షణలు కొత్త గాదు. అసలు మనదేశంలో అనేముంది ప్రపంచంలో అనేక చోట్ల మతయుద్ధాలు, ఘర్షనలు ఏదో ఒక ప్రాంతంలో జరుగుతూనే ఉంటాయి. అభివృద్ధి చెందిన పాశ్చాత్య దేశాల్లో ఈమధ్య తగ్గాయి కానీ చరిత్రలో అక్కడ కూడా మతఘర్షణలు జరిగిన ఉదంతాలు అనేకం. మనదేశంలో ముస్లిములు అధికంగా ఉండే అన్ని ప్రాంతాల్లో మతఘర్షణలు అనేక సందర్భాల్లో జరిగాయి. మతం ఉన్నన్నాల్లూ మతఘర్షనలు ఏదో ఒకరీతిలో ఉంటాయనేది మత ఛాందసవాదులు తప్ప మిగతావారంతా ఒప్పుకునేదే. అందుకే ఈమతాల అడ్డుగోడలు తొలగిపోవాలని అభ్యుదయవాదులందరూ చెబుతారు.

మిగతా ప్రాంతాల్తో పోల్చినపుడు హైదరాబాదులో మతసామరస్యం బాగానే ఉండేది అనేది అందరూ ఒప్పుకునే విషయం. ఇంతమంది ముస్లిములు ఇక్కడ ఉన్నప్పటికీ ఇక్కడ హిందువులూ, ముస్లిములూ by and large కలిసే ఉన్నారు. కలిసి ఒకరి పండుగలు మరొకరు చేసుకున్నారు, ఒకరి పెల్లిల్లకు, ఫంక్షన్లకూ మరొకరు అతిథులయ్యారు. ఏదో కొన్ని చెదురుమదురు సంఘటనలు మినహా పెద్దేత్తున ఇక్కడ ఘర్షణలు జరిగిన ఉదంతాలు చరిత్రలో కనపడవు.ఇప్పటికీ పాతబస్తీలో హిందువులూ, ముస్లిములూ చక్కగా కలిసే ఉంటారు.

అయితే ఎప్పుడయితే రాజకీయ నాయకులు తమ రాజకీయ అవసరాలకు హైదరాబాద్ పాతబస్తీని వాడుకోవడం మొదలు పెట్టారో అప్పటినుంచీ ఇక్కడ పెద్ద ఎత్తున ఘర్షనలు చెలరేగాయి. వందల సంఖ్యలో ప్రజలు మృతి చెందారు. అయితే ఇవి నిజమయిన మత ఘర్షనలు కావు. రాజకీయ పార్టీలు తమ రాజకీయ అవసరాలకు మతవిభేదాలను రెచ్చగొట్తడం ఒక ఎత్తు. అది దేశంలోని మిగతా ప్రాంతాల్లో మొదలయ్యింది. కానీ ఇక్కడి పరిస్థితి వేరు. రాజకీయ పార్టీలు తమ అనుచర బృందాన్ని ఇతర ప్రాంతాలనుండి తెప్పించి హత్యలు చేసి వాటికి మతం రంగు పుయ్యటం మాత్రం హైదరాబాదుకే ప్రత్యేకమయింది. ఇవి ఎంత ఘోరంగా జరిగాయి అంటే ఒకే బస్టాపులో హిందూ, ముస్లిం లిద్దరూ ఉంటే స్కూటర్ మీద వచ్చిన దుండగులు హిందూ, ముస్లిం లిద్దరిపై దాడి చేసినలాంటి ఉదంతాలెన్నో.

ముఖ్యమత్రులను మార్చాలన్నా, కొందరు నేతలకు తమ ప్రాబల్యం పెంచుకోవాలన్నా హైదరాబాదులో మతఘర్షణలను కృత్రిమంగా సృష్టించడం గత మూడుదశాబ్దాలుగా మొదలయిన నాయాట్రెండు. కృత్రిమంగా ఉద్యమాలే సృష్టించిన ఘనులకు కృత్రిమ మతఘర్షణలు సృష్టించడం పెద్ద విద్యేం కాదు. ఈ ట్రెండును సృషించింది, రాజకీయ అవసరాలకోసం హైదరాబాదుకు బయటినుండి తెప్పించిన గూండాలద్వారా మతకల్లోహాలు సృష్తించిందీ ఎవరనేది ఇక్కడ అందరికీ తెలిసినా బయటికి చెప్పలేని ఒక బహిరంగ రహస్యం. ఇది ఎవరి రంగప్రవేశం తరువాత మొదలయిందో కూడా తెలిసిందే. మజ్లీస్ లాంటి ఒక ముఠాకు అనవసర సీనిచ్చి దాన్ని బలంగా తయారుచేసింది కూడా ఈవర్గమే.

సాధారణంగా ఒక వ్యాసం రాసేప్పుడు విషయాన్ని వివరించగలిగే సౌలభ్యం ఉన్నట్టు టీవీ చానెల్స్‌లో అందునా సీమాంధ్రా మీడియా చానెల్లుగా ముద్రపడ్డ కొన్ని చానెల్లు ఒకరిపై ఒకరు అరుచుకోవడమే చర్చ అని చెప్పబడే చర్చాకార్యక్రమాల్లో ఉండదు. అలాంటి ఒక అరుపుల కార్యక్రమంలో ఒక తెలంగాణ అనుకూల మీడియా విశ్లేషకుడు హైదరాబాదులో మతఘర్షణలు మొదలయింది సీమాంధ్ర నేతల ప్రవేశం తరువాతే అని చెప్పాట్ట, నేనయితే అది చూళ్ళేదు. ఆచత్త కార్యక్రమాన్ని పట్టుకుని ఆ విశ్లేషకుడు చవకబారున్నర విశ్లేషకుడు, సిగ్గులేని ప్రొఫెసరు అంటూ రకరకాల పోస్టులు బ్లాగుల్లో వెలిశాయి, అక్కడికి ఈయన తప్ప మిగతా విశ్లేషకులందరూ పెద్ద సుద్దపూసలు, ఈయన తప్ప మిగతా వారు చెప్పేవన్ని చరిత్ర సత్యాలు. అంతే కదా మన పచ్చకల్లకు అనుకూలంగా మాట్లాడేవాడు గొప్ప విశ్లేషకుడు, వ్యతిరేకంగా మాట్లాడే వాడు చవకబారున్నర....మనం మాట్లాడిందే ఎప్పటికీ సత్యం.మనం ఇన్నాల్లూ పుస్తకాల్లో చదువుకున్న తెలుగుజాతి ఐక్యతకోసం పొట్టి శ్రీరాములు చనిపోయాడనేది గొప్ప సత్యం.

పచ్చకామెర్లు వచ్చిన కొందరికి తప్ప వేరెవరికి నచ్చని పచ్చబాబు రెండుకల్ల సిద్దాంతం మాత్రం గొప్ప నీతీ, నిజాయితీ, ధర్మం. ఇలాంటి రాతలు రాసేవాల్లందరూ నిజంగా తాము నమ్మినదాన్నే రాస్తారా.. ఏదో తమవర్గానికి కొమ్ముకాసేవారిని ఎలాగయినా సమర్ధించాలనేది వీరి తపన గానీ. అసలు తెలంగాణ లాంటి ఒక సున్నితమైన అంశంపై ఎక్కువమంది సాధారన ప్రజలకు ఏది మచిది అన్న కోణంలోనుండి కాకుండా రాష్ట్రాన్ని విభజిస్తే నాకు, నా సామాజిక వర్గానికి, నా అభిమాన రాజకీయ పార్టీకి, అభిమాన రాజకీయ నాయకుడికి ఎంత లాభం, ఎంత నష్టం అంటూ కూడికలూ తీసివేతలూ వేసేవారివలననే ఇలాంటి వాదోపవాదాలని నా అభిప్రాయం.

క్రికెట్ మాచ్ ఓడిపోతే?

మన క్రికెట్ జట్టు ఒక గెలవాల్సిన క్రికెట్ మాచ్ చివరిబంతుల్లో ఏదో బౌలర్ లేదా బాట్స్‌మన్ తప్పిదం వల్ల ఓడిపోతే అది క్రికెట్ అభిమానులందరినీ ఎంతో బాధిస్తుంది. అంతా ఒక జట్టు ఓడిపోయినట్లు గాక తామే ఓడిపోయినట్లు భావిస్తారు.అలాంటిది ఒక రాష్ట్రం ఏర్పాటు, కోట్లమంది ప్రజల ఆకాంక్ష చివరిదాకా వచ్చి, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ఏర్పాటుపై ఒక నిర్ణయం తీసుకుని చివరికి ఆ రాష్ట్ర ఏర్పాటు ఆగిపోతే ఎలా ఉంటుంది?

అది కూడా కొంతమంది స్వార్ధ నాయకులు, కొన్న్ని రాజకీయ పార్టీలు తమ స్వార్ధ లాభాలకోసం మాటలు మార్చి, ధనబలంతో, మీడియా బలంతో, అధికార బలంతో, అంగబలంతో లేని ఉద్యమాలను పీసీ సర్కార్ కన్న గొప్పగా మాయాజాలం చేసి సృష్టించి ఆపితే ఎలా ఉంటుంది?

ఈబాధ ఇక్కడి ప్రజలను కలవరపరిచింది. ఈవోటమి ఇప్పటికే ఆరువందల ప్రాణాలు బలిగొంది. ఇప్పటిదాకా నాయకులు, రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు ఈప్రాంత ప్రజలతో ఆటలు ఆడుకుంటూ మాచ్‌ఫిక్సింగ్ చేస్తుంటే చూసిన ప్రజల సహనం నశించింది. ఇప్పుడు ప్రజలు తాము ఎంతకాలమూ ఆటలో పావులు కాదని తేల్చారు. దాని పరిణామమే ఇప్పుడు కాంగ్రేస్, తెలుగుదేశం నేతల్లో వణుకు. తెలంగాణ సాధించకపోతే తాము తమ నియోజకవర్గాల్లో మల్లీ అడుగుపెట్టలేని పరిస్థితి. తెరాసకు తాము గతంలో చెన్నారెడ్డిలాగా ప్రజలను వంచిస్తే ప్రజలు సహించరనే హెచ్చరిక.

ఎలాగయితేనేం, ఇప్పుడు ప్రజలు నాయకుల ఆటల్లో బొమ్మలు కావడం మాని నాయకులను శాసించే స్థితికి వచ్చారు. అందుకే ఇప్పుడు కాంగ్రేస్, తెలుగుదేశం ప్రతినిధుల రాజీనామాలు. ఆలస్యంగా నిర్ణయం తీసుకున్నా చివరికి ఎలాగోలా గట్టి నిర్ణయం తీసుకున్న ఈనాయకులు తమ నిర్ణయానికి కట్టుబడి ఉంటే వెక్కిరించే సీమాంధ్ర నేతలు, మీడియా, మాస్వార్ధలాభంకోసం మీరు మాతో కలిసే ఉండాలి, విడిపోయే హక్కు మీకులేదంటూ మిడిసిపడే కుహనా సమైక్యవాదులూ అందరూ గిజగిజలాడడం ఖాయం. ఈనాయకులు ఎంతవరకూ తమ నిర్ణయానికి కట్టుబడి ఉంటారనేదానికి ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే. ప్రస్తుతానికి మాత్రం తెలంగాణ కాంగ్రేస్, తెలుగుదేశం ప్రజాప్రతినిధులకు నా అభినందనలు.

Tuesday, 3 May 2011

నడ్డి విరిచే వడ్డీ రేట్లు





పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని (ఇన్‌ఫ్లేషన్) అదుపుచెయ్యడానికని రిజర్వ్ బ్యాంక్ మరోసారి వడ్డీరేట్లు పెంచింది. వడ్డీ ధరలు పెంచడం సంవత్సరకాలంలో ఇది బహుషా నాల్గోసారి అనుకుంటా. వడ్డీ రేట్లు ఎంతపెంచినా ఇన్‌ఫ్లేషన్ పెరుగుతుంది కానీ తగ్గడం లేదు. అసలింతకీ ఇన్‌ఫ్లేషన్‌కూ వడ్డీ రేట్లకూ సంబంధం ఏమిటి? మిగతా దేశాల్లో ఇంత పెరగని ఇన్‌ఫ్లేషన్ ఒక్క మన దేశంలోనే ఎందుకు పెరుగుతుంది? అసలు ఇన్‌ఫ్లేషన్ పెరుగుదల, వడ్డీ రేట్ల పెరుగుదల ఈ రెండింటిలో ఏది సామాన్యునిపై ఎక్కువ భారం వేస్తుంది? లాంటివన్ని మనబోటి వారికొచ్చే ధర్మ సందేహాలు.

"వడ్డీ రేట్లు పెరిగితే ద్రవ్యం విలువ పెరుగుతుంది, కాబట్టి డబ్బు సప్లై తగ్గుతుంది. డబ్బు సప్లై తగ్గితే వస్తువుల డిమాండ్ తగ్గుతుంది కాబట్టి ధరలు తగ్గుతాయి." ఇది ధరలకు, వడ్డిరేట్లకూ ఉన్న థీరిటికల్ లింకు. ధరలను తగ్గించడానికి మన ప్రభుత్వానికి తెలిసిన మొదటి సూత్రం ఇదే కాబట్టి ధరలు పెరిగినప్పుడల్లా వడ్డీరేట్లు తగ్గిస్తారు.కానీ నిజంగా ఈసూత్రం పనిచేసి ధరలు తగ్గుతాయా అనేది సందేహాస్పదం.

ఇంకా కుదరకపోతే ఆహార పదార్థాల ఎగుమతులపై ఆంక్షలు విధిస్తారు. అది ఈపాటికే చేసి చక్కర, బియ్యంలపై ఎగుమతులపై కంట్రోల్ పెట్టారు. దానివలన బయట చక్కర డిమాండ్ ఎక్కువ ఉన్నా మన చెరకు రైతుకు మాత్రం గిట్టుబాటు ధర రావట్లేదు.

మిడిల్ ఈస్ట్ క్రైసిస్ వలన క్రూడ్ ధరలు పెరుగుతున్నాయి, దానికి వడ్డీ రేట్లతో సంబంధం లేదు. వర్షాలు బాగోలేక, పంటలు పండక, తుఫానులు, వడగళ్ళ వానలు లాంటి ప్రతికూల పరిస్థితులవలన,దళారీలూ, అక్రమ నిలువలవలన ఆహారధరలు పెరుగుతున్నాయి. వడ్డీరేటు పెరిగినా తరిగినా ప్రజలు బతకడానికి తినడం తప్పదు కాబట్టి ఆహార ధరలు కూడా వడ్డీరేటు పెరగడం వలన తగ్గే అవకాశాలు లేవు.

ఇల్లధరలు బహుషా వడ్డీరేటు పెంచితే తగ్గొచ్చు కానీ దానివలన ఇన్‌ఫ్లేషన్ పెద్దగా తగ్గే అవకాశం లేదు. మరీ ఊరికే ఇలా వడ్డిధరలు పెంచడం వలన నిజంగా సాధించేది ఏమైనా ఉందా? వడ్డీ రేట్లు పెరగడం వలన ఇంఫ్రాస్ట్రక్చర్ కంపనీలు నష్టపొతాయి, కాబట్టి ఇంఫాస్ట్రక్చర్ గ్రోత్ తగ్గుతుంది. మధ్యతరగతి ప్రజలలో బ్యాంకులో డబ్బులు డిపాజిట్ చేసేవారికంటే అప్పులు తీసుకునేవారే ఎక్కువ. వారికి వడ్డీరేట్లు పెంచినప్పుడల్లా నడ్డివిరుగుతుంది. మరి ఈ వడ్డీ రేట్లు పెంచడం వలన ఇప్పుడు ఎవరికి లాభం?

Thursday, 31 March 2011

రామోజీ షేరుధర ఐదులక్షలా?

రామోజీరావు తన ఈనాడు వందరూపాయల షేరునొ ఒక్కోటి రు.5,28,630/- కు అమ్ముకోగా సాక్షి 10రూపాయల షేరును 350/- కు అమ్ముకుంటే తప్పేంటి?" ఇది సాక్షిలో పెట్టుబడులను సమర్ధిస్తూ వైఎస్సార్ అసెంబ్లీలో చెప్పిన సమాధానం, జగన్ సమర్ధీకులు నిత్యం టీవీల్లో కోడై కూసే విషయం, సాక్షి అనేకసార్లు తన పేపర్లో పెట్టుబడులను సమర్ధించుకుంటూ రాసుకున్న విషయం, ఇవ్వాల్టితో సహా. ఇంతకూ ఒకషేరుధర 5 లక్షలు అయితే ఎక్కువ ధర పెట్టినట్టు, రు. 350అయితే తక్కువ ధర పెట్టినట్లా? ఈ లెక్కన టెక్‌మహింద్రా షేరు ధర 670, విప్రో షేరుధర 450 కాబట్టి టెక్‌మహింద్రా విప్రోకంటే పెద్ద కంపెనీ అవుతుందా?

ఒక కోటి రూపాయల విలువైన వ్యాపారాన్ని నాలుగు వాటాలు చేస్తే ఒక్కో షేరు ధర 25 లక్షలు, అదే నాలుగు లక్షల వాటాలు చేస్తే ఒక్కో షేరు ధర 25 రూపాయలు. ఈవ్యాపారంలో పావలా వంతు ఎవరికైనా అమాలంటే ఒక్క 25లక్షల షేరు అమ్మినా, లేక లక్ష 25/-ల షేర్లు అమ్మినా తేడా ఏమీ వుండదు. కాబట్టి షేరు ధర ఎంత అనే వాదన అనవసరం, ఎంత వాటాను ఎంత ధరకు అమ్మాడనేదే అక్కడ ముఖ్యం. మరలాంటప్పుడూ అదేపనిగా అసెంబ్లీలోనూ, టీవీల్లోనూ ఇలా రామోజీ 5లక్షలకు ఒక షేరును అమ్మగా సాక్షి ఒక షేరును 350కి అమ్మితే తప్పేమిటని వాదన ఎందుకు?

రామోజీ తన ఉషోదయా పబ్లికేషన్స్‌లో 26 శాతం వాటాను సుమారు వెయ్యిఖోట్లకు అమ్ముకున్నాడు. ఈలెక్కన ఉషోదయ పబ్లికేషన్స్ మొత్తం విలువ నాలుగు వేలకోట్లు. ఈనాడుకు ఉన్న సర్క్యులేషన్‌కు, లాభాలకు, డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్‌కూ కలిపి బహుసా అంత విలువ ఉండొచ్చు. సాక్షి ఏ ఇరవైఐదేల్లనుంచో ఉన్న పేపర్ కాదు, ఇప్పుడే మొదలయింది. అందులో వాటాదారులందరికీ వారివారి పెట్టుబడులను బట్టి సుమారు అదే రేషియోలో వాటా రావాలి. కాబట్టి సాక్షి తన పెట్టుబడులను సమర్ధించుకోవాలంటే అందులో తన పెట్టుబడి ఎంత, అందుకు తన వాతా ఎంత, మిగతా వారి పెట్టుబడీ ఎంత, వారి వాటా ఎంత అనే విషయం చెప్పాలి, అంతే కానీ ఇలా అవసరంలేని, ప్రాముఖ్యత లేని షేరు ధరలు మాట్లాడి సమర్ధించుకుంటే ఏం లాభం లేదు. అయితే ఈవిషయంలో మన ముఖ్యమంత్రులూ, మత్రులూ, మీడియా తమ మోసాల్ను కప్పిపుచ్చుకోవడానికి ఎంత చక్కగా, నిస్సిగ్గుగా అబద్దాలను చెప్పి నిజాలను మసిపూసి మారేడుగాయలు చేస్తాయో మాత్రం తెలుస్తుంది. ఇలాంటి చర్చలు జరిగే అసెంబ్లీలో చర్చలకు ఉన్న విలువెంత? అలాంటి అసెంబ్లీలో విషయాలు చర్చిస్తే ఉపయోగమెంత?

Friday, 25 March 2011

మేధావి వర్గం వివక్షాధోరణి

"చెడ్డవారి దుర్మార్గం కంటే మంచివారి మౌనం ప్రమాదకరం" ఇది మన మేధావివర్గ రాజకీయనాయకుడు జేపీగారు పదేపదే వినిపించే డైలాగు. జేపీగారూ, వినండి: మంచివారి మౌనం కంటే కూడా మేధావివర్గం వివక్షాధోరణి ప్రమాదకరం. ఈ మేధావి వర్గం వారిమాటలతో ప్రమాదం ఎంతంటే వీరుమాట్లాడే నీతులన్ని వింటుంటే ఎంతో బాగున్నట్టుగా ఉంటాయి, నిజమే సుమీ ఎంత అన్యాయం జరుగుతుందీ అనిపిస్తుంది. కానీ వీరి నీతులు చాలా సెలెక్టివ్‌గా ఉంటాయి. తామకు ఎవరు నచ్చకపోతే వారికి మాత్రమే నీతులు వినిపిస్తారు, తమకు నచ్చిన వాడు లేదా తనకంటే బలంగా ఉండి తను నీతులు చెబితే రెండు తగిలించే వాడికి మాత్రం వీరు నీతులు చెప్పరు. చెడ్డవారి దుర్మార్గం సామాన్యుడి బ్రతుకులను మాత్రమే అణచివేస్తాయి, మేధావుల వివక్ష సామాన్యుడి మనసులనే మానిపులేట్ చేస్తాయి.

మన మేధావినాయకుడు జేపీ విగ్రహాలకూల్చివేత సందర్భంగా అరగంటసేపు అసెంబ్లీలో చానా ఆవేశంతో, మధ్యమధ్యలో జాషువా పద్యాలతో, గురజాడ కవిత్వాన్ని ఉపయోగిస్తూ మాట్లాడాడు. కాస్త న్యూట్రల్‌గా ఉంటూ కాస్త విషయాలను గూర్చి పెద్దగా లోతుకు వెల్లని సామాన్య జనం విని ఆహా ఎంతబాగా మాట్లాడాడు జేపీ, ఇది విని కూడా ఫలానా వారికి బుద్ధిరాదేమో అనుకునేలా మాట్లాడాడు. మరి ఇదే పెద్దమనిషి దేశంలోని అతున్నత న్యాయస్థానంలో న్యాయమూర్తిగా పనిచేసిన వ్యక్తి అధ్యక్షతన తెలంగాణా విషయంపై నిజానిజాలు తేల్చమని ఒక కమిటీ వేస్తే ఆ కమిటీ ఉద్యమాన్ని ఎలా అణచివెయ్యాలి, నాయకులను ఎలా కొనాలి, మీడియాను ఎలా మానిపులేట్ చెయ్యాలి అన్న పాఠాలతో ఒక కుట్రపూరితమైన రిపోర్టును వండితే దానిపై మాత్రం అసలేం స్పందించడు. రాష్ట్ర హైకోర్టు కమిటీ అలాంటి రిపోర్టును ఇచ్చినందుకు నిందిస్తే ఇతనికి మాత్రం పట్టదు.

ఉస్మానియా విద్యార్థులను రాక్షసంగా హాస్టల్లలో బంధించి గంటలతరబడి కొడితే రాష్ట్ర హైకోర్టు ఇది మానవహక్కుల ఉల్లంఘన అని చెప్పినా ఇతను మాత్రం అసలేం స్పందించడు. పైగా ఒక టీవీ షోలో మాట్లాడుతూ తెలంగాణాలో విద్యార్థుల ఆత్మాహుతిని చాలా తక్కువగా చేస్తూ ఈ దేశంలో రోజుకు ఎంతమంది ఆత్మహత్యలు చేసుకోవడంలేదు అని వాఖ్యానిస్తాడు. అప్పులకు తట్టుకోక చేసుకొనే రైతు ఆత్మహత్యలకూ, ఉద్యమంలో ఆత్మాహుతి చేసుకునే వారికీ ఈయన దృష్టిలో తేడా ఏంలేదు. ఒక తెలంగాణా సగటుపౌరుడు ఈయన నెత్తిపై ఒకటి ఇచ్చినతరువాత కూడా ఈయన తనవివక్షను మానుకోలేదు.

ఇక మన సీపీఎం మేధావులు మరోతీరు. ఊరందరిదీ ఒకదారైతే ఉలిపికట్టెది మరో దారన్నట్లు వీరి మార్క్సిస్టు మేధస్సు ఎప్పుడూ అడ్డదిడ్డంగానే ఆలోచిస్తుంది. వీరిదృష్టిలో హిందువులకు కొమ్ముకాసేవారు మతతత్వ శక్తులు, ముస్లిములకు కొమ్ముకాసేవారు మాత్రం కాదు. రాష్ట్ర హైకోర్టు శ్రీక్రిష్ణ రిపోర్టు ఎనిమిదో అధ్యాయాన్ని కమీషను తమ విధులను విస్మరించి కొందరికి కొమ్ముగాస్తూ రాసిందని చెప్పి రిపోర్టును బహిర్గతం చెయ్యాలని తీర్పిస్తే ఈ సీపీఎం మేధావులు క్రిష్ణకమిటీని తప్పు పట్టరు, తీర్పిచ్చిన న్యాయమూర్తిని తప్పుపడతారు. పైగా మీడియానూ, పార్టీలనూ మేనేజ్ చెయ్యాలనే అనైతికమయిన పనులను చెప్పిన రిపోర్టును సమర్ధిస్తూ ఇవన్ని ఎవరికీ తెలియని విషయాలంటూ విషయాన్ని పలుచన చేస్తారు.

Thursday, 10 March 2011

బ్లాగుల్లో కాన్స్పిరసీ థీరీలు


చరిత్రలో కాన్స్పిరసీ థీరీలు అనేకం. 9-11 అంతా ఇన్‌సైడర్ జాబ్, అసలు నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ చంద్రునిపై కాలు పెట్టనే లేదు, జీసస్ క్రైస్ట్ కు సంతానం ఉండేది లాంటివి అనేక థీరీలు ఉన్నాయి. ఇవన్నీ చదవడానికి మాత్రం బాగుంటాయి, కానీ ఇవి సత్యదూరాలనేవి అందరూ ఒప్పుకునేవే. ఈ కాన్స్పిరసీ థీరీలకు సాధారణంగా ఎలాంటి ఎవిడెన్స్‌లూ ఉండవు, కేవలం కొన్ని ఊహజనిత కల్పనల ఆధారంగా ఇవి అల్లబడతాయి. ఇది ఇలా అయ్యుండొచ్చు, అలా జరిగుంటే వాడికి లాభం లాంటి వాదనలపైన ఈథీరీలు ఆధారపడతాయి కాబట్టి ఇవి ఎవరినయితే టార్గేట్ చేస్తాయో వారంటే ఇష్టం లేనివారు ఈథీరీలను సులభంగా నమ్ముతారు, లేక నమ్మినట్లు నటిస్తారు. ఉదాహరణకు అమెరికా అంటే గిట్టనివారు నాసా చంద్రునిపై లాండింగ్ ఫేక్ చేసిందంటే ఒప్పుకుంటారు, అది అబద్దమయినా.

సాధారణంగా కాన్స్పిరసీ థీరీల పుట్టుకకు రెండు కారణాలు ఉండొచ్చు. మొదటిది తమకు నచ్చని వారిపై దుమ్మెత్తి పొయ్యడానికి, నచ్చినవారిని నేరం నుంచి తప్పించడానికి కాన్స్పిరసీ థీరీలు వాడుకోవచ్చు. రెండవది కొందరు మానసిక జబ్బుతో బాధపడుతున్నవారు జరగని వాటిని జరిగినట్లు ఊహించుకొని ఎవరో తమపై కుట్ర చేస్తున్నారనే ఒక ఆందోళనతో బాధపడుతూ సంబంధం లేని డాట్స్‌ను కలుపుతూ థీరీని అల్లవచ్చు.

తెలుగు బ్లాగులు కూడా కాన్స్పిరసీ థీరీలకు కొత్తకాదు. అడపా దడపా ఎవరో ఒకరు "ఇది విన్నారా, చంద్రునిపై లాండింగ్ నాసా ఫేక్ చేసిందట" లాంటి టపాలు ఎవరో ఒకరు రాస్తూనే ఉంటారు, అదే ఫ్రీక్వెన్సీలో ఉన్నవారు కొందరు ఆవాదనను సమర్ధిస్తూ కామెంట్లు రాస్తారు. ఇవి ఎక్కడొ నెట్‌లో చదివిన థీరీలు. అయితే తెలుగుబ్లాగుల్లోనే పుట్టిన ఇండిజీనియస్ థీరీలు కూడా ఉన్నాయి. ఇందులో నాకు తెలిసినవి రెండు బ్లాగులు.

మొదటిది అందరికీ తెలిసిన అమ్మవొడి బ్లాగులోని సుదీర్ఘమయిన "భారత రాజాకీయ, ఆర్ధిక, సంస్కృతిక వ్యవస్థలపైన కణికవ్యవస్థ కుట్ర". ఇది చక్రవాకం సీరియల్‌లాగా ఎన్నటికీ అయిపోదు. పూర్తిగా ఊహాజనితం, ఏమాత్రం సంబంధం లేని చరిత్రలోని వేర్వేరు కాలాల, ప్రాంతాలకు చెందినివారిని కలుపుతూ అల్లిన కథ. దీని గూర్చి ఇంతకుముందు నేను రాసిన సటైరు ఇక్కడ చదవచ్చు.

రెండవది కలగూరగంపలోని కలగాపులగమయిన టపాలు. ఉదాహరణకు "నీళ్ళపై నిప్పులు: ఆర్డీఎస్ పై దాడి తెరాసవారే చేసి ఉండొచ్చు", "ఇండియన్ నేషనల్ కాంగ్రేస్ కుట్ర - తెరాస పుట్టుక". ఇవి చదివితే ఇందులో వాస్తవాలు సున్నా, ఇది కేవలం తెలంగాణాపై అక్కసుతో అల్లిన వంటకము మాత్రమే అని తెలుసుకోవడం అంతకష్టం కాదు. మూఖ్యంగా ఆర్డీఎస్ గురించి, అసలు చేసింది ఎవరనేది అందరికీ బహిర్గతం, అదేమీ రహస్యంగా చెయ్యలేదు,కొత్తగా చెయ్యలేదు, ఆతరువాతకూడా చేసినవారు బహిరంగంగానే స్టేట్‌మెంట్లు గుప్పిచ్చారు. అయినా ఇలా కేవలం గిట్టని వారిపై బురదజల్లడం కోసం మాత్రమే అల్లిన చత్త సిద్ధాంతాలవలన ఎవరికి లాభం?

Friday, 25 February 2011

వర్మ చేతిలో క్లీన్‌బౌల్డయిన రజనీకాంత్‌

రోజూ అందరినీ రకరకాల ప్రశ్నలతో కంఫ్యూజ్ చేసి కంగారుపెట్టే TV9 రజనీకాంత్ ఈరోజు రాంగోపాల్‌వర్మ చేతిలో కంప్లీట్‌గా క్లీన్‌బోల్డయ్యాడు. గంటసేపు జరిగిన ప్రోగ్రాంలో కనీసం ఒక్కసారి కూడా రాంగోపాల్‌వర్మకు సమానస్థాయిలో కౌంటర్ ఆర్గ్యుమెంట్ ఇవ్వలేకపొయ్యాడు. అనేక సందర్భాల్లో డిస్కషన్ ఎలా నడపాలో తెలియక వెర్రిమొహం వేశాడు. తనవాదనకు పనికొస్తారేమోనని ఇద్దరు మూవీ జర్నలిస్టులని పిలిస్తే వాల్లు ఇంకొంచెం కంఫ్యూషన్ క్రియేట్ చేశారు కానీ ఏవిధంగానూ రజనీకాంత్‌కు సహాయం కాలేకపొయ్యారు.

రోజూ అందరు పబ్లిక్ ఫిగర్లపైనా బురదచల్లి, మల్లీ వారొచ్చి తమపైన వచ్చిన వార్తలను ఖండిస్తే మరొకసారి అదికూడా చూపించి టీఆర్పీ పెంచుకోవడానికి చీప్‌ట్రిక్స్ ఆడే TV9 రాంగోపాల్‌వర్మతో ఎందుకు పెట్టుకున్నామురాబాబూ అనుకునేలా డిస్కషన్ నడిచింది. ఎలాగయినా సరే వర్మను వెధవను చేద్దామని అదే ప్రశ్నను మల్లీమల్లీ ఎపాటిలాగే అడిగిన రజనీకాంత్ ఈసారి మల్లీమల్లీ వెధవయ్యాడు.

రాంగోపాల్‌వర్మ పూర్తి డిస్కషన్‌లో ఒకే పాయింటుపైన ఉన్నాడు. తను తీసే సినిమాలు బాగులేవని విమర్శించొచు, కానీ వర్మ ప్రేక్షకులను వెధవలు అనుకుంటాడని ఆయన తరఫున వీరెలా చెబుతారనే దానికి రజనీకాంత్ దగ్గర సమాధానం లేదు. కాస్సేపు బురద జల్లుడు కార్యక్రమం, కాస్సేపు వర్మకు సలహాలిచ్చే కార్యక్రమం, కాస్సేపు ప్రేక్షకులను రక్షించబోయే కార్యక్రమం చేసి అన్నిట్లో ఫెయిల్ అయ్యాడు. ఇక ఏనాడూ సమాజానికి పనికొచ్చే ఒక్క స్పెషల్ రిపోర్టు చూపించక ఎప్పుడూ పనికిమాలిన డిబేట్‌లు పెట్టి ఒకరినొకరు తిట్టుకునేట్టు చెయ్యడం, లేకపోతే పబ్లిక్‌ఫిగర్లపై బురదజల్లడం చేసి టీఆర్పీ పెంచుకునే TV9 వర్మకు సామాజిక స్పృహ నేర్పే ప్రయత్నం చెయ్యబొయి బోర్లాపడ్డం గమ్మత్తుగా ఉంది. పనిలో పనిగా ఇందులో యండమూరి కూడా ఫూల్ అయ్యాడు.

Sunday, 13 February 2011

ఒక జెస్సికా లాల్, ఒక ఆయేషా మీరా



ఒక జెస్సికా లాల్: డెల్లీకి చెందిన ఒక అప్‌కమింగ్ మోడల్. అప్పర్ మిడిల్ క్లాసుకు చెందిన జెస్సికా ఒక చెల్లెలు, తల్లి దండ్రులతో కలిసి ఉండేది. ఒకానొక పార్టీలో అంతా చూస్తూ ఉండగా ఒక హై ప్రొఫైల్, డబ్బూ, అధికారమూ కల వ్యక్తి చేత చంపబడింది. ముందుగా ప్రత్యక్ష సాక్షుల స్టేట్‌మెంట్‌ల ఆధారంగా ఆ వ్యక్తిని అరెస్టు చెయ్యడం జరిగింది. ముద్దాయికి శిక్షపడడం కోసం ముద్దాయి చెల్లెలూ, తల్లితండ్రులూ తమ శాయశక్తులా కృషి చేశారు. ప్రత్యక్ష సాక్షులను బతిమాలి, బామాలి కేసును నడిపించారు. కొంతమంది సిన్సియర్ పోలీసులు కూడా కేసు నిరూపణకోసం కష్టపడ్డారు.

కానీ ఆ తరువాత సాక్షులంతా ఒక్కొక్కరుగా బెదిరింపబడడం వల్లనో, డబ్బు వల్లనో కేసులో అడ్డం తిరిగి సాక్షాన్ని ఉపసంహరించుకున్నారు. ఫోరెన్సిక్ సాక్షాలు తారుమారు చెయ్యబడ్డాయి.కోర్టులో కేసు కొట్టివెయ్యబడింది. అంత సులభంగా కేసునుండి ముద్దాయి తప్పించుకోవడం చూసిన కొంతమంది మీడియా వారు ముద్దాయిలు తప్పుడు సాక్షాలు ఇచ్చినట్లుగా నిరూపించారు. డెల్లీ ప్రజలు మీడియాకు మద్దతు ఇచ్చారు. కేసు మల్లీ ఓపెన్ చెయ్యబడింది. ఎలాగయితేనేం చివరికి జెస్సికాకు న్యాయం జరిగింది, ముద్దాయికి శిక్ష పడింది.

ఒక ఆయేషా మీరా: విజయవాడకు దగ్గర్లో ఒక పేద కుటుంబానికి చెందిన ఆయేషా ఒక చిన్నపాటి ప్రైవేట్ ఉమెన్స్ హాస్టల్లో ఉంటూ బీఎస్సీ చదివేది. ఒకరోజు రాత్రి హాస్ట్లల్లోనే అత్యంత కిరాతకంగా చెరచబడి ఆ తరువాత హత్యకు గురయింది. ఒక హాస్టల్లో ఉన్న అమ్మాయిని హాస్టల్లో జఓబడి చెరిచి చంపినప్పుడు ఖచ్చితంగా అక్కడి వారికి, హాస్టల్ వార్డెన్, వాచ్‌మన్, మిగతా రూంమేట్స్కు తెలియకుండా ఆ సంఘటన జరగడం అసాధ్యం. కానీ ప్రత్యక్ష సాక్షులెవరూ ఎలాంటి సాక్షమూ చెప్పలేదు.హంతకులు హై ప్రొఫైల్, డబ్బూ, అధికారము కల ఒక మాజీమంత్రి మనవడని హతురాలి తల్లి ఆరోపణ. అయితే వారి ఆరోపణల ఆధారంగా ఎలాంటి విచారణా జరగలేదు. హాస్టల్‌లోని మిగతా విద్యార్థులను విచారించే ప్రయత్నం చెయ్యలేదు.

ముందు ఒకడిని హంతకుడని చెప్పి పోలీసులు అరెస్టు చేశారు. అతని తండ్రి ఒక చిన్న లాయర్‌ను పెట్టుకోగల స్థోమత కలిగిన వాడు కావడంతో కేసు నిలవలేదు. ఆ తరువాత మరో చిన్నపాటి చిల్లర దొంగను అరెస్టు చేశారు. అరెస్టు కాబడ్డ వ్యక్తీ, హతురాలి కుటుంబం కూడా పేదవారు, లాయర్‌ను పెట్టుకోనే స్థోమత లేని వారు, మీడియాలో గట్టిగా మాట్లాడే అంత తెగువలేని వారు. హతురాలి తల్లి అరెస్టు కాబడ్డవ్యక్తి హంతకుడు కాదు అని మొత్తుకున్నా ఎవరూ వినిపించుకోలేదు. సాక్షాలు, ఆధారాలూ అన్ని తయారు చెయ్యబడ్డాయి. ఇక్కడ ఏ మీడియా కూడా ఆయేషాకు న్యాయం చెయ్యాలని పోరాటం చెయ్యలేదు. చివరికి ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తిపై ఎలాంటి విచారణ జరగలేదు, మరో అమాయకుడుకి శిక్ష పడింది. ఆయేషాకు న్యాయం జరగలేదు.

నీతి: మనదేశంలో నోరున్న అర్బన్ మధ్యతరగతికి లేటుగా నయినా న్యాయం జరగవచ్చు. కనీసం డబ్బూ అధికారాల బలంతో వీరు పోరాటం చెయ్యగలరు. అర్బన్ మిడిల్ క్లాసుకు మీడియా మద్దతు ఫరవాలేదు. కానీ నోరులేని సామాన్యులకు మాత్రం ఎవరి మద్దతూ లేదు, వీరికి న్యాయం ఎప్పుడూ జరగదు.

Sunday, 6 February 2011

మూడేళ్ళలో మెగాస్టార్ నుంచి జోకర్ స్థాయికి



పాపం చిరంజీవి!! మెగాస్టార్‌గా వెలిగినవాడు చివరికి పేకాటలో జోకరైపొయ్యాడు. లక్షలమంది అభిమానుల అభిమానాన్ని కాసిని మంత్రిపదవులకోసం సోనియా వద్ద తాకట్టు పెట్టాడు. ఎలాగైతేనేం, ఎన్నాళ్ళనుండో జెండా పీకేద్దమనుకున్నా బయటికి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించాడు గానీ చివరికి జెండా పీకేశాడు, దుకాణం అమ్మేసాడు.

కష్టపడి ఒకోమెట్టూ ఎక్కి సినిమాల్లో చిన్నస్థాయి నుంచి అగ్రస్థానంలోకి వెళ్ళాడు. కానీ కష్టపడకుండానే అధికారంలోకి రావాలనుకొని బుక్కైపొయ్యాడు. సినిమాల్లో డైరెక్టరు చెప్పినట్లు నటించడమే అలవాటు. రాజకీయాల్లో సరైన దర్శకుడు దొరక్క బామ్మర్దికే దర్శకత్వం భాద్యతలు ఇచ్చాడు. బామ్మరిదేమో సినిమా హిట్టైతేనేం, ఫట్టయితేనేం ఓపెనింగు కలెక్షన్లు అదిరిపోతే చాలునని నమ్మే ఫక్తు కమర్షియల్ ప్రొడ్యూసరు. ఇంకేం, సినిమాల్లో డిస్ట్రిబ్యూటర్లదగ్గర అడ్వాన్సులు తీసుకొని సినిమా తీసి బాక్సులమ్ముకున్నట్లుగా టిక్కెట్లు అమ్మేసి దొరికిపొయ్యాడు.

సామాజిక తెలంగాణా తీసుకొస్తానన్నాడు, తరువాత సమైఖ్యవాదం అందుకున్నాడు. జెండా పీకడం ఎవరికైనా సాధ్యామా అన్నాడు, జెండా పీకేసాడు, సామాజిక న్యాయం తెస్తానన్నాడు, ఇప్పుడేమో కాంగ్రేస్ ద్వారా సామాజికి న్యాయం తెస్తానంటున్నాడు. మాటపై నిలకడలేనివాడికి గౌరవం ఎలా ఉంటుంది?

బహుషా రాజకీయాల్లోకి ఎందుకొచ్చానురా బాబూ అని ఎన్నో సార్లు చిరంజీవి అనుకొని ఉండొచ్చు. సరే ఎలాగో ఇన్నాల్లూ నెట్టుకొచ్చాడు. ఇంకా మూడేల్లు పార్టీని నడపడం కూడా కష్టమే. ఇలాంటి పరిస్థితిలో తనను నమ్మి పార్టీలోకి వచ్చిన కార్యకర్తలనూ, టికెట్లు కొనుక్కున్న ఎమ్మెల్యేలనూ నట్టేట్లో వదలకుండా కాంగ్రేస్లో పార్టీని కలపడం ఒక విధంగా మంచిదే. అయితే ఇకనైనా తనకు అచ్చిరాని రాజకీయాలకు గుడ్‌బై చెప్పి తమ్ముడు పవన్‌లాగా దూరంగా ఉంటే కాస్త మర్యాదన్నా దక్కేది. ఇప్పుడు కాంగ్రేస్ ఇచ్చే మంత్రి పదవికి కక్కుర్తి పడి ఎప్పటికైనా ముఖ్యమంత్రి కాలేనా అని కలలు కంటే మాత్రం చివరికి పేకాటలో జోకర్ కాస్తా కూరలో కరివేపాకు కావడం ఖాయం.

కొసమెరుపు: అసలు చిరంజీవి పార్టీ పెట్టడం తెలుగుదేశాన్ని ఓడించడానికి ఒకానొక వైఎస్సార్ వ్యూహమే, అంతా మొదటినుంచే మ్యాచ్‌ఫిక్సింగే, పీఆర్పీ ఎప్పటికైనా కాంగ్రేస్‌లో కలిసేదే అని చాలామంది ఇంతకుపూర్వం అనుమానాలు వ్యక్తం చేశారు. ఇప్పుడు ఆ అనుమానాల్లో ఏదయినా నిజం ఉందేమో అని నాక్కూడా డౌటు వస్తుంది.