Showing posts with label కథలు. Show all posts
Showing posts with label కథలు. Show all posts

Thursday, 20 October 2011

ఇద్దరన్నదమ్ముల కథ

అనగనగా ఒక ఊర్లో ఇద్దరన్నదమ్ములు. అన్న ఏపని చేసేవాడు కాదు. ఉట్టినే బలాదూరుగా తిరగడం వల్ల ఊర్లో మంచి పలుకుబడి సంపాదించుకున్నాడు. తమ్ముడు అదో ఇదో పనిచేసి సంపాదిస్తే వచ్చిన డబ్బుతో కుటుంబం గడిచేది. సంపాదించేది తమ్ముడయినా పెద్దవాల్లు కాబట్టి ఇంట్లో అన్నా, అన్న భార్యల పెత్తనమే సాగేది.గంపెడు చాకిరీ చేస్తే తమ్ముడి భార్యకు తినడానికి కడుపునిండా భోజనం కూడా దొరికేది కాదు.

తమ్ముడి పెల్లయినప్పుడు తమ్ముడి భార్యకు అరణంగా పుట్టింటివారు ఒక ఆవును ఇచ్చారు. కాలం గడుస్తున్నకొద్దీ ఆవు పెద్దదయి బాగానే పాలిస్తుంది. అయితే పాలన్నీ అన్న పిల్లలే తాగేవారు. తమ్ముడి పిల్లలకు పాలూ, పెరుగు దొరికేవి కావు. ఇంట్లో ఒక దానిమ్మ చెట్టుండేది. ఆ దానిమ్మ పల్లు కూడా అన్ని అన్న పిల్లలే తినేవారు. కాలం గడుస్తున్నకొద్దీ సరైన ఆహారం దొరక్క తమ్ముడు, తమ్ముడి భార్యా పిల్లలూ బక్కచిక్కిపొయ్యారు. దాంతో వీరికంటే బలంగా తయారయిన అన్న పిల్లలు ఇంకాస్త దౌర్జన్యం చేసే వారు, తమ్ముడి పిల్లలను గేలిచేసేవారు.


కొన్నాల్లకు వల్లుమండిన తమ్ముడి భార్య  భర్తతో మనం దోపిడీకి గురవుతున్నాం, ఇలాగయితే కష్టం, ఉమ్మడి కుటుంబంలో తమకు ఇబ్బందిగా ఉంది, విడిపోదామని తెగేసి చెప్పింది. ఊర్లో పెద్దమనుషుల పంచాయితీ పెట్టి ఇలా నామొగుడు పనిచేసి సంపాదిస్తున్నా మాకు సరిగ్గా తిండి కూడా దొరకట్లేదు, అందుకే విడిపోవాలనుకుంటున్నామని చెప్పింది.


అప్పటిదాకా తమ్ముడి సంపాదనతో ఏ పనిచెయ్యకుండానే చక్కగా తింటున్న అన్నకుటుంబానికి ఈపరిణామం ఒక్కసారిగా షాక్ కొట్టినట్టయింది. అమ్మో విడిపోతే రేపటినుంచి తాను ఏం చేసి కుటుంబాన్ని పోషించాలి అని అన్న అనుకున్నాడు. అమ్మో ఇప్పుడు ఉన్నపళంగా విడిపోతే నాఇంటిపనీ, వంటపనీ నేనే చేసుకోవాలి ఎలాగా అని అన్న  భార్య అనుకుంది. అమ్మో ఇప్పుడు చక్కగా ఆవు పాలూ, పెరుగు తాగుతున్నాం, విడిపోతే ఈ ఆవు మనకు దక్కదు అని అన్న పిల్లలనుకున్నారు. అంతా కలిసి ఎలాగయినా తమ్ముడి కుటుంబం విడిపోకుండా అడ్డుకోవాలనుకుని తామూ విడిపోడానికి వీల్లేదంటూ పద్దమనుషులదగ్గర ఎదురు పంచాయితీ పెట్టారు. ఇక పంచాయితీ మొదలయింది.


అదేంటి, మేం విడిపోవడానికి వీల్లేదంటూ చెప్పే హక్కు మీకెక్కడుంది? కలిసుండాలా విడిపోవాలా అని నిర్ణయించుకునే హక్కు మాకుంది. మేం విడిపోతామంటే సొమ్ములు ఎలా పంచుకోవాలనే విషయంపై పంచాయితీ పెట్టాలి గానీ విడిపోవాడానికి వీల్లేదంటూ పంచాయితే పెడితే ఎలా అంటూ తమ్ముడు నోరుబాదుకున్నాడు. మనది ఒకే వంశం, ముందు నుండీ కలిసే ఉన్నాం, మనం ఎప్పటికీ ఇలాగే ఉండాలి, ఇదంతా ఆపక్కింటి ఎల్లయ్యగాడి కుట్రగని లేకపోతే విడిపోవాలనే పాడు బుద్ది నీకెలా వస్తుంది? అంటూ అన్న ఎదురు ప్రశ్న వేశాడు.


"చూడు తిండిసరిగా దొరక్క నాడొక్క ఎలా ఎండిపోయిందో? ఇన్నాల్లూ నాసంపాదన మీరు దోచుకున్నారు, ఇక మీతో కలిసి ఉండడం నాకు సాధ్యం కాదు" అంటూ వల్లుమండిన తమ్ముడు చెప్పాడు. అమ్మో అమ్మో మీ సంపాదన మేం దోచుకున్నామా? మమ్మ్మల్ని దోపిడీ దొంగలంటావా? ఇల్లాగయితే నిన్నస్సలు విడిపోనివ్వం అంటూ అన్న భార్య హుంకరించింది.


నీడొక్క ఎండిపోతే దానికి మేమెలా భాద్యులం? నీసమస్యకు మమ్మల్ని కారణమంటావేం అంటూ అన్న లాజిక్ పెట్టాడు. నాసమస్యకు కారణం నువ్వనడం లేదు, అసలు నాసమస్యే నువ్వు అందుకే విడిపోతున్నాం. తమ్ముడు బుర్ర గొక్కుంటూ సనిగాడు.


మమ్మల్ని దోచుకున్నామని నువ్వు, నీభార్యా ఫలానా రోజు పెద్దమనుషుల దగ్గర అన్నారు, మీరు లెక్కలు తీసుకొచ్చి మేము మిమ్మల్ని నిజంగానే దోచుకున్నట్టు నిరూపిస్తేగానీ విడిపోవడానికి వీల్లేదు. మమ్మల్ని ఈసంఘం దృష్టిలో దోపిడీదారులను చేద్దామనా నీ ఐడియా? అన్న భార్య హుంకరించింది. ఇంట్లో లెక్కలు రాసేదీ, సామాన్లూ కొనుక్కొచ్చేదీ అన్నీ అన్నే చేస్తాడు కాబట్టి అన్న ముందే లెక్కల పద్దు తనకు అనుకూలంగా రాసుకున్నాడు. తమ్ముడు లెక్కలు చెప్పబోతే అవి చెల్లవు, నేను  రాసిన ఈ మన ఉమ్మడికుటుంబం అధికారిక పద్దులు చూపిస్తేనే నేను ఒప్పుకుంటా, వేరే లెక్కలు నేనొప్పుకోను అంటూ అన్న తెలివి ప్రదర్శించాడు.


అసలు కలిసి ఉండాలనేభావన ఒక ఉమ్మడి కుటుంబంలోని విలువ, దాన్నీ ఇద్దరూ గౌరవించి ఎవరికీ అన్యాయం జరగకుండా ఉంటే బాగానే ఉంటుంది, అలా కుదరనప్పుడు విడిపోవడం నాహక్కు దానికి అసలు ఏలెక్కలు మాత్రం ఎందుకు? లేని హక్కు కోసం నువ్వెలా పంచాయితీ పెడతావు? తమ్ముడు వాపోయాడు.


నువ్వు విడిపోతామనేది మీకు అరణంగా మీపుట్టింటివారిచ్చిన ఆవు ఉంది కనుకే. ఆఅవు ఇప్పుడు మన ఉమ్మడి పెరట్లో గడ్డితిని బలిసింది కనుక అది ఉమ్మడి ఆస్థి, దాన్ని నువ్వొక్కడివే కొట్టేద్దామని చూస్తున్నావ్! అన్న తెలివి ప్రదర్శించాడు. అయ్యో అది నాకు మాపుట్టింటివారిచ్చిన ఆవు, ఇన్నాల్లూ మీరే మా ఆవు పాలు తాగారు, విడిపోతే నాఅవు నాకుదక్కాలనుకోవడం కూడా తప్పేనా అనుకుంది తమ్ముడి భార్య.


ఇదీ కథ! మాఇంట్లో జరిగిన కథ, రాష్ట్రంలో జరుగుతున్న కథ. ముగింపు ఎలాగుంటుందనేది కాలమే నిర్ణయించాలి.

Tuesday, 12 April 2011

దేముడికీ చావొస్తుంది!!-ముగింపు (కథ)

రోజులు గడుస్తున్న కొద్దీ సత్తిరాజు చింతచెట్టు ఆశ్రమానికి భక్తుల రాక విపరీతంగా పెరిగింది. హుండీలు చూస్తుండగానే నిండుతున్నాయి. వచ్చినడబ్బుతో చింతచెట్టు ఆశ్రమాన్ని పెద్ద రాజభవనం లాగా కట్తారు. ఇంకా అనేక చోట్లకూడా ఆశ్రమాలు స్థాపించి ప్రచారం మొదల్పెట్తారు. ఆశ్రమాలు పెరుగుతుండడంతో దానితోపాటు భక్తులు కూడా పెరుగుతున్నారు.

కొన్నాల్లు పొయ్యాక సత్తిరాజుకు, మిగతా శిష్యులకూ ఒక ఐడియా వచ్చింది. ఎన్నాల్లు ఇలా హుండీలు పెట్టి డబ్బులు తీసుకుంటాం, ఆశ్రమం తరఫున ఒక ట్రస్టును పెడితే ట్రస్టుపేరుచెప్పి దర్జాగా డబ్బులడుక్కోవచ్చు అనుకున్ని ఒక ట్రస్టును స్థాపించారు. ఇప్పటికే విదేశాల్లో కూడా ఆశ్రమాలు ఉండడంతో విదేశాల్లో కూడ ట్రస్టు పేరుతో డబ్బులు వసూలు చెయ్యడం మొదలుపెట్టారు. ఊరికే డబ్బులు తీసుకుంటే బాగుండదు కాబట్టి వచ్చిన డబ్బులో ఒక నయాపైసా వంతు ఖర్చుచేసి వారిజిల్లాలో మంచినీటి సౌకర్యాలు, ఒకట్రెండు హాస్పిటల్లూ పెట్టారు. దీంతో సత్తిరాజు ఒకే దెబ్బకు రెండు పిట్టలు పట్టాడు. తనభక్తులకు తనను సమర్ధించడానికి ఒక సాకు దొరికింది, దానితోపాటు ఇంకా ఎక్కువ డబ్బు వసూలు చెయ్యడానికి తనకు అవకాశం కూడా దొరికింది.

రంగడు అదే ఊర్లో ఉండి సత్తిరాజును మొదటినుంచీ ఎరిగినవాడు, ఆండాల్లమ్మ చెయ్యిపట్టుకున్నప్పుడు సత్తిరాజును కొట్టిన వారిలో ఒకడు. రంగడు ఈసత్తిరాజు దేముడు కాదు, వీడు ఒకప్పుడు ఒట్టి జులాయి అని అరిచాడు. రంగడి గోల ఎవరూ పట్టించుకోలేదు. ఏం, నీడబ్బులేమన్నా ఆశ్రమానికిచ్చావా నీకెందుకు అని ఒకడన్నాడు. ఔరా, నాదాకా వస్తే కానీ నేను మాట్లాడకూడదా అని రంగడు బుర్రగోక్కున్నాడు. మనఊరికి నీల్లిచ్చాడు కదా, మహిమలున్నా లేకపోయినా సత్తిరాజు దేముడే అని మరొకడన్నాడు. ఇదేపని ఎంతమంది రాజకీయ నాయకులు చెయ్యగలుగుతున్నారు, వారు చెయ్యలేనిపని నేడు మన సత్తిరాజు చేశాడు, సత్తిరాజు దేవుడే అని ఇంకోడన్నాడు. విదేశస్తుల దగ్గరినుండి డబ్బులు కొల్లగొట్టి మన ఊరికి నీళ్ళు తెచ్చాడు, సత్తిరాజు అభినవ రాబిన్‌హుడ్ అని మరొకడన్నాడు. డబ్బులిమ్మని ఎవ్వరినీ అడగలేదు కదా, ప్రజలు తమకు తాముగా వచ్చి డబ్బులిస్తే తీసుకుంటే తప్పేంటి అని ఇంకొకడన్నాడు. చేతనయితే నువ్వు దేవుడని చెప్పుకో ఎవరొద్దన్నారు అని ఇంకోడన్నాడు. నీదంతా ఉట్టి 'హేటు' వాదం, మేము మాట్లాడేదే వాస్తవం దబాయించారు.

రంగడికేమీ పాలు పోలేదు. అదేంటి రాజకీయనాయకులతో పోలుస్తున్నారు, వారినేమీ దేవుడని చెప్పి మొక్కట్లేదు కదా అనుకున్నాడు. ఏమిటి విదేశస్తులను మోసం చేస్తే అది మాత్రం మోసం కాదా, మనలను చేస్తేనే మోసమా అనుకున్నాడు. డబ్బులు అడిగి తీసుకుంటేనే మోసమా, దేవుడని చెప్పి నమ్మించి డబ్బులు తీసుకుంటే మోసం కాదా అనుకున్నాడు, పైగా ఆపని తాను చేసి చూపించాలంట. ఒకపక్క అదిమోసమని చెబుతుంటే అదే మోసం తనను చెయ్యమంటారు ఏంటో అనుకున్నాడు.

కొన్నాల్లకి సత్తిరాజుకు జబ్బు చేసింది. రేపో ఎల్లుండో అనేలా తయారయ్యాడు. భక్తులు దేశదేశాలనుండి వచ్చి సత్తిరాజుకోసం ఏడుస్తున్నారు, గుండెలు బాదుకుంటున్నారు. తనతోపాటు ఊరిలో పెరిగి, తను చూస్తుండగా చిల్లరదంగతనాలు చేసినవాడు, తనచేతిలో తన్నులు తిన్నవాడు ఈరోజు ఇలా దేవుడిలా వెలిగిపోతుంటే రంగడికేం పాలుపోలేదు. చివరి రంగడికి తత్వం బొధపడింది. దేముడికి కూడా చావొస్తుంది కానీ ప్రజల అమాయకత్వానికి చావు రాదు అనుకున్నాడు. సత్యానందస్వామి ఆరోగ్యం కుదుటపడాలని భజన చేస్తున్న జనంతో తనూ గొంతుకలిపాడు.

Monday, 4 April 2011

దేముడికీ చావొస్తుంది!! (కథ)

సత్తిరాజు ఆఊర్లో ఒక మంచి జులాయి. మంచి జులాయి అంటే నిజంగా మంచి తెలివయిన జులాయి అన్నమాట. అల్లరి తిరుగుళ్ళూ, చిల్లర దొంగతనాలే కాదు తెలివిగా జనాలను ఎలా మోసం చెయ్యాలో బాగా తెలిసిన వాడు. ఊర్లో సత్తిరాజంటే తెలియనివారూ, సత్తిరాజును తిట్టని వారూ ఎవరూ ఉండరేమో. ఒకరోజు సంతలో ఆండాళ్ళమ్మ చెయ్యి పట్టుకున్నందుకు అక్కడి జనం చక్కగా వడ్డించడమే కాదు, మళ్ళీ ఊర్లో కనిపిస్తే మక్కెలిరుగుతాయని వార్నింగు కూడా ఇచ్చారు.

సత్తిరాజుకు అహం దెబ్బతిన్నది. ఛ!ఎందుకీబతుకు అనుకున్నాడు. ఊరోళ్ళమీద బాగ కసి పుట్టింది. అసలీ ఊళ్ళోనే ఉండొద్దు అనుకున్నాడు. కానీ ఎక్కడికని వెల్లగలడు? ఊరిబయట చింతతోపులో అలా ఒంటరిగా నడుస్తున్నాడు. ఆలోచిస్తున్*నాడు. ఏమిటి చెయ్యాలి? తనను కొట్టిన ఈఊరివారిపై ఎలా కసి తీర్చుకోవాలి అని తెగ బుర్రగోక్కున్నాడు. సరే కొద్దిరోజులు పట్నం వెల్లి గడిపి అంతా సద్దుమణిగినతరువాత మల్లీ ఊరికి రావచ్చని పట్నం బస్సెక్కాడు.

ఫట్నంలో అలా ఒంటరిగా నడుస్తూ ఉంటే కాషాయం బట్టలు తొడుక్కుని గడ్డం పెంచుకుని, గంజాయి పీలుస్తూ గుడిపక్కన కూర్చున్న ఒక జంగమయ్య కనిపించాడు. జంగమయ్యను చూడగానే సత్తిరాజు బుర్రలో తళుక్కున ఒక ఐడియా మెరిసింది. ఔను, తానొక స్వామీజీ అవతారమెత్తి ఊరికెల్తే? ఊరివాల్లు నమ్ముతారా? తనను కొట్టినవారు ఇప్పుడు తనమాట వింటారా? ఏమయితే అదయింది, ఇంకా ఎన్నాల్లీ చిల్లర దొంగతనాలు, జీవితంలో ఏదో ఒకటి గట్టిగా చేసెయ్యాలనే మొండి ధైర్యం వచ్చింది. జేబులో ఉన్న ఐదొందల నోటుతో మార్కెటుకెల్లి ఒక కాషాయం రంగు తాను గుడ్డా, ఉంగరాలజుత్తుండే విగ్గూ కొనుక్కొచ్చాడు. దారిన కనపడ్డ టైలరు దగ్గర కాషాయం గుడ్డతో రెండు నైటీ టైపు గౌనులు కుట్టించుకున్నాడు. బూక్‌స్టాల్ కెల్లి తెలుగులో కనపడ్డ రెండు భక్తి పుస్తకాలు, తత్వాలు కొన్నాడు. ఒక నెలరోజులు అలాగే పట్నంలో ఉండి పుస్తకాల్లో దొరికిన తత్వం ముక్కలు బట్టి వేశాడు.

నెలరోజుల తరువాత ఒకరోజు రాత్రి సత్తిరాజు తిరిగి ఊరికెల్లాడు. చీకట్లోనే తనకు తెలిసిన ఇద్దరు చిల్లర దొంగలను కలుసుకుని తన ప్లాను చెప్పాడు. తెల్లవారగానే ఒక చెట్టుకింద కూర్చుని ఇద్దరు దొంగలనీ శిష్యులుగా చేసుకుని తత్వం మాట్లాడం మొదలుపెట్టాడు. ఆనోటా ఈనోటా ఊరిజనానికి అందరికీ సత్తిరాజు కొత్తావతారం గురించి తెలిసింది. మొదట నవ్వుకున్నారు, తరువాత సరేలే పోనిమ్మనుకున్నారు, మెల్లిగా ఏమో ఏ పుట్టలో ఏపాముందో? ఎక్కడికెల్లి ఏమహిమలు నేర్చుకున్నాడో అనుకున్నారు. మెల్లిమెల్లిగా సత్తిరాజు చింతచెట్టుకు జనం రాకపోకలు పెరిగిపొయ్యాయి. అన్నట్టు మరో విషయం! పట్నంలో ఉండగా ఒక గారడీవాడు రోడ్డుమీద ఆడుతుంటే సత్తిరాజు గంటలతరబడి చూసి కొన్ని చిన్నచిన్న విద్యలు నేర్చుకున్నాడు. ఇంతకుముందు జేబుదొంగతనాలు చేసే అనుభవం ఉండడంతో నేర్చుకోవడం పెద్ద కష్టం కాలేదు. ఇప్పుడు ఆ గారడీ బాగ కలిసొచ్చింది. చెట్టుదగ్గరికి వచ్చిన ఊరివారిని ఆకర్షించదంకోసం గారడీలు చెయ్యడం మొదలు పెట్టాడు. ఆండాళ్ళమ్మ విషయంలో తన ప్రేమ బెడిసికొట్టడం బాగ పనిచేసిందేమో, వచ్చినవారికి ప్రేమే దైవం అంటూ తత్వం చెప్పేవాడు.

ఇప్పుడు సత్తిరాజు వట్టి సత్తిరాజు కాదు, సత్యానందస్వామి. ఆనోటా ఈనోటా చుట్టుపక్కల ఉన్న ఊరివారందరికీ తెలిసిపొయ్యాడు. చింతచెట్టు చుట్టూ ఒక చిన్న ఆశ్రమం కట్టారు. జనాల రాకపోకలు పెరిగాయి. వచ్చినవారో అంతో ఇంతో డబ్బులు ఇచ్చేవారు, లేకపోతే ఏదయిన వస్తువు ఇచ్చేవారు. ఇప్పుడు సత్తిరాజుకూ, శిష్యులకూ రోజులూ బాగా గడుస్తున్నాయి. ఆశ్రమంలో కొంతమంది పెర్మనెంట్ భక్తులు ఏర్పడ్డారు. ఒకరోజు శివరాత్రినాడు మంచి టైం చూసుకుని సత్తిరాజు భక్తులకు తాను దేవున్ననీ, ఫలానా అవతారమనీ చెప్పుకున్నాడు. భక్తులు నిజమే కాబోలనుకున్నారు. దేవుడికి అతిదగ్గరి భక్తబృందంలో తామున్నందుకు మురిసిపొయ్యారు, తమవంతు ప్రచారం చేశారు. చూస్తుండగానే సత్యస్వామికి రాష్ట్రం మొత్తంలో భక్తులు పెరిగిపొయ్యారు.
(ఇంకాఉంది)