Thursday, 23 December 2010

తొంభై ఐదేళ్ళ యువకుడు

శ్రీ కొండా లక్ష్మన్ బాపూజీ గారు ప్రస్తుత తరం ప్రజలకి అంతగా తెలియని వెనుకటి తరం కాంగ్రేస్ నాయకుడు. తొంభై అయిదు సంవత్సరాలు పైబడ్డ వయసులో కూడా కొండా లక్ష్మన్ గారు తెలంగాణా ఉద్యమంలో అత్యంత చురుగ్గా పాల్గొంటూ అనేక కార్యక్రమాలలో ముఖ్య అథిధిగా, వక్తగా ఉద్యమానికి తోడ్పడుతున్నారు..

స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్న కొండా లక్ష్మన్ గారు 1956లొ ఆంధ్రప్రదేశ్ అవతరణ తరువాతి మొట్టమొదటి అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్‌గా పనిచేశారు. ఆ తరువాత రాష్ట్ర మంత్రిగా విభిన్న ప్రభుత్వాలలో పనిచేసిన ఈ నేత 1969లో తెలంగాణా ఉద్యమానికి మద్దతుగా తన పదవికి రాజీనామా చేశి ఉద్యమంలో భాగస్వామ్యం తీసుకున్నారు. ఆదిలాబాద్ వాస్తవ్యుడైనప్పటికీ నల్లగొండ జిల్లా నుండి అసెంబ్లీకి ప్రాతినిఘ్యం వహించారు. తెలంగాణా ప్రజా సమతి ఫౌండింగ్ మెంబర్ కూడా అయిన కొండా లక్ష్మన్ గారు నేటికీ అదే ఉద్యమస్ఫూర్తిని ప్రదర్శిస్తున్నారు.

సుమారు నలభై ఏళ్ళుగా తెలంగాణా ఆశయం కోసం పనిచేసిన కొండా లక్ష్మన్ గారు టీఆరెస్ పార్టీ ఆఫీసు కోసం తన నివాస గృహాన్ని అద్దె లేకుండానే ఇవ్వగా అక్కసుతో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టాంక్‌బండ్ పక్కన ఉన్న వారి ఇంటిని అధికారబలంతో రాత్రికి రాత్రి నేలమట్టం చేయించాడు.

తన ఇద్దరు కొడుకులలో ఒక కొడుకు ఇండియన్ ఎయిర్‌ఫోర్సులో పైలట్‌గా పని చేసి విమాన ప్రమాదంలో మృతి చెందగా మరో కొడుకు అమెరికాలో ఉంటూ ఇటీవలే అనారోగ్యంతో చనిపోయారు. తొంభై ఏల్ల వయసులో కూడా తన ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్న బాపూజీ గారు ఈ వయసులో కూడా ఉద్యమానికి సంబంధించి ఎవరు ఏ సమావేశానికి ఆహ్వానించినా తప్పకుండా వెలుతారు. ఈ తొంభై అయిదేళ్ళ యువకుడి ఉద్యమస్ఫూర్తికి నా జోహార్లు.