Saturday 5 June 2010

ఆడిన మాట తప్పకూడదా?


"మాట తప్పని, మడమ తిప్పని వంశం మాది", "రాజకీయాల్లో విశ్వసనీయత ముఖ్యం", "రాజశేఖర్ రెడ్డి పధకాలకు ఈ ప్రభుత్వం తూట్లు పొడుస్తుంది", "పావురాల గుట్టపైనే నేను మాట ఇచ్చాను" ఇవన్నీ గత కొన్ని సంవత్సరాలుగా వైఎస్సార్, జగన్ చెప్పిన కొన్ని మాటలు మరియూ సాక్షి పేపరులో ఎడిటొరియల్సూ!

వైఎస్సారు, జగన్ తమని తాము ఆడిన మాట తప్పని రాచవంశీకులుగా ప్రొజెక్ట్ చేసుకోవడానికి చేసిన ప్రయత్నమే ఈ మాటలు. వీరు నిజంగానే మాట తప్పరా అన్న విషయం జోళికి వెల్లకుండా, అసలు మాట తప్పడం అంత పెద్ద నేరమా, మాట తప్పకపోవడం రాజకీయాల్లో పెద్ద క్వాలిఫికేషనా అని ఒక సారి చర్చిద్దాం.

వెనుకటికి రాజులు ఇచ్చిన మాత నిలబెట్టుకోవడానికి అవసరమయితే రాజ్యాలనే వదులుకున్నారని పుస్తకాల్లో, కధల్లో చదువుకున్నాం. అయితే ఇప్పుడున్నది రాచరిక పాలన కాదు, ప్రజాస్వామ్యం. వ్యక్తుల ఈగోలకన్నా, ప్రజల సంక్షేమం ముఖ్యం. పనికిరాని వాగదానాలు ఇచ్చినప్పుడు వాటిని పాటించడం మరో తప్పిదమే కానీ అది ఎన్నటికీ ఒక క్రెడిట్ కాదు. చత్త హామీలను నిలబెట్టుకుంటే విశ్వసనీయత పెరుగదు, తగ్గుతుంది.

ఎన్నికల్లో గెలవడానికి అన్ని పార్టీలు తలా కొన్ని ఆచరణ సాధ్యం కాని పధకాలను, హామీలుగా ఇచ్చేసింది. ఇందులో ఏ పార్టీ మినహాయింపు కాదు. కనీసం గెలిచాకనయినా ఆ హామీలు ప్రభుత్వం నడ్డి విరుస్తున్నాయి అని తెలుసుకున్నప్పుడు వాటిని వదిలివేయాలా లేక మాట ఇచ్చాము కదా అని కొనసాగించాలా?

మాట నిలపెట్టుకోవడం ముఖ్యం కాదు, ప్రజల శ్రేయస్సు ముఖ్యం అంటే, మరి రాజకీయ పార్టీలు ఎడా పెడా ఎన్నికలముందు వాగ్దానాలు చేయడం సమర్ధనీయమేనా అంటే కానే కాదు. సాధ్యాసాధ్యాలతో, ప్రజల శ్రేయస్సుతో, దేశ అభివృద్ధితో సంబంధం లేకుండా కేవలం వోట్లకోసం వాగ్దానాలు చెయ్యడం ఎంతమాత్రమూ సమర్ధనీయం కాదు. అయితే ఇలాంటి రాష్ట్రాన్ని వెనక్కి తీసుకెల్లే వాగ్దానాలు చెయ్యడం ఒక నేరం కాగా మాట ఇచ్చాం కదా అని వాటిని ఎలాగయినా నిలుపుకోవాలని పంతానికి పోయి దేశాన్ని ఇంకొంచెం వెనక్కి తీసుకెల్లడం మరో నేరం అవుతుంది.

రోశయ్య గారూ, ఇకనైనా సాక్షి పత్రిక ఏదో రాస్తుంది, జగన్ వర్గం తప్పు పడుతుంది అని భయపడి ఈ సం"క్షామ" పధకాలను కొనసాగించకుండా వాటిని ఒక్కసారి కడిగేయండి. మీరు వీటిని అమలు చేసినా, చెయ్యకపొయ్యినా వచ్చే ఎలక్షనులో ఏ వోటరూ వాటిని చూసి వోటేయడు. ఒకవేళ ఏసినా ముఖ్యమంత్రిగా ఉండేది మీరు ఎలాగూ కాదు కాబట్టి మీకా భయం అస్సలు అవసరం లేదు.

Friday 4 June 2010

దేవుడి అస్తిత్వంపై పాస్కల్ వేజర్

దేవుడి అస్తిత్వం పైన ఫ్రెంచ్ తత్వవేత్త బ్లైస్ పాస్కల్ ఈ విధంగా చెప్పాడు. దేవుడు ఉన్నాడో, లేదో ఒక నిర్ణయానికి మనిషి రావడం కష్టం. ఇక మనం చెయ్యగలిగింద ఏదో ఒక వర్గంవైపు మొగ్గడం.

మరి ఏ వర్గం వైపు మొగ్గడం మనిషికి లాభదాయకం? దేవుడు ఉండడానికీ, లేకపోవడానికీ ఫిఫ్టీ ఫిఫ్టీ చాన్సెస్ ఉన్నాయంటే మనిషి ఎటువైపు మొగ్గొచ్చు? దేవుడు ఉన్నాడని నమ్మి, చివరికి దేవుడు లేకపోతే వచ్చే నష్టం ఏమీ లేదు. కానీ ఒక వేల మనిషి దేవుడిని నమ్మక నాస్తికుడిలాగా ఉండగా, నిజానికి దేవుడు ఉన్నాడు అనుకోండి, అప్పుడు దేవుడి పుస్తకంలో మనిషికి మంచి స్థానం ఉండదు. కనుక దేవుడు ఉన్నాడని నమ్మడం మంచి బెట్.

దీనికి రిచర్డ్ డాకిన్స్ వాదన ఇలా ఉంది. ఒక వేళ దేవుడు ఉన్నా ఆ దేవుడు మనం నమ్మే దేవుడు కాక మరొక దేవుడు కావొచ్చు. లేక పోతే అసలు మనకు తెలిసిన దేవుళ్ళెవరూ కాకుండా మరో కొత్త దేవుడు అయ్యుండొచ్చు. అప్పుడు ఆ దేవుడికి మన పూజా విధానాలేవీ నచ్చకపోవచ్చు. అసలు దేవుడు ఉంటే అతను పొగడ్తలకి, పూజలకి బోల్తాపడే వాడయ్యుండడు. కాబట్టి దేవుడిని మనిషి నమ్మి దేవుడు నిజంగా ఉన్నా పెద్ద లాభం ఏమీ ఉండదు. దేవుడిని అసలు నమ్మని మనిషియొక్క ఆత్మ విశ్వాసాన్ని ఆ దేవుడు మెచ్చుకోవచ్చు కూడా.

అలా కాక దేవుడు లేడన్నిదే నిజమయి మనిషికి చివరికి ఆ విషయం తెలిస్తే ఇన్నాళ్ళూ తాను అలాంటి విశ్వాసాన్ని ఏర్పరుచుకున్నందుకు అసంతృప్తి మిగులుతుంది.