Saturday 17 November 2012

వ్యతిరేకం కాదు (కథ)



"ఈదోమలు పాడుబడ, ఒక్కటె శెవులల్ల గుయ్య్ గుయ్య్ మంటయ్!" నిద్రపట్టక పక్కమీద మెసులుతున్న చిన్నారావు గొణిగిండు.

"సప్పుడు జెయ్యకుంట పండుకోరాదు?" నిద్రలోనే కసిరింది భార్య రాజమ్మ.

పడుకోనయితె పడుకుండుగని చిన్నారావుకు ఎంతకూ నిద్ర ఒస్తలేదు. ఒక్కటే ఆలోచనలు...ఏం జేశేది? ఈసారి ఎలక్షన్లలో గెలిచేది ఎట్ల?

తన సమస్య అట్లాంటిది మరి. చిన్నారావు ఊరికి సర్పంచి. మంచి మాటకారీ, రాజకీయ చతురుడు. కొండగడపలొ రాజకీయాలల్లో పట్టున్న నాయకుడు. తను అగ్రకులం వాడే అయినా ఊళ్ళోని బీసీలు, దళితులు అందరినీ మాయజేసి, మభ్యపెట్టి మరీ అందరి మద్దతునూ కూడగట్టి రెండుసార్లు ఊరికి సర్పంచి అయిండు. ఊళ్ళో రాజకీయంగా చిన్నారావుకు  తిరుగులేదు. ఇప్పటిదాకా అంతాబాగానే ఉందిగానీ ఇప్పుడు కొత్తగాతన బామ్మర్ది జెయ్యబట్టి చిన్నారావుకు సమస్యొచ్చింది.

చిన్నారావు బామ్మర్ది ఏడుకొండలు డిగ్రీ ఫెయిలయి ఇంట్లో ఉంటుంటే తన చేతికింద ఉంటడని రాజమ్మ తన ఇంట్లోనే ఉంచుకుంటుంది. ఏడుకొండలు కాస్త రౌడీటైపు. తాగడం, ఆడవారిపై అసభ్యంగా ప్రవర్తించడం లాంటి అలవాట్లు మొదట్నుంచీ ఉన్నాయి.

ఊర్లో మంచినీళ్ళబాయి దగ్గరికొచ్చిన మాలపిల్ల గౌరిని ఏడిపించబోతే అక్కడ ఉన్న కొందరు దళిత యువకులు చితక్కొట్టి పంపించారు.పక్కూరికి పనికెల్లి వస్తున్న నలుగురు దళితయువకులను దారికాచి దాడిచేశాడు. దాడిలో దళిత యువకులకు బాగా కత్తి గాట్లుపడి ఇప్పుడు వాళ్ళు పట్నంలో పెద్దదావకాన్ల ఉన్నరు.



బామ్మర్దిది తప్పని ఒప్పుకుందామంటే ఇంట్లో భార్యక్కోపం. సర్లే మనకేంది అని ఊరుకుందామంటే రెండునెలల్లో ఎన్నికలాయె, దళితుల వోట్లు లేనిదే గెలవడమెట్ల?ఇట్లనే ఆలోచిస్తుంటె చిన్నారావుకు అంతకుముందు పేపర్లో జదివిన రెండుకళ్ళ సిద్ధాంతం యాదికొచ్చింది. "అరె, నాపరిస్థితి గుడ గిట్లనె ఉంది, గిదేజేద్దాం. రేప్పొద్దున ఏదో ఒకటి జెప్పి మాలోల్ల నోరు మూయిద్దంలే", అనుకుంటూ నిద్రలోకి జారుకుండు.

* * * * *


తెల్లారి తనదొడ్డిలో పనిజేసే కిష్టయ్య, యాదయ్యలను తీసుకుని దళితవాడకు బయల్దేరిండు. కిష్టయ్య, యాదయ్యలు దళితులే..వాళ్ళకూ జరిగిన అన్యాయం చూస్తుంటే కోపమొస్తుంది. అట్లని యజమాని మాట యినకబోతె పొట్టగడిచేదెట్ల అనుకుని సప్పుడు గాకుండ ఉంటుండ్రు.


సర్పంచి వచ్చిండు, బామ్మర్ది గురించి ఏం మాట్లాడుదమో ఇందమని గూడెంల పెద్దలందరు గుడిసెలనుంచి బయటకొచ్చిన్రు.


యాపచెట్టుకింద ఉన్న గుండ్రాయి మీద గూసొని చిన్నారావు వచ్చినోళ్ళను గుడ కూసొమ్మని సైగ జేశిండు.

"నర్సప్పా! ఎల్లయ్య! కూసుండ్రా. మీపిలగాండ్లకు దెబ్బలు దాకినయని తెలిశింది, నాకు శాన బాదయింది. గిది జెప్పుదామనె గిట్లొచ్చిన."


"ఇది జేయించింది మీ బామ్మర్ది ఏడుకొండలే" కాస్త దూరంగా నిల్చున్న శేఖర్ అన్నడు. శేఖర్ దళితుడే అయినా పట్నంల హాస్టల్ల ఉండి చదువుకుంటుండు.

"నాకు మీరొకటి, నా బామ్మర్ది ఒకటి కాదు. మీరు, నాకుటుంబం, నాకు రెండు కండ్లసుంటోళ్ళు. నాపరిస్థితి అర్ధం జేసుకోండ్రి."

"మరి తప్పు జేశినందుకు మీబామ్మర్దికి ఏం శిక్ష ఏస్తరు?"

"అరె ఏంది శేకర్, గట్ల మాట్లాడుతవ్? శిక్ష ఏసెటొందుకు నేనెవర్ని? దానికి కోర్టులున్నయ్!"

"పోలీస్ స్టేషన్ల మా దరకాస్తుగుడ దీసుకుంటలేరు. అడిగితె ఎస్సై మీపేరు జెపుతుండు."


"నేనత్లెందుకు జెపుత నర్సప్పా? ఇదంత నాశత్రువులు నామీద జేస్తున్న కుట్ర. జెర మీరు నన్నర్దం జేసుకోండ్రి. ఇగొ, నాపొలంల పనిజేసే కిష్టయ్య, యాదయ్యలను గుడ తీసుకొచ్చిన. వీళ్ళు మీకులపొల్లె. వీల్లు కుడ నాతరఫున మీతోపాటు పోరాటం జేస్తరు."

"మరి మాపొరగాండ్లను కొట్టింది కుడ నీమనుషులేగద దొర?దానికేం జెయ్యాలె?రెండు దిక్కుల మీరే కొట్లాడుతరా?"

కాస్సేపు చిన్నారావుకేమనాలో తోచలేదు. చివరికి మెల్లగా అన్నాడు. "నేను మీ పోరాటానికి వ్యతిరేకం కాదు, నా మాట నమ్ముండ్రి."

"గట్లనా! అయితే మాతో పాటు పోలీస్ స్టేషన్లకొచ్చి మాపిర్యాదు తీసుకొమ్మని ఎస్సైకి జెప్పున్రి. శేయించింది మీ బామ్మర్ది, మీ మనుషులేనని సాక్ష్యం జెప్పున్రి".

"అరె, గట్ల మాట్లాడుతరేంది నర్సప్ప? నేను మీకు వ్యతిరేకం గాదన్న గని అనుకూలమన్ననా? మీపంచాయితి మీరు జూసుకోండ్రి."

"మా పంచాయితి మేము జేస్తుంటె పోలీస్ స్టేషన్ల మోకాలడ్డం బెట్టింది మీరే కద?ఊరికి సర్పంచిగ ఇవిషయంల మీ వైఖరేంది?""

"గిదంత నా శత్రువుల కుట్రని శెప్పినగద, మల్ల గట్లడుగుతరేంది? మీరు మాత్రం ఎలక్షన్లల్ల మీ వోట్లు నాకే ఎయ్యలి, మరిశిపోకుండ్రీ."

"ఏస్తమేస్తం. గట్లనె మీ బావబామ్మర్దుల నాటకాలన్ని జూస్తం." ఆవేశంతో అన్నాడు శేఖర్.

"ఇన్నిరోజులు నేనేం జెప్పినా నమ్మెటోండ్లు, ఇప్పుడు వీళ్ళుగుడ తెలివి మీరిండ్రు. ఇంక వీళ్ళను మోసం జేయడం కష్టం. ఊర్లొ పోశమ్మ గుడి సుట్టు పొర్లుదండాలు బెడితెనన్న గెలుస్తనో?" అనుకుంటూ చిన్నారావు అక్కడినుంచి కదిలిండు.







4 comments: