ఓదార్పు యాత్ర వెనుక జగన్ అసలు ఉద్దేషం, జగన్ యొక్క ఓదార్పు గుణం, ఓదార్పు యాత్ర ఆవశ్యకత లాంటి అంశాలజోళికి వెల్లకుండా నిజంగా వీరు చెప్పేట్లు జగన్ హక్కుని ప్రభుత్వం, తెలంగాణా వాదులు కాలరాశారన్న వాదనలో నిజం ఉందా?
ఒక వ్యక్తిగా జగన్‌కి గానీ, మరెవరికయినా దేశంలో ఎక్కడికయినా స్వేచ్చగా వెళ్ళే హక్కు ఉండాలి. దురదృష్టవశాత్తూ మనదేశంలో పౌరులు ఎన్నో చోట్లకు ఒంటరిగా వెళ్ళలేని స్థితి ఉంది. జగన్ ప్రాతినిధ్యం వహించే రాయలసీమలో చాలా చోట్ల ఒక వర్గం వారు ఇంకో ప్రాంతంలోకి వెళ్ళాలంటే శాంతిభద్రతల కారణాల దృష్ట్యా పోలీసులు అనుమతి ఇవ్వరు.
ఈ ఓదార్పు యాత్రలో జగన్ ఒక వ్యక్తిగా వెళ్ళడం లేదు, రెండువేలమని అనుచర బృందం, మందీ మార్బలం, వ్యక్తిగత రక్షణ సిబ్బందీ, వారి ఆయుధాలూ వగైరాలతో వెల్తున్నారు. వారిని రిసీవ్ చేసుకోవడానికి కాచుకు కూర్చున్న కొండా దంపతులు వరంగల్ జిల్లాలో సమాంతర ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. వీరికి మాత్రం తమ యాత్రలకు అనుమతి కావాలి, అందులో ఏవయిన గొడవలు జరిగితే భాద్యత ప్రభుత్వానిదీ, తెలంగాణా వాదులదీ కానీ విరిది కాదు.
మరి ఇంత మంది గుమి గూడి ఊరేగింపుగా వెల్లడానికి అనుకూలమయిన పరిస్థితులు వరంగల్ జిల్లాలో లేనే లేవు. తెలంగాణా ఉద్యమానికి ఆయువు పట్టయిన వరంగల్, నల్గొండా, కరీం నగర్, నిజామాబాద్ లాంటి జిల్లాలలో సీమాంధ్ర నాయకులు నిరశన జ్వాలలు ఎదుర్కోక తప్పదు.
కేసీఆర్ నిరాహార దీక్ష చేసుకునే హక్కును బలవంతంగా కాలరాసి ముందస్తు అరెస్టు చేసి ఖమ్మం సెంట్రల్ జైలుకి తరలించిన ఈ ప్రభుత్వం జగన్ అరెస్టుకు ఎందుకు ఘర్షణలు చెలెరేగే దాకా ఆగినట్లు? శాంతిభద్రతలను కాపాడవలసిన హోం మినిష్టరు వ్యక్తిగత హోదాలో రాయబారాలు ఎందుకు చేసినట్లు?
తమ హక్కును కాలరాశారని మొసలి ఏడుపులు ఏడ్చే ఈ జగన్, సురేఖలు తమ తమ నియోజక వర్గాలలో ఆటవిక పాలన కొనసాగిస్తూ, సమాంతర ప్రభుత్వాలను నడిపిస్తూ ఇతర పార్టీ నాయకుల ప్రచారాన్ని అడ్డుకోవడం వాస్తవం కాదా?
ఇక అక్కడ నిజంగా తెలంగాణా వాదులు రాళ్ళు విసిరి రెచ్చగొట్టారా, లేక జగన్ వర్గీయులే ముందు రాళ్ళు వేసి కవ్వించారా అనేది మనకు తెలియని విషయం. విచిత్రంగా అక్కడ గాయపడిన వారంతా విద్యార్థులే. ఒక్క జగన్ యువసైనికుడు కానీ, కాంగ్రేస్ కార్యకర్త గానీ గాయపడలేదు. కాల్పులు జరిపింది రక్షణ సిబ్బంది మాత్రమే కాదు కొండా మురళి , మరియూ అతని అనుచరులు కూడా అనేది బహిరంగ రహస్యం.
ఈ మొత్తం వ్యవహారం చూస్తే ఎలాగయినా విద్వేషాలు రెచ్చగొట్టి రోశయ్య ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడం జగన్ వ్యూహం కాగా, కాగల కార్యం గంధర్వులే తీరుస్తారనే పీవీ సూత్రం రోశయ్య చాణక్య నీతిలాగుంది. తమ స్వార్ధం కోసం టీఆరెస్ నాయకులతో సహా అంతా పంతాలకు పోతే పావులుగా మారి ప్రాణాలమీదికి తెచ్చుకుంది మాత్రం పేద విద్యార్థులే.