వెనుకటికి ఎవడో కొండంతా తవ్వి ఎలుకను బయటికి తీసి జబ్బలు చరుచుకున్నాడంట. అలాగుంది మన శ్రీక్రిష్ణ కమీషను తీరు. ఇంకా వారి రిపోర్టు పూర్తిగా చదవలేదు కానీ వారిచ్చిన ఆరు ప్రతిపాదనలలో కొత్తది ఏదీ లేదు. ఆమాత్రం దానికి ఈ కమీషన్ ఎందుకు, వీరు సంవత్సరం కాలంగా సంప్రదింపులు, పర్యటనలూ చేసి సాధించింది ఏమిటి అనేది ప్రశ్నార్ధకం.
అందులో రెండు ప్రతిపాదనలు ఒకటి యధాస్థితిని కొనసాగించడం, మరొకటి హైదరాబాదు రాజధానిగా తెలంగాణా రాష్ట్రాన్ని ఏర్పాటు చెయ్యడం. రెండూ ఒకటి సీమాంధ్ర సమైఖ్య నాయకుల వాదన కాగా మరొకటి తెలంగాణా ప్రజల ఆకాంక్ష. రెండింటిలోనూ కొత్తది ఏదీ లేదు. వాటికోసం కమీషనెందుకు?
మరో మూడు ప్రతిపాదనలు మరీ హాస్యాస్పదం. ఒకటి జేసీ దివాకర్‌రెడ్డి, మజ్లీస్ ప్రతిపాదించిన రాయల తెలంగాణా కాగా మరోరెండు దానం, ముఖేశ్‌ల హైదరాబాదు స్టేట్ వాదనను కాస్త అటూఇటూ చేసి హైదరాబాదు యూనియన్ టెర్రిటరీ అన్నారు. అందులో ఒకటి నల్గొండ, మహబూబ్‌నగర్లను కల్పగా మరొకటి ఒక్క గ్రేటర్ హైదరాబాద్ మాత్రమే. ఈ ప్రతిపాదనలకు ఒక రేషనల్ బేసిస్ అంటూ లేదు, కొందరు నాయకుల టైంపాస్ స్టేట్మెంట్లు తప్పితే. బహుషా మరో కోన్‌కిస్కా ఎవరయినా అండమాన్ కాపిటల్‌గా గుంటూరు స్టేట్ కావాలని ఏదయినా సందర్భంలో జోక్‌చేసిఉంటే బహుషా వీరు వీరి రిపోర్టులో అదికూడా జతచేసేవారేమో.
ఇక ఆరో ప్రతిపాదన సమస్యను దాటవేసి మరికొంత కాలం కాలయాపన చెయ్యడానికి మాత్రమే పనికొచ్చే ప్రాతీయమండలి ఏర్పాటు. ఇంతకు ముందు తెలంగాణాకై చేసిన ఒప్పందాలూ, కమిటీలూ, జీవోలూ అన్నీ బుట్టదాఖలే అయినప్పుడు కొత్తగా ప్రాంతీయమండలి వలన ఒరిగేదేమిటి?
మొత్తానికి శ్రీక్రిష్ణ కమీషనూ ఏర్పాటు వలన సమస్యను ఒక సంవత్సరం పాటు వాయిదా వేయగలిగారే కానీ సంవత్సరం తరువాత కూడా ఉద్యమం తీవ్రత అదే స్థాయిలో ఉండగా సమస్యపై సందిగ్ధతకూడా అలాగే ఉంది.
No comments:
Post a Comment