Wednesday, 19 January 2011

ఒక ఉద్యమం.. అంతా అబద్దమే!!
"సమైఖ్యాంధ్ర ఉద్యమం!!" డిసెంబరు తొమ్మిది చిదంబరం ప్రకటన తరువాత తెలంగాణా ఇవ్వకుండా మోకాలు అడ్డు పెట్టటానికి సీమాంధ్ర నాయకులు ఆడిన నాటకానికి వారు పెట్టుకున్న పేరు ఇది. పదిహేనురోజులు నడిచిన ఈ నాటకానికి వీరు పెట్టుకున్న పేరుతో సహా ఇందులో అంతా అబద్దమే. సమైఖ్యత అనే భావనే ఎన్నడు చూపని వారు, ఏళ్ళతరబడి తెలంగాణా ఉద్యమం నడుస్తున్నా, అన్నీ రాజకీయ పార్టీలు తెలంగాణాకు మద్దతు చెప్పి తమ తమ ఎలక్షను మానిఫెస్టోలలో కూడా తెలంగాణా అంశాన్ని చేర్చినా ఏనాడూ మాట్లాడని నాయకులంతా ఒక్కసారి రాత్రికి రాత్రి మొదలుపెట్టిన మహా దొంగనాటం ఇది.ఉద్యమాలు ప్రజలలోంచి పుడతాయి. నాయకులు ఉద్యమాలను నడపరు, ఉద్యమాలే నాయకులను తయారు చేస్తాయి. నాయకులు కేవలం ప్రజల ఆశలను వినిపించడానికి ఒక వేదికను తయారు చేస్తారు, ఉద్యమానికి ఒక రీతి, నడవడి తయారు చేస్తారు. ఉద్యమాలు ప్రజల్లో అంతర్లీనంగా మొదలయి, మెల్లిగా ఒక గతిని ఏర్పాటు చేసుకుంటాయి. కానీ ఈ ఉద్యమం ప్రజలలోంచి పుట్టలేదు. అసలు ఈ ఉద్యమానికి అంత సమయం కూడా లేదు. ఇది మొదలయింది లగడపాటి అనే ఒక వ్యాపారస్తుడైన ఎంపీ తన పెట్టుబడులను, అందులో భాగమయిన కబ్జాలను కాపాడుకోవడం కోసం ప్రకటన వెలువడిన కొన్ని నిముషాలలోనే రాజీనామా చేయడంతో మొదలయింది. ఆ తరువాత చైన్ రియాక్షను లాగా ఒకరితరువాత ఒకరుగా అందరు సీమాంధ్ర ఎంపీలూ, ఎమ్మెల్యేలూ ఎక్కడ తాము ఈ నాటకంలో వెనుకబడుతామేమోనని ఆదరబాదరగా రాజీనామాలు చేసి దీక్షలు మొదలుపెట్టారు. అంటే అసలు ప్రజల భాగస్వామ్యమే లేకుండా, ప్రజల రియాక్షనుకు టైము కూడా ఇవ్వకుండా నాయకులు మొదలుపెట్టిన నాటకం తప్పితే ఇది ప్రజా ఉద్యమం కాబోదు.

ప్రభుత్వ పెద్దల అండదండలు దండిగా ఉండడంతో ఈ నాయకులు ఒకవైపు దీక్షలు చేస్తూ మరో వైపు తమ మనుషుల ద్వారా పదిహేను రోజుల్లో జరిపిన ప్రభుత్వ ఆస్థుల ధ్వంసం సంవత్సర కాలంలో తెలంగాణాలో జరిగినదానికన్నా చాలా ఎక్కువ. చాలా చోట్ల పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారు. ఇందులో చెప్పుకోవాల్సింది అనంతపురం బీఎస్సెన్నెల్ కేబుల్ల ధ్వంసం. కోట్ల విలువచేసే బీఎస్సెన్నెల్ ఆస్తులు పోలీసుల కల్లముందే ధ్వంసం అయ్యాయి.ఇంకా రైల్వే స్టేషనులు, పోస్టాఫీసులు, దూరదర్శన్ కేంద్రాలు, రైలు భోగీలు ఎన్నో ధ్వంసం చేశారు.

ప్రజలు తమ హక్కుల సాధనకోసం ఉద్యమం చేస్తారు. అంతే కానీ ఎదుటివారి హక్కులకు అడ్డుపడటానికి ఉద్యమాలు చెయ్యరు. రెండు ప్రాంతాలవారు కలిసి చేస్తే అది సమైఖ్య ఉద్యమం అవుతుంది కానీ ఒక ప్రాంతం వారు చేస్తే అది సమైఖ్య ఉద్యమం కాబోదు. ఎవరి స్వలాభాలకోసం వారు పోరాడుతారు.. అందులో తప్పులేదు. కానీ తమ స్వార్ధప్రయోజనం కోసం ఎదుటివారు తమతో కలిసి ఉండాలని శాసించరు!! అది ఎదుటివారి హక్కులను హరించడమే.

చరిత్రలో ఇంతకుముందు సమైఖ్య ఉద్యమాలు జరిగాయి. ఉదాహరణకు ప్రజల ఇష్టాలకు వ్యతిరేకంగా బెర్లిన్లో గోడకట్టి తూర్పు, పశ్చిమ జెర్మనీలుగా విడగొట్టినప్పుడు జెర్మన్లు కలిసి ఉండడంకోసం ఉద్యమించారు. రెండువైపులవారు సమానంగా కలిసిఉండాలనే కోరికతో ఉద్యమించారు. కానీ ఎక్కడా అవతలి వారికి ఇష్టం లేకున్నా తమతో కలిసి ఉండాలని ప్రజాస్వామ్య ఉద్యమాలు చెయ్యలేదు, కేవలం యుద్ధాలు చేశారు. సీమాంధ్ర నేతలు తమ కాంక్షలను తీర్చుకోవడంకోసం, తెలంగాణా ప్రజల హక్కులు కాలరాయడం కోసం ఈ అభినవ యుద్ధానికి తెరలేపారు, దానికి సమైఖ్యాంధ్ర ఉద్యమమని పేరు పెట్టుకున్నారు.

ఈ విధంగా ఈ మోకాలడ్డే కార్యక్రమం ఉద్యమం అనడమే అబద్ధం, దాని ఉద్దేశమూ అబద్ధం. ఈ అబద్దపు ఉద్యమాన్ని పెద్దది చేసి చూపేందుకు సీమాంధ్ర నేతల కనుసన్నలలో నడిచే మీడియా అష్టకష్టాలు పడింది. పదిమంది టెంటేసుకుని కూర్చుంటే దాన్నే పెద్దచేసి, పదికోణాల్లో చూపించింది. ఒస్మానియాలో హాస్టల్లకు వచ్చి వీరంగం సృష్టించే పోలీసులు, అధికార యంత్రాంగం కూడా ఈ నాటకానికి తమ సహకారం పూర్తిగా ఇచ్చారు. కొద్దిమంది అల్లరిమూకలు బస్సులు తగలబెడుతుంటే, ఆస్థులు ధ్వంసం చేస్తుంటే చూస్తూ కూర్చున్నారు. అక్కడ మాత్రం హాస్టల్లను మూసివేయలేదు, హాస్టల్లలో దూరి కొట్టలేదు, ఎవరిపైనా కేసులూ పెట్టలేదు. ప్రజల ఉద్యమాలను బూటుకాల్లతో అణచివేసే ప్రభుత్వయంత్రాంగం ఈ నాయకుల కిరాయిమూకల విధ్వంసానికి మాత్రం ఎప్పటిలాగే అడ్డుపడలేదు.

ఈ ఉద్యమాన్ని నడిపించింది ప్రధానంగా సీమాంధ్రకు చెందిన కాంగ్రేసు, తెలుగుదేశం నేతలు. వీరు తమ నాయకులు తెలంగాణాకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నప్పుడు, మానిఫెస్టోల్లో జోడించినప్పుడూ ఎన్నడూ అడ్డుపడలేదు. కానీ ఒక్కసారిగా నాటకంలో తామెక్కడ వెనుకబడుతామోనని ప్రకతన వెలువడగానే గొంతుచించడం మొదలుపెట్టారు. పార్టీలు మరిచి, పాతకక్షలు మరిచి భాయీ భాయీలయిపొయ్యారు. బయటివారితో యుద్ధం చేసేప్పుడు ఇంటివారు తమ గొడవలు మరిచిపొయినట్లు కలిసి మరీ యుద్ధం చేశారు. పేరుకు మాత్రం ఇది సమైఖ్య ఉద్యమం, తెలంగాణా వారితో సోదరభావం ఉన్నట్లు ఫోజులు..అంతా అబద్ధమే. పెట్టుబడికీ ఫాక్షనిజానికీ పుట్టిన అక్రమసంతానం ఈ అబద్ధపు ఉద్యమం.

5 comments:

 1. 100% agree .. but you should stop commenting that and should do the following:


  తెలంగాణ కోసం పోరాడని తెలంగాణ నాయకుల మెడలు వంచండి ..

  ReplyDelete
 2. చాలా బాగా రాసారు.
  ఆది నుంచీ ఆంద్ర నేతలు అబద్ధాల కోర్లే.
  వారు ఒప్పుకున్నా పెద్ద మనుషుల ఒప్పందం ఒక అబద్ధం.
  ఆరు వందల పది జీ వో ఒక అబద్ధం.
  హామీలు, కమిటీలు నివేదికలు అభివృద్ది సమైక్యతా రాగం అన్నీ అబద్ధం.

  తెలంగాణాను వంచించడానికి ఎన్ని అబద్ధాలైనా అడతారు, ఎన్ని హామీలైనా గుప్పిస్తారు.
  మీరన్నట్టు 2004 , 2009 ఎన్నికలలో తెలంగాణాకు అనుకూలంగా తెలుగు దేశం కాంగ్రెస్ పార్టీలు ఎలాంటి తీర్మానాలు చేసాయో,
  2009 డిసెంబర్ ౯ ప్రకటనకు వెలువడే ముందు రోజు నిర్ణయాధికారం సోనియా గాంధీ కి కట్టబెడుతూ ఆమె ఎ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటామంటూ
  కాంగ్రెస్ నాయకులు ఎలా తీర్మానం చేసి ఆ తర్వాత దానిని ఎలా ఉల్లంఘిం చారో,
  మీరు బిల్లు పెట్టండి మేం సమర్దిస్తాం అంటూ నిండు అసెంబ్లీలో , అఖిల పక్షం భేటిలో ఎలా అబద్ధాలు ఆడాయో
  మనకు తెలుసు.

  ఆంద్ర పెట్టుబడి దార్లు కోట్లు ఖర్చు పెట్టి "ఓయి తెలుగు వాడా అనే ఒక కమర్షియల్ సమైక్య పాట రాయించి అన్ని టీ వీ చానళ్ళలో ఊదర గొట్టారు.
  వాళ్ళ అబద్ధపు ఉద్యమానికి ఆ ఉదంతమే మరో ఉదాహరణ.
  పైగా తెలంగాణా ఉద్యమాన్ని కొంత మంది రాజకీయ నిరుద్యోగుల ఉద్యమంగా చిత్రిస్తూ దాని వెనక జనమే లేదని ఇప్పటికీ కళ్ళున్న కబోదుల్లా
  అబద్ధాలు ప్రచారం చేయడం వారికే చెల్లింది.

  ఇక ఇప్పుడు వాళ్ళ అబద్ధాలు తెలంగాణాలోనే కాదు ఆంధ్రా లోనూ ఎవరూ నమ్మే పరిస్థితి లేదు.
  వాళ్ళ అబద్ధాల పాచిక లేవీ ఇప్పుడు పనిచేయవు.
  తెలంగాణా ఉద్యమం జయిస్తుంది..
  తెలంగాణా తప్పక ఉదయిస్తుంది.
  అంతిమంగా నిజమే గెలుస్తుంది.
  జై తెలంగాణా !

  ReplyDelete
 3. లగడపాటి, నన్నపనేని ముద్దులు, కౌగిలింతలతో సాగిన ఈ ఉద్యమ నాటకం కాంగ్రెస్, TDP అక్రమ సంబంధానికి ప్రతీకగా నిలిచింది.

  ఆ పదిరోజుల్లో వీరు చేసిన విధ్వంసం అదే రేటులో తెలంగాణాలోనే గనుక జరిగి ఉంటే, ఈపాటికి తెలంగాణాలో ఏమీ మిగిలి ఉండేది కాదు.

  ఉద్యమం అంటే హటాత్తుగా వచ్చి పదిరోజుల్లో చల్లారి పోదు. వరంగల్‌లో 25 లక్షల మందితో విజయవంతంగా జరిగిన తెలంగాణా గర్జన మహాసభను చూసి వీరు పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు ఒంగోలులో పెట్టుకున్న సభకు రెండువేల మంది కూడా రాలేదంటే వీరి ఉద్యమంలో పస ఎంతో అర్థం అయితది.

  ReplyDelete
 4. @a2zdreams,గౌతం నారయన్, శ్రీకాంతాచారి, కిరణ్

  మీ స్పందనలకు ధన్యవాదాలు.

  ReplyDelete