Sunday, 3 July 2011

క్రికెట్ మాచ్ ఓడిపోతే?

మన క్రికెట్ జట్టు ఒక గెలవాల్సిన క్రికెట్ మాచ్ చివరిబంతుల్లో ఏదో బౌలర్ లేదా బాట్స్‌మన్ తప్పిదం వల్ల ఓడిపోతే అది క్రికెట్ అభిమానులందరినీ ఎంతో బాధిస్తుంది. అంతా ఒక జట్టు ఓడిపోయినట్లు గాక తామే ఓడిపోయినట్లు భావిస్తారు.అలాంటిది ఒక రాష్ట్రం ఏర్పాటు, కోట్లమంది ప్రజల ఆకాంక్ష చివరిదాకా వచ్చి, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ఏర్పాటుపై ఒక నిర్ణయం తీసుకుని చివరికి ఆ రాష్ట్ర ఏర్పాటు ఆగిపోతే ఎలా ఉంటుంది?

అది కూడా కొంతమంది స్వార్ధ నాయకులు, కొన్న్ని రాజకీయ పార్టీలు తమ స్వార్ధ లాభాలకోసం మాటలు మార్చి, ధనబలంతో, మీడియా బలంతో, అధికార బలంతో, అంగబలంతో లేని ఉద్యమాలను పీసీ సర్కార్ కన్న గొప్పగా మాయాజాలం చేసి సృష్టించి ఆపితే ఎలా ఉంటుంది?

ఈబాధ ఇక్కడి ప్రజలను కలవరపరిచింది. ఈవోటమి ఇప్పటికే ఆరువందల ప్రాణాలు బలిగొంది. ఇప్పటిదాకా నాయకులు, రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు ఈప్రాంత ప్రజలతో ఆటలు ఆడుకుంటూ మాచ్‌ఫిక్సింగ్ చేస్తుంటే చూసిన ప్రజల సహనం నశించింది. ఇప్పుడు ప్రజలు తాము ఎంతకాలమూ ఆటలో పావులు కాదని తేల్చారు. దాని పరిణామమే ఇప్పుడు కాంగ్రేస్, తెలుగుదేశం నేతల్లో వణుకు. తెలంగాణ సాధించకపోతే తాము తమ నియోజకవర్గాల్లో మల్లీ అడుగుపెట్టలేని పరిస్థితి. తెరాసకు తాము గతంలో చెన్నారెడ్డిలాగా ప్రజలను వంచిస్తే ప్రజలు సహించరనే హెచ్చరిక.

ఎలాగయితేనేం, ఇప్పుడు ప్రజలు నాయకుల ఆటల్లో బొమ్మలు కావడం మాని నాయకులను శాసించే స్థితికి వచ్చారు. అందుకే ఇప్పుడు కాంగ్రేస్, తెలుగుదేశం ప్రతినిధుల రాజీనామాలు. ఆలస్యంగా నిర్ణయం తీసుకున్నా చివరికి ఎలాగోలా గట్టి నిర్ణయం తీసుకున్న ఈనాయకులు తమ నిర్ణయానికి కట్టుబడి ఉంటే వెక్కిరించే సీమాంధ్ర నేతలు, మీడియా, మాస్వార్ధలాభంకోసం మీరు మాతో కలిసే ఉండాలి, విడిపోయే హక్కు మీకులేదంటూ మిడిసిపడే కుహనా సమైక్యవాదులూ అందరూ గిజగిజలాడడం ఖాయం. ఈనాయకులు ఎంతవరకూ తమ నిర్ణయానికి కట్టుబడి ఉంటారనేదానికి ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే. ప్రస్తుతానికి మాత్రం తెలంగాణ కాంగ్రేస్, తెలుగుదేశం ప్రజాప్రతినిధులకు నా అభినందనలు.

No comments:

Post a Comment