Monday, 21 November 2011

పసలేని పరకాలవాదం


మూడు నాల్గు పార్టీలు మారి నాలుగుసార్లు ఎలక్షన్లలో నిలబడి డిపాజిట్టు కోల్పోయినప్పటికీ రాష్ట్రంలో పరకాల అంటే పెద్దగా ఇంతకుముందు ఎవరికీ తెలియదు. పీఆర్పీలో టికెట్ దొరక్క బయటికి వచ్చి అదోవిషవృక్షం అంటూ పరకాల హడావిడీ చేసినతరువాత మాత్రం కొన్నిరోజులు పరకాలకు టీవీల్లో మంచి పబ్లిసిటీ దొరికింది. ఆతరువాత మల్లీ ఎవరూ పట్టించుకోకపోయేసరికి ఎలాగోలా మల్లీ టీవీ హెడ్లైన్లలోకెక్కాలని ఈమధ్యన విశాలాంధ్ర మహాసభ అంటూ ఒక వెబ్‌సైటు పెట్టుకుని హడావిడీ చేస్తున్నాడు. అసలిది విశాలాంధ్ర మహాసభ కాదు, ఇదొక విషాంధ్ర మహాసభ, వీరికంటూ ఒక వాదం గట్రా ఏంఈలేదు, తెలంగాణా వాదాన్ని, తెలంగాణ ఉద్యమకారులను తిట్టడమే వీరి ఏకైక అజెండా అని జనాలు చెప్పుతున్నారనేది వేరే విషయం.

సరే ఈవెబ్సైటుతో మీడియా వర్క్‌షాప్ గట్రా అంటూ హడావిడీ చేసి తెలంగాణవాదుల్ని రెచ్చగొట్టి ఎలాగయితేనేం పరకాల మల్లీ వార్తల్లోకి వచ్చాడు. ఎలాగూ పరకాలకు కావల్సిందదే, వార్తల్లోకి ఎక్కడం, పబ్లిసిటీ పెంచుకోవడం. ఇప్పటికే మూడు పార్టీలు మార్చి వెల్తూ వెల్తూ పీఆర్పీని తిట్టిని తిట్లకు ఎలాగూ ఇప్పుడూ ఎవరూ ఈయన్న పార్టీలోకి చేర్చుకోరు.

ఈవిషాంధ్ర మహాసభ వెబ్‌సైటూ, బ్లాగూ నడుపుతూ ఇంతవరకూ సాధించింది ఏంతయ్యా అంటే ఫలానా తెలంగాణ నాయకుడు ఫలానా టైంలో సమైక్యాంధ్రకు జైకొట్టాడు అంటూ పేపర్ కటింగులు పెట్టడం, లేదా తెలంగాణ వాదుల్ని వేర్పాటువాదులు అంటూ తిట్టిపొయ్యడం. మొదట్లో కొన్నిరోజులు అసలు తెలంగాణకు నీటిపారుదలలో ఎలాంటి వివక్షా జరగలేదంటూ లోక్‌సత్తా రిపోర్టును సాక్ష్యంగా చూపుతూ హడావిడీ చేశారు కానీ అవన్నీ తప్పని బ్లాగుల్లో నిరూపించబడడంతో సమాధానం చెప్పలేక నోర్మూసుకున్నారు.

పరకాల ఈమధ్య టీవీల్లో బాగా హడావిడీ చేస్తున్నాడు. పరకాలకు, ప్రొఫెసర్ హరగోపాల్‌కు మధ్యన  మహాటీవీలో ఒక చర్చా కార్యక్రమం జరిగింది. ఆసక్తి కరంగా ఉంది కదా అని నేనూ ఓపిగ్గా అన్ని వీడియోలు చూశాను. లండన్లో పీహెచ్డీ చేసిన ఈమహానుభావుడు ఏంచెబుతాడో చూద్దామంటే అసలు ఎంతసేపూ చెప్పిందే చెప్పి బోరుకొట్టించడం లేకపోతే ఎదుటివారిని ఎగతాళి చెయ్యడం తప్ప ఈయన వాదన శూన్యం. కాలికేస్తే మెడకేస్తాను, మెడకేస్తే కాలికేస్తాను అదే నావాదన అని నిరూపించుకుంటున్న ఈయన ఒకే అర్ధం వచ్చే విషయానికి వరుసగా పది పర్యాయపదాలు చెబుతూ అదే వాదన అని భ్రమ పడుతున్నాడు.

"సమైక్యవాదం ఒక గొప్ప ఉదాత్తమమయిన వాదం, తెలంగాణ అన్నిరంగాలలోనూ ఈఈ సూచీల్లో మిగతా ప్రాతాల్లోకన్నా ముందుంది, తెలంగాణలో లక్షలాది ప్రజలు రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుకుంటున్నారు." ఇవే విషయాలను పదే పదే వల్లించడం తప్ప ఇంక ముందుకు వెల్లడు, ఆయా వాదనలపై హరగోపాల్ అడిగే సహేతుక ప్రశ్నలకు ఈఅయన దగ్గర సమాధానం ఉండదు, పైగా మల్లీ మల్లీ వేర్పాటువాదుల వాదనలో పస లేదు అంటూ అరవడం. అసలు తెలంగాణవాదుల్ని వేర్పాటువాదులు అని పిలిచేవారినీ, అలా పిలవడాన్ని సమర్ధించే టీవీ చానెల్లను బొక్కలో వెయ్యాలని నా అభిప్రాయం, ప్రస్తుతం ఉన్న సీమాంధ్రప్రభుత్వంలో అది సాధ్యం కాదుగానీ.

జీడీపీలు, తలసరి ఆదాయాలు అభివృద్ధిని చెప్పలేవు, వాస్తవపరిస్థుతులు అలాలేవు. అన్నీ బాగా ఉంటే మరి క్రిష్నా పక్కనే ఉండగా నల్లగొండలో ఫ్లోరైడ్ సమస్య, మహబూబ్నగర్లో కరువు ఎందుకు ఉంటుంది అంటే అందుకు సీమాంధ్ర ఎలా కారణం అంటూ దాటవేస్తాడు. తెలంగాణ అన్ని రంగాల్లో మిగతాప్రాంతాలకంటే చాలా అభ్వృద్ధి చెందిందనే ఈయన వాస్తవపరిస్థుతులు చెబుతుంటే తప్పించుకోవడం ఎందుకు? అక్కడ వాదన మహబూబ్నగర్ ఎండిపోవడానికి సీమాంధ్ర ప్రజలే కారణమని కాదు, ఈయన చెప్పే తెలంగాణ చాలా అభివృద్ధి చెందింది అనేది తప్పని చెప్పడం.

లక్షలాది ప్రజలు తెలంగాణలో రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుకుంటున్నారు అని పదేపదే వల్లిస్తాడు, మరి అందుకు సాక్ష్యం ఏది, ఏదయినా మహాసభ నిర్వహించారా, ర్యాలీ జరిగిందా అంటే సమాధానం ఉండదు. కానీ ఇదిగో నలమోతు తెలంగాణవాడే అని చెబుతాడు. ఆ బాషా ఒక్కసారి చెబితే వంద సార్లు చెప్పినట్టయితే ఈయనకు నలమోతు ఒక్కడే లక్షలాది ప్రజల్లాగా కనిపిస్తున్నారేమో.

సమైక్యభావన గొప్ప ఉదాత్తమమయిన భావన అనేది ఈయన మరో పాయింటు. మరి సమైక్యవాదంలో ప్రజలను సంతృప్తి పరచడానికి ఏదయిన ఆదాయవనరు ఉందా, సమైక్యవాదంలో కలిపిఉంచే అంశమేంటి అనడిగితే దానికీ సమాధానం ఉండదు. ఊరికే మమ్మల్ని సమైక్యవాదం ప్రచారం చేసుకోనీయట్లేదు అంటూ దొంగ ఏడుపులు మాత్రం ఏడుస్తుంటాడు. అయ్యా పరకాలా, నీవాదానికి నిజంగా నువ్వు చెప్పేట్లు లక్షలాది ప్రజల మద్దతు ఉంటే ఒకరు నీవాదాన్ని వినిపించకుండా ఆపలేరు, ప్రజలే నీకు మద్దతుగా వస్తారు, ఇక్కడ ఎవరూ సమైక్యంగా ఉండాలని కోరుకోవట్లేదు కాబట్టే నీకు ఒక మీటింగు పెట్టుకోవడం కూడా గగనమవుతుంది.  నువ్విక్కడీకొచ్చి వేర్పాటువాదులూ లాంటి భాషను ఉపయోగితూ ప్రొఫెసర్ జయశంకర్ లాంటి పెద్దలను అగౌరవపరచడం రెచ్చగొట్టడం తప్ప మరోటి కాదు, ఈవిషయం నీక్కూడా తెలుసుననుకో, అయినా ఇలా చెప్పాల్సి వస్తుంది.

Wednesday, 16 November 2011

విస్తృత స్థాయి చర్చలు


జూన్ 2011:

తెలంగాణ అంశంపై యూపీయే ప్రభుత్వం రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు చెందిన అన్ని కాంగ్రేస్ మరియూ ఇతర పార్టీల నేతలతో చర్చలు జరుపుతుంది. ఇది చాలా సున్నితమైన అంశం, అన్ని ప్రాంతాల ప్రజల మనోభావాలకు సంబంధించిన అంశం కనుక ఈవిషయంపై తొందరపాటుతో వ్యవహిరించకుండా అన్నివర్గాలవారి అంగీకారంతో అందరికీ అనుకూలమైన నిర్ణయం తీసుకుంటాం.

నవంబరు 2011:

తెలంగాణ అంశంపై యూపీయే ప్రభుత్వం జాతీయస్థాయిలో అందరు యూపీయే భాగస్వామ్య పార్టీలతోనూ మరియూ ఇతర వర్గాలతోనూ విస్తృత స్థాయిలో చర్చలు జరుపుతుంది. తెలంగాణ అంశం ఒక్క తెలంగాణప్రాంతానికి సంబంధించిన వ్యవహారం మాత్రమేకాదు, ఇది దేశంలోని అన్ని ప్రాంతాలనూ ప్రభావితం చేసే విషయం. తెలంగాణ డిమాండ్ పరిష్కరిస్తే దేశంలో ఇంకా ఇలాంటి డిమాండ్లు పుట్టుకొచ్చే అవకాశం ఉంది. కనుక అందరినీ సంప్రదించినతరువాత కీలక నిర్ణయం తీసుకుంటాం.

జనవరి 2012:  

తెలంగాణ అంశంపై యూపీయే ప్రభుత్వం ప్రపంచంలోని అన్ని పెద్ద దేశాల నేతలతో అత్యంత విస్తృత స్థాయిలో చర్చలు జరుపుతుంది. ఈఅంశానికి సంబంధించి మన విదేశాంగ మంత్రి బ్రిటన్, అమెరికా, ఫ్రాన్స్, టాంజానియా దేశాలనేతలతో రాబోయే నాలుగు నెలల్లో కీలక చర్చలు నిర్వహిస్తారు. తెలంగాణ డిమాండ్ లాంటిదే టాంజానియాలోనూ ఒక డిమాండ్ ఉంది, మరియూ ముందు ముందు ఈసమస్యను పరిష్కరిస్తే ఉగాండా, కాంబోడియా లాంటి దేశాల్లో కొత్త డిమాండ్లు ఉత్పన్నమయే అవకాశం ఉంది. కనుక అందరితో చర్చించిన తరువాత ప్రభుత్వం ఒక చక్కని శాశ్వత పరిష్కారాన్ని ప్రకటిస్తుంది.

మార్చి 2013:

ఇప్పటికే రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో చర్చలు పూర్తిచేశాం. ఈచర్చలు చాలా వేగవంతంగా పూర్తిచేయగలిగాం, చర్చలు చాలావరకు సత్ఫలితాలనిచ్చాయి. అయితే రాబోయే కాలంలో ఒక్క భూమిమీదే కాక ఇంకా ఎక్కడైనా జీవరాశి ఉంటే అక్కడకూడా ఇలాంటి సమస్యలు ఉత్పన్నమయే అవకాశాలు ఉన్నాయి. దీనికోసం యూపీయే ప్రభుత్వం ఏలియన్లతో కూడా చర్చించాలని నిర్ణయించుకుంది, దానికోసం ఒక కమిటీని రూపొందించాం. ఈకమిటీ అసలు భూమండలం కాక ఎక్కడయినా జీవరాశి ఉందా అన్న విషయంపై ముందుగా అధ్యయనం చేసి ఒక నివేదిక ఇస్తుంది. ఆతరువాత అక్కడి జీవరాశితో ఒక కమ్యూనికేషన్ చానెల్ను తయారుచేసి సంప్రదింపులు చేయడంకోసం మరో కమిటీని నియమిస్తాం.

మొత్తానికి ఈసమస్య ఎంతో సంక్లిష్టమయిన సమస్య అయినా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో చాలా వేగవంతంగా చర్చలు పూర్తిచేయగలిగాం. ఇకముందు కూడా అదేవేగంతో విశ్వవ్యాప్త సంప్రదింపులు పూర్తిచేస్తామని ఆశాభావాన్ని వ్యక్తపరుస్తున్నాం.

Tuesday, 8 November 2011

తొంభై ఐదేళ్ళ యువకుడు

సంవత్సరం క్రితం రాసిన టపా..బ్లాగరులకోసం మరొకసారి.

Thursday, 23 December 2010


తొంభై ఐదేళ్ళ యువకుడు

శ్రీ కొండా లక్ష్మన్ బాపూజీ గారు ప్రస్తుత తరం ప్రజలకి అంతగా తెలియని వెనుకటి తరం కాంగ్రేస్ నాయకుడు. తొంభై అయిదు సంవత్సరాలు పైబడ్డ వయసులో కూడా కొండా లక్ష్మన్ గారు తెలంగాణా ఉద్యమంలో అత్యంత చురుగ్గా పాల్గొంటూ అనేక కార్యక్రమాలలో ముఖ్య అథిధిగా, వక్తగా ఉద్యమానికి తోడ్పడుతున్నారు..

స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్న కొండా లక్ష్మన్ గారు 1956లొ ఆంధ్రప్రదేశ్ అవతరణ తరువాతి మొట్టమొదటి అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్‌గా పనిచేశారు. ఆ తరువాత రాష్ట్ర మంత్రిగా విభిన్న ప్రభుత్వాలలో పనిచేసిన ఈ నేత 1969లో తెలంగాణా ఉద్యమానికి మద్దతుగా తన పదవికి రాజీనామా చేశి ఉద్యమంలో భాగస్వామ్యం తీసుకున్నారు. ఆదిలాబాద్ వాస్తవ్యుడైనప్పటికీ నల్లగొండ జిల్లా నుండి అసెంబ్లీకి ప్రాతినిఘ్యం వహించారు. తెలంగాణా ప్రజా సమతి ఫౌండింగ్ మెంబర్ కూడా అయిన కొండా లక్ష్మన్ గారు నేటికీ అదే ఉద్యమస్ఫూర్తిని ప్రదర్శిస్తున్నారు.

సుమారు నలభై ఏళ్ళుగా తెలంగాణా ఆశయం కోసం పనిచేసిన కొండా లక్ష్మన్ గారు టీఆరెస్ పార్టీ ఆఫీసు కోసం తన నివాస గృహాన్ని అద్దె లేకుండానే ఇవ్వగా అక్కసుతో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టాంక్‌బండ్ పక్కన ఉన్న వారి ఇంటిని అధికారబలంతో రాత్రికి రాత్రి నేలమట్టం చేయించాడు.

తన ఇద్దరు కొడుకులలో ఒక కొడుకు ఇండియన్ ఎయిర్‌ఫోర్సులో పైలట్‌గా పని చేసి విమాన ప్రమాదంలో మృతి చెందగా మరో కొడుకు అమెరికాలో ఉంటూ ఇటీవలే అనారోగ్యంతో చనిపోయారు. తొంభై ఏల్ల వయసులో కూడా తన ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్న బాపూజీ గారు ఈ వయసులో కూడా ఉద్యమానికి సంబంధించి ఎవరు ఏ సమావేశానికి ఆహ్వానించినా తప్పకుండా వెలుతారు. ఈ తొంభై అయిదేళ్ళ యువకుడి ఉద్యమస్ఫూర్తికి నా జోహార్లు.

Thursday, 3 November 2011

వంచన దోపిడీ పునాదులుగా (నాటకం) -2


సీన్ - 3

టెంట్ హౌజ్ నుండి తెచ్చి వేసిన ఒక షామియాన కింద సంజీవ్, ప్రకాశ్, బ్రహ్మానంద్, గోపాల్ కూర్చుని మంతనాలు చేస్తుంటారు. పక్కనే కాస్త దూరంగా కొందరు మేకలు కాసుకునేవారు మాట్లాడుకుంటూ వీల్లే మన ముఖ్యమంత్రీ, మంత్రులూ నంట, ఈషామియానాలోనే మన పెబుత్వం నడుస్తుందంట నీకు తెలుసా అని చెవులు కొరుక్కుంటుంటారు.

సంజీవ్:                 శ్రీరాం గాడి చావు పుణ్యమా అని రాష్ట్రం, పదవులూ అయితే దక్కాయి గానీ ఏమిటీ విధి వైపరీత్యం? షామియానాలకింద అసెంబ్లీలూ, సెక్రెటేరియట్లూనూ!!

ప్రకాశ్:                  నా పరిస్థితి అయితే పెనం మీద నుండి పొయ్యిలో పడ్డట్టుంది. ఇంతకుముందు చక్కగా మంత్రి పదవి వెలగబెడుతూ క్రిష్ణా రామా అంటూ ఉండేవాడిని. ఇప్పుడు ముఖ్యమంత్రినయ్యాను గానీ ఒక అసెంబ్లీ లేదు, ఒక కారు లేదు. ఎండలో కూర్చోవాల్సి వస్తుంది. ఉద్యోగస్తులు జీతాలడుగుతున్నారు, ఇద్దామంటే ఒక్క పైసా లేదు.

గోపాల్:                ఇప్పుడేం చేద్దాం?

బ్రహ్మానంద్:          ఇలా ఎక్కువరోజులు భరించలేం, ఏదో ఒకటి చేసి ఈపరిస్థితినుండి బయట పడాలి. కేంద్రం ఏమన్నా డబ్బిస్తుందంటావా?

గోపాల్:                కేంద్రామా నా బొందా, ఒక చిప్ప ఇస్తుంది.

ప్రకాశ్:                ఎలాగోలా మనం భాగ్యనగర్‌ను దక్కించుకున్నామంటే మన కష్టాలన్నీ తీరిపోయి మల్లీ భాగ్యం చేతికొస్తుంది. దానికోసం ఏం చెయ్యాలో మార్గాలు వెతకాలి.

గోపాల్:               మనదగ్గర రాజధాని కాదు గదా ఒక జిల్లాను పరిపాలించడానికి కూడా సరిపోయే నగరం ఒక్కటంటే ఒక్కటి లేదు.

సంజీవ్:             మరెందుకాలస్యం? తొందరగా భాగ్యనగర్‌ను దక్కించుకునేందుకు పావులు కదుపుదాం. అక్కడ మిగులు బడ్జెట్ కూడా ఉందంట. మన కష్టాలన్నీ తీరిపోతాయి.

బ్రహ్మానంద్:           మనం కలవమంటే వాల్లు కలుస్తారా? మన సంగతి తెలిసినవారు ఎవరైనా మనల్ని నమ్ముతారంటావా?

సంజీవ్:           వాల్లు మనల్ని నమ్మరనేది నిజం, కానీ ఎలాగయినా నమ్మించాలి మరో మార్గం లేదు.

ప్రకాశ్:             ఐదుగురు పెద్దమనుషులను కూర్చోపెట్టి పంచాయితీ పెడదాం వాల్లేం అడిగితే అది ఒప్పుకుని సంతకాలు పెడదాం. అమలయేనాటికి ఎవడు బతికుంటాడో, ఎవడు చస్తాడో ఎవరికి తెలుసు?

సంజీవ్:           ఈ ఐడియా బాగానే ఉంది గానీ ముందు ఢిల్లీ ఒప్పుకుంటుందా?

ప్రకాశ్:            నీకన్నీ అనుమానాలే. మనం గట్టిగా లాబీయింగ్ చెయ్యాలి గానీ ఢిల్లీని ఒప్పించడం పెద్ద కష్టమా?

గోపాల్:           మరి అక్కడి ప్రజలసంగతో? వారు ఇందుకు అస్సలు ఒప్పుకోరు. మొదట్నుంచీ మన జనాలు వాల్లను తక్కువగా చూస్తారనీ, వాల్ల యాసను వెక్కిరిస్తారనీ వారికి తెలుసు కదా?

ప్రకాశ్:           అందరం తెలుగువాల్లమే అనీ, తెలుగు జాతి ఐక్యత అనీ ప్రచారం చెయ్యాలి. తెలుగుతల్లి విగ్రహాలు ఊరూరా పెట్టాలి. మన శ్రీరాం గాడి బొమ్మను కూడా అక్కడ ఊరూరా పెడదాం. మెల్లగా జనాలు దారికొస్తారు.


Wednesday, 2 November 2011

పొట్టి శ్రీరాములు గురించి తెలంగాణవాదిగా!!

ఈమధ్యన కొందరు తెలుగు బ్లాగరులు తెలంగాణవాదులు పొట్టిశ్రీరాములును ద్వేషిస్తున్నట్టూ, అవమానిస్తున్నట్టు ప్రచారాలు చేస్తున్నారు. నిజానికి పొట్టి శ్రీరాములుపై తెలంగాణవాదులకు ఎలాంటి ద్వేషం లేకపోగా ఒక గాంధేయవాదిగా, తాను నమ్మినదానికోసం ప్రాణాలు అర్పించిన వ్యక్తిగా గౌరవం ఉంది. తెలంగాణవాదులు ఎక్కడా పొట్టి శ్రీరాములును ద్వేషించలేదు, దూషించలేదు. కొండకచో కొందరు ఆవేశపూరిత ఉద్యమకారులు పొట్టి శ్రీములు విగ్రహాలను తొలగించడానికి ప్రయత్నం చేసినా అది పొట్టి శ్రీరాములుపై కోపం కాదు, తెలంగాణవాదుల కోపం కేవలం తమప్రాంతానికి సంబంధం లేని వ్యక్తి విగ్రహాన్ని తమ ప్రాంతంలో ఊరూరా (హైదరాబాద్ మాత్రమే కాదు, ప్రతి జిల్లాలో అని గమనించాలి) ప్రతిష్టించి తమ అభిజాత్యాన్ని నిరూపించుకునే ప్రయత్నం పైనా, చరిత్రను వక్రీకరిస్తూ ఆంధ్రప్రదేశ్ అవతరణకు పొట్టిశ్రీరాములుకు ముడిపెట్టడం పైనా.


ఆంధ్ర రాష్ట్ర అవతరణకు ముందుగా దీక్ష చేసింది గొల్లపూడి సీతారాం. అతని దీక్ష తరువాత కేంద్రప్రభుత్వం సూత్రప్రాయంగా ఆంధ్రరాష్ట్ర ఏర్పాటుకు ఒప్పుకుంది. ఆతరువాత పొట్టి శ్రీరాములు దీక్ష చేసింది మద్రాసు నగరం రాజధానిగా ఆంధ్రరాష్ట్రం ఏర్పడాలి అనే ప్రధాన డిమాండ్‌తో కాగా అతని డిమాండ్ తీరకుండానే పొట్టి శ్రీరాములు గతించారు.

నిజానికి ఎలాగూ దక్కదని తెలిసీ మద్రాసు నగరం కోసం పొట్టి శ్రీరాములును దీక్షకు ఉసిగొల్పిందీ, అతను దీక్షకు పూనుకుంటే ఈడిమాండ్ నెరవేరడం కాష్టమని చెప్పి  దీక్ష విరమణకోసం ప్రయత్నం చెయ్యనిదీ ఆంధ్ర నాయకులే. దీక్ష చివరిరోజుల్లో అపస్మారక స్థితిలో ఉండి తన స్వంత నిర్ణయం తీసుకోలేని స్థితిలో ఉన్నప్పుడు విరమింపజేయాల్సింది ఆంధ్రనాయకులే అయినా వారు దానికోసం ఎలాంటి ప్రయత్నాలు చెయ్యలేదు. ఈవిధంగా పరోక్షంగా పొట్టి శ్రీరాములు మృతికి కారణం ఆంధ్ర నాయకత్వమే.

ఇక స్వాతంత్ర్యం వచ్చిన తరువాత, ఆంధ్రరాష్ట్ర ఉద్త్యమానికి ముందు పొట్టి శ్రీరాములు ఒంటరిగా దళిత అభ్యున్నతికై ఉద్యమిస్తూ రోడ్డుపై బ్యానర్ పట్టుకుని  కాల్లకు చెప్పుల్లేకుండా తిరుగుతుంటే ఏఆంధ్రా నాయకులూ అతనికి సహకారం ఇచ్చిన పాపాన పోలేదు. అప్పుడు ఆంధ్రా ప్రజానీకమే పొట్టి శ్రీరాములును పిచ్చివాడికింద జమకట్టి అవమానించారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పడినతరువాత ఒక్కసారిగా పొట్టి శ్రీరాములు హీరోను చేసి ఆంధ్రాకంటే కూడా ఎక్కువ విహ్రహాలను తెలంగాణలో ప్రతిష్టించింది కూడా ఆంధ్రా నాయకులే. పాఠ్యపుస్తకాల్లో పొట్టి శ్రీరాములు మూలంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడిందనే అర్ధం వచ్చేలా పాఠాలు చొప్పించిందీ ఆంధ్రా నాయకత్వమే. పొట్టి శ్రీరాములు ఆత్మ నేడు ఎవరిచర్యలవల్ల క్షోభిస్తుందో!!

ఇప్పుడు తెలంగాణవాదులు మాకు సంబంధం లేని వ్యక్తుల విగ్రహాలు మాప్రాంతంలో వద్దు, చరిత్రను వక్రీకరించి నవంబరు ఒకటి ఆంధ్రప్రదేశ్ అవతరణకు, పొట్టి శ్రీరాములుకు ముడిపెట్టొద్దంటే తెలంగాణవాదులను ద్రోహులు అంటూ అవాకులు పేలుతున్నదీ ఆంధ్రా నాయకులూ, బ్లాగరులే.పొట్టి శ్రీరాములు విగ్రహానికి దండేయాల్సింది నవంబరు ఒకటిన కాదు, అక్టోబరు ఒకటి రోజు, ఆంధ్ర రాష్ట్ర అవతరణ గూర్చి.



వంచన, దోపిడీ పునాదులుగా (నాటకం) -1

సీన్-1:
ప్రకాశ్, గోపాల్, సంజీవ్, బ్రహ్మానంద్ కలిసి గదిలో మంతనాలు చేస్తున్నారు
.
సంజీవ్:                భజగోవిందం, భజగోవిందం. అంతా అయిపోయింది. ఆఖరుకు ఎమ్మెల్యే పదవి కూడా దక్కలేదు. ఈకమ్యూనిస్టులు చెయ్యబట్టి సొంత నియోజకవర్గంలో ఓడిపోయాను. ఇంతబతుకూ బతికి ఇంటెనుక చచ్చినట్టు ముఖ్యమంత్రినవుదామని కలలు గంటే ఎమ్మెల్యేగిరీ దక్కలేదు.

బ్రహ్మానంద్:  నాపరిస్థితి కూడా సేం టు సేం. నేనెవరితో చెప్పుకునేది?

గోపాల్:         బాగుంది వరస. నేను మాత్రం ఎమన్న ఎక్కువ బావుకున్నానా? నేనూ మీవంతే. ఇంగ్లీసోడి చదువులు చదువుకున్నందుకు ఇన్నాల్లూ కాంగ్రేస్ పార్టీలో నాయకత్వం వెలగబెట్టాము గానీ ఇప్పుడా ఇంగ్లీసోడు వెల్లిపొయ్యాక మన ఇంగ్లీసుకు విలువ లేదు. సొంతనియోజక వర్గంలో ప్రజలు మనల్ని నమ్మడం లేదు. ఇప్పుడేం మార్గం?

గోపాల్, సంజీవ్, బ్రహ్మానంద్:      ప్రకాశ్, నువ్వే ఏదో ఒక మార్గం చెప్పు. నువ్వు చక్కగా మంత్రి పదవి వెలగబెడుతున్నావుగా?

ప్రకాశ్:       నాగోడెవరితో చెప్పుకునేది? ఈ రాజా ఢిల్లీకి వెల్లినవాడు అక్కడే ఉండక వెనక్కొచ్చి ముఖ్యమంత్రి పదవి లాగేసుకున్నాడు. మనకు ఇక బతికుండగా ముఖ్యమంత్రి పదవి దక్కడం కష్టం.

సంజీవ్:      అయితే ఇప్పుడు ఏమిటి సాధనం?

ప్రకాశ్:        దీనికొక్కటే మార్గం ఉంది. మనం వెంటనే మనకో ప్రత్యేక రాష్ట్రం కావాలని ఆందోళన చేద్దాం. ప్రజల్లో మల్లీ పలుకుబడి వస్తుంది. ఒకవేళ రాష్ట్రం గానీ వస్తే గిస్తే మనం ముగ్గురం ముఖ్యమంత్రి పదవులు పంచుకోవచ్చు.

బ్రహ్మానంద్: మనం ఉద్యమం చేస్తే ఎవరు నమ్ముతారు? పోనీ నిరాహార దీక్షలూ గట్రా చేద్దామంటే మనకసలే అలవాటు లేదాయే?

ప్రకాశ్:          మన చేతికి మట్టంటించుకోవడం ఎందుకు? ఏదారే పోయే శ్రీరాం గాన్నో దీక్షకు కూర్చోపెడితే సరి, చస్తే వాడే చస్తాడు. పదవులు మనం కొట్టేయొచ్చు.

సంజీవ్:        బాగుంది ఈ ఐడియా. మరి ఎప్పుడు మొదలెడుదాం?

గోపాల్:    ఆలస్యం అమృతం విషం, శుభస్య శీఘ్రం. 

సీన్- 2:
ప్రకాశ్, గోపాల్, సంజీవ్, బ్రహ్మానంద్ గదిలో తీవ్రంగా వాదులాడుకుంటున్నారు.

సంజీవ్:           ముఖ్యమంత్రి పదవి నాకే దక్కాలి. లేకపోతే నేను నామద్దతు విరమించుకుంటాను. మా ప్రాంతం కొత్తరాష్ట్రంలో కలవనివ్వను.

గోపాల్:            నేనొప్పుకోను, నాకే దక్కాలి. నీక్కావాలంటే ఉపముఖ్యమంత్రి పదవి తీసుకో.

ప్రకాశ్: మీరు కాస్త ఊరుకోండి. వయసు పైబడ్డవాన్ని. ఈసారికి నన్ను ముఖ్యమంత్రిని కానివ్వండి. తరువాత మీఇష్టం.

పక్కగదిలో నుంచి బలహీనంగా మాటలు వినిపిస్తున్నాయి. "ఆకలి. ఆకలి. నాక్కాస్త అన్నం పెట్టండి. నేను తట్టుకోలేకపోతున్నాను. నాకింకా ఈదీక్ష వద్దు. కాస్త అన్నం పెట్టండి, వచ్చేజన్మలో మీకడుపులో పుడతాను."

గోపాల్:              చచ్చేట్టున్నాడు. ఏం చేద్దాం? కాస్త తిండి పడేద్దామా?

సంజీవ్:             పైవాడు ఇంకా మన ఉద్యమానికి పూర్తిగా స్పందించలేదు. ఇప్పుడు దీక్ష విరమిస్తే ఎలా?

ప్రకాశ్:              అవున్నిజమే. ఇప్పుడు తిండి ఇవ్వొద్దు.

పక్క గదిలో నుండి దబ్బుమని కింద పడ్డ శబ్దం. ముగ్గురూ అక్కడికి వెల్తారు.

సంజీవ్:             చచ్చినట్టున్నాడు. ఇప్పుడేమిటి చెయ్యడం?

ప్రకాశ్:               ఇదే మంచి అదును. మన వాల్లకు చెప్పి అల్లర్లు చేయిద్దాం. బెజవాడ, నెల్లూరు, వైజాగ్ అన్నీ ఒక్కసారి అదిరిపోవాలి. ఈదెబ్బకు కేంద్రం దిగి రావాలి.




Tuesday, 1 November 2011

జీడీపీలు సులభంగా పెంచండిలా!!

జీడీపీ, తలసరి ఆదాయాలగురించి వినని వారుండరు. చిన్నప్పుడు మనందరం సోషల్ పుస్తకాల్లో దేశాల ఆర్ధిక స్థితులను పోల్చడానికి ఈ ఇండెక్స్‌లు వాడడం చూసేఉంటాం. జీడీపీ (Gross Domestic product) ఒక ప్రాంతంలో ఒక సంవత్సరంలో జరిగిన ఉత్పత్తిని సూచిస్తే తలసరి ఆదాయం ఆప్రాంతంలో ఒక వ్యక్తి సగటు ఆదాయాన్ని సూచిస్తుంది.

ఈసూచీలు ఇంకా అనేక ఇతర సూచీలతో కలిపి చూసి మనం రెండు దేశాల ప్రజల జీవన ప్రమాణాలని పోల్చవచ్చు. అయితే statistics మీద అవగాహన లేనివారు వీటిని ఇష్టం ప్రకారం ఉపయోగిస్తే మొదటికే మోసం వస్తుంది. తలసరి ఆదాయం ఒక ప్రాంతంలో మనిషియొక్క సగటు ఆదాయాన్ని చెపుతుంది కానీ అక్కడ ఉన్న ఆర్ధిక అసమానతలు, బీదా బిక్కీ ప్రజల స్థితి తెలియదు. అందుకే మనదేశంలో వెనుకబడిన జిల్లాల పట్టీ తయారు చేసేప్పుడు మన కేంద్రప్రభుత్వం జీడీపీలూ, తలసరి ఆదాయాలు తీసుకోదు, అక్కడి కూలీ రేట్లు, వ్యవసాయం, జీవనోపాధి మార్గాలు, లిటరసీ రేట్లు లాంటి ఇతర ఇండికేటర్లను తీసుకుంటారు. 

ఉదాహరణకు ఫలానా జిల్లాలో తలసరి ఆదాయం బాగా తక్కువగా ఉందనుకోండి. అక్కడ నిజమైన అభివృద్ధి జరిగి ప్రజల జీవన ప్రమాణాలు పెరగాలంటే చాలా శ్రమించాలి. ప్రజలకు ఉపాధి అవకాశాలు పెంచాలి, వ్యవసాయం నీటిపారుదలలో అభివృద్ధి సాధించాలి ఇంకా ఎన్నో సాధించాలి. అయితే ఇవన్నీ చేయకుండా కూడా చాలా సులభంగా ఆజిల్లా ప్రజల తలసరి ఆదాయాన్ని పెంచొచ్చు. ఎలాగంటారా లగడపాటి, కావూరు, జగన్, చంద్రబాబు లాంటి కొందరు బడా బాబులను అక్కడి జనాభా లెక్కల్లో నమోదు చేస్తే సరి. వారి ఆదాయం కూడా అక్కడి ప్రాంతం లోకే వస్తుంది కాబట్టి తలసరి ఆదాయం అమాంతంగా పెరిగిపోతుంది.

ఇక జీడీపీ ఎలా పెంచాలంటారా? వెనుకబడిన ప్రాంతంలో ఎలాగూ వ్యవసాయభూములు తక్కువధరకు దొరుకుతాయి. అక్కడ కొన్ని భూములను ప్రభుత్వం లాగేసుకుని ఒక SEZ కట్టిందనుకోండి, అప్పుడు జీడీపీ అమాంతంగా పెరిగిపోతుంది. ఆSEZలో లోకల్ ప్రజలు   ఎలాగూ ఉండరు, అప్పటికే అభివృద్ధి సాధించిన ప్రాంతాల్లో విద్యావకాశాలు, చదువుకునే స్థోమత ఎక్కువ ఉంటాయి కనుక అక్కడివారే పెద్ద ఉద్యోగాలు ఎలాగూ చేజిక్కించుకుంటారు. కంపనీ ఎలాగూ అభివృద్ధి చెందిన ప్రాంతం వారే పెడతారు కాబట్టి కీలక పదవుల్లో అంతా వారి చుట్టాలో పక్కాలో అభివృద్ధి చెందిన ప్రాంతం వారే ఉంటారు.  చప్రాసీ ఉద్యోగాలకు కూడా తమ ప్రాంతంలోనే ఉన్న వెనుకబడిన వర్గాలను తెచ్చుకుంటే సరి. అంటే వెనుకబడిన ప్రాంతంలో ఒక్కరి ఆదాయం కూడా పెంచకుండానే అక్కడి జీడీపీని అమాంతం పెంచవచ్చు. అయినా బలిసిన వారు ఎక్కడన్నా తాముండే ప్రాంతంలో పరిశ్రమలు పెట్టుకుని తమప్రాంతంలో కాలుష్యం పెంచుకుంటారా మన పిచ్చిగానీ?

మరి బ్లాగుల్లో జీడీపీలూ, తలసరి ఆదాయాల లెక్కలు చూపించి తెలంగాణాయే అభివృద్ధి చెందిందని చెప్పే చౌదర్లకు ఇవన్నీ తెలియవా అంటే అన్నీ తెలుసు. కానీ చదివేవాల్లని అందర్నీ అమాయకులకింద జతకట్టేసి ఇలాంటి అవాకులు రాస్తుంటారు. ఇలాంటి అబద్ధపు రాతలు రాయడం ఎందుకు? రాష్ట్రం కలిసుంటే వీరికేం లాభం అంటారా? అదో చిదంబర రహస్యం. సమైక్య రాష్ట్రంలో వీరిది చాలా బలమయిన లాబీ. వ్యాపారాలు, రాజకీయాలు, మీడియా అన్నీ వీరిచేతుల్లోనే ఉంటాయి. విడిపోతే తెలంగాణా, మరీ ముఖ్యంగా హైదరాబాదు వీరి చేతుల్లోంచి బయటికి పోతుంది, అక్కడి కాంట్రాక్టులు వీరి వర్గం వారికి రావు అనేదే వీరి బాధ.

ఎవరి బాగుకై సమైక్య?



తేగీ!!
ఆరు వందల పదిజీవొ అమలుకాదు,
సాగునీటిపై దోపిడీ సమిసిపోదు
నిధుల తరలింపు ఆగదు నేటివరకు
ఎవరి బాగుకై సమైక్య? ఏది నీతి?