Wednesday 14 April 2010

మహబూబ్ నగర్, నల్లగొండే కాదు, ఉత్తరాంధ్ర, రాయలసీమ కూడా అభివ్రుద్ధి చెందలేదు కదా??!!

మహబూబ్ నగర్, నల్లగొండే కాదు, ఉత్తరాంధ్ర, రాయలసీమ కూడా అభివ్రుద్ధి చెందలేదు కదా?ఇది సమైఖ్య వాదుల రెగ్యులర్ వాదన. ఎప్పుడు ఎవరైనా తెలంగాణా వాడు నల్లగొండ, మహబూబ్ నగర్ అభివృద్ధి చెందలేదు అనగానే సమైఖ్య వాదులు వెంటనే ఈ వాదన మొదలు పెడతారు. దీనికి తెలంగాణా వాదులు సమాధానం ఇచ్చీ ఇచ్చీ ఇప్పటికే బహుషా విసిగి పోయి ఉంటారు. కానీ సంఖ్యా బలం సమైఖ్య వాదులలో ఎక్కువ కనుక వాల్ల పోస్ట్లుల మధ్య సాధారణంగా తెలంగాణా బక్క గొంతులు వినపడవు. రోజూ లగడపాటి టీవీలో జోరుగా ఇదే వాదన వినిపిస్తాడు. దానికి సమాధానం ఎన్ని సార్లు చెప్పినా ఆయన చెవికెక్కదు. ఈ వితండ వాదాలు చేసే సమైఖ్య వాదులకోసం ఈ టపా!!

నిజమే!! సమిఖ్య వాదుల వాదన అక్షర సత్యం. తెలంగాణా యే కాదు, శ్రీకాకుళం, విజయనగరం, అనంతపురం, కడప అన్నీ వెనుక బడినవే. ఇది ఎవరయినా ఒప్పుకొని తీరాల్సిందే. అయితే ఇక్కడ గమనించవలసిందేమంటే ఉత్తరాంధ్రా, అనంతపురం, కడప, చిత్తూరు లాంటి జిల్లాలలో జల వనరులు లేవు, వర్షపాతం తక్కువ. అయితే మహబూబ్ నగర్, నల్లగొండ జిల్లాల సమస్య వీటికి విరుద్ధం. ఇక్కడ పక్కనే క్రిష్ణా ఉండి కూడా ఇవి వెనుక బడ్డాయి. ఒకవేల పంజాబ్, హర్యాణా లను ఎండపెట్టి నీళ్ళన్నింటినీ రాజస్థాన్ కి తరలించారనుకోండి, అప్పుడు పంజాబ్ వాళ్ళు ఊరుకుంటారా? మరి అలాంటప్పుడు రాజస్తాన్ వెనుకబడలేదా నీటిని రాజస్థాంకి తరలిస్తే తప్పేమిటనే వాదన వితండ వాదమే కదా?

ఏ ప్రాంతం ప్రజలకి ఆ ప్రాంతపు వనరులపై అధికారం ఉంటుంది. జలవనరులపై మొదటి హక్కు నదీ పరీవాహిక ప్రాంత వాసులకి ఉంటుంది. అక్కడి ప్రజల అవసరాలు తీరిన తరువాత మాత్రమే వాటిని మిగతా ప్రాంతాలకు కేటాయించాలి. ఈ మాత్రం సమైఖ్య మేధావులకి తెలియదని కాదు, కానీ వాదనలో ఎదుటివారి నోరు మూయించడమే వీరి విధానం, నిజానిజాలు గాలికే వదిలేస్తారు. మహబూబ్నగర్ ఎండిపోతే మాకేంటి, మా కర్నూలు, గుంటూరు, క్రిష్ణా, అనంతపురం, కడప,చిత్తూరు, మద్రాసు అన్నింటికీ క్రిష్ణా జలాలు కావాలి అనేది వీరి అభిప్రాయం కాబోలు. ఇంకా ఏమన్నా మిగిలితే అవి కడప రాజా గారి సిమెంటు ఫాక్టరీలకు తరలిస్తారు. వడ్డిచేవాడు మనవాడయితే వెనుక వరసలో ఉన్న విస్తరి నిండా అన్నీ బాగానే దొరుకుతాయి మరి.

ఇక సమైఖ్య వాదుల రెండో వాదన.. క్రిష్ణా, గుంటూరు, గోదావరి జిల్లలలో మాత్రం పేదవారు లేరా? పేదరికం ఎక్కడ లేదు అని. అవును, అమెరికా, జెర్మనీలలో కూడా పేదవారు ఉన్నారు. అంత మాత్రాన అవి పేద దేశాలయిపోవు. పేదవాళ్ళెందరు, ధనవంతులెందరు, సగటు ఆదాయం ఎంత అనేవి అక్కడ ముఖ్యం.

ఇక ఇవేవీ నడవకపోతే చివరగా సమైఖ్యవాదులు తమ బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగిస్తారు. మీ తెలంగాణా జిల్లాలకి నీరు అందకపోతే మీ నాయకులేం చేస్తునారు అనే వాదన బ్రహ్మాస్త్రం. దీనికి తిరుగులేదు..తప్పు అవతలి వాడి పైకి తోసేస్తే సరిపోతుంది. తెలంగాణా నుండి ఎంతమంది ముఖ్యమంత్రులు ఎన్ని సంవత్సరాలు చేశారేంటి? పొరపాటున ఎవరైనా ఒక్కసారి అయితే వెంటనే వారిని దించడానికి రాయలసీమ, అవనిగడ్డ రౌడీలు హైదరాబాద్ వచ్చేసి గొడవలు చేస్తారు.

ఇవన్నీ సమైఖ్యవాదులకి తెలియవని కాదు. కానీ బయటపడరు. లేకపోతే తమ అధిపత్యాన్ని కాపాడుకోవడం ఎలా?

1 comment:

  1. చక్కని విశ్లేషణ. ఎంత చెబితేనేమండీ, ఎక్కడా కానరాని సమైఖ్యతని తమ స్వార్ధంకోసం పలికే ఈ వలసవాదులు తమ వితండవాదాన్ని మానుకుంటారా?

    ReplyDelete