Monday, 24 January 2011
కార్యకర్తపై లగడపాటి వీరంగం
రచ్చబండ కార్యక్రమంలో ఒక కాంగ్రేస్ కార్యకర్త లగడపాటి యొక్క సమైఖ్య ఉద్యమం తన ఆస్థులకోసమే కాదా అని ప్రశ్నించగా లగడపాటి అతనిపై చెయ్యిచేసుకున్నాడు. ఇది జరిగింది ఏ తెలంగాణా ప్రాంతంలోనో కాదు, సొంత నియోజకవర్గమైన విజయవాడలోనే. ప్రజల భాగస్వామ్యం లేకుండా నాయకులు జరిపించిన కృత్రిమ సమైఖ్య ఉద్యమంపై సీమాంధ్రలోనే అనుమానాలున్నాయని ఈ సంఘటన ద్వారా తేటతెల్లం అవుతుంది. ఈ సీనును ఈ క్రింది వీడియోలో చూడవచ్చు.
Sunday, 23 January 2011
నేతల రీతులు!!
తెలంగాణా కాంగ్రేస్ నేత మనోగతం:
పదవే ముఖ్యము నాకు,
ప్రజలెట్ట బోతె నేమి?
రాజీనామా మాత్రం
నేనసలే జెయ్యనంట!!
ఊరికి రానివ్వకుంటె
పట్నంలో పడి ఉంటా!
ముఖం మీద ఉమ్మేస్తే
దస్తి పెట్టి తుడుచుకుంట!!
వచ్చే ఎన్నికలోగా
నా ఖజాన నింపుకుంట!
నా మనవడి కొడుకు కొరకు
నేనిపుడే కూడబెడుత!!
తెలంగాణా తెదేపా మనోగతం:
జనం తీరు జూడబోతె
గుండెలదిరి పోతున్నయి,
అధినేతను ఎదిరించే
గుండెదమ్ము లేకపాయె!!
పార్టీలో కొనసాగితె
కరివేపాకయితున్నం,
పార్ట్టీ వీడుదమంటే
తీసుకునేదెవ్వరంట?
ముందునుయ్యి, వెనుక గొయ్యి
ఎటుపోనూ దారిలేదు,
తెలంగాణ వచ్చుదాక
నోరుమూసుకుంటె బెటరు!!
సీమాంధ్రా కాంగ్రేస్ నాయకులు:
కల్లెబొల్లి మాటలతో
ఇన్నాల్లూ నెట్టుకొస్తె
చిదంబరం ప్రకటనతో
గట్టి షాకు ఇచ్చినాడు!!
మేమేం తక్కువ తిన్నమ?
దొంగ ఉద్యమం జేస్తిమి,
తెలంగాణ ఏర్పాటుకు
మోకాలడ్డం పెడితిమి!!
తెలంగాణ వచ్చెలోపు
అధికారం మనదేగద!
కబ్జా చేసిన భూములు
తొందరగా అమ్మాలిక!!
చిరంజీవి మనోగతం:
సామాజిక తెలంగాణ
ఓట్లేమీ రాల్చలేదు,
సమైక్య వాదంజేస్తే
క్రెడిటేమీ దక్కలేదు!!
ప్రజలమనసులో ఉన్నది
తెలుసుకోవడం ఎట్లా?
బామ్మర్దిని అడుగబోతె
అడ్రస్సే లేకపాయె!!
కాంగ్రేసుకు మద్దతిస్తె
మంత్రిపదవి వస్తదేమొ!
ఈలోగా నా జెండా
పీకకుండ జూసుటెట్ల?
Friday, 21 January 2011
"గిదీ తెలంగాణా" -- కార్టూన్ పుస్తకం
ఆంధ్రజ్యోతి పొలిటికల్ కార్టూనిస్టు శ్రీ శేఖర్ గారు తెలంగాణా సమస్యను, తెలంగాణా సంసృతినీ తన అందమైన బొమ్మలద్వారా వివరిస్తూ తయారుచేశారీ పుస్తకాన్ని. ఇందులో తెలంగాణా ఉద్యమానికి సంబంధిచిన కార్టూన్లతో పాటు తెలంగాణా సంస్కృతిపై అందేశ్రీ, అల్లం నారాయణ, శ్రీధర్ దేశ్పాండే లాంటి పెద్దల కవితలూ, వచనాలూ ఉంతాయి.ఈ పుస్తకం ప్రతులు విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌజ్‌లో లభిస్తాయి.
సూర్యాపేట వాస్తవ్యులైన శేఖర్ గారు ఇంతకు పూర్వం ఇండియన్ ఎక్స్‌ప్రెస్, ప్రజాశక్తి, ఆంధ్రప్రభ పత్రికలలో పనిచేశారు. శేకర్‌టూన్స్, పారాహుషార్, బాంక్ బాబు కార్టూన్ పుస్తకాలు ఇంతకు పూర్వం ప్రచురించారు. గిదీ తెలంగాణా ఆన్లైన్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.
ఒక ఉద్యమం అంతా అబద్ధమే - 2
తెలంగాణా ఉద్యమం ఏల్లతరబడి ప్రభుత్వపు పాలనా వివక్ష ఫలితంగా ఏర్పడ్డ ఆకలి పోరాటం అయితే సీమాంధ్ర ఉద్యమం అక్కడి నాయకుల, వ్యాపారస్థుల ధన దాహం, ఆరాటం. ఒక ప్రజా ఉద్యమం పూర్తిస్థాయికి చేరుకోవడానికి ఎంతో సమయం, శ్రమ, ఎన్నో త్యాగాలు అవసరమవుతాయి. ఉద్యమం ఒక గతిని, రీతినీ తీసుకోవడానికి ముందు ఎన్నో బాలార్ష్టాలను ఎదుర్కుంటుంది. కానీ డబ్బూ, అధికారం, మీడియాల సహాయంతో తయారయిన కృత్రిమ ఉద్యమాలకు ఇవేవీ అక్కరలేదు..రాత్రికి రాత్రే ఊపందుకుంటాయి, అంతే వేగంగా కనుమరుగయితాయి.
ఈ సీమాంధ్రా కృత్రిమ ఉద్యమాన్ని సమర్ధించుకోవడానికి వారి నాయకులూ కొందరు బ్లాగరులూ ఎంటో కష్టపడ్డారు. అందులో ఒకతనంటాడు: "మా ఉద్యమం ప్రజలనుంచి రావలసిన అవసరం లేదు, మా నాయకులు మా ప్రయోజనాలకోసం మా తరఫున మొదలు పెట్టారు. మాలో రాజకీయ చైతన్యం ఎక్కువ అని." మరి ఇదే నాయకులు ఒకరోజు మందర అమ్మా సోనియా మీరేం నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటాము అని ఎందుకన్నారు? బిల్లు పెట్తండి మేము సమర్ధిస్తాము అన్నారు? ఇక తెలుగు దేశంలో నయితే ఎవరి అధ్వర్యంలో పార్టీ కమీషను ఏర్పాటు చేసి తెలంగాణాకు మద్దతు ప్రకటించిందో అతనే చివరికి కౌంటరు ఉద్యమం మొదలు పెట్టాడు. ఏ ప్రజలు అధికారం ఇచ్చారు వీరికి ఇలా కప్పగంతులు వేయమని? నిజంగా ప్రజలనుండి వ్యతిరేకత వస్తే అప్పుడు ఉద్యమం ప్రారంభించినా ఒక అర్ధం వుంది, కానీ నిముషాల్లోనే ఉద్యమం శృష్టించారే? పోనీ తాము ఒక మాటకు కట్టుబడి ఉంటే కనీసం మర్యాదన్న దక్కేది సీపీఎం లాగా. అదికూడా లేదే? ఎందుకీ నయవంచన?
Thursday, 20 January 2011
రాజకీయ నిరుద్యోగులు, ఉద్యమాలు
"తెలంగాణా ఉద్యమం రాజకీయ నిరుద్యోగులు చేపిస్తున్న ఉద్యమం!!??". ఈ డైలాగు మొదట పీయార్పీ అధినేత చిరంజీవి ఉపయోగించగా తరువాత తరువాత సీమాంధ్ర నాయకులు, తెలుగు బ్లాగర్లూ కూడా తెలంగాణా ఉద్యమాన్ని కించపరచడం కోసం దీన్ని వాడుకున్నారు, ఇంకా వాడుకుంటూనే ఉన్నారు. ఒకరు ఒక ఉద్యమాన్ని చేపట్టితే ఆ ఉద్యమం యొక్క అంశం ప్రాధాన్యతను చూడాలిగానీ దాన్ని చేపట్టిన వారు ఎందుకు చేస్తున్నారు అనేది అంత ప్రాధాన్యమయిన విషయం కాదు. కానీ మనవారు తెలంగాణా ఉద్యమాన్ని విమర్శించడం చేతకానప్పుడల్లా నేతలను ఇలా విమర్శిస్తూ వచ్చారు.
నాకు కేసీఆర్ అంటే ప్రత్యేక అభిమానమేమీ లేదు. తెలంగాణా ఉద్యమంలో కేసీఆర్ ఒక నాయకుడు మాత్రమే.కేసీఆర్లో కొన్ని లోపాలు ఉండవచ్చుగాక. అయితే ప్రజల మద్దతులేకుండా కేవలం నాయకులు నడిపించిన సీమాంధ్ర ఉద్యమాన్ని చూసిన సంఖ్యాంధ్ర మద్దతుదారులు తెలంగాణా ఉద్యమం కూడా అలాగే అని భ్రమపడి వ్యక్తులను విమర్శించడం హాస్యాస్పదం. ఇప్పుడు తెలంగాణాలో ప్రజలందరూ తెలంగాణా రాష్ట్రాన్ని కోరుకుంటున్నారనే వాస్తవం బై-ఎలక్షను తరువాతే తెలిసిపోయినా ఇంకా కొందరు వ్యక్తులపై విమర్శలు చెయ్యడం సరికాదు. అందులోనూ చిరంజీవి లాంటి ఏమాత్రం రాజకీయ అవగాహన, పరిగ్నానం లేనివాడు, తాను సొంత స్లోగన్లు కూడా తయారు చేసుకోలేక ఇతరుల స్లోగన్లను వాడుకునే (ఉదా: మార్పు, సామాజిక న్యాయం, నిశ్శబ్ద విప్లవం) అతని డైలాగును వీరు కాపీ కొట్టడం మరీ హాస్యాస్పదం.
కేసీఆర్ తెలుగుదేశం వదిలిపెట్టి టీఆరెస్ పార్టీ స్థాపించకముందు అతని రాజకీయ ఉద్యోగం "డిప్యూటీ స్పీకరు". ఈ ఉద్యోగం గడచిన కాలంలో సీమాంధ్ర ఉద్యమాన్ని నెత్తినేసుకున్న అనేకమంది నాయకులకంటే గౌరవప్రదమయిన ఉద్యోగం. అదేమీ నిరుద్యోగమూ లేక చిరుద్యోగమూ కాదు. ఉదాహరణకు సీమాంధ్ర ఉద్యమంలో బాగా యాక్టివ్‌గా ఉన్న లగడపాటిది ఎంపీ ఉద్యోగం, చిరంజీవిది తనదే ఉద్యోగమో తనకే తెలియని ఉద్యోగం. మిగతా వారు నిరుద్యోగులు, చిరుద్యోగులూనూ.
తెలంగాణా, సీమాంధ్రా కాకుండా ఇంకే ఉద్యమం తీసుకున్నా ఉద్యమ నాయకులు సాధరణంగా ప్రతిపక్షంలో ఉండి అధికారం కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులు. ధరల పెరుగుదల విషయమైనా, బాబ్లీ విషయమైనా, నందిగ్రాం, సోంపేట థర్మల్ ప్రాజెక్టు లాంటి అన్ని విషయాలపై ఉద్యమాలు నడిపింది రాజకీయ నిరుద్యోగులే. అంతమాత్రం చేత ఆ ఉద్యమాల లక్ష్యం తప్పు కాబోదు.
ఇంకొంచెం వెనక్కి వెలితే మద్రాసు రాష్ట్రం నుండి ఆంధ్ర రాష్ట్రం విడిపోవటానికి నిరాహార దీక్ష చేపట్టింది రాజకీయ కాంక్షలు లేని గాంధేయవాది అయిన అమరజీవి పొట్టిశ్రీరాములు అయినప్పటికీ ఆ ఉద్యమానికి రాజకీయంగా నాయకత్వం వహించింది మాత్రం ప్రకాశం పంతులు, నీలం సంజీవరెడ్డి, బెజవాడ గోపాలరెడ్డి. ఇందులో ప్రకాశం పంతులు గారు మద్రాసు రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని విశ్వప్రయత్నం చేసి, అది తనకు సాధ్యపడదని తెలుసుకోగా నీలం సంజీవరెడ్డి, బెజవాడ గోపాలరెడ్డి అంతకుముందు జరిగిన ఎలక్షన్లో ఓడిపోయి కనీసం ఎమ్మెల్యే ఉద్యోగం కూడా దొరక్క ఖాళీగా ఉన్నారు. వీరందరికీ అప్పుడు తమ రాజకీయ ప్రాబల్యం పెంచుకోవడానికీ, తరువాత అధికారం చేజిక్కించుకోవడానికీ ప్రత్యేకాంధ్ర రాష్ట్ర ఉద్యమం బాగా కలిసొచ్చింది, ఆ అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకుని వీరు తమ ప్రాబల్యం పెంచుకున్నారు. ఆ తరువాత రాష్ట్ర విభజన జరగగా వీరు ముగ్గురూ వరుసగా ఆంధ్ర రాష్ట్రానికీ, ఆంధ్ర ప్రదేశ్‌కు కూడా ముఖ్యమంత్రులు అయ్యారు. కాబట్టి సమఖ్యాంధ్ర మద్దతునిచ్చే మిత్రులారా, మీరు మరోసారి తెలంగాణా ఉద్యమాన్ని రాజకీయ నిరుద్యోగుల ఉద్యమం అనేముందు ఒక్కసారి ఆలోచించండి..బహుషా అది మీ సీమాంధ్ర ఉద్యమ నేతలకు, ప్రత్యేకాంధ్ర రాష్ట్ర ఉద్యమ నేతలకే తగలవచ్చు.
Wednesday, 19 January 2011
ఒక ఉద్యమం.. అంతా అబద్దమే!!
"సమైఖ్యాంధ్ర ఉద్యమం!!" డిసెంబరు తొమ్మిది చిదంబరం ప్రకటన తరువాత తెలంగాణా ఇవ్వకుండా మోకాలు అడ్డు పెట్టటానికి సీమాంధ్ర నాయకులు ఆడిన నాటకానికి వారు పెట్టుకున్న పేరు ఇది. పదిహేనురోజులు నడిచిన ఈ నాటకానికి వీరు పెట్టుకున్న పేరుతో సహా ఇందులో అంతా అబద్దమే. సమైఖ్యత అనే భావనే ఎన్నడు చూపని వారు, ఏళ్ళతరబడి తెలంగాణా ఉద్యమం నడుస్తున్నా, అన్నీ రాజకీయ పార్టీలు తెలంగాణాకు మద్దతు చెప్పి తమ తమ ఎలక్షను మానిఫెస్టోలలో కూడా తెలంగాణా అంశాన్ని చేర్చినా ఏనాడూ మాట్లాడని నాయకులంతా ఒక్కసారి రాత్రికి రాత్రి మొదలుపెట్టిన మహా దొంగనాటం ఇది.
ఉద్యమాలు ప్రజలలోంచి పుడతాయి. నాయకులు ఉద్యమాలను నడపరు, ఉద్యమాలే నాయకులను తయారు చేస్తాయి. నాయకులు కేవలం ప్రజల ఆశలను వినిపించడానికి ఒక వేదికను తయారు చేస్తారు, ఉద్యమానికి ఒక రీతి, నడవడి తయారు చేస్తారు. ఉద్యమాలు ప్రజల్లో అంతర్లీనంగా మొదలయి, మెల్లిగా ఒక గతిని ఏర్పాటు చేసుకుంటాయి. కానీ ఈ ఉద్యమం ప్రజలలోంచి పుట్టలేదు. అసలు ఈ ఉద్యమానికి అంత సమయం కూడా లేదు. ఇది మొదలయింది లగడపాటి అనే ఒక వ్యాపారస్తుడైన ఎంపీ తన పెట్టుబడులను, అందులో భాగమయిన కబ్జాలను కాపాడుకోవడం కోసం ప్రకటన వెలువడిన కొన్ని నిముషాలలోనే రాజీనామా చేయడంతో మొదలయింది. ఆ తరువాత చైన్ రియాక్షను లాగా ఒకరితరువాత ఒకరుగా అందరు సీమాంధ్ర ఎంపీలూ, ఎమ్మెల్యేలూ ఎక్కడ తాము ఈ నాటకంలో వెనుకబడుతామేమోనని ఆదరబాదరగా రాజీనామాలు చేసి దీక్షలు మొదలుపెట్టారు. అంటే అసలు ప్రజల భాగస్వామ్యమే లేకుండా, ప్రజల రియాక్షనుకు టైము కూడా ఇవ్వకుండా నాయకులు మొదలుపెట్టిన నాటకం తప్పితే ఇది ప్రజా ఉద్యమం కాబోదు.
ప్రభుత్వ పెద్దల అండదండలు దండిగా ఉండడంతో ఈ నాయకులు ఒకవైపు దీక్షలు చేస్తూ మరో వైపు తమ మనుషుల ద్వారా పదిహేను రోజుల్లో జరిపిన ప్రభుత్వ ఆస్థుల ధ్వంసం సంవత్సర కాలంలో తెలంగాణాలో జరిగినదానికన్నా చాలా ఎక్కువ. చాలా చోట్ల పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారు. ఇందులో చెప్పుకోవాల్సింది అనంతపురం బీఎస్సెన్నెల్ కేబుల్ల ధ్వంసం. కోట్ల విలువచేసే బీఎస్సెన్నెల్ ఆస్తులు పోలీసుల కల్లముందే ధ్వంసం అయ్యాయి.ఇంకా రైల్వే స్టేషనులు, పోస్టాఫీసులు, దూరదర్శన్ కేంద్రాలు, రైలు భోగీలు ఎన్నో ధ్వంసం చేశారు.
ప్రజలు తమ హక్కుల సాధనకోసం ఉద్యమం చేస్తారు. అంతే కానీ ఎదుటివారి హక్కులకు అడ్డుపడటానికి ఉద్యమాలు చెయ్యరు. రెండు ప్రాంతాలవారు కలిసి చేస్తే అది సమైఖ్య ఉద్యమం అవుతుంది కానీ ఒక ప్రాంతం వారు చేస్తే అది సమైఖ్య ఉద్యమం కాబోదు. ఎవరి స్వలాభాలకోసం వారు పోరాడుతారు.. అందులో తప్పులేదు. కానీ తమ స్వార్ధప్రయోజనం కోసం ఎదుటివారు తమతో కలిసి ఉండాలని శాసించరు!! అది ఎదుటివారి హక్కులను హరించడమే.
చరిత్రలో ఇంతకుముందు సమైఖ్య ఉద్యమాలు జరిగాయి. ఉదాహరణకు ప్రజల ఇష్టాలకు వ్యతిరేకంగా బెర్లిన్లో గోడకట్టి తూర్పు, పశ్చిమ జెర్మనీలుగా విడగొట్టినప్పుడు జెర్మన్లు కలిసి ఉండడంకోసం ఉద్యమించారు. రెండువైపులవారు సమానంగా కలిసిఉండాలనే కోరికతో ఉద్యమించారు. కానీ ఎక్కడా అవతలి వారికి ఇష్టం లేకున్నా తమతో కలిసి ఉండాలని ప్రజాస్వామ్య ఉద్యమాలు చెయ్యలేదు, కేవలం యుద్ధాలు చేశారు. సీమాంధ్ర నేతలు తమ కాంక్షలను తీర్చుకోవడంకోసం, తెలంగాణా ప్రజల హక్కులు కాలరాయడం కోసం ఈ అభినవ యుద్ధానికి తెరలేపారు, దానికి సమైఖ్యాంధ్ర ఉద్యమమని పేరు పెట్టుకున్నారు.
ఈ విధంగా ఈ మోకాలడ్డే కార్యక్రమం ఉద్యమం అనడమే అబద్ధం, దాని ఉద్దేశమూ అబద్ధం. ఈ అబద్దపు ఉద్యమాన్ని పెద్దది చేసి చూపేందుకు సీమాంధ్ర నేతల కనుసన్నలలో నడిచే మీడియా అష్టకష్టాలు పడింది. పదిమంది టెంటేసుకుని కూర్చుంటే దాన్నే పెద్దచేసి, పదికోణాల్లో చూపించింది. ఒస్మానియాలో హాస్టల్లకు వచ్చి వీరంగం సృష్టించే పోలీసులు, అధికార యంత్రాంగం కూడా ఈ నాటకానికి తమ సహకారం పూర్తిగా ఇచ్చారు. కొద్దిమంది అల్లరిమూకలు బస్సులు తగలబెడుతుంటే, ఆస్థులు ధ్వంసం చేస్తుంటే చూస్తూ కూర్చున్నారు. అక్కడ మాత్రం హాస్టల్లను మూసివేయలేదు, హాస్టల్లలో దూరి కొట్టలేదు, ఎవరిపైనా కేసులూ పెట్టలేదు. ప్రజల ఉద్యమాలను బూటుకాల్లతో అణచివేసే ప్రభుత్వయంత్రాంగం ఈ నాయకుల కిరాయిమూకల విధ్వంసానికి మాత్రం ఎప్పటిలాగే అడ్డుపడలేదు.
ఈ ఉద్యమాన్ని నడిపించింది ప్రధానంగా సీమాంధ్రకు చెందిన కాంగ్రేసు, తెలుగుదేశం నేతలు. వీరు తమ నాయకులు తెలంగాణాకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నప్పుడు, మానిఫెస్టోల్లో జోడించినప్పుడూ ఎన్నడూ అడ్డుపడలేదు. కానీ ఒక్కసారిగా నాటకంలో తామెక్కడ వెనుకబడుతామోనని ప్రకతన వెలువడగానే గొంతుచించడం మొదలుపెట్టారు. పార్టీలు మరిచి, పాతకక్షలు మరిచి భాయీ భాయీలయిపొయ్యారు. బయటివారితో యుద్ధం చేసేప్పుడు ఇంటివారు తమ గొడవలు మరిచిపొయినట్లు కలిసి మరీ యుద్ధం చేశారు. పేరుకు మాత్రం ఇది సమైఖ్య ఉద్యమం, తెలంగాణా వారితో సోదరభావం ఉన్నట్లు ఫోజులు..అంతా అబద్ధమే. పెట్టుబడికీ ఫాక్షనిజానికీ పుట్టిన అక్రమసంతానం ఈ అబద్ధపు ఉద్యమం.
Sunday, 16 January 2011
కర్పూరపు జ్యోతులు..ప్రాణాలతో చెలగాటాలు
ప్రతి సంవత్సరం నవంబర్, డిసెంబరు నెలలు రాగానే అయ్యప్ప సీజను మొదలవుతుంది. అయ్యప్ప భక్తులు మండలం రోజులు దీక్ష తీసుకుని చలిలో పొద్దున్నే లేచి చన్నీల్ల స్నానం చేస్తారు, కాళ్ళకు చెప్పులు తొడుక్కోకుండా నల్ల బట్టలు ధరిస్తారు, రోజూ పూజలు చేస్తారు. దీనివల్ల మనిషిలో ఒక డిసిప్లైన్ వస్తుంది, ఆరోగ్యం మెరుగుపడుతుంది అని నాకనిపిస్తుంది. ఇంతవరకూ బాగానే ఉంది.
వచ్చిన చిక్కేమిటంటే ఈ అయ్యప్ప దీక్ష తీసుకున్నవారు శబరిమలైలో అయ్యప్పగుడి దర్శనం చేసుకుని తమ దీక్ష విరమిస్తారు. ఇలా లక్షలమంది ఒకేసారి శబరిమల దర్శనం చేసుకోవడం వలన రైల్లూ, రోడ్డుమార్గాలలో విపరీతమయిన రద్దీ పెరుగుతుంది. విపరీతమయిన రద్దీ ఏర్పడుతుంది. లక్షల్లో జనాలు గుమికూడినపుడు ప్రమాదాలు జరగడం మామూలే. మొన్నటికి మొన్న విజయవాడకు చెందిన ఒక బృందానికి బస్సు యాక్సిడెంటు జరిగి 11మంది మరణించారు. ఇప్పుడు మకర సంక్రాంతి రోజు తొక్కిసలాట జరిగి వందకుపైగా చనిపోగా మరో వందకు పైగా గాయపడ్డారు.
మకర సంక్రాంతి రోజు ఇక్కడ ఒక మకరజ్యోతి కనిపిస్తుందనీ, ఆజ్యోతిని చూస్తే పుణ్యం వస్తుందని అనేది భక్తుల నమ్మకం. మకర సంక్రాంతి రోజు రాత్రి అక్కడికి దూరంగా ఉండే కొండల మీదుగా మూడు సార్లు జ్యోతి కనిపిస్తుంది. ఇదే మకరజ్యోతి అనీ, ఇది ఆకాశంలో కనిపించే నక్షత్రమని భక్తులు నమ్ముతారు. అయితే మూడు సంవత్సరాలక్రితమే కేరళలో కొందరు హేతువాదులు అసలు రహస్యాన్ని కనిపెట్టారు. కేరళ ఎలక్ట్రిసిటీ బోర్డుకు చెందిన ఒక ఉద్యోగి రహస్యంగా ఆకొండలపై ఉన్న చదును ప్రదేశంలో రహస్యంగా పెద్దఎత్తున కర్పూరాన్ని మండిస్తూ దొరికిపోయాడు. ఆ వీడియో అప్పట్లో ఎన్‌డీటీవీ వారు దేశమంతటా ప్రసారం చెయ్యగా అది పెద్ద డిబేట్ టాపిక్ అయిపొయ్యింది. గతంలో ఎండీటీవీ వీడియో యూట్యూబ్‌లో కూడా ఉండేది, తరువాత డిలీట్ చేశారు.
కేరళ ఎలక్ట్రిసిటీ బోర్డు ఉద్యోగి ఒకరు ఈ తంతు ఎన్నో ఏళ్ళుగా జరుగుతోందనీ, ఎవరికీ తెలియకుండా జాగ్రత్తలు తీసుకుంటారనీ చెప్పారు. ఆ కొండలదగ్గరికి వెల్లడానికి ప్రైవేటు వ్యక్తులకు అనుమతి ఉండదు. దీనిపై విమర్శలు పెరగడంతో శబరిమల ఆలాయం ప్రతినిధి ఆ కొండపై కర్పూరం మండించడం గిరిజన సాంప్రాదాయమయిన మకర విళుక్కు అనీ, దాన్నే ప్రభుత్వం తరఫున ఇప్పుడు చేస్తున్నారని, మకరజ్యోతి వేరే నక్షత్రమనీ సమర్ధించుకున్నాడు. మరి నిజంగానే అది గిరిజన సాంప్రాదాయాన్ని కొనసాగించడమే అయితే అంత రహస్యంగా చెయ్యడం ఎందుకు? భక్తులు మకర సంక్రాంతి రోజు శబరిమల వెల్లేది ఈ కర్పూరం వెలుతురు చూడ్డానికా, లేక నక్షత్రాన్ని చూడ్డానికా? ప్రభుత్వ ఆదాయం కోసం ఇలాంటి నమ్మకాలను ప్రచారం చెయ్యడం ఎంతవరకూ సమంజసం? లాంటివన్నీ ధర్మ సందేహాలు.
ఇక భక్తులు కూడా ఏదో మంచిజరుగుతుందనే నమ్మకంతో ఇలా లక్షల్లో జనాలు గుమికూడడం ఎంతవరకూ సమంజసం? లక్షలమంది ఒకదగ్గర గుమికూడినప్పుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ప్రమాదాలను పూర్తిగా నివారించడం అసాధ్యమని తెలిసీ ఎందుకు వల్లడం? దొరికే పుణ్యం మాటేమిటో గానీ ప్రాణాలకే రక్షణ లేకపోతే ఎలా? త్రొక్కిసలాటలు గుడుల్లోనే అవుతాయని చెప్పడం నా ఉద్దేశం కాదు, చిరంజీవి సినిమాకు, రోడ్డుషోలలోకూడా బాగానే తొక్కిసలాటలు జరిగాయి. అయితే గుడులలో అయితే జనం కాస్త పెద్దేత్తున ఎక్కువ ఇరుకు ప్రదేశాలలో గుమికూడుతారు గనక ప్రమాదాలు సంభవిస్తే జరిగే నష్టం ఎక్కువగా ఉంటుంది.
Thursday, 6 January 2011
కొండను తవ్వి ఎలుకను పట్టిన చందం
వెనుకటికి ఎవడో కొండంతా తవ్వి ఎలుకను బయటికి తీసి జబ్బలు చరుచుకున్నాడంట. అలాగుంది మన శ్రీక్రిష్ణ కమీషను తీరు. ఇంకా వారి రిపోర్టు పూర్తిగా చదవలేదు కానీ వారిచ్చిన ఆరు ప్రతిపాదనలలో కొత్తది ఏదీ లేదు. ఆమాత్రం దానికి ఈ కమీషన్ ఎందుకు, వీరు సంవత్సరం కాలంగా సంప్రదింపులు, పర్యటనలూ చేసి సాధించింది ఏమిటి అనేది ప్రశ్నార్ధకం.
అందులో రెండు ప్రతిపాదనలు ఒకటి యధాస్థితిని కొనసాగించడం, మరొకటి హైదరాబాదు రాజధానిగా తెలంగాణా రాష్ట్రాన్ని ఏర్పాటు చెయ్యడం. రెండూ ఒకటి సీమాంధ్ర సమైఖ్య నాయకుల వాదన కాగా మరొకటి తెలంగాణా ప్రజల ఆకాంక్ష. రెండింటిలోనూ కొత్తది ఏదీ లేదు. వాటికోసం కమీషనెందుకు?
మరో మూడు ప్రతిపాదనలు మరీ హాస్యాస్పదం. ఒకటి జేసీ దివాకర్‌రెడ్డి, మజ్లీస్ ప్రతిపాదించిన రాయల తెలంగాణా కాగా మరోరెండు దానం, ముఖేశ్‌ల హైదరాబాదు స్టేట్ వాదనను కాస్త అటూఇటూ చేసి హైదరాబాదు యూనియన్ టెర్రిటరీ అన్నారు. అందులో ఒకటి నల్గొండ, మహబూబ్‌నగర్లను కల్పగా మరొకటి ఒక్క గ్రేటర్ హైదరాబాద్ మాత్రమే. ఈ ప్రతిపాదనలకు ఒక రేషనల్ బేసిస్ అంటూ లేదు, కొందరు నాయకుల టైంపాస్ స్టేట్మెంట్లు తప్పితే. బహుషా మరో కోన్‌కిస్కా ఎవరయినా అండమాన్ కాపిటల్‌గా గుంటూరు స్టేట్ కావాలని ఏదయినా సందర్భంలో జోక్‌చేసిఉంటే బహుషా వీరు వీరి రిపోర్టులో అదికూడా జతచేసేవారేమో.
ఇక ఆరో ప్రతిపాదన సమస్యను దాటవేసి మరికొంత కాలం కాలయాపన చెయ్యడానికి మాత్రమే పనికొచ్చే ప్రాతీయమండలి ఏర్పాటు. ఇంతకు ముందు తెలంగాణాకై చేసిన ఒప్పందాలూ, కమిటీలూ, జీవోలూ అన్నీ బుట్టదాఖలే అయినప్పుడు కొత్తగా ప్రాంతీయమండలి వలన ఒరిగేదేమిటి?
మొత్తానికి శ్రీక్రిష్ణ కమీషనూ ఏర్పాటు వలన సమస్యను ఒక సంవత్సరం పాటు వాయిదా వేయగలిగారే కానీ సంవత్సరం తరువాత కూడా ఉద్యమం తీవ్రత అదే స్థాయిలో ఉండగా సమస్యపై సందిగ్ధతకూడా అలాగే ఉంది.
Sunday, 2 January 2011
జలయగ్నం డొల్లతనం ఫలితం - క్రిష్ణా ట్రిబ్యునల్ తీర్పు
క్రిష్ణా ట్రిబ్యునల్ తాజా తీర్పు మన రాష్ట్రానికి అశనిపాతంలా మారింది. ప్రస్తుతం రాష్ర్ట్రంలో అంతా శ్రీక్రిష్ణ కమీషన్ రిపోర్టుకై ఎదురుచూస్తున్న తరుణంలో ఈ తీర్పు ఎక్కువగా మీడియాలో ప్రభావం చూపడం లేదు కానీ భవిష్యత్తులో రాష్ట్రం విడిపోయినా కలిసి ఉన్నా ఈ తీర్పు తెలంగాణాకూ సీమాంధ్రకూ గణనీయమైన నష్టం కలిగిస్తుందనేది నిస్సందేహం. అయితే ఇలాంటి తీర్పు రావడానికి కారణాలు ఏమిటి, అందులో మన పాలకుల నిర్వాకం, సరైన ప్రణాలికలేని మన జలయగ్నం యొక్క ప్రభావం ఎంతమేరకు ఉందనేది మనం గమనించాల్సిన విషయాలు.
నదీ జలాల వినియోగంపై హక్కులు ఆ నదీ పరివాహికప్రాంతం (క్యాచ్మెంట్ ఏరియా) కే చెందుతాయనేది అంతర్జాతీయంగా పాటించబడుతున్న సూత్రం. క్రిష్ణా జలాల వినియోగంలో మనరాష్ట్రం మొదటినుంచీ ఈ సూత్రాన్ని తుంగలో తొక్కుతూ పెన్నా క్యాచ్మెంట్ ఏరియాకి క్రిష్ణా జలాలను తరలిస్తూ వస్తుంది. ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు విషయంలో మనరాష్ట్రం అభ్యంతరాలను తోసిపుచ్చుతూ అనేక సంవత్సరాలుగా కర్ణాటక చేస్తున్న వాదన కూడా ఇదే: నిభంధనలకు వ్యతిరేకంగా ఆంధ్ర ప్రదేశ్ క్రిష్ణా జలాలను ఇతర నదీ ప్రవాహిక ప్రాంతాలకు తరలిస్తుందనేది. దీనికి మన రాష్ట్రం నుండి సరైన సమాధానం లేకపోవడంతో ఆల్మట్టి విషయంలో ఇంతకుముందే మనకు నష్టం జరిగింది.ఇప్పుడు అక్రమమన్న ఆల్మట్టి ఎత్తు చట్టబద్దం కాగా, ఇంకా ఎత్తు పెంచుకోవడానికి అనుమతి లభించింది. క్రిష్ణా నది క్యాచ్మెంటును ఈ క్రింది పటంలో చూడవచ్చు.
నిభంధనలకు వ్యతిరేకంగా ఇతర నదీ క్యాచ్మెంటు ఏరియాలకు క్రిష్ణాజలాలను తరలించడాన్ని మన రాష్ట్రం మేము మిగులు జలాలను మాత్రమే ఇతరక్యాచ్మెంట్ ఏరియాలకు తరలిస్తున్నామని సమర్ధించుకుంటుంది. అయితే నికరజలాల వాటాను వాడుకోకుండా మిగులు జలాలు ఎలా వాడుకుంటారనేది సందేహం. క్రిష్ణా పై చేపట్టిన ప్రాజెక్టులు ఈ క్రింది పటంలో చూడవచ్చు.
ఎవరైనా ముందు నికర హక్కులు కలిగిన ప్రాజెక్టులను ముందు పూర్తి చేసి జలాలను వినియోగంలోకి తీసుకుంటారు. ఆ తరువాత మిగులు జలాలకు సంబంధించిన ప్రాజెక్టులు చేపడతారు. అయితే మన సమైఖ్య రాష్ట్రంలో నికరజలాలపై బచావత్ ట్రిబ్యునల్ హక్కులు కల్గిన శ్రీశైలం ఎడమకాలువ, భీమ లాంటి ప్రాజెక్టులను దశాబ్దాలు గడుస్తున్నా చేపట్టక, చేపట్టిన ప్రాజెక్టులను పూర్తిచేయక కాలం గడిపేస్తూ మిగులు జలాలపై మాత్రం ఆఘమేఘాలపై వెలిగొండ, హంద్రి-నీవా, పోతిరెడ్డిపాడు లాంటి ప్రాజెక్టులు చేపట్టింది.
మన రాష్ట్రంలో తెలంగాణా వారికి సమాధనం చెప్పేప్పుడు మాత్రం పోతిరెడ్డిపాడు, వెలిగొండ, హంద్రినీవా,గాలేరు-నగరి లాంటి ప్రాజెక్టులన్నీ మిగులు జలాలను మాత్రమే వాడుకుంటాయని చెప్పి క్రిష్ణా ట్రిబ్యునల్ దగ్గర అసలు మిగులు జలాలే లేవని రెండు నాల్కలధోరణి ప్రదర్శించి రాష్ట్రానికి తీరని అన్యాయం చేశారు. మిగులు జలాల ఆధారంగా ఆంధ్రా ఇన్ని ప్రాజెక్టులను చేపడుతుందంటే మిగులు జలాలు చాలా ఎక్కువగా ఉంటాయనే అనుమానాలకు ఈ వాదన దారి తీసింది. ఈ విధంగా నికరజలాల హక్కులు కల్గిన తెలంగాణా ప్రాంతానికి మొండి చెయ్యిచూపించి అలా మిగిలిన "మిగులు" జలాలను సీమాంధ్రకు తరలిద్దామనుకున్న రాజశేఖరరెడ్డి పధకం రాష్ట్ర ప్రయోజనాలకే బెడిసికొట్టింది.పైగా అసలుకే ఎసరయ్యింది. జలయగ్నం ధనజలయగ్నం మాత్రమే కాదు, క్రిష్ణా జలాలను తెలంగాణాకు కాకుండా చేసే మహా పన్నాగం అన్న అనుమానాలను నిజం చేసింది.
Subscribe to:
Posts (Atom)