Tuesday 15 March 2011

ఏది వార్త? ఏది చరిత్ర?

మిలియన్ మార్చ్‌ను అణచివెయ్యడానికి లక్షకు పైగా తెలంగాణా ప్రజలను, విద్యార్థులను అక్రమంగా అరెస్టులు చేసి జైల్లూ, పోలీస్ స్టేషన్‌లూ కూడా సరిపోకపోతే ఆడిటిరియాలూ, స్కూలు భవనాలలో రాక్షసంగా బంధిచిన విషయం ఒక్క లోకల్ న్యూస్ పేపర్, టీవీ చానెల్ కూడా కవర్ చెయ్యలేదు, కానీ రాష్ట్రంలోని ప్రాంతీయ వివక్షలకు దూరంగా ఉన్న బీబీసీ మాత్రం తన వెబ్సైటులో ఈ వార్తను రిపోర్ట్ చేసింది. బీబీసీ వార్తను ఇక్కడ చదవచ్చు.

ఒక ఈజిప్టులోనో, ట్యునీషియాలోనో, మాస్కోలోనో పోలీసుల దిగ్భంధాన్ని తప్పించుకుని వేలమంది ఒక మార్చ్ చేస్తే మనం అక్కడి ప్రజల ఆకాంక్షను మాత్రమే చూస్తాము, అందులో కూలిపోయిన విగ్రహాలను చూడం. కానీ మన సొంత రాష్ట్రంలో పదివేల మంది పోలీసులూ, స్పెషల్ ఫోర్షులను తప్పించుకుని, మూడు వందల చెక్ పోస్టులను దాటుకుని ప్రజలు మిలియన్ మార్చ్‌లో పాల్గొంటే మన తెలుగు మీడియా చూపించేది మాత్రం అక్కడ ప్రజల ఆకాంక్షను కాదు, కూలిన విగ్రహాలను మాత్రమే. అరెస్టులను గురించి ఏమాత్రం పట్టించుకోని మన ఈనాడు పత్రిక విగ్రహాలకోసం మూడు పేజీలు కేటాయించింది.బీబీసీ యాభై వేలమంది మార్చ్‌లో పాల్గొన్నారని రాస్తే మన మీడియా పదివేలని రాస్తుంది. ఇక్కడ మాత్రం మనకు ప్రజల ఆకాంక్షలు కనపడవు.

భూస్వామ్యవ్యవస్థకు వ్యతిరేకంగా తెలంగాణాలో జరిగిన తెలంగాణా సాయుధ పోరాటం గురించి జెర్మనీ, రష్యా, ఫ్రాన్స్ లాంటి దేశాల పాఠ్యపుస్తకాలు అదొక మహోన్నత పోరాటంగా అభివర్ణిస్తే మన రాష్ట్రంలో మనం చదువుకున్న సోషల్ పుస్తకాల్లో అసలు ఆ ఊసే ఉండదు. అసలు మొత్తంగా తెలంగాణా చరిత్రనే తుడిచేసి పొట్టి శ్రీరాములు త్యాగం ఫలితంగా ఆంధ్ర ప్రదేశ్ (ఆంధ్ర రాష్ట్రం కాదు) ఏర్పడింది, టంగుటూరి ప్రకాశం మన మొదటి ముఖ్యమంత్రి అని ఉంటుంది, బూర్గుల రామక్రిష్ణారావు మాత్రం భూతద్దం పెట్టుకొని వెతికినా ఏ పుస్తకంలోనూ కనపడడు.

No comments:

Post a Comment