Thursday 17 March 2011

పేదవాడి సత్యాగ్రహమే ఆత్మబలిదానం




మద్రాసు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చెయాలనే ఆశయంతో ప్రాణాలర్పించిన పొట్టి శ్రీరాములు త్యాగధని, అమరజీవి అని మనం చదువుకున్న చరిత్ర, మనం నమ్మే వాస్తవం. కానీ అదే ఆఆశయంతో ఆత్మ బలిదానం చేసుకున్న ఆరువందలకు పైగా యువకులు మాత్రం మన మీడియా దృష్టిలో, ఇంకా అనేకమంది సీమాంధ్ర నాయకుల, ప్రజల దృష్టిలో పిరికివారు లేదా పిచ్చివారు.

ఇంతకూ ఒక ఆశయం కోసం బలిదానం చేసుకున్న యువకుడికీ, ఒక ఆశయం కోసం నిరాహారదీక్ష చేసి చనిపోయిన వ్యక్తికీ తేడా ఏమిటీ అంటే అది చనిపోయే విధానం నిరాహార దీక్షలో కాస్త సాగదీయబడడం, ఎప్పుడో ఒకప్పుడు ప్రభుత్వం దిగివస్తే తనప్రాణం నిలుస్తుందనే ఆశ, అంతకుమించి మరేమీ లేదు. పోనీ గాంధీగారి సత్యాగ్రహం గురించి మనం గొప్పలు పోతాం, మరి ఇప్పటి పరిస్థితుల్లో సత్యాగ్రహం సాధ్యమా అంటే, ఒక సామాన్య మానవుడు, లేదా కొంతమంది సామన్య మానవులు కలిసి నిరాహారదీక్ష చేపడితే ఫలితం ఏముంటుందో అందరికీ తెలిసిందే..పోలీసులతో దాడి చేసి బలవంతంగా దీక్షను భగ్నం చెయ్యడం, దీక్షా వేదికను, దీక్ష చేసే ఉద్యమకారులను బూటుకాళ్ళతో తొక్కడం.

ఆత్మబలిదానం అనేది ఇప్పుడు తెలంగాణాలో కొత్తగా చేసింది కాదు, ఇంతకుముందు మనదేశంలో మండల్ కమీషన్ వ్యతిరేకంగా చేసిన ఉద్యమంలోనూ, ఇంకా అనేకసార్లు ప్రజలు ఆత్మబలిదానాలు చేసుకున్నారు. ఢిల్లీలో మండల్ కమీషను వ్యతిరేకంగా ఆత్మహత్య చేసుకున్న రాజీవ్ గోస్వామిని ఎవ్వరూ పిరికి వాడనలేదు. ట్యునీషియాలో మొహమ్మద్ బొజోజి ఆత్మాహుతి చేసుకుంటే అతన్ని అమరవీరునిగా మిడిల్ ఈస్ట్‌లో కొనియాడారు. కానీ మనరాష్ట్రంలో ఆరు వందలమంది ఆత్మబలిదానాలు చేసుకుంటే మన మీడియా, కొందరు ఆకతాయులు వారికి ఇచ్చే బిరుదులు మాత్రం అవహేళనలే!! వీరి అవహేళనలు తెలంగాణా యువకులను మరింత రెచ్చగొట్టి మరింతమంది చనిపోవడానికి దారి తీస్తున్నాయి.

ఆత్మబలిదానాలను ఎవరూ సమర్ధించరు, కానీ ఆరొందలమంది కళ్లముందు చనిపోతే ఏమీ జరగనట్టు నటించడం ఏం మానవత్వం? ఆ బలిదానాలను అవహేళన చెయ్యడం ఎక్కడి సాడిజం? తెలంగాణాకు సంబంధంలేని పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని ఇక్కడి ఊరూరాపెట్టి గొప్పలు పొయ్యే వారూ, ఎవరైనా ఆకతాయి విగ్రహాన్ని అవమానం చేస్తే నెత్తీ నోరూ బాదుకునే వారూ కళ్ళముందు జరుగుతున్న బలిదానాలను మాత్రం చోద్యం చూడ్డమే కాదు, హేళన చేస్తారు. ఇంకా అంతా ఒకటే జాతి అని వీరు ఎవరిని నమ్మబలుకుతున్నారు? వందలమంది ప్రాణాలు నేలకొరుగుతుంటే నవ్విపొయ్యేవారు అన్నదమ్ములమంటె ఎవరు నమ్ముతారు?

2 comments:

  1. your blog is very nice.your views on different issues are very democratic.i have started seeing telugu blogs recently and i was shocked to see the posts full of hatred in different blogs.i m happy that atleast there are some bloggers like you.

    ReplyDelete