Thursday, 23 June 2011

ముసుగేస్తే దాగదీ వివక్ష - ఇరిగేషన్ (repost)


Image credits: http://www.gideetelangana.blogspot.com/

మన స్వయప్రకటిత మేధావి నాయకుడు జయప్రకాశ్ నారాయణ తెలంగాణా అంశంపై చాన్నాల్లపాటూ గోడమీద పిల్లిలా విన్యాసాలు చేసి ఇక తప్పనిసరి పరిస్థితిలో సమైక్యాంధ్రకు అనుకూలంగా శ్రీక్రిష్ణ కమీషనుకు ఒక రిపోర్టును వండాడు. ఈ రిపోర్టులో తెలంగాణాపై వివక్ష ఏమీ జరగలేదని నిరూపించడానికి అనేక లెక్కలను వండివార్చాడు. దీనిపై గతంలో నేను రాసిన టపా ఇక్కడ చూడొచ్చు. ఈమధ్యనే కొత్తగా వెలిసిన "విషాంధ" మహాసభ అనే ఒక బ్లాగువారు ఈమధ్య తెలుగుజాతిని కలిపి ఉంచే మహత్తర భాద్యతలో భాగంగా తెలంగాణా వాదులపై విషం చిమ్ముతూ పనిలో పనిగా అసలు ఇరిగేషన్‌లో తెలంగాణాపై ఎలాంటి వివక్ష జరగలేదు, అన్నీ కట్టుకథలు అని చెబుతూ ఒక టపా రాశారు. దానికోసం వారు పాపం మన జేపీగారి రిపోర్టును అరువు తెచ్చుకున్నారు.

వీరి వాదన టూకీగా గోదావరి భౌగోళిక స్వరూపంవల్ల శ్రీరాంసాగర్ తరువాత పోలవరం వరకూ ఎక్కడా డాం కట్టడానికి అనువైన స్థలం లేదు, ఎత్తిపోతలు ఖర్చుతో కూడినపని (అంటే ఇచ్చాపురం ప్రాణహిత-చేవెళ్ళ పధకాన్ని అటకెక్కించాలి). కనుక గోదావరి జలాలను తెలంగాణాలో వాడకంలో తేవడం సాధ్యం కాదు, పోలవరం దగ్గర ప్రాజెక్టు కట్టి నీటిని క్రిష్ణా డెల్టాకు మల్లించాలి, తద్వారా మిగిలిన క్రిష్ణా నీటిని రాయలసీమకు మల్లించాలి, తెలంగాణా నోట్లో మొత్తంగా మట్టికొట్టాలి. మన ప్రభుత్వ ఉద్దేషంకూడా ఇదే కానీ బయటికి చెప్పక తెలంగాణాలో కూడా ప్రాజెక్టులు చేస్తున్నాం అని కథలు చెబుతూ ప్రజలను ఏమారుస్తారు, వీరు మేధావులు కనుక బహిరంగంగానే తెలంగాణా నోట్లో మట్టికొట్టాలని ప్రవచిస్తారు. వీరి వాదనలో ఎక్కడా క్రిష్ణా నది ఊసెత్తరు, ఎందుకంటే అక్కడ జరిగే వివక్షను ఏమార్చడం ఇంతమేధావులవల్ల కూడా కాలేదు మరి.

ఇప్పటికే క్రిష్ణా పూర్తిగా తెలంగాణాకు కాకుండా పోయింది. మిగిలిన గోదావరిని కూడా తెలంగాణాకు కాకుండా చెయ్యడం అనే తమ ప్రణాలికను ఒకవైపు చెబుతూనే మరోవైపు తెలంగాణాపై వివక్షలేదని చెప్పడం వీరి వాదన. మీ ప్రాంతంలో నీల్లివ్వడం కష్టం, మీకు వ్యవసాయం లాభదాయకం కాదు, రైతులందరూ వ్యవసాయం వదిలేసి మీ భూములను సెజ్జులకిచ్చేయండి, ఆతరువాత ఆసెజ్జులు కట్టేప్పుడు రోజుకూలీలుగా పనిచేసి పొట్టపోసుకోండి, కడుపు నిండకపోతే ముంబైకో దుబాయికో వలస పోండి, కానీ మీకు ఎవరైనా వచ్చి ఇక్కడి సాగునీటి వాడకంలో మోసం జరిగిందంటే మాత్రం అస్సలు నమ్మొద్దు. ఇదీ వీరి వాదన.

శ్రీరాం సాగర్ ప్రాజెక్టు: తెలంగాణాపై ఎప్పుడు వివక్ష ఊసొచ్చినా సమైక్యవాదులు ఇచ్చే ఏకైక ఉదాహరణ శ్రీరాంసాగర్. చూశారా శ్రీరాంసాగర్ మీనిజాం కట్టించలేదు, సమైక్య ప్రభుత్వమే కట్టించింది. ఎంతసేపూ అందులో పూర్తిగాని స్టేజీలనే ఎందుకు మాట్లాడుతారు? పూర్తయిన చిన్నముక్కను చూసి సంతోషించొచ్చు కదా?

శ్రీరాంసాగర్ ప్రాజెక్టును సమైక్య ప్రభుత్వం తెలంగాణాపై ప్రేమతోనో, తమ భాద్యత గుర్తొచ్చో ఇవ్వలేదు. ఇక్కడి ప్రజలు 69లో రాష్ట్రం కొరకు ఉద్యమం చేస్తే ఉద్యమాన్ని బలవంతంగా అణచివేసినతరువాత ఏదో ఒకటి చెయ్యకపోతే ఎక్కువకాలం ఏమార్చలేమని ఈప్రాజెక్టును మొదలుపెట్టారు. గోదావరి నదిపై శ్రీరాం సాగర్ ఉన్న ప్రాంతం అత్యంత ఎత్తుపై ఉన్న ప్రాంతం, ఆప్రాజెక్టు ద్వారా గోదావరి నీటిని కరీమ్నగర్, ఆదిలాబాద్, ఖమ్మం, నల్లగొండ, వరంగల్ జిల్లాలన్నింటికీ ఇచ్చే ప్రణాలికతో మొదలయిన ప్రాజెక్టు. పూర్తయితే ఇరవై లక్షల ఎకరాలకు సాగునీరివ్వాల్సిన ప్రాజెక్టు అన్ని క్లియరెన్సులూ వచ్చిన తరువాత నలభై ఏల్లు గడచిన తరువాత కూడా ఇంకా ఐదు లక్షల ఎకరాలకు కూడా ఇవ్వలేకపోతుంది. నల్లగొండ, వరంగల్ జిల్లాల ప్రజలు ఎప్పటికైనా తమకు పోచంపాడు(శ్రీరాంసాగర్) నీల్లొస్తాయని ఇంకా ఎదురుచూస్తూనే ఉన్నారు.

మన దేశంలో ప్రాజెక్టులన్ని ఇలాగే లేటవుతాయి అందులో పెద్ద వివక్ష ఏమీ లేదు అని తేల్చే వారు ఒక్క సారి మన రాష్ట్రంలోని నాగార్జునసాగర్, తెలుగు గంగ ప్రాజెక్టులు, ఇతర రాష్ట్రాలలోని పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఎన్ని రోజుల్లో అయ్యాయో గమనించాలి.

లిఫ్ట్ ఇరిగేషన్ పై అపోహలు: లిఫ్ట్ ఇరిగేషన్లో నదిపై అనువైన ప్రాంతంలో ఒక బ్యారేజీ కట్టి, స్టోరయిన నీళ్ళను ఒక ఎత్తయిన ప్రదేశంలో కట్టిన రిజర్వాయరుకు తరలిస్తారు. అక్కడినుంచి కాలువల ద్వారానో మరో విధంగానో ఆయకట్టుకు నీటిని తరలించొచ్చు. లిఫ్ట్ ఇరిగేషన్‌పై వచ్చే విమర్శలు ఏమిటంటే దీనివలన విద్యుత్ ఖర్చవుతుంది, ఇది అదనపు భారం. గ్రావిటీ ద్వారా నయితే ఫ్రీగా నీటిని తరలించొచ్చు.

నిజమే నీటిని లిఫ్ట్ చెయ్యాలంటే విద్యుత్ కావాలి. ఐతే మన దేశంలో 70 శాతం ప్రజల జీవనాధారం వ్యవసాయం. ఏదో అభివృద్ధి చెందిన దేశాల్లో లాగా మనం వ్యవసాయం లాభసాటి అయితేనే చెయ్యం, వ్యవసాయం ఇక్కడ ఎందరికో జీవన విధానం. కాలువల ద్వారా నీరు రాకపోతే ప్రతి రైతూ ఒక బావి తవ్వుకోవాలి, బావిలో నీల్లు సరిపోవు కనుక అందులో ఒక బోరు వేసుకోవాలి, రెండు మోటార్లు పెట్టి బోరునీటిని పొలానికి తరలించాలి. అంటే రైతు కాలువవ్యవసాయం కంటే అదనంగా బావికి, బోరుకు, మోటార్లకు, విద్యుత్తుకు ఖర్చు చెయ్యాలి. ఆ విద్యత్తుకు ప్రభుత్వం సబ్సిడీ ఇస్తే ప్రపంచ బ్యాంకు ఏడుపులు. ప్రతి రైతూ తన బోరుకోసం విద్యౌత్‌పై చేసే ఖర్చూ, అందుకు ప్రభుత్వ సబ్సిడీ అన్నీ చూసుకుంటే లిఫ్ట్ ఇరిగేషన్‌లో అయ్యే విద్యుత్ ఖర్చు చాలా తక్కువ. తీరా వచ్చే కరెంటు కనీసం ఆరుగంటలు కూడా ఉండదు, అది ఎప్పుడొస్తుందో తెలియక నిద్రాహారాలు మాని పొలం దగ్గర పడిగాపులు చెయ్యాలి. ఇంతఖర్చు చేసి చివరికి పొలం ఎండిపోతే రైతులు అప్పులభాధకు ఆత్మహత్యలు చేసుకోవాలి.

మరి ఒక ప్రాజెక్టుకింద వ్యవసాయం చేసేవారు ఏదో నామమాత్రంగా ఎకరాకు యాభై రూపాయలు ప్రభుత్వానికిస్తాడు. మరి ప్రాజెక్టు కట్టిన ఖర్చూ, కాలువలు తవ్విన ఖర్చూ, వాటి మెయింటెనన్సు ఖర్చులూ, ప్రాజెక్టు కట్టినప్పుడు నిర్వాసితులకు పునరావాస ఖర్చు ఇవన్నీ ఖర్చులు కావా? ఇవన్ని ఎవరి జేబులోనుంచి వెల్తున్నాయి? కాబట్టి రైతుకు నీటిని ఇవ్వడం అనేది ప్రభుత్వ భాద్యత, అందులో లాభనష్టాలు బేరీజు వేసుకుని ఎక్కడ కాలువ తావ్వడం తక్కువ ఖర్చుతో అవుతుందో అక్కడే తవ్వుతాం, ఎక్కడ ఖర్చెక్కువ అవుతుందో అక్కడ తవ్వం అని ఏప్రభుత్వమూ లెక్కలు కట్టదు, ఒక్క మన ప్రభుత్వం తప్ప. మన పక్క రాష్ట్రం అయిన మహారాష్ట్రలో, మిగతా చాలా చోట్ల చక్కగా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములు ఏర్పాటు చేసుకున్నారు, వారి వాటా నీటిని వాడుకున్నారు అంతే కానీ డెల్టా ప్రాంతం మాకు లేదు, డెల్టా అంతా కోస్తా ఆంధ్రలో ఉంది అక్కడయితే తేలిగ్గా నీటిని సరఫరా చెయ్యొచ్చు కాబట్టి ఈనీళ్ళను వారికే వదిలేద్దం అనుకోలేదు.మన రాష్ట్రంలోమాత్రం గడచిన యాభై ఏల్లలో శ్రీరాంసాగర్ నుంచి ధవలేశ్వరం మధ్యలో ఒక్క ప్రాజెక్టూ కట్టకపోవడానికి చూపించే సాకు గ్రావిటీ.

వాటర్ బేసిన్ ఉల్లంఘణలు: ఏ నదీ జలాలను ఆ నది బేసిన్‌లోనే వాడాలనేది ఇరిగేషన్‌లో ఒక ప్రాధమిక సూత్రం. మన రాష్ట్రం మాత్రం క్రిష్ణా జలాలను పూర్తిగా పెన్నా బేసిన్లో ఉన్న రాయలసీమకు,నెల్లూరుకూ తరలించి కనీసం పది శాతం కూడా తెలంగాణకు ఇవ్వట్లేదు. ఈ ఉల్లంఘణవల్ల నష్టం తెలంగాణాకు మాత్రమే కాదు, క్రిష్ణా ట్రిబ్యునల్ వద్ద కర్నాటక మనరాష్ట్ర రివర్ బేసిన్ వియోలేషన్లను సాకుగా చూపించి తను ఎక్కువ నీటి వాటాను పొందుతుంది. ఈ వాటర్ బేసిన్ ఉల్లంగణలవల్ల క్రిష్ణా ట్రిబ్యునల్ తీర్పులో మనరాష్ట్రానికి (మొత్తం ఆంధ్ర ప్రదేశ్‌కు, తెలంగాణకు మాత్రమే కాదు) జరిగిన నష్తం గురించి నేను గతంలో రాసిన టపా ఇక్కడ చూడొచ్చు.

మన ప్రభుత్వం మేం మిగులు జలాలను మాత్రమే వేరే ప్రాంతాలకు తరలిస్తున్నామని కుంటి సాకులు చెబుతూ వచ్చింది, నికరజలాలను వాడకుండా మిగులు జలాలు ఎలావాడుతారో చెప్పలేకపోయి క్రిష్ణాలో వాటాను తగ్గించుకుంది. ఇప్పుడు గోదావరి విషయంలో కూడా తెలంగాణాలో గ్రావిటీ సాకు చూపించి గొడావరి నీటిని ఇతర బేసిన్లకు తరలించే ప్రయత్నం చేస్తుంది. దాన్ని మన జేపీగారి మేధావి వర్గం అప్రూవ్ చేస్తుంది.

పోలవరం: ఇక గోదావరి నీటిని తెలంగాణాలో వాడడానికి గ్రావిటీ బూచిని చూపిస్తున్నవారు పోలవరంపై మాత్రం గగ్గోలు పెడతారు. లక్షల మంది ఆదివాసీలను నిర్వాసితులను చేసి, ఎంతో ప్రకృతి సంపదను, పాపికొండలనూ, వన్యమృగాలనూ ముంచేసే పోలవరంపై వీరికి అపార ప్రేమ. తెలంగాణాలో అన్ని క్లియరెన్సులూ వచ్చేసి దశాబ్దాలు పెండింగులో ఉన్న ప్రాజెక్టులను వదిలేసి ఎన్విరన్‌మెంట్ అనుమతి లేని పోలవరంపై మాత్రం ఉద్యమాలు చేస్తారు.పోలవరంపై ఆదివాసీల అభిప్రాయాలు ఈవీడియోలో చూడొచ్చు.



రాష్ట్రం ఏర్పడితే తెలంగాణకు ఏం లాభం?: ఇప్పుడు ప్రత్యేక రాష్ట్రాలవడం వలన మహారాష్ట్ర, కర్ణాటక, చత్తీస్ఘర్ గోదవరిపై తమ హక్కును ఎలా కాపాడుకుంటున్నాయో అలాగే తెలంగాణ కూడా తమ గోదావరి జలాలపై తమహక్కును కాపాడుకుంటుంది. ఇది తెలుసుకోవడానికి సివిల్ ఇంజనీరింగ్ అక్కరలేదు, మేధావులు కానక్కర్లేదు. ఎలా గ్రావిటీ సమస్యను అధిగమిస్తారు నీటిని ఎలా పంపు చేస్తారు అనేది తెలంగాణ ప్రజలకు సంబంధించిన విషయం. ఇక గోదావరిపై తెలంగాణకు అన్యాయం ఏమీ జరగలేదని మోసపు రాతలు రాసేవారు మీ రాతలను కట్తబెట్టి మీపని మీరు చూసుకోవచ్చు.

Sunday, 19 June 2011

సత్యసాయిబాబా చెప్పులపై హిందూ దేవతలు



ఈబంగారు పాదరక్షలు బాబా యజుర్మందిరంలో దొరికాయి. హిందూ దేవతామూర్తుల విగ్రహాలను చెప్పులపై చూడవచ్చు. హిందువులు పవిత్రంగా చూసుకునే లక్ష్మీ, సరస్వతి లాంటి దేవతల మూర్తులను కాళ్ళకు ధరించడం వలన ఆయా దేవతలకు అవమానం జరిగినట్లా, లేక బాబా స్వయంగా దేవుడు కనుక ఆయనకు మామూలు మనుషులకు ఉండే నిభందనలు వర్తించవా అనే విషయం నాఊహకు అందలేదు.

Friday, 17 June 2011

దేవుడి యజుర్మందిరంలో లక్షల కోట్లు??



సత్యసాయిబాబా మరణించి రెండునెలలు కావొస్తున్న సమయంలో సత్యసాయి అనారోగ్యానికి లోనయినప్పుడు తాళం పెట్టిన ఆయన వ్యక్తిగత గది యజుర్మందిరం తలుపులు నిన్న తెరిచారు. నదులో లక్ష కోట్ల దాకా విలువ చేసే డబ్బూ, బంగారం, వజ్రాలు, టన్నులకొద్దీ వెండీ ఉన్నట్లు తెలుస్తోంది. బాబా మరణం తరువాత ఇప్పటికే ఎంతో బంగారం, డబ్బూ బయటికి తరలించారనేది మరో విషయం. ఇదంతా కేవలం ఆయన వ్యక్తిగతహోదాలో తన మందిరంలో దాచుకున్న సంపద కాగా దేశవిదేశాల్లో ట్రస్టుకు ఇంకెంతో సంపద ఉందనేది తెలిసిందే.

బాబా తాగునీటి ప్రాజెక్టులూ, విద్య, హాస్పిటల్ వగైరాలను చూపించి అతని దేవుడి స్టేటస్‌కు జస్టిఫికేషన్ ఇచ్చేవారు సంక్షేమానికి వెచ్చించిన మొత్తం సొమ్ము ఆయన సంపదలో నీటిబిందువంత అని ఒప్పుకోకతప్పదు. అదికూడా సత్యసాయి సంక్షేమానికి డబ్బులు వెచ్చించింది ఆయనమీద అనేక ఆరోపణలు వచ్చినతరువాత ఆరోపణలనుండి బయటపడడానికి మాత్రమే కానీ 1980 ముందు అతను సేవకు పెద్దగా చేసిందేమీ లేదనేది మరొక విషయం. ఇంతకూ సమాజసేవ చేసిన వారంతా దేవుల్లయితే సొంతడబ్బులు సమాజసేవకు వెచ్చించిన పారిశ్రామికవేత్తలనెవరూ దేవుల్లనరు..ఒక్కరోజు పేపర్లో చదివి ఓహో అలాగా అనడం తప్ప. బిల్‌గేట్స్, వారెన్ బఫెట్, స్టీవ్‌వా లాంటి విదేశీయులు వారికి సంబంధం లేని మనదేశంలో సొమ్మును సమాజసేవకు ఖర్చు చేస్తున్నారు. మనదేశంలో అజీంప్రేంజీ, టాటా, నారాయణమూర్తీ లాంటివారు ఎంతో సొమ్ము సమాజసేవకు వెచ్చిస్తున్నారు. ఎవ్వరూ తాము దేవుల్లమని చెప్పుకోరు, వారిని వారి సేవచూసి ఎవరూ దేవుల్లని అనరు.

ఇంతకూ సత్యసాయి దేవుడని చెప్పుకున్నందుకు డబ్బులు సంపాదించాడా, డబ్బులు సంపాదించి అందులో కొద్దిమొత్తాన్ని సమాజసేవకు వెచ్చించినందుకు దేవుడయ్యడా అనేది మరో సందేహం. ఒక మామూలు వ్యక్తి ఎంతనిజాయితీగా సమాజసేవ చెయ్యడానికి ముందుకొచ్చినా డబ్బులు పెద్దగా రాలవు, దేవుడని చెప్పుకుంటే మాత్రం దండిగా వస్తాయి. డబ్బులిచ్చినవారిలో అధికభాగం డబ్బును ట్రస్టుకు ఇచ్చారు, ట్రస్టు స్థాపించిన ఉద్దేషం ఎలాగూ సమాజసేవే కనుక డబ్బును ఎందుకు ఇచ్చారో అందుకు అదికూడా అతికొద్ది శాతం ఖర్చు చేస్తే దేవుడెలాగ అయ్యాడో నాకయితే అర్ధం కాదు.

ఇక నీసొమ్మేమన్నా అడిగాడా, నువ్వేమన్నా నీడబ్బులు ఇచ్చావ, మరి నువ్వెందుకు అడుగుతున్నావు అంటూ విరుచుకుపడే వితండవాదులగురించి వాదన ఎలాగూ అనవసరం. ఒక రాజకీయనాయకుడు అధికారం అడ్డం పెట్టుకుని లక్షలకోట్లు దోచుకుని ప్రజలసొమ్మును తనసొంతడబ్బులాగా ఉచితపధకాలకు దానం చేసి దేవుడయిపొయాడు. ఒక బాబా దేవుడినని చెప్పుకుని లక్షలకోట్లు సొమ్ముచేసుకుని అందులో ఒక ఫ్రాక్షన్ ప్రజలసొమ్మును ప్రజలకు దానం చేసి దేవుడయిపొయ్యాడు. ఇద్దరిలో పెద్దతేడాలేదు.

Tuesday, 14 June 2011

తెలుగు భాష సరళతను కాపాడుదాం



తెలుగు భాషాపరిరక్షణ


తెలుగు భాష సరళతను కాపాడడానికి నలమోతు శ్రీధర్ గారు ప్రారంభించిన భాషా పరిరక్షణ ఉద్యమానికి నా సంఘీభావం ప్రకటిస్తున్నాను. ఈసందర్భంగా శివరామ ప్రసాద్‌గారి వాఖ్యను యధాతధంగా రాస్తూ నామాటకూడా అదేనని చెబుతున్నాను.

"నేను ఎన్నటికీ “గట్టిపళ్ళెం”, “జాలగూడు”, “విహారిణి”, “నియంత్రణా వ్యవస్థ”,”క్రమకర్తలు”,”ఖతి” ,”సంగణకం”, “విశ్వవ్యాప్త వలయం” “మృదులాంతకం” ,”పంపక సులభ కవిలె” “సంప్రకారం” వంటి భ్రష్ట పదాలను వాడను. నేను మాట్లాడాను లేదా వ్రాశాను అంటే ఇతరులకి అర్ధం కావటానికి కాని, నా పాండిత్య ప్రదర్శనకు కాదు అని తెలిసి ఉన్నవాణ్ని కనుక అలా చేయలేను."

Friday, 3 June 2011

రంగు కళ్ళజోళ్ళు


రంగు కల్లజోళ్ళు పెట్టుకుంటే లోకమంతా రంగుగా కనిపిస్తుందనేది అందరికీ తెలిసిన పాత సామెతే, అందరం తరుచుగా వాడే సమెతే. సమస్య ఏమిటంటే ప్రతివాడు ఎదుటివాడిని నీరంగు కల్లజోళ్ళు తీసెయ్యమనడం, కానీ తనదాకా వస్తే తనకల్లజోళ్ళసంగతి మరిచిపోవడం.

ఒక్కరిని అనేదేముంది, మన తెలుగు మీడియా అంతా రంగుకల్లజోళ్ళమయం. ఒకరికి పసుపు కల్లజోళ్ళయితే మరొకరికి మొన్నటిదాకా ఆకుపచ్చకల్లజోళ్ళు, ఇప్పుడేరంగో తెలియదు కానీ జగన్ జోళ్ళు. నేను రోజూ పొద్దున లేవగానే ఈనాడూ, సాక్షి అప్పుడప్పుడూ సూర్య పత్రికలు చదువుతాను. ఈమధ్య ఆంధ్రజ్యోతి వాడు వెబ్ ఏదిషన్ పైడ్ చేశాడు కాబట్టి చదవడం కుదరడం లేదు. సాధారణంగా ఒకే విషయంపై ఈనాడులో ఒక వార్త ఒకలాగ రాస్తే సాక్షి దానికి పూర్తిగా వ్యతిరేకంగా రాస్తుంది. ఏవిషయంలో ఏవార్తను నమ్మాలి అన్న దాన్ని కేస్ టు కేస్ బేసిస్లో డిసైడ్ చెయ్యాల్సి ఉంటుంది. జగన్ విషయమైతే ఈనాడు, చంద్రబాబు విషయమైతే సాక్షి వార్తలను నమ్మితే కాస్త వాస్తవానికి దగ్గరగా ఉంటుందనిపించింది.

మేముండే ప్రాంతంలో ఇండియన్స్ తక్కువే, అందులో తెలుగువాళ్ళు పెద్ద ఎక్కువ కాదు. కానీ ఉన్నకొద్దిమందిలో రెండు సామాజిక వర్గాలవారు గ్రూపులుగా కలిసి ఉంటారు. మిగతావారు ఒక వర్గంగా ఉండేంత మంది లేకపోవడంతో ఆవర్గాలు లేవు. మిగతా అన్ని రాష్ట్రాలవారు రాష్ట్రాలవారీగా గుంపులు కడితే తెలుగు వారు మాత్రాం ఇలా సామాజికవర్గాలు గా విడిపోవడం మామూలే. అయితే విషయం ఏమిటంటే ఏదయినా గెట్‌టుగెదర్ జరిగి జనం కలుసుకున్నపుడు టాపిక్ రాజకీయాల్లోకి వెలుతుంది. ఒక సామాజిక వర్గం చిరంజీవిని మరో సామాజిక వర్గం చంద్రబాబునూ సమర్ధిస్తుంది, అది ఎలాంటి విషయమైనా. ఇది ఎంతగా నంటే చిరంజీవి రాజకీయాల్లో రెండు సంవత్సరాల్లో పూర్తిపరువు పోగొట్టుకున్నప్పటికీ చిరంజీవిని ఒక వర్గం ఇంకా సమర్ధిస్తుంది. చంద్రబాబు నక్కజిత్తులు తెలిసినా ఒక వర్గం చంద్రబాబును సమర్ధిస్తుంది. ఫలానా వారు ఫలానా విషయాన్ని కేవలం తాము ధరించిన కల్లజోళ్ళకారణంగా సమర్ధిస్తున్నారని తెలిసినపుడు మనం వారితో విషయంపై చర్చించి ఏం లాభం?

ఈమధ్యన ఒకబ్లాగులో ఒకరు తెలంగాణ వాదులు తమ రంగుకల్లద్దాలను తీసి చూసినట్లయితే చంద్రబాబు రెండుకల్లసిద్దాంతంలో ఉన్న నీతిని చూడచ్చని రాసి తెలంగాణ వాదులందరికీ కలగలిపి రంగుకల్లజోళ్ళను అంటించారు. అవును తెలంగాణ వారికి తెలంగాణ రంగు కల్లజోళ్ళు, సీమాంధ్ర వారికి సీమాంధ్ర రంగు కల్లజోళ్ళు ఉంటాయి, ఇద్దరూ ఆ కల్లజోళ్ళలోంచే విషయాన్ని గమనిస్తారు. అసలు సీమాంధ్ర వాదులకు ఉన్నవి రంగు కల్లజోళ్ళు కావు, అవి "అంధులు" ధరించే నల్ల కల్లజోల్లు, కాబట్టి వారు నిజాలను ఎప్పుడూ చూడలేరు అని చెప్పేవారు కూడా ఉన్నారనుకోండి, కానీ అది వేరే విషయం.

అయితే నాకు తెలిసి తెలంగాణ వారి కల్లజోళ్ళకు ఒక లేయర్ ఉంటే సీమాంధ్ర వాదులకు ఉన్న కల్లజోళ్ళకు రెండు లేయర్లుంటాయి, ఒకటి ప్రాంతానికి సంబంధించిన లేయర్ కాగా మరొకటి కులాని సంబంధించినది. అందుకే జగన్ను విమర్శిస్తే ఒక వర్గం, చంద్రబాబును విమర్శిస్తే ఒక వర్గం, చిరంజీవిని విమర్శిస్తే మరో వర్గం మండిపడుతుంది. తెలంగాణపై మాత్రం పై అన్ని వర్గాలు ఎగిరిపడతాయి. మరి వీరు రెండు పొరలున్న ఈకల్లజోల్లను ఛేదించుకుని వాస్తవాలను ఎప్పటికైనా గ్రహిస్తారంటారా? ఇలాంటివారితో ఎవరైనా విషయంపై విభేదించి అవతలి వారికి తమవాదన వినిపించగలరా?