Sunday 6 February 2011

మూడేళ్ళలో మెగాస్టార్ నుంచి జోకర్ స్థాయికి



పాపం చిరంజీవి!! మెగాస్టార్‌గా వెలిగినవాడు చివరికి పేకాటలో జోకరైపొయ్యాడు. లక్షలమంది అభిమానుల అభిమానాన్ని కాసిని మంత్రిపదవులకోసం సోనియా వద్ద తాకట్టు పెట్టాడు. ఎలాగైతేనేం, ఎన్నాళ్ళనుండో జెండా పీకేద్దమనుకున్నా బయటికి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించాడు గానీ చివరికి జెండా పీకేశాడు, దుకాణం అమ్మేసాడు.

కష్టపడి ఒకోమెట్టూ ఎక్కి సినిమాల్లో చిన్నస్థాయి నుంచి అగ్రస్థానంలోకి వెళ్ళాడు. కానీ కష్టపడకుండానే అధికారంలోకి రావాలనుకొని బుక్కైపొయ్యాడు. సినిమాల్లో డైరెక్టరు చెప్పినట్లు నటించడమే అలవాటు. రాజకీయాల్లో సరైన దర్శకుడు దొరక్క బామ్మర్దికే దర్శకత్వం భాద్యతలు ఇచ్చాడు. బామ్మరిదేమో సినిమా హిట్టైతేనేం, ఫట్టయితేనేం ఓపెనింగు కలెక్షన్లు అదిరిపోతే చాలునని నమ్మే ఫక్తు కమర్షియల్ ప్రొడ్యూసరు. ఇంకేం, సినిమాల్లో డిస్ట్రిబ్యూటర్లదగ్గర అడ్వాన్సులు తీసుకొని సినిమా తీసి బాక్సులమ్ముకున్నట్లుగా టిక్కెట్లు అమ్మేసి దొరికిపొయ్యాడు.

సామాజిక తెలంగాణా తీసుకొస్తానన్నాడు, తరువాత సమైఖ్యవాదం అందుకున్నాడు. జెండా పీకడం ఎవరికైనా సాధ్యామా అన్నాడు, జెండా పీకేసాడు, సామాజిక న్యాయం తెస్తానన్నాడు, ఇప్పుడేమో కాంగ్రేస్ ద్వారా సామాజికి న్యాయం తెస్తానంటున్నాడు. మాటపై నిలకడలేనివాడికి గౌరవం ఎలా ఉంటుంది?

బహుషా రాజకీయాల్లోకి ఎందుకొచ్చానురా బాబూ అని ఎన్నో సార్లు చిరంజీవి అనుకొని ఉండొచ్చు. సరే ఎలాగో ఇన్నాల్లూ నెట్టుకొచ్చాడు. ఇంకా మూడేల్లు పార్టీని నడపడం కూడా కష్టమే. ఇలాంటి పరిస్థితిలో తనను నమ్మి పార్టీలోకి వచ్చిన కార్యకర్తలనూ, టికెట్లు కొనుక్కున్న ఎమ్మెల్యేలనూ నట్టేట్లో వదలకుండా కాంగ్రేస్లో పార్టీని కలపడం ఒక విధంగా మంచిదే. అయితే ఇకనైనా తనకు అచ్చిరాని రాజకీయాలకు గుడ్‌బై చెప్పి తమ్ముడు పవన్‌లాగా దూరంగా ఉంటే కాస్త మర్యాదన్నా దక్కేది. ఇప్పుడు కాంగ్రేస్ ఇచ్చే మంత్రి పదవికి కక్కుర్తి పడి ఎప్పటికైనా ముఖ్యమంత్రి కాలేనా అని కలలు కంటే మాత్రం చివరికి పేకాటలో జోకర్ కాస్తా కూరలో కరివేపాకు కావడం ఖాయం.

కొసమెరుపు: అసలు చిరంజీవి పార్టీ పెట్టడం తెలుగుదేశాన్ని ఓడించడానికి ఒకానొక వైఎస్సార్ వ్యూహమే, అంతా మొదటినుంచే మ్యాచ్‌ఫిక్సింగే, పీఆర్పీ ఎప్పటికైనా కాంగ్రేస్‌లో కలిసేదే అని చాలామంది ఇంతకుపూర్వం అనుమానాలు వ్యక్తం చేశారు. ఇప్పుడు ఆ అనుమానాల్లో ఏదయినా నిజం ఉందేమో అని నాక్కూడా డౌటు వస్తుంది.

2 comments:

  1. జెండా పీకేశారు అని వ్రాసినందుకు ఓ దిన పత్రిక ఆఫీసును ముట్టడించి
    మహిళలని అని కూడా చూడకుండా పెట్రోల్ తో నిప్పు పెట్టడానికి ప్రయత్నించిన
    వాళ్ళు ఇప్పుడు నిజంగా ఢిల్లీలో జెండా సిగ్గుఎగ్గు లేకుండా పీకేసుకున్నారు!

    ReplyDelete
  2. నా జెండా పీకే దమ్ము ఎవరికైనా ఉందా అని ఆ పత్రిక ఆ వార్త రాసిన నాడు చిరు చాలెంజ్ చేశాడు. తనకుందని సోనియా గాంధీ చూపించింది.

    ReplyDelete