Sunday, 13 February 2011

ఒక జెస్సికా లాల్, ఒక ఆయేషా మీరా



ఒక జెస్సికా లాల్: డెల్లీకి చెందిన ఒక అప్‌కమింగ్ మోడల్. అప్పర్ మిడిల్ క్లాసుకు చెందిన జెస్సికా ఒక చెల్లెలు, తల్లి దండ్రులతో కలిసి ఉండేది. ఒకానొక పార్టీలో అంతా చూస్తూ ఉండగా ఒక హై ప్రొఫైల్, డబ్బూ, అధికారమూ కల వ్యక్తి చేత చంపబడింది. ముందుగా ప్రత్యక్ష సాక్షుల స్టేట్‌మెంట్‌ల ఆధారంగా ఆ వ్యక్తిని అరెస్టు చెయ్యడం జరిగింది. ముద్దాయికి శిక్షపడడం కోసం ముద్దాయి చెల్లెలూ, తల్లితండ్రులూ తమ శాయశక్తులా కృషి చేశారు. ప్రత్యక్ష సాక్షులను బతిమాలి, బామాలి కేసును నడిపించారు. కొంతమంది సిన్సియర్ పోలీసులు కూడా కేసు నిరూపణకోసం కష్టపడ్డారు.

కానీ ఆ తరువాత సాక్షులంతా ఒక్కొక్కరుగా బెదిరింపబడడం వల్లనో, డబ్బు వల్లనో కేసులో అడ్డం తిరిగి సాక్షాన్ని ఉపసంహరించుకున్నారు. ఫోరెన్సిక్ సాక్షాలు తారుమారు చెయ్యబడ్డాయి.కోర్టులో కేసు కొట్టివెయ్యబడింది. అంత సులభంగా కేసునుండి ముద్దాయి తప్పించుకోవడం చూసిన కొంతమంది మీడియా వారు ముద్దాయిలు తప్పుడు సాక్షాలు ఇచ్చినట్లుగా నిరూపించారు. డెల్లీ ప్రజలు మీడియాకు మద్దతు ఇచ్చారు. కేసు మల్లీ ఓపెన్ చెయ్యబడింది. ఎలాగయితేనేం చివరికి జెస్సికాకు న్యాయం జరిగింది, ముద్దాయికి శిక్ష పడింది.

ఒక ఆయేషా మీరా: విజయవాడకు దగ్గర్లో ఒక పేద కుటుంబానికి చెందిన ఆయేషా ఒక చిన్నపాటి ప్రైవేట్ ఉమెన్స్ హాస్టల్లో ఉంటూ బీఎస్సీ చదివేది. ఒకరోజు రాత్రి హాస్ట్లల్లోనే అత్యంత కిరాతకంగా చెరచబడి ఆ తరువాత హత్యకు గురయింది. ఒక హాస్టల్లో ఉన్న అమ్మాయిని హాస్టల్లో జఓబడి చెరిచి చంపినప్పుడు ఖచ్చితంగా అక్కడి వారికి, హాస్టల్ వార్డెన్, వాచ్‌మన్, మిగతా రూంమేట్స్కు తెలియకుండా ఆ సంఘటన జరగడం అసాధ్యం. కానీ ప్రత్యక్ష సాక్షులెవరూ ఎలాంటి సాక్షమూ చెప్పలేదు.హంతకులు హై ప్రొఫైల్, డబ్బూ, అధికారము కల ఒక మాజీమంత్రి మనవడని హతురాలి తల్లి ఆరోపణ. అయితే వారి ఆరోపణల ఆధారంగా ఎలాంటి విచారణా జరగలేదు. హాస్టల్‌లోని మిగతా విద్యార్థులను విచారించే ప్రయత్నం చెయ్యలేదు.

ముందు ఒకడిని హంతకుడని చెప్పి పోలీసులు అరెస్టు చేశారు. అతని తండ్రి ఒక చిన్న లాయర్‌ను పెట్టుకోగల స్థోమత కలిగిన వాడు కావడంతో కేసు నిలవలేదు. ఆ తరువాత మరో చిన్నపాటి చిల్లర దొంగను అరెస్టు చేశారు. అరెస్టు కాబడ్డ వ్యక్తీ, హతురాలి కుటుంబం కూడా పేదవారు, లాయర్‌ను పెట్టుకోనే స్థోమత లేని వారు, మీడియాలో గట్టిగా మాట్లాడే అంత తెగువలేని వారు. హతురాలి తల్లి అరెస్టు కాబడ్డవ్యక్తి హంతకుడు కాదు అని మొత్తుకున్నా ఎవరూ వినిపించుకోలేదు. సాక్షాలు, ఆధారాలూ అన్ని తయారు చెయ్యబడ్డాయి. ఇక్కడ ఏ మీడియా కూడా ఆయేషాకు న్యాయం చెయ్యాలని పోరాటం చెయ్యలేదు. చివరికి ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తిపై ఎలాంటి విచారణ జరగలేదు, మరో అమాయకుడుకి శిక్ష పడింది. ఆయేషాకు న్యాయం జరగలేదు.

నీతి: మనదేశంలో నోరున్న అర్బన్ మధ్యతరగతికి లేటుగా నయినా న్యాయం జరగవచ్చు. కనీసం డబ్బూ అధికారాల బలంతో వీరు పోరాటం చెయ్యగలరు. అర్బన్ మిడిల్ క్లాసుకు మీడియా మద్దతు ఫరవాలేదు. కానీ నోరులేని సామాన్యులకు మాత్రం ఎవరి మద్దతూ లేదు, వీరికి న్యాయం ఎప్పుడూ జరగదు.

No comments:

Post a Comment